రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

A writer should have this little voice inside of you saying, Tell the truth. Reveal a few secrets here- Quentin Tarantino

Saturday, October 22, 2016

రివ్యూ!

రచన – దర్శకత్వం : పూరీ జగన్నాథ్

తారాగణం: నందమూరి కల్యాణ్‌రామ్‌, జగపతిబాబు, అదితీ  ఆర్య,
వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, అలీ, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ముఖేష్  జి.
బ్యానర్‌: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌, నిర్మాత: నందమూరి కల్యాణ్‌ రామ్‌
విడుదల : అక్టోబరు 21, 2016
***
   నిర్మాత –నటుడు కల్యాణ్ రామ్  మరోసారి అదృష్ట పరీక్షకి నిలబడ్డారు- ఈసారి నిలబడి తీరాలన్న దృఢ చిత్తంతో-  సిక్స్ ప్యాక్ బాడీతో – ‘ఇజం’ అనే మోడర్నిజపు టైటిల్ తో- పూరీజగన్నాథ్ సౌజన్యంతో. ఎంత బడ్జెట్ అయినా వెనుకాడకుండా రిస్కు తీసుకునే కల్యాణ్ కి సక్సెస్ ఎందుకు రాదు- తప్పకుండా వస్తుంది, ధరించే పాత్రలో కూడా సిక్స్ ప్యాక్ అంత విషయమున్నప్పుడు. మరి ఈసారి ఏం జరిగింది? రిస్కు ని  తన పంచ్ డైలాగు ప్రకారం ‘డకింగ్’ చేయగల్గారా, లేక  తనే డకౌట్ అయ్యారా ఓసారి చూద్దాం....

కథ 
      సుల్తాన్ అనే పేరుతో కల్యాణ్ రామ్ అలియాస్ సత్యా మార్తాండ్ (కల్యాణ్ రామ్) తన సిక్స్ ప్యాక్ దేహదారుఢ్యంతో మొరాకో లోని  ఓ దీవిలో స్ట్రీట్ ఫైట్లు చేసి జీవనం గడుపుతూంటాడు. ఓ స్ట్రీట్ ఫైట్ సందర్భంగా అలియా ఖాన్ (అదితీ ఆర్య) అనే అమ్మాయిని చూడగానే మనసు పారేసుకుని వెంటపడతాడు. ఈమె బడా డాన్ జావేద్ ఇబ్రహీం (జగపతి బాబు) కూతురు. జావేద్ ఇబ్రహీం ప్యారడైజ్ బ్యాంకు  నడుపుతూ ఇండియాలోని నల్లకుబేరుల ధనం దాస్తూంటాడు. ఇండియాలో  ఇతడి ఏజెంటుగా కోటిలింగాల (పోసాని) అనే మంత్రి వుంటాడు. ఆలియా వెంటపడుతున్న సత్యా మార్తాండ్ (అసలు పేరు) ఆమె కన్పిస్తే తాళి  కట్టేస్తానని కూడా బెదిరిస్తూంటాడు. ఇతడి నస తండ్రికి చెప్పుకుంటుంది. ఇతణ్ణి  చంపమని గ్యాంగ్ కి చెప్తాడు. అసలు తనని కలుస్తూ కబుర్లు చెప్తున్న కల్యాణ్ రామ్ అనే బీడీ ఫ్రెండే తన కూతుర్ని వేధిస్తున్న రోమియో అని జావేద్ కి తెలీదు. పైగా డబ్బున్న వాళ్ళ కూతుళ్ళని ఎలా ప్రేమించాలో చిట్కాలు కూడా చెప్తూంటాడు. ఓ పెళ్ళిళ్ళ ఏజెంట్ (అలీ) కి చెప్పి కూతురికి సంబంధాలు చూస్తూంటాడు. ఓ పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు ఇంట్లోకి జొరబడి జావేద్ లాప్ టాప్ ఎత్తుకు పోతాడు సత్య. ఇక తనని కలుస్తున్న కల్యాణ్ రామే సత్య అని జావేద్ కి తెలిసిపోతుంది. అంతే కాదు, ఈ సత్య తన బ్యాంకుని  కొల్లగొట్టేందుకు వల పన్ని వచ్చిన ‘గ్రాండ్ లీక్స్’ అనే అజ్ఞాత వెబ్సైట్ నడుపుతున్న జర్నలిస్టు అని కూడా తెలిసిపోతుంది... ఇక సత్య తన బ్యాంకు కొల్లగొట్టకుండా, లక్షలాది కోట్ల నల్లధనం ఇండియాలో ప్రజలకి పంచకుండా అడ్డుకోవడానికి ఇప్పుడు జావేద్ ఏమేం చేశాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ఈ మధ్య వీకీ లీక్స్ అంటూ, పనామా పేపర్స్ అంటూ నల్ల కుబేరుల బండారాలు పడుతున్న  సంగతి  తెలిసిందే. ప్రభుత్వం కూడా విదేశాల్లోని నల్లధనం తెచ్చి ఇండియాలో తలా ఇరవై లక్షలు పౌరుల జేబుల్లో కుక్కి  చక్కిలిగింతలు పెడతానని అంటున్న- లేదా అనేసి మరచిపోతున్న విషయం కూడా తెలిసిందే. తీరా చూస్తే తేలిందేమంటే- ఆ విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం స్వచ్ఛ భారత్ చేసి పూచిక పుల్ల సహా వూడ్చేసి  తీసుకురావాలన్నా కూడా అదసలు నల్లధనమని ముందు రుజువు చెయ్యాలి ప్రభుత్వం. రుజువు చెయ్యాలంటే కింది కోర్టుల నుంచీ పై సుప్రీం కోర్టు దాకా ఈ ‘నల్ల’ ఖతాదార్లతో ఇన్ కం టాక్స్ శాఖవాళ్ళు  ఎంతకాలం కొట్లాడుతూ కూర్చోవాలో తెలీదు. ఎన్నేళ్ళూ, ఎన్ని యుగాలూ పడుతుందో తెలీదు. ఎన్ని కేసులు రుజువవుతాయో కూడా తెలీదు. పైగా ఇంకో తిరకాసుంది- దొంగా దొంగా అంటూంటే దొంగేమైనా దోచిన సొత్తు దగ్గర వుంచుకుంటాడా? ఆ విదేశీ బ్యాంకుల్లోంచి  నల్లకుబేరులు తమతమ నల్లధనాల్ని ఎప్పుడో తరలించేసుకుని - నల్లతనాల్ని చెరిపేసుకుని తెల్లగా మారిపోయారు. తెల్లధనంగా ఆ సొమ్మంతా విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి స్వదేశంలోకే దింపి రియల్ ఎస్టేట్ రంగాన్ని దివ్యంగా వెలగబెడుతున్నారు! ఇలా డిమాండ్ కి మించిన భవనాలు నిర్మించేస్తూంటే అవి ఖాళీగా పడి ఉంటున్నాయి, ఐనా వాళ్లకేం నష్టం. 

        ఇప్పుడు పూరీ జగన్నాథ్ కి ఆ బ్యాంకుని హ్యాకింగ్ చేసి నల్లధనమంతా తెచ్చి క్లయిమాక్స్ లో దేశ వ్యాప్తంగా ప్రజలకి తలా ఇంత పంచి చక్కిలిగింతలు పెట్టడానికి - ఎక్కడ్నించి వస్తుందని? తమ ఖాతాల్ని  నల్ల ఖతాదార్లు ఎప్పుడో తామే ‘హ్యాకింగ్’ చేసుకున్నారు పూరీ కంటే ముందే. ఇంకా జనాలకి- పోనీ ప్రేక్షకుల్ని ఆ డబ్బింకా స్విస్ బ్యాంకుల్లోనే వున్నట్టు ఎలా నమ్మిస్తారు. అక్కడి నల్లధనం చక్కగా తెల్లధనంగా  మారిపోయి ఇండియాకే విదేశీ పెట్టుబడులుగా వెనక్కి వస్తోందిగా - ఎందరికో ఉపాధి కూడా  కల్పిస్తూ. 

        ఇంత విశాల కాన్వాస్ వున్న ఓ సామాజిక అంశాన్ని పూరీ తెర కెక్కించే ముందు వాస్తవాల్ని  చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి రాజకీయ, సామాజిక స్పృహ కొంచెం ఎక్కువే. ఏ స్పృహా వుండని రొటీన్ మసాలా సినిమాల్ని ఎన్నైనా సహిస్తారు గానీ, ఇలాటి తప్పుడు సమాచారంతో నిజం లేని ‘ఇజం’ ని కూడా హజం చేసుకుంటారులే అని తక్కువ అంచనా వేయడం తొందరపాటు తనమే అవుతుంది. 

 ఎవరెలా చేశారు?
      కల్యాణ్ రామ్ ఈ సినిమా స్వయంగా నిర్మించి ఎంత లాభ పడినా పడకున్నా నటనలో మాత్రం మంచి శిక్షణ పొందడానికి ఈ సినిమా అవకాశం కల్పించింది. శిక్షకుడు పూరీ జగన్నాథ్ కల్యాణ్ ని నటనలో ఉత్తమ విద్యార్థిగా తీర్చి దిద్దారు. డైలాగులు పలికించడంలోనేమి, కత్తిలానటింపజేయ
డంలోనేమి కల్యాణ్ కెరీర్ ని నిత్య కల్యాణం పచ్చ తోరణం చేశారు పూరీ. కాకపోతే పాత్రే, పాత్ర చిత్రణే వాస్తవ దూరంగా ఉండాల్సి వచ్చాయి. కోర్టు సీనులో కల్యాణ్ భావావేశం, వాక్పటిమ తన పాత్ర సిక్స్ ప్యాక్ దారుఢ్యంతో సింక్ కాకపోవడం- కథలో చివరికొచ్చేసరికి తను సిక్స్ ప్యాక్ అన్న సంగతి మర్చిపోవడం వల్ల జరిగిందేమో. కోర్టు సీన్లకి ఇంకా నందమూరి వంశానిదే పెట్టింది పేరని చెప్పొచ్చు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఆ మధ్య జ్యూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు కల్యాణ్ రామ్. అయితే కల్యాణ్ రామ్ కోర్టు సీను నటన ఫరవా లేదనిపించినా విషయపరంగా ఈ సీనుకి, ఇందులోని పూరీ రాసిన డైలాగులకీ చోటెంతన్నది ప్రశ్న. కథే దేశంలోని అవాస్తవాల మీద అల్లినప్పుడు అందులోని సమస్తం  అప్రస్తుతమే అయిపోతాయి కూడా ఆటోమేటిగ్గా. 

        హీరోయిన్ అదితీ ఆర్య ఆదితీ అగర్వాల్ ముఖకవళికలతో వుంది. ఆమెకి పెద్దగా నటించే అవసరమే రాలేదు. పూరీ హీరోయిన్ కి నటనతో పనేమిటి.  ఉడుక్కో గలిగితే, సణుక్కో గలిగితే, తిట్టుకో గలిగితే, విరుచుకు పడగలిగితే చాలు- క్యారక్టర్ కవరై పోతుంది. 

        జగపతిబాబుది కిల్ అయిన పాత్ర. ఇంతటి కథకి తన విలన్ పాత్ర ఎలా వుండాలి. జోకర్ గా మారిపోయి చివరికి విలనే కాకుండా పోయింది పాత్ర. హాలీవుడ్ లో, కొంత వరకు బాలీవుడ్ లో ఎలా వుంటుందంటే నటులు స్క్రిప్టు పంపించమంటారు. ఆ స్క్రిప్టు చదివి కథతో బాటు, ఇతర పాత్రలతో  ఇంటరాక్షన్ తో బాటు,  తమ పాత్రని ఫాలో అయి, దాని సమగ్రతని బేరీజు వేసుకుంటారు. తేడా వుంటే సరిదిద్దమంటారు. తెలుగులో నటులు స్క్రిప్టు అడగరు. ఇచ్చినా చదవరు. చదవడం, రాయడం అన్నవి చాలా లో - క్లాస్ యాక్టివిటీస్.  ఆ పూటకి సీ ను పేపరు చూసి నటించి వెళ్ళిపోవడమే.  పాత్ర సౌష్టవం, సమగ్రత, ట్రావెల్ ఎలా ఉన్నాయనేది అవసరమే లేదు. అందుకే ఇలాటి జావేద్ భాయ్ లాంటి క్యారెక్టర్ ల రూపంలో నటులు నీరసం తెప్పిస్తారు ప్రేక్షకులకి. పాత్రచిత్రణ తెలిసిన నటులు  తెలుగులో వున్నారో లేదో వెతుక్కోవాలి. 

        సినిమాలో ఇంకా చాలా పాత్రలున్నాయి. వాటి గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. యాక్షన్ సీన్స్ బాగా కంపోజ్ చేశారు. కెమెరా వర్క్ బ్రిలియెంట్ గా వుంది. పాటల గురించి చెప్పాలంటే, ఈ థీమ్ లో వుండాల్సిన రకం పాటలు మాత్రం కావివి.


 స్క్రీన్ ప్లే సంగతులు  
      పూరీ సినిమాలకి షాట్స్ ప్లే వుంటుంది తప్ప స్క్రీన్ ప్లే ఏముంటుంది. ఆయన సరదాగా ఓల్డ్ స్కూల్ దర్శకుడు. ఎలాటి కథనైనా సరదాగా అదే ఓల్డ్  సీసాలో పోసేస్తారు. ఆయనకి బ్యాంకాక్ బీచిలో సీసా ఏదో దొరికివుంటుంది. అందులో సందేశమేదో ఆకర్షించి వుంటుంది (మెసేజ్ ఇన్ ది బాటిల్ లాగా - దీని మీద ‘శివమణి- 98480 22338’ అని సినిమా కూడా తీశారు).  అందుకే అక్కడి  బీచి కెళ్ళిపోయి ప్రతీ సినిమాకీ అంత సరదాగా పదిహేను రోజుల్లో స్క్రిప్టులు రాసేయ గల్గుతున్నారు. పదిహేను రోజుల్లో!! గిన్నీస్ లో చేరాల్సిన రికార్డ్!! ఆయనది లేజీ రైటింగ్ అనలేం గానీ, క్యాజువల్ రైటింగ్. క్యాజువల్ గా అలా అలా పైపైన ఏదో రాసేసుకుని తీసేస్తారంతే. మరి అంతే క్యాజువల్ గా ప్రేక్షకులు చూడాలిగా! క్యాజువాలిటీ వార్డులో చేరేంత పనవుతోంది. 

        కోన వెంకట్- గోపీ మోహన్ లని వుండే వాళ్ళు. వాళ్ళు అదే పనిగా ఒకటే సింగిల్ విండో స్కీమ్ పెట్టుకుని, ఏ సూపర్ స్టార్ వచ్చినా అందులోకే తోసి పారేసి-  సూపర్ స్టార్ గారు విలన్ గారింట్లో చేరి కామెడీ చేయుట అను బ్రహ్మనందపు ఆటగా ఆడించీ ఆడించీ, ఒక్క ప్లాట్ పాయింట్ టూ లాంటి దెబ్బకి సింగిల్ విండో మూసేసి వెళ్ళిపోయారు. పూరీ ఇంకా అదే ఓల్డ్ సీసాతో కొనసాగడమంటే  -క్లయిమాక్స్ దాకా వెళ్ళకుండా రేపోమాపో ఆ ప్లాట్ పాయింట్ టూ దెబ్బకి తనుకూడా దగ్గరవుతున్నట్టే.

        శంకర్ ‘భారతీయుడు’ తీయకుండా వుండి వుంటే ‘భారతీయుడు’ ని కూడా పూరీ ‘ఇజం’ లాగే తన సీసాలో పోసి తీసేస్తారు. భూమి బల్ల పరుపుగా వుందని ఆనాడెవరో నమ్మినట్టు, తను కూడా ఎలాటి కథనైనా బల్ల పరుపుగా చదును చేసేస్తారు. శంకర్ ‘ఇజం’ తీయాలనుకుంటే ఫ్యూచరిస్టిక్ జానర్ లోకి తీసికెళ్ళి 2050 లలో కథ స్థాపిస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు దీంతో కాలీన స్పృహ లేదు. బిగ్ కాన్వాస్ ని డిమాండ్ చేసే ఇలాటి హై కాన్సెప్ట్ సబ్జెక్టుని అంతే అద్భుత ప్రపంచంలోకి  తీసికెళ్ళి శంకర్ సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తారు. పూరీ విజన్ కి హైకాన్సెప్ట్, బిగ్ కాన్వాస్, ఉదాత్త కథా, మానమర్యాదలూ అనే ఉన్నత దృశ్యాలు అందవు. ‘ఈడియెట్’ కాడ్నించీ ‘ఇజం’ వరకూ అదే పాత మూస టెంప్లెట్ పెట్టుకుని అందులోకే భారత రామాయణాల్ని కూడా తోసేసి తన బ్రాండ్ టపోరీ కథలుగా మార్చేయగలరు. హీరోయిన్ ఏ పోలీస్ కమీషనర్ కూతురో, మాఫియా కూతురో, రాజకీయ నాయకుడి కూతురో అయివుండాలి; హీరో ఆవారా టపోరీగా ఉంటూ ఆమెని ప్రేమించమని వేధిస్తూ వుండాలి; ప్రేమించాక తానో అండర్ కవర్ ఏజెంటుగా బయటపడాలి; ఆ తర్వాత ఆమె విలన్ తండ్రితో ఆడుకోవాలి. ఏ సీరియస్ సామాజిక కథయినా కూడా ఈ డ్రామాలోకే సర్దుకోవాలి.  

        ‘ఇజం’ కథని భవనాలు కూలిపోతున్న విషయ గాంభీర్యంతో బ్రహ్మాండంగా ప్రారంభించారు. కానీ జర్నలిస్టు పాత్రకి కూడా అదే బాల్యం నాటి ఫ్లాష్ బ్యాక్, అందులోని అదే అన్యాయం అవసరమా. జర్నలిస్టనే వాడు తన గురించి కాక, సమాజం గురించి ఏదో ఫీలై జర్నలిస్టు అవుతాడు. ఆ తర్వాత తన గురించి ఫీలైపోయి నయూం లాంటి వాళ్ళతో నయా దందాలు చేసుకోవచ్చు దండాలు పెట్టుకుంటూ, అది వేరే విషయం. కానీ తన కేదో అన్యాయం జరిగిందని జర్నలిస్టు అయిపోడు. ఇజం జర్నలిజపు కథ ఒక వాస్తవంగా ఉందనుకుంటున్న సామాజిక సమస్యని డీల్ చేస్తున్నప్పుడు, అంతే వాస్తవికం గా డీల్ చేస్తే సరిపోతుంది. ఫ్లాష్ బ్యాకూ, టపోరీ వేషాలూ అవసరం లేదు. ఈ టపోరీ ప్రేమ కథని ప్లాట్ పాయింట్ అనేదే లేకుండా ఇంటర్వెల్ వరకూ సాగదీసి  ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ టైపు ఎండ్ సస్పెన్స్ కాని ఎండ్ సస్పెన్స్ కథనంతో నడపనవసరమే లేదు. సామాజిక కథ జానర్ మర్యాద ఇక్కడే తప్పిపోయింది. అసలు చివరి దాకా ప్రేమ కథ అనే సపరేట్ ట్రాకే జానర్ మర్యాదకి ప్రధాన దెబ్బ. ఇతివృత్తపు రసపోషణకి  పెద్ద అడ్డంకి.  సెకండాఫ్ లో కూడా ప్రధాన కథకి అడ్డుపడే - పదే పదే హీరోయిన్ ప్రేమ గోల తాలూకు ట్రాకు - ప్రధాన కథతో సంబంధం  లేకుండా పాటలూ - మాస్ ప్రేక్షకులకి కూడా చీకాకే.  

        ఫస్టాఫ్ లో ఎడతెగకుండా ఇంటర్వెల్ వరకూ గంటా అయిదు నిమిషాలూ, సెకండాఫ్ లో మళ్ళీ అడపాదడపా ఇంకో అరగంటా తినేసే టపోరీ ప్రేమకే ఇంత సమయం పోతే,  ప్రధాన కథకి మిగిలింది కేవలం 40 నిమిషాలు. ఈ 40 నిమిషాల ‘కథ’ కి పూర్తి వందశాతం టికెట్ ధర చెల్లించుకుంటున్నారు  ప్రేక్షకులు. పదిహేను రోజుల్లో స్క్రిప్టు ఎలా  పూర్తయి పోతోందంటే ఇలాగే - ఓ అరగంటకి  మాత్రమే సరిపడా ప్రధాన కథ ఆలోచించి, ఇక ఆలోచించనవసరం లేని మిగతా భాగాన్ని తయారుగా వున్న బాటిల్లోంచి తీసి ఒంపెయ్యడం వల్లే.   

        అంత భారీ స్థాయిలో తమ బ్యాంకు హీరో కొల్ల గొడుతున్నాడని తెలిసీ వాడితో ప్రేమకోసమే  పారిపోయి రావడం, అదీ పిస్తోలు పట్టుకుని హైదరాబాద్ నగరంలో బాహాటంగా తిరగడం, ఎప్పుడో హీరో చెప్పి వున్న అతడి తల్లిపేరు పట్టుకుని ఆధార్ కేంద్రంలో అడ్రసు తెలుసుకుని ఇంటికి వచ్చెయ్యడం- (ఆ పేరు గల మనిషి నగరం మొత్తం మీద ఆమె ఒకత్తే వుందేమో. పోనీ ఇంటి పేరు కూడా తెలీదు దాన్నాధారంగా పట్టుకుందను కోవడానికి- అయినా ఆధార్  కేంద్రాల్లో ఇలా అడ్రసులు ఇచ్చేస్తారా) -  పిస్తోలుతో ఆ హీరో తల్లిదండ్రుల్ని బెదిరిస్తూ ఆ ఇంట్లో మకాం పెట్టడమూ ఇదంతా- కేవలం ఈ సినిమా ప్రేమ కథే అయితే సరే గానీ, ఒక పెద్ద సామాజిక కథ ఇది. సమాజం కోసం హీరో ఏం చేస్తున్నాడో తెలిసి కూడా అతడి పక్షం వహించి అందులో పాలు పంచుకోకుండా, పిచ్చి ప్రేమంటూ తిరిగే పాత్ర బహుశా ఇంకే బాధ్యత గల సినిమాలోనూ వుండదేమో. 

        అసలీమె డాన్ కూతురే ఎందుక్కావాలి. హీరోతో బాటు పనిచేస్తున్న అజ్ఞాత జర్నలిస్టుల్లో ఒకత్తి ఎందుకు కాకూడదు. ఈ సినిమా ఏకత్రాటిపై, ఏకసూత్రత అనే బేసిక్ కథా లక్షణంతో ఒకే కథగా ఎందుకు వుండకూడదు. గంటా ముప్పయి  ఐదు నిమిషాల టపోరీ ప్రేమ కథగా కూడా ఎందుకుండాలి. 

        జావేద్ ఇబ్రహీం పాత్రని శంకర్ కిస్తే ఆయన పరమ కర్కోటకుడుగా ఆకాశానికెత్తేస్తాడు. పూరీ చేతిలో ఇది హాస్యాస్పదంగా తయారయ్యింది. పైగా హీరో తన బ్యాంకు పని బడుతున్నాడని తెలిసి కూడా ప్రధాన కథ వదిలేసి, ప్రేమ ట్రాకుని ‘పండించడం’ కోసం కూతుర్నివెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఆ బాపతు విలనిజంతో బిజీగా ఉంటాడు. హీరో హ్యాకింగ్ చేస్తూంటే ఆచూకీ తెలుసుకుని చంపించడానికి మనుషుల్ని పంపుతాడు. అంతేగానీ, హ్యాకింగ్ ని నిరోధించే టెక్నికల్ టీం అతడి అంత పెద్ద బ్యాంకులోనే వుండరు. మొదట హీరోయిన్ ఖాతా హ్యాకింగ్ జరిగిందని ఎలా చేతులెత్తేసి మొత్తుకుంటారో, ఆ తర్వాత సర్వర్ హ్యాకింగ్ అయి సొమ్ములు ఖాళీ అయిపోతున్నప్పుడు కూడా అంతే లబోదిబోమంటారు. 

        ఇంతకీ అలా ఖాళీ అయిన సొమ్ములు మన దేశవ్యాప్తంగా ప్రజల బ్యాంక్ ఎక్కౌంట్ లలో పడిపోయి- తండోపతండాలుగా  వాళ్ళ జేబుల్లో సెల్ ఫోన్లు డబ్బులు పడ్డ మెసేజిలతో ఠింగు ఠింగు మని  ఎలా మోగుతాయో అర్ధంగాదు. ఇది చూస్తున్న ఈ సమయంలోనే మన జేబుల్లో మొబైల్స్  కూడా ఇలా మోగివుంటే, ఓ ఇరవైలక్షలతో మనం కూడా కింగు లయ్యేవాళ్ళం కదా పూరీకి పూరాగా ప్రణమిల్లి. అప్పుడు ఈ రివ్యూ ఇలా రాసే బాధ కూడా తప్పేది. 

        జావేద్ భాయ్ కి హీరో డబ్బులు కొల్ల గొట్టేశాడన్న కసే లేదు, సరే నా కూతుర్ని తీసుకుపొమ్మంటాడు. హీరోకి కూడా ఈ జావేద్ భాయ్ తన ఫ్రెండ్స్ అయిదు గుర్నీ చంపించాడన్నపగే వుండదు. పాపం ఫ్రెండ్స్! ఇలా ‘కరీం బీడీ’ కామెడీ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటైపోతారు, ఈసారి మామా అల్లుళ్ళుగా! దావూద్ ఇబ్రహీం- సారీ- జావేద్ ఇబ్రహీం అంటే పూరీకి అంత ప్రేమ ఎందుకో అర్ధం గాదు.

        ‘బిజినెస్ మాన్’ లో మాఫియా కార్పొరేటీ కరణ అంటూ నడిపిన ప్రహసనం ఎలా వుందో, అలాగే  వుంది ఈ బ్లాక్ మనీతో ఫార్సు కూడా. జర్నలిస్టు హీరోని అరెస్టు చేయవచ్చు గానీ, జర్నలిస్టు భావజాలాన్ని అరెస్టు చేయలేరన్నారు. ఏమిటా జర్నలిస్టు భావజాలం- అక్కడ స్విస్ బ్యాంకుల్లో నల్ల డబ్బే లేకపోయాక! వున్నా తీసుకొచ్చే వీలే లేనప్పుడు! ఈ నల్లధనం గురించి వివిధ మాంటేజీలు వేస్తూ తెర మీద వివిధ పత్రికల, మీడియా సంస్థల పేర్లేశారే- వాటిలో వున్న ఒక పత్రిక ‘అవుట్ లుక్’ మ్యాగజైన్ లోనే వుంది అసలు కథ! కాకతాళీయంగా ఈ మొత్తం వ్యవహారంపై ఓ పత్రిక్కి వ్యాసం కూడా రాసి ఇవ్వాల్సి వచ్చింది ఈ వ్యాసకర్త అప్పట్లో.

        హీరో హ్యకింగే చేస్తున్నప్పుడు నల్ల డబ్బు తెచ్చేందుకు కోర్టులతో చట్టాలతో పనేముందని అనొచ్చు. హ్యాకింగ్ చేయడానికి వాస్తవంగా అసలక్కడ అలాటి డబ్బే లేదన్నది అలా వుంచితే, హీరో చేసే హ్యాకింగ్ కి ఎథికల్ హ్యాకింగ్ అని నీతివంతమైన పేరెందుకు.  ఈ నైతిక ప్రహరీ వెనుక ఎందుకు దాక్కుంటున్నాడు హీరో. అతను చట్టాన్ని చేతిలోకి తీసుకున్న విజిలాంటీ జర్నలిస్టు అయినప్పుడు నేరాన్ని నిర్ద్వంద్వంగా నేరంతోనే కొట్టాలి- ‘డెత్ విష్’ లో విజిలాంటీ క్యారక్టర్ వేసిన చార్లెస్ బ్రాన్సన్ లాగా. అంతే కదా. పెద్ద పెద్ద పదాలు వాడినంత మాత్రాన, బిల్డప్పులిచ్చినంత మాత్రాన,  అర్ధవంతమైన ఇంటలెక్చువల్ కథ- పాత్ర అయిపోతాయా? అసలు చిన్నప్పుడే హీరో పంటికి పన్ను అన్నట్టు, తన తండ్రి కాలు విరగ్గొట్టిన వాణ్ణి పెట్రోలు పోసి తగలేట్టేశాడు కదా. అలాంటి సిక్స్ ప్యాక్ వయొలెంట్ విజిలాంటీకి ఇంకా ఎథికల్ హ్యాకింగ్ ఏమిటి- మొరాకోలోనే గొడ్డలి తీసుకుని బ్యాంకు బొక్కసాన్ని బద్దలు కొట్టెయ్యకుండా. 

      ఇక ‘జర్నలిజం ఇజం ఇజం ఇజం జర్నలిజం -దిస్ ఈజ్ పెట్రియాటిజం’ అంటూ పాట హోరెత్తించారు చివర్లో. ఈ సినిమా జర్నలిస్టులు చూడాలన్నా తమ వృత్తి గురించి గొప్పగా ఫీలవడానికి ఏమైనా వుందా. అలా కథ చెప్పారా.  ఒక్క సీనులో కూడా హీరోని జర్నలిస్టు కష్టాలతో చూపించలేదు, ఆ వృత్తినే చూపించలేదు, చూపించిందంతా టపోరీ ప్రేమా చిన్నప్పటి అన్యాయమూ. మళ్ళీ ఇందులో దేశభక్తిని గుర్తు చేయడమెందుకు, నిజాల్ని వెలికి తీస్తూనే అన్నేసి లక్షల పేజీల్ని అనునిత్యం నింపుతూనే వుంటారు జర్నలిస్టులు. ఆ నిజాల్ని ముందు పెట్టుకుని సరైన సమాచారంతో బాధ్యత గల సినిమా తీసి నిరూపించుకోవాల్సింది పూరీయే దేశభక్తిని! జానర్ మర్యాద అనేది అత్యవసరం ఇప్పటి రోజుల్లో. జానర్ మర్యాద పాటించిన ఆరేడు సినిమాలే నిలబడ్డాయి గతసంవత్సరం. ప్రేక్షకులు దేనికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారో చెప్పలేరు, దర్శకులే ఆ కనెక్షన్ ఏమిటో అర్ధం జేసుకోవాలి- ఇప్పుడు జానర్ మర్యాద అని! పూరీకి ఆ బాటిల్ వున్నంత కాలం ఇదెప్పుడూ ఆయన సాధించలేరు. ఆయన సబ్జెక్టులు తీయాల్సింది అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని నమ్ముకుని. అల్లావుద్దీన్ అద్భుత దీపమంటే తనలో వుండే సబ్ కాన్షస్ మైండే!-సికిందర్
       
       


       

Tuesday, October 18, 2016

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -17


స్క్రీన్ ప్లేకి ఎండ్ అంటే ఏమిటి? ఒక కథ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఎందుకు ఎండ్ అవుతుంది, ఎండ్ అవుతూ సాధించేదేమిటి? అసలు ఎండ్ ఎలా మొదలవుతుంది?  ఎండ్ విభాగంలో జరిగే బిజినెస్ ఏమిటి?  సీక్వెన్సు లేమిటి? ఎండ్ కల్లా కథలో  ఏఏ అంశాలు ముగిసిపోవాలి?  వీటన్నిటినీ  వివరించుకుని ఈ ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాస పరంపరని ముగింపుకి తెద్దాం...
          ముందుగా  14 వ అధ్యాయంలో రాసిన  అంశాల్ని దగ్గర పెట్టుకుని, రెండిటినీ కలిపి చదువుకుంటే, ఎండ్ విభాగపు సైన్స్ నంతా బాగా అర్ధం జేసుకోవచ్చు. ఈ లింక్ ని క్లిక్ చేసి ముందుకు సాగండి:  
           https://sikander-cinemascriptreview.blogspot.in/2016_05_26_archive.html


        స్క్రీన్ ప్లే కి ఎండ్ విభాగం అనేది మిడిల్ అంతమైన చోట ప్లాట్ పాయింట్ -2 నుంచి ప్రారంభమవుతుంది. దీన్నే క్లయిమాక్స్ అంటారు. క్లయిమాక్స్ అంటే చిట్ట చివర్లో పాజిటివ్ శక్తి ( ఏ జానర్ ని బట్టి అలాటి కథానాయకుడు/నాయిక), నెగెటివ్ శక్తి (ఏ జానర్ ని బట్టి అలాటి  ప్రతినాయకుడు/నాయిక) మీద సాధించే అంతిమ విజయం. దీన్నే డా. పరుచూరి గోపాలకృష్ణ విస్తృతార్ధంలో  ‘ఫలప్రాప్తి’ అన్నారు, లజోస్ ఎగ్రీ ‘రిజల్యూషన్’ అన్నారు. రెండూ ఒకటే. కానీ మన సినిమాల్లో ఇప్పుడు విస్తృతార్ధంతో ముగిసే సినిమాలు అంతగా రావడం లేదు. హీరో గోల్ ని సాధించే ఉద్దేశంతోనే కథలు ముగిసిపోతున్నాయి తప్ప, హీరో గోల్ తో పాటూ కథా ప్రయోజనాన్ని కూడా సాధిస్తూ ‘ఫలప్రాప్తి’ గా,  ‘రిజల్యూషన్’ గా ముగియడం లేదు. ‘శివ’ దీన్ని దృష్టిలో పెట్టుకుంది. హీరో గోల్ కంటే కథా ప్రయోజనం ఉన్నతమైనది. కథా ప్రయోజనం కోసం హీరో గోల్ ని సాధించాలి తప్పితే, కథలో వ్యక్తిగత ప్రయోజనం కోసం కారాదు. 

        ‘ప్రధానపాత్ర ముఖ్యోద్దేశమేమిటో  ఆ దిక్కుగా ఆఖరి 30-40 నిమిషాల నడక వుండాలి, గెలుపోటముల మధ్య డోలాయమాన పరిస్థితి వుండాలి’ అన్నారు గోపాల కృష్ణ. ‘పతాక స్థాయికి చేరటానికి ముందు విషమ స్థితికి తీసుకు వెళ్ళాలి. ఇదే యాంటీ క్లైమాక్స్. ఇలా కథానాయికో, కథానాయకుడో  ఇక ఆశయాన్ని సాధించలేరు అని నూటికినూరు శాతం నమ్మకం కలిగించటమే విషమ స్థితి. ఆ తర్వాత ఫలప్రాప్తి సాధించాలి’  అని కూడా అన్నారు తన ‘తెలుగు సినిమా సాహిత్యం- కథ, కథనం, శిల్పం’ అన్న పుస్తకంలో.  

        ‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’  లో-  ఎండ్ కుండాల్సిన వరస క్రైసిస్, క్లయిమాక్స్, రిజల్యూషన్ అన్నారు లజోస్ ఎగ్రి. ‘డెత్ ఈజ్ క్లయిమాక్స్, బిఫోర్ డెత్ ఈజ్ క్రైసిస్’ అన్నారు. అంటే చావుకి ముందు సంక్షుభిత పరిస్థితినీ – పోరాటాన్నీ చూపకుండా అకస్మాత్తుగా హీరో వచ్చేసి, ఒక్క పోటుతో విలన్ ని పొడిచి చంపేసి
-  ఐపోయింది కథ అంటే ఎంత దారుణంగా వుంటుందో, ఆ సంక్షుభిత పరిస్థితినీ – పోరాటాన్నీ చూపిస్తూ చంపేశాక  కూడా, వెంటనే  శుభం కార్డు వేయడమూ అంతే  అన్యాయంగా ఉంటుందన్నమాట. ‘జనతా గ్యారేజ్’ ఆకస్మిక ముగింపులో ఇదే చూశాం. ఇంత భారీ కథకి కథా ప్రయోజనం అన్న సంగతే ఆలోచించలేదు. 

         అలాగే ‘హైపర్’ లో కథా ప్రయోజనం ఆకస్మికంగా క్లయిమాక్స్ లో వూడి పడుతుంది. అంతవరకూ జరిగిన కథలో దీని ఊసే వుండదు- హీరో గోల్ తో మిళితమై కూడా వుండదు. హీరోతో సంబంధం లేకుండా హీరో తండ్రీ- విలన్ లు కలిసి, వాళ్లకి వాళ్ళు మొదలెట్టుకునే క్లయిమాక్స్ లో ‘సంతకం’ గురించి మొత్తం ప్రభుత్వోద్యోగులంతా తిరగబడే వృత్తాంతం కథా ప్రయోజనం అన్పించదు. ఈ కథా ప్రయోజనం గురించి హీరో ఎక్కడా మాట్లాడడు. 

        కథా ప్రయోజనమనేది కథకి ఆత్మ (సోల్) లాంటిది. అది కథలో అంతర్లీనంగా ప్రవహిస్తూ వుంటుంది, వుండాలి. ‘శివ’ కథా ప్రయోజనం కళాశాలల్లో మాఫియాల జోక్యాన్ని రూపు మాపడం. అంతేగానీ  ఎవరో మాఫియా ప్రతినిధి జేడీ అనేవాడు హీరోయిన్ని తాకినందుకు హీరో పగబట్టిన వ్యక్తిగత కథ కాదు. శివ తన గ్రూపులోని మల్లిని భవానీ మనుషులు చంపినప్పుడు కూడా ఇంకింత  ఎక్స్ టెండ్ చేసిన కథా ప్రయోజనంతో కూడుకున్న మాటలే అంటాడు. మల్లిని చంపాడని తను భవానీని చంపితే, రేపింకో భవానీ పుట్టుకొస్తాడు, వాణ్ణి  చంపితే ఇంకో భవానీ పుట్టుకొస్తాడు- ఇలాకాకుండా ఇలాటి భవానీలని పుట్టిస్తున్న వ్యవస్థనే నాశనం చేయాలంటాడు. ఇదీ కథా ప్రయోజనం
, విస్తృతార్ధంలో ముగింపు, ఫలప్రాప్తి, రిజల్యూషన్ వగైరా వగైరా. ఇది జరిగిందా లేదా అనేది  ముగింపులో చూడాలి.    

        హీరో సామాజిక ప్రయోజనాన్ని చూస్తాడు. కానీ వ్యవస్థ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటుంది. బిన్ లాడెన్ ని చంపడం వల్ల టెర్రరిజం సమస్య సమసిపోలేదు. బిన్ లాడెన్ ని చంపకుండా అతడి భావజాలాన్ని ఎలా చంపెయ్యొచ్చో, తద్వారా టెర్రరిజానికి ఎలా శాశ్వతంగా తెర దించవచ్చో- ఒక హాలీవుడ్  రచయిత నుంచి సీఐఏ తీసుకున్న బ్లూ ప్రింట్ ని ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఆ హాలీవుడ్ రచయిత సరీగ్గా సినిమాలో శివ చెప్పిన మాటలే  చెప్పి హెచ్చరించాడు- మీరు బిన్ లాడెన్ చంపితే వందల మంది బిన్ లాడెన్ లు పుట్టుకొస్తారని. కానీ వ్యవస్థకి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం- సమాజం, ప్రపంచం ఎలా పోతే ఏంటి. అందుకని బిన్ లాడెన్ భావజాలం నాశనం కాకుండా బిన్ లాడెన్ హతమయ్యాడు. అలాగే  గ్యాంగ్ స్టర్ నయీంని చంపేశాక వాణ్ణి సృష్టించిన వ్యవస్థని శిక్షించగలరా? వ్యవస్థ ఎప్పుడూ వ్యక్తిగత లాభాలే చూసుకుంటుంది- కానీ కథల్లో హీరో అలాకాదు- సామాజిక ప్రయోజనాన్నే కాంక్షిస్తాడు. 

        ‘శివ’ లో భవానీ అనుచరుడు గణేష్ కూడా ఇలాటి నయీం లాంటి వాడే. వీణ్ణి చట్టానికి పట్టిస్తే – భవానీతో బాటు, వీడి వెనుక వ్యవస్థ మొత్తాన్నీకూడా   వీడి ద్వారా నాశనం చేయవచ్చని అంతిమంగా శివ కనుగొన్న పరిష్కారమార్గం. అందుకే ప్లాట్ పాయింట్ టూ దగ్గర గణేష్ ని పట్టుకుని లాకప్ లో వేయించాడు. ఇక్కడ్నించీ వ్యవస్థ నాశనమయ్యే పాడు కాలం మొదలయ్యింది. వ్యవస్థకి సింబల్ మాచిరాజు.
                                          ***
       ఏ కథకైనా ముగింపు ప్రారంభంలోనే దాగి ఉంటుందని చెప్పుకున్నాం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర శివ జేడీని కొట్టి కథ ప్రారంభిస్తున్నప్పుడు,  అందులో ముగింపు ఏమిటీ అని చూస్తే- ఆటోమేటిగ్గా భవానీ అంతమేనని తెలిసిపోతుంది. అయితే ప్లాట్ పాయింట్ వన్ ని ప్లాట్ పాయింట్ టూ కి తాళం చెవిగా కూడా 14 వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఈ మొత్తం హీరో ఎదుర్కొంటున్న సమస్యకి హీరో పరిష్కార మార్గాన్ని  కనుగొని దాంతో క్లయిమాక్స్ ప్రారంభిస్తాడు. ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ హీరోకి పరిష్కార మార్గం ఎలా, ఎక్కడ్నించీ దొరుకుతుంది? అన్నిటికీ సమాధానం సృష్టి మూలమే. ప్లాట్ పాయింట్ వన్నే. 

        ముందుగా తాళం ఏదో తెలిస్తే దాన్ని విప్పే  తాళం చెవి ఏదో తెలుస్తుంది. తాళం  హీరో గోల్ లోని  అంశం అనుకుంటే, దాన్ని చేరుకునే ద్వారాల్ని తెరిచేదే తాళం చెవి అనే పరిష్కార మార్గం. ఏ జానర్ కి చెందిన కథకైనా ఈ ఏర్పాటు వుంటుంది. లేదంటే అది తోచినట్టూ రాసుకున్న ఏదో  ‘కత’ అయి వుంటుంది.  గోల్ లోని అంశానికి సరిపడా తాళం చెవి లేకపోతే, ఇంకేదో చేసి బలవంతంగా గోల్ ద్వారాలు తెరిస్తే అది దొంగ దారి అవుతుంది. ఉంగరం పడిపోయింది...పోతే పోనీ... హృదయం మాత్రం పదిలం పదిలం ... అనే పాత  పాట వున్నట్టు- తాళం చెవి దొరకని కథ ఏమంత పదిలంగా వుండదు. అసలు తాళం చెవులే లేని కథలు తయారవుతున్నాయి. 

        వెతికితే బిగినింగ్ లేదా మిడిల్ విభాగాల్లోనే ఈ తాళం చెవి దొరుకుతుంది. ‘శివ’ లో హీరో గోల్ వ్యవస్థ అయినప్పుడు దాన్ని సాధించే తాళం చెవి గణేషే అవుతాడు తప్ప భవానీ కాదు, మాచిరాజూ కాదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడ్డ గోల్ లోని  అంశం (కథా ప్రయోజనం) వ్యవస్థ నాశనమే అయినప్పుడు ముందుగా ఆ వ్యవస్థ నాశన క్రమం తెలియాలి. ఏం చేస్తే అలాటి వ్యవస్థ నాశనమవుతుందో సామాజిక స్పృహతో, సంయమనంతో, అర్ధవంతంగా  పరిశీలించాలి. (ఇతర జానర్ల కథలకి కూడా ఏంచేస్తే సమస్య పరిష్కారమౌతుందో ఇలా సైంటిఫిక్ గానే విస్తృతార్ధంలో ఆలోచించాలి). బిన్ లాడెన్ ని చెంపేస్తేనే అలాటి వ్యవస్థ నాశనం అవుతుందనుకుంటే భవానీని కూడా చంపెయ్యొచ్చు. అలా భవానీని చంపిన పాలకులకి తిరిగి ఓట్లు పడతాయేమోగానీ, ఈ అవగాహనారాహిత్యం వల్ల సినిమాలో హీరోకి మాత్రం టికెట్లు తెగవు. ఎందుకంటే ఇంతకి ముందే చెప్పుకున్నట్టు,  హీరో దృక్పథం దూరదృష్టితో కూడుకుని సువిశాలమైనదై వుంటుంది. పాలకుల్లాగా హ్రస్వ దృష్టితో వ్యక్తగత, పార్టీగత లాభాలు చూసుకోడు. ‘శివ’ లో హీరో భవానీని చంపలేదని కాదు, చంపాడు. వ్యవస్థకి సింబలైన మాచిరాజు నాశనమయ్యాకే భవానీని చంపాడు. పైన చెప్పుకున్న హాలీవుడ్ రచయిత కూడా బిన్ లాడెన్ భావజాలాన్ని నాశనం చేశాకే బిన్ లాడెన్ ని వురి తీయమన్నాడు. బిన్ లాడెన్ భావజాలాన్ని ఎలా నాశనం చెయ్యొచ్చో చాలా సైంటిఫిక్ గా చెప్పాడు. 

        అలా వ్యవస్థ నాశనమవ్వాలంటే గణేష్ తోనే  నరుక్కురావాలని  అంత సైంటిఫిక్ గా  శివ ఆలోచించాడు  గనుకనే, ప్లాట్ పాయింట్ టూ  అనే తాళాన్ని బిగినింగ్ విభాగంలోనే గణేష్ రూపంలో  తచ్చాడుతూ కన్పించిన తాళం చెవిని పట్టుకుని  తెరిచాడు. గణేష్ ని పట్టుకుని లాకప్ లో వేయించే చర్యతో, సమస్యకి పరిష్కారమార్గాన్ని సుగమం చేసుకున్నాడు. ఏ జానర్ కథ కైనా ఇలాటి ఏర్పాటుని బిగినింగ్ లేదా మిడిల్ విభాగాల్లోనే వెతికితే తప్పకుండా దొరుకుంతుంది. మరొకటేమిటంటే,  కథ అంటే ఆర్గ్యుమెంట్ అని కూడా చెప్పుకున్నాం. ఈ ఆర్గ్యుమెంట్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రశ్నని సంధిస్తుంది (సంధించ లేదంటే అది కథవదు. స్టేట్ మెంట్ తో కూడిన, సినిమాకి పనికి రాని ఏదో  కేవల ‘గాథ’ అవుతుంది). ఇలా లేవనెత్తిన ప్రశ్నకి ముగింపులో సమాధానం చెప్పి తీరాలి.   ప్లాట్ పాయింట్ వన్ దగ్గర శివ జేడీని సైకిలు చెయినుతో ఆ యెత్తున బాదడం మొదలెట్టాడంటేనే ఎంతో సవాలు భవానీ మీద. ఒక మామూలు కుర్రాడు భవానీ తోనే పెట్టుకున్నాడే ఇప్పుడేమిటీ అన్న కంగారు పుట్టించే ప్రశ్న. ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ మలుపు యాక్షన్ ద్వారా తెలియ జేస్తేనే ప్రశ్న బలంగా, కంగారు పుట్టించేదిగా వుంటుంది ఆ విజువల్ ఎఫెక్ట్ వల్ల. ప్రేమ కథల్లో లాగా మాటా  మాటా  అనుకుని విడిపోయే వెర్బల్ ప్లాట్ పాయింట్ బలహీనంగా వుంటుంది, సరైన ప్రశ్న కూడా పుట్టించకుండా. ఇదే యాక్షన్ లో చూపిస్తే పుట్టాల్సిన కంగారంతా పుడుతుంది. ప్రశ్న ఎంత కంగారు పుట్టిస్తే క్లయిమాక్స్ అంత బలంగా వుంటుంది. ఎండ్ విభాగం బలహీనంగా వుందంటే దాని రుగ్మతలు  బిగినింగ్ విభాగంలో ఉన్నట్టేనని ఏనాడో ప్రఖ్యాత దర్శకుడు బిల్లీ వైల్డర్ చెప్పనే చెప్పాడు. ఇలాటి పరిశీలనలు చేసి చెప్పే దర్శకులు మనకున్నారా? తమ గురించి ఏదో ఫీలైపోతూ ఏటా తొంభై శాతానికి తగ్గకుండా  ఫ్లాపులు ఇవ్వడంలోనే వాళ్లకి ఆసక్తి. ఇంతాచేసి టాలీవుడ్ కి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇదే!
***

      గణేష్ ని లాకప్ లో పడేశాక ‘శివ’ ఎండ్ విభాగం ఈ మేకప్ తో వుంటుంది...
        79.  పోలీస్ లాకప్ లో వున్న గణేష్ ని నానాజీ కలవడం, తనని బయటికి తీయకపోతే కోర్టులో భవానీ గురించి చెప్పేస్తానని గణేష్ అనడం.
        80.  ఈ విషయం నానాజీ భవానీకి చెప్పేయడం, గణేష్ ని లేపెయ్యమని భవానీ ఆదేశించడం.
       
81.  పోలీస్ స్టేషన్ లో గణేష్ ని చంపడానికి ప్రయత్నించిన భవానీ అనుచరుల్ని  శివ చంపడం.
       
82. శివ సీఐ కి కాల్ చేసి భద్రత కోసం గణేష్ ని తన ఆధీనంలో వుంచుకుంటాననీ, రేపు కోర్టు దగ్గర అప్పగిస్తాననీ అనడం.
       
83.  వారం రోజుల్లో శివ సంగతి చూస్తానని చెప్పి ఏమీ  చేయలేనందుకు భవానీ మీద మాచిరాజు మండిపడడం.
       
84. మాచిరాజు శివ ని కలిసి భవానీకి వ్యతిరేకంగా మాట్లాడి శివని తనతో కలుపుకోవడానికి ప్రయత్నించడం.
       
85. శివని ఆపడం మాచిరాజు వల్ల కూడా కాలేదనీ, గణేష్ ని శివ ఎక్కడ దాచాడో తెలుసుకోవాలంటే శివ కదలికల మీద నిఘా వుంచాలనీ నానాజీని భవానీ ఆదేశించం.
       
86. కీర్తికి బాగాలేదని అన్న దగ్గర్నుంచి కాల్ వస్తే బయల్దేరిన శివని భవానీ మనుషులు అనుసరించడం.
       
87.  అన్న దగ్గరికి వెళ్ళిన శివ ద్వారా అన్నఇంటి అడ్రసు భవానీ అనుచరులకి తెలియడం.
       
88.  ఈ విషయం నానాజీ భావానీకి చెప్తే,  కీర్తిని తీసుకు రమ్మని భవానీ ఆదేశించడం.
       
89. శివ అన్న ఇంట్లోంచి  భవానీ అనుచరులు కీర్తిని అపహరించడం.
       
90.  శివ కోర్టులో సీఐ కి గణేష్ ని అప్పగించడం, అక్కడే అన్న కూతురి అపహరణ గురించి తెలియడం.
       
91. కీర్తిని అపహరించే లోగా శివ గణేష్ ని కోర్టుకి అప్పగించాడనీ, భవానీ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని నానాజీ భవానీతో అనడం, బందీగా వున్న కీర్తి మీద భవానీ కన్నేయడం.
       
92. శివ అన్న ఇంటిదగ్గరికి వెళ్లేసరికి అక్కడ కీర్తి శవం వుండడం.
       
93. శివ భవానీ దగ్గరికి వెళ్లేసరికి అతను మాచిరాజు దగ్గరికి వెళ్ళాడని తెలియడం.
       
94. తన మీద అరెస్ట్ వారెంట్ మాఫీ చెయ్యనందుకు, తన గురించి చులకనగా
మాట్లాడినందుకూ భవానీ మాచిరాజుని చంపెయ్యడం.
       
95. పారిపోతున్న భవానీని శివ వెంటాడి చంపడం.
***సమాప్తం ***

     ఈ ఎండ్ విభాగం 17 సీన్లతో వుంది. ఓ 25 నిమిషాలలోపు రన్. బిగినింగ్ 20 సీన్లతో వుంటే, ఆ తర్వాత  మిడిల్ -1 వచ్చేసి 28 సీన్లతో, మిడిల్ - 2 వచ్చేసి 30 సీన్లతోనూ వున్నాయి. మొత్తం స్క్రీన్ ప్లే  20+58+17= 95 సీన్లు. అంటే  ప్రామాణికంగానే సుమారు అటూ ఇటుగా  1 : 2 : 1 నిష్పత్తిలోనే,  లేదా 25% +50% +25%  శాతంగానే విభాగాల సైజులున్నాయి.

        ఎండ్ విభాగం 25 శాతమే వుండాలని లేదు. కొన్ని కథలకి ఎండ్ నాలుగైదు సీన్లే సరిపోవచ్చు. గరిష్టంగా 25 శాతం మాత్రం దాటకూడదు. దాటిందంటే ముగింపు కోసం దర్శకుడు స్క్రిప్టు మీద అర్ధంగాక వదిలేసి, సినిమాతీసి వెండితెర మీద వెతుక్కుంటున్నట్టే జాలిగొలిపేలా వుంటుంది. ఇటీవల వచ్చిన ‘డోంట్ బ్రీత్’ లో ఎండ్ విభాగం ఇలాంటిదే.  ఎలా ముగించాలో తెలియనట్టు- ఒకదగ్గర ముగిస్తున్నట్టు అన్పింపజేస్తూ, మళ్ళీ అక్కడికే వచ్చి ఫ్రెష్ గా మొదలెడుతూంటాడు. ఇలా ముగిస్తున్నట్టే అన్పించి, ఇలాకాదని ఇంకో విధంగా  మళ్ళీ ఫ్రెష్ గా మొదలెట్టడం మూడు సార్లు జరుగుతుంది. 

        పై ఎండ్ విభాగం ఆర్డర్ లో మళ్ళీ రెండు సీక్వెన్సులు వున్నాయని గమనించ వచ్చు. అంటే బిగినింగ్ లో రెండు, మిడిల్ -1 లో రెండు, మిడిల్ -2 లో రెండూ సీక్వెన్సులు ఉన్నట్టే, ఎండ్  లోనూ రెండు సీక్వెన్సులుండి మొత్తం 8 సీక్వెన్సులతో ఈ స్క్రీన్ ప్లే సమతూకంతో వుంది. 

సీక్వెన్స్ -1
       
79.  పోలీస్ లాకప్ లో వున్న గణేష్ ని నానాజీ కలవడం, తనని బయటికి తీయకపోతే కోర్టులో భవానీ గురించి చెప్పేస్తానని గణేష్ అనడం.
        80.  ఈ విషయం నానాజీ భవానీకి చెప్పేయడం, గణేష్ ని లేపెయ్యమని భవానీ ఆదేశించడం.
       
81.  పోలీస్ స్టేషన్ లో గణేష్ ని చంపడానికి ప్రయత్నించిన భవానీ అనుచరుల్ని  శివ చంపడం.
       
82. శివ సీఐ కి కాల్ చేసి భద్రత కోసం గణేష్ ని తన ఆధీనంలో వుంచుకుంటాననీ, రేపు కోర్టు దగ్గర అప్పగిస్తాననీ అనడం.
       
83.  వారం రోజుల్లో శివ సంగతి చూస్తానని చెప్పి ఏమీ  చేయలేనందుకు భవానీ మీద మాచిరాజు మండిపడడం.
       
84. మాచిరాజు శివ ని కలిసి భవానీకి వ్యతిరేకంగా మాట్లాడి శివని తనతో కలుపుకోవడానికి ప్రయత్నించడం.
       
85. శివని ఆపడం మాచిరాజు వల్ల కూడా కాలేదనీ, గణేష్ ని శివ ఎక్కడ దాచాడో తెలుసుకోవాలంటే శివ కదలికల మీద నిఘా వుంచాలనీ నానాజీని భవానీ ఆదేశించం.
       
86. కీర్తికి బాగాలేదని అన్న దగ్గర్నుంచి కాల్ వస్తే బయల్దేరిన శివని భవానీ మనుషులు అనుసరించడం.
       
87.  అన్న దగ్గరికి వెళ్ళిన శివ ద్వారా అన్నఇంటి అడ్రసు భవానీ అనుచరులకి తెలియడం.
       
88.  ఈ విషయం నానాజీ భావానీకి చెప్తే,  కీర్తిని తీసుకు రమ్మని భవానీ ఆదేశించడం.
       
89. శివ అన్న ఇంట్లోంచి  భవానీ అనుచరులు కీర్తిని అపహరించడం.
***


        సీక్వెన్సుల్ని గుర్తించడం ఎలా? మొత్తం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాల్ని వాటిలో జరిగే  ఏ బిజినెస్ (కార్యకలాపాల) లక్షణాలతో గుర్తిస్తామో, సీక్వెన్సుల స్ట్రక్చర్ ని కూడా ఇవే విభాగాల బిజినెస్ లక్షణాలతో గుర్తిస్తాం. స్క్రీన్ ప్లే బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాల్లో, వీటి అంతర్నిర్మాణాలైన సీక్వెన్సుల్లో, మళ్ళీ ఈ సీక్వెన్సుల  అంతర్నిర్మాణాలైన సీన్లలోనూ- అన్నిటా బిగినింగ్ మిడిల్ ఎండ్ లనేవి విధిగా వుంటాయి- ఇవన్నీ విడివిడి బిజినెస్ లతో కూడి వుంటాయి. బిగినింగ్ విషయం పరిచయం చేసి సమస్యని స్థాపించే బిజినెస్ తో, మిడిల్ ఆ సమస్యతో సంఘర్షించే బిజినెస్ తో, ఎండ్ వచ్చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపే బిజినెస్ తోనూ వుంటాయి. 

        ఇలా పై రెండు సీక్వెన్సుల్లో మొదటి దాన్ని తీసుకుంటే,  ఇది 79 వ సీనుతో ప్రారంభమై, 89 వ సీనుతో ముగుస్తుంది. ఇందులో విభాగాలు చూద్దాం. 79వ సీనుతో  బిగినింగ్ విషయం చెప్పడం  ప్రారంభిస్తోంది...తనని లాకప్ లోంచి బయటికి తీయకపోతే కోర్టులో భవానీ గురించి చెప్పేస్తానని గణేష్ బెదిరిస్తున్నాడు. తర్వాతి సీన్లో వాణ్ణి చంపెయ్యమని భవానీ ఆదేశించాడు. ఆ తర్వాతి సీన్లో గణేష్ ని చంపబోతే శివ వచ్చి చంపుతున్న వాణ్ణి  చంపేసి లాకప్ లోంచి గణేష్ ని తీసికెళ్ళి పోయాడు. ఇప్పుడు గణేష్ ని సజీవంగా కోర్టులో హాజరుపర్చాలన్న శివ ఎజెండాతో, కోర్టు కెళ్ళకుండా గణేష్ ని చంపాలన్న భవానీ కుట్రతో సమస్య ఏర్పాటై బిగినింగ్ విభాగం 82 వ సీనుతో ముగిసింది. దీన్ని ఈ కింది క్రమంలో గమనించ వచ్చు.

సీక్వెన్స్ -1  బిగినింగ్ విభాగం:  
       
79.  పోలీస్ లాకప్ లో వున్న గణేష్ ని నానాజీ కలవడం, తనని బయటికి తీయకపోతే కోర్టులో భవానీ గురించి చెప్పేస్తానని గణేష్ అనడం.
        80.  ఈ విషయం నానాజీ భవానీకి చెప్పేయడం, గణేష్ ని లేపెయ్యమని భవానీ ఆదేశించడం.
       
81.  పోలీస్ స్టేషన్ లో గణేష్ ని చంపడానికి ప్రయత్నించిన భవానీ అనుచరుల్ని  శివ చంపడం.
       
82. శివ సీఐ కి కాల్ చేసి భద్రత కోసం గణేష్ ని తన ఆధీనంలో వుంచుకుంటాననీ, రేపు కోర్టు దగ్గర అప్పగిస్తాననీ అనడం.

మిడిల్ విభాగం :
        83.  వారం రోజుల్లో శివ సంగతి చూస్తానని చెప్పి ఏమీ  చేయలేనందుకు భవానీ మీద మాచిరాజు మండిపడడం.
       
84. మాచిరాజు శివ ని కలిసి భవానీకి వ్యతిరేకంగా మాట్లాడి శివని తనతో కలుపుకోవడానికి ప్రయత్నించడం.
       
85. శివని ఆపడం మాచిరాజు వల్ల కూడా కాలేదనీ, గణేష్ ని శివ ఎక్కడ దాచాడో తెలుసుకోవాలంటే శివ కదలికల మీద నిఘా వుంచాలనీ నానాజీని భవానీ ఆదేశించం.
       
86. కీర్తికి బాగాలేదని అన్న దగ్గర్నుంచి కాల్ వస్తే బయల్దేరిన శివని భవానీ మనుషులు అనుసరించడం.
       
87.  అన్న దగ్గరికి వెళ్ళిన శివ ద్వారా అన్నఇంటి అడ్రసు భవానీ అనుచరులకి తెలియడం.
       
88.  ఈ విషయం నానాజీ భావానీకి చెప్తే,  కీర్తిని తీసుకు రమ్మని భవానీ ఆదేశించడం.

          రు సీన్లతో వున్న పై మిడిల్ విభాగాన్ని చూస్తే- ఇందులో సంఘర్షణ ప్రారంభమయ్యింది.  గణేష్ గురించిన ప్రధాన సమస్యతో బాటు, మాచిరాజుతో ముందునుంచీ నడుస్తున్న సబ్ ప్లాట్ కూడా కొలిక్కి రావడం మొదలైంది. వ్యవస్థకి ప్రతిరూపం మాచిరాజు భవానీ ఇక వేస్ట్ అని భావించి ఊసరవెల్లిలా శివని ఆకర్షించేందుకు విఫలయత్నం చేశాడు. శివ గట్టి సమాధానం చెప్పి పంపించాడు. శివది సర్జికల్ ఆపరేషన్. పరిమిత స్థాయిలో గణేష్ మీద చర్య తీసుకుంటే ఆటోమేటిగ్గా మూలపురుషుడు మాచిరాజు కూడా క్లోజ్ అవుతాడన్న వ్యూహం పన్నాడు. అందుకే ఇప్పుడు మాచిరాజు తన దగ్గరికి వచ్చినా కొత్తాలోచన చేయలేదు. ఎలాగూ వచ్చాడు కాబట్టి వీడితో డీల్ కుదుర్చుకుని దొంగ దెబ్బ తీయాలని మరో నాటకానికి తెర తీయలేదు. శివ ఈజ్ సైంటిఫిక్.

        భవానీ గణేష్ వేటలోనే వున్నాడు. శివ బందీగా వున్న గణేష్ ని పట్టుకుని చంపెయయ్యాలన్న ఎత్తుగడతో శివ మీద విఘా పెట్టించాడు. శివని అనుసరించి వెళ్ళిన భవానీ అనుచరులకి శివ అన్న కుటుంబం గురించి తెలిసింది. ఇది భవానీ ఎదుర్కొంటున్న సమస్యకి పరిష్కారం చూపింది. దీంతో శివఅన్న కూతుర్ని తీసుకు రమ్మన్నాడు. ఈ సంఘర్షిస్తున్న సమస్యకి ఈ పరిష్కార మార్గంతో మిడిల్ ముగిసింది. 

ఎండ్ విభాగం:
       
శివ అన్న ఇంట్లోంచి భవానీ మనుషులు కీర్తిని అపహరించడమనే ఒకే సీనుతో ఎండ్ విభాగం ముగిసింది. ఇలా విషయ పరిచయం, సమస్య, సంఘర్షణ, పరిష్కారమనే విభాగాల పనిముట్లతో మొదటి సీక్వెన్స్ స్ట్రక్చర్ సాగింది.

సీక్వెన్స్ -2
        90.  శివ కోర్టులో సీఐ కి గణేష్ ని అప్పగించడం, అక్కడే అన్న కూతురి అపహరణ గురించి తెలియడం.
       
91. కీర్తిని అపహరించే లోగా శివ గణేష్ ని కోర్టుకి అప్పగించాడనీ, భవానీ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని నానాజీ భవానీతో అనడం, బందీగా వున్న కీర్తి మీద భవానీ కన్నేయడం.
       
92. శివ అన్న ఇంటిదగ్గరికి వెళ్లేసరికి అక్కడ కీర్తి శవం వుండడం.
       
93. శివ భవానీ దగ్గరికి వెళ్లేసరికి అతను మాచిరాజు దగ్గరికి వెళ్ళాడని తెలియడం.
       
94. తన మీద అరెస్ట్ వారెంట్ మాఫీ చెయ్యనందుకు, తన గురించి చులకనగా మాట్లాడినందుకూ భవానీ మాచిరాజుని చంపెయ్యడం.
       
95. పారిపోతున్న భవానీని శివ వెంటాడి చంపడం.

బిగినింగ్ విభాగం:
          పై ఆర్డర్ లో మొదటి ఒకే సీనే విషయాన్ని పరిచయం చేసి, సమస్యని స్థాపించేసి  బిజినెస్ ని పూర్తి  చేసింది. శివ కోర్టు దగ్గర గణేష్ ని సీఐకి అప్పజెప్పాడు, అక్కడే కీర్తి అపహరణ గురించి తెలిసి సమస్యలో పడ్డాడు. ఈ సీక్వెన్స్ మొదటి సీక్వెన్స్ కి కౌంటర్ గా మొదలైందని గమనించ వచ్చు. మొదటి సీక్వెన్స్ లో గణేష్ ని అపహరించి శివ భవానీని  సమస్యలో పడేస్తే, ఈ రెండో సీక్వెన్స్ లో భవానీ కీర్తిని అపహరించి శివని సమస్యలో పడేశాడు. డైనమిక్స్ అంటే ఇదే. ఇలా పరస్పర యాంటీ కథనాలే కథలో  ఉత్కంఠని రేకెత్తిస్తాయి. పాసివ్ కథనాలు ఆర్గ్యుమెంట్ సహిత కథలకి వుండవు, సినిమాలకి పనికిరాని గాథలకే  వుంటాయి. పాసివ్ కథనమంటే బాగా కడుపు నిండిన రైటర్, వ్యవసాయానికి వ్యాయామాన్ని బద్దకించి, భుక్తాయసంతో బోర్లా పడి చేసే లేజీ రైటింగే. సోమరితనపు సొగసులు. సినిమా అంతే సంగతులు. ఏటా 90 శాతం ఫ్లాపులంటే ఆ దర్శకులు కూడా పాసివ్ పరమాణువులే. వేకప్ ఇండియా మానవులు కొద్ది మందే. 

మిడిల్ విభాగం :
         
91. కీర్తిని అపహరించే లోగా శివ గణేష్ ని కోర్టుకి అప్పగించాడనీ, భవానీ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని నానాజీ భవానీతో అనడం, బందీగా వున్న కీర్తి మీద భవానీ కన్నేయడం.
       
92. శివ అన్న ఇంటిదగ్గరికి వెళ్లేసరికి అక్కడ కీర్తి శవం వుండడం.
       
93. శివ భవానీ దగ్గరికి వెళ్లేసరికి అతను మాచిరాజు దగ్గరికి వెళ్ళాడని తెలియడం.
       
94. తన మీద అరెస్ట్ వారెంట్ మాఫీ చెయ్యనందుకు, తన గురించి చులకనగా
మాట్లాడినందుకూ భవానీ మాచిరాజుని చంపెయ్యడం. 

       
పై నాలుగు సీన్లతో మిడిల్ బిజినెస్ అయిన సంఘర్షణ ముగిసింది. అరెస్ట్ వారెంట్ రద్దుకోసం భవానీ ప్రయత్నం, కుదరక మాచిరాజుని చంపెయ్యడం; కీర్తి చావుని చూసి శివ ఇక భవానీని చంపేసేందుకు బయల్దేరడం. 

       
బ్ ప్లాట్ అయిన మాచిరాజు కథ మెయిన్ ప్లాట్ కంటే ముందే ముగిసిపోవడాన్ని గమనించాలి. మెయిన్ ప్లాట్ ముందు నుంచీ కూడా శివ- భవానీల మధ్యే వుంది. దీంతోనే కథకి ముగింపూ  వుంటుంది. కథలో వుండే సబ్ ప్లాట్స్ అన్నీ ప్రధాన కథకంటే ముందే ముగిసిపోవడం సరైన పధ్ధతి. ఇక్కడ కథా ప్రయోజనం వ్యవస్థని నాశనం చేయడమైనప్పుడు, ఇలాటి ప్రధాన విషయం సబ్ ప్లాట్ గా ఎందుకుందనవచ్చు. దీని ప్రతీక అయిన మాచిరాజుతో శివకి పెద్దగా సంపర్కం ఎందుకు లేదని కూడా అనొచ్చు. ప్రధాన దుష్ట శక్తి అదృశ్యంగా ఉంటేనే కథకి అందం. అలాగని కథకి ప్రధాన విలన్ అదృశ్యంగా వుండకూడదు. వుంటే ‘సరైనోడు’ లో లాగా విలన్ కీ - హీరోకీ సంపర్కంలేక, ఎంత సేపూ ఛోటా మోటా విలన్ అనుచరులతోనే క్లయిమాక్స్ వరకూ పాసివ్ రియాక్టివ్ పాత్రలాగా హీరో ఏకపక్ష పోరాటాలు చేసుకుంటూ- ఎక్కడున్నావ్ రా ముందుకురా - అని పదేపదే  విలన్ ని కేకలేసుకుంటూ గడపాల్సి వస్తుంది. హీరో కంఠశోషే తప్ప విలన్ తో ఏమీ జరగడం లేదని ఒక వెలితి బయల్దేరుతుంది. ఇలా కాకుండా సగం కథకల్లా విలన్ హీరో ముఖాముఖీ అవ్వాల్సిందే- ఎందుకంటే,  హీరో చేసే జర్నీయే కాన్ష మైండ్ లోంచి సబ్ కాన్షస్ మైండ్ లోకి. ఆ సబ్ కాన్షస్ మైండ్ లో  తలపడాల్సిన శక్తే కన్పించకపోతే ప్రేక్షకులకి  సైకలాజికల్ కనెక్ట్  వుండదన్న మాట  కథతో. 

        ఇద్దరు ముగ్గురు విలన్లు వున్నప్పుడు వాళ్ళల్లో ఒక విలనే ప్రత్యక్షంగా వుండి, మిగిలిన వాళ్ళు పరోక్షంగా వుంటారు. ‘హైపర్’ లోలాగా ఒకటో రెండో మూడో కృష్ణుడు లాగా ఒకరుపోయి ఇంకో విలన్ వచ్చే పధ్ధతి కథల్లో వుండదు. వుందంటే అది పాయింటు కాదు, పాదరసం. కథ ఏ పాయింటు మీదా నిలబడని పాదరసం. 

        మాచిరాజు సబ్ ప్లాట్ శివ లక్ష్యించిన వ్యవస్థతో ముడి పడి  వుంది. ఈ వ్యవస్థ కూడా అతణ్ణి భవానీయే చంపడంతో ఫినిష్ అయ్యింది- మరి ఒక హీరోగా శివ చేసిందేమిటని కూడా అనవచ్చు. చిచ్చు పెట్టిందంతా శివే. ‘ముత్యాల ముగ్గు’ లో కూడా చిచ్చు పెట్టేదంతా పిల్లలే. దాంతో విలన్లు ఒకర్నొకరు సర్వనాశనం చేసుకుంటారు- సృష్టి ఉపసంహారం త్రివిధాలుగా జరుగుతుందనే బ్రహ్మపురాణం ప్రకారం- అందులో ఒకటైన- పంచ భూతాలు ఒకదాన్నొకటి మింగేసుకునే నైమిత్తిక పద్ధతిలో ‘ముత్యాలముగ్గు’ విలన్లకి ముగింపు నివ్వడం జరిగింది. ‘శివ’ లోనూ ఇంతే. ఇలా ఈ రెండో సీక్వెన్స్ మిడిల్ లో సబ్ ప్లాట్ ముందుగానే ముగిసిపోయింది. భవానీ మాచిరాజు దగ్గరి కెళ్లాడన్న సమాచారంతో శివకి పరిష్కారం దొరికి,  అక్కడికి బయల్దేరడంతో- మిడిల్ బిజినెస్ సమగ్రంగా ముగిసింది. 

ఎండ్ విభాగం:
        ఇది భవానీని శివ వెంటాడి చంపే ఒకే సీనుతో ముగుస్తుంది. ఈ రెండో సీక్వెన్స్ బిగినింగ్ ఒకే సీనుతో ముగిసినట్టే, ఎండ్ కూడా ఒకే సీనుతో ముగిసింది. ఇక్కడ కథా ప్రయోజనం నెరవేరిన తర్వతే శివ స్వప్రయోజనం తీర్చుకున్నాడు- కీర్తిని చంపిన భవానీని చంపడం ద్వారా. పాత్ర చిత్రణ రీత్యా చూసినా శివ ముందు కథా ప్రయోజనానికే ప్రాధాన్య మిచ్చి,  మెచ్యూర్డ్ క్యారెక్టర్ అన్పించుకున్నాడు.
***
       ఎండ్ విభాగాన్ని రెండు సీక్వెన్సులు పటిష్టం చేశాయి. లైన్ ఆర్డర్ వేయడమంటే సీక్వెన్సుల్ని కూర్చడమే. సీక్వెన్సులు లేని లైన్ ఆర్డర్ పిచ్చి పిచ్చి పువ్వులు గుచ్చిన మాలలా వుంటుంది. ఇలా ఎండ్ విభాగాన్ని ముగించాక, మొదట్నించీ కథని క్రాస్ చెక్ చేసుకుంటూ రావాలి. ఇంకేవైనా నోళ్ళు తెర్చుకున్న మ్యాన్ హోల్స్ వున్నాయేమో, ఓపెన్ నాలాలూ వున్నాయోమో చూసుకోవాలి. మ్యాన్ హోల్స్ మీద వెంటనే మూతలేసేసి మూసెయ్యాలి. లేకపోతే వాటిలో పడి రైటరనే వాడు స్క్రిప్టుతో సహా గల్లంతై పోవచ్చు. ఓపెన్ నాలాల్ని కూడా వెంటనే మూసెయ్యాలి. స్క్రీన్ ప్లేలో ప్రతీ విభాగంలో రెండేసి సీక్వెన్సులు చొప్పున మొత్తం ఎనిమిది సీక్వెన్సులుంటాయి. కొన్ని ఆంగ్ల స్క్రీన్ ప్లే పుస్తకాల్లో చూసి 12,18 సీక్వెన్సులు వుంటాయని పొరబడకూడదు. అవి సీక్వెన్సులు కావు. ఎనిమిది సీక్వెన్సుల్లో కుదురుకున్న మజిలీలు. కథలో హీరో సాగించే ప్రయాణం తాలూకు దశలు మాత్రమే. ఐతే ఇన్ని దశలు కూడా మన సినిమాలకి అక్కర్లేదు. గత అధ్యాయాల్లో చెప్పుకున్నట్టు ఈ తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాల ఉద్దేశం- తెలుగులో ఇప్పటి కాలానికి తగ్గ కమర్షియల్ స్క్రీన్ ప్లేలు తయారు చేసుకునే సులువు చెప్పడమే. కాకపోతే క్వాలిటీ కోసం జోసెఫ్ క్యాంప్ బెల్, జేమ్స్ బానెట్ ల వంటి పండితుల శాస్త్రాల నుంచి, ఇప్పటి తెలుగు సినిమాలకి ఎంతవరకు నప్పుతుందో అంతే తీసుకుని ఈ స్ట్రక్చర్ ని డెవలప్ చేశాం. ఈ పండితులు చెప్పే అన్నేసి మజిలీలతో, ఇంకానేక పనిముట్లతో స్క్రీన్ ప్లే రాయడమంటే అది కళాఖండాలకే  అవసరం. కళాఖండాలు సమీప భవిష్యత్తులో తెలుగులో తీయరు కాబట్టి ఇంత శాస్త్రం మనకి అక్కర్లేదు. అనవసరంగా బుర్ర చెడగొట్టుకోవడమే. సింపుల్ గా బాక్సాఫీసు దగ్గర కాస్త పరువు నిలబెట్టుకుని, ఫ్లాపుల శాతాన్ని  ఇంకో పది శాతం తగ్గించుకుంటే చాలన్న పరిమిత ఆశే తప్ప, దీంతో పట్టిందల్లా సూపర్ హిట్టే అవ్వాలన్న గొంతెమ్మ కోర్కె కాదు.  


        ఎండ్ విభాగమనేది బిగినింగ్, మిడిల్ విభాగాల్ని పే ఆఫ్ చేసేది. కాబట్టి ఆ రెండు విభాగాల్లో లేవనెత్తిన అంశాలు, ప్రశ్నలు, సస్పెన్స్, సబ్ ప్లాట్స్  మొదలైన వాటన్నిటినీ క్లోజ్ చేసిన తర్వాతే ముగింపు కెళ్ళాలి. బిగినింగ్ అద్దమైతే, మిడిల్ భూతద్దం, ఎండ్ సూక్ష్మదర్శిని.రేపు ఉపసంహారం!
-సికిందర్

       

       


     ప్రతిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివిధ సామాజిక సమస్యలపై లోతైన అధ్యయనాన్ని డిమాండ్ చేసేది. ఒక రకంగా ఇది జర్నలిజమే. ఉదాహరణకు ‘పార్టనర్స్ ఇన్ క్రైమ్ ‘ అనే డాక్యుమెంటరీ ఫిలిం నే తీసుకుంటే, ఇది సినిమా రంగానికి బెడద గా తయారైన కాపీరైట్/ పైరసీల పెను సమస్య గురించి విశ్లేషనాత్మకంగా చర్చిస్తుంది. ఈ డాక్యుమెంటరీ వివిధ డాక్యూ ఫెస్టివల్స్ లో అనేక అవార్డులు పొందింది. పారోమితా వోహ్రా రూపొందించిన ఈ డాక్యూమెంతరీ కాపీరైట్ చౌర్యం గురించి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు వెలికి తీసి లోకానికి ప్రదర్శిస్తుంది.

          ఒక లెక్కలేనన్ని సినిమాలని, మ్యూజిక్ ని, వీడియోలనీ డౌన్ లోడ్  చేసుకున్న కాకలుతీరిన పైరసీ దారుడ్ని’నువ్వు చేస్తున్నది చట్ట విరుద్ధమని తెలుసా?’ అని అడిగితే  – ‘ఇవి నాకేం ఉత్త పుణ్యానికి రాలేదు, వీటిని సంపాదించడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను చేసిన వర్క్ ఎంత విలువైనదో నాకు తెలుసు’ అనేశాడతను.

          ఇలా పైరసీయే గాకుండా, కళాకారులు చేసే పాల్పడే కాపీరైట్ ఉల్లంఘనల గురించి కూడా ఇందులో చిత్రీకరించారు. ముఖ్యంగా మ్యూజిక్ కి సంబంధించి..ఇండియన్ రాక్ బ్యాండ్ ‘ధర్మల్ అండ్ ఏ క్వార్టర్’ ఎలా తమ ట్యూన్లని సినిమాపాటలకి కాపీ చేసి వాడుకుంటున్నారో వివరించారు. అంతేగాకుండా ఇంటర్నెట్ లో తమ సంగీతాన్ని తమ అభిమానులే కాపీ రైట్ హక్కుల్ని ఉల్లంఘించి పైరసీకిపాల్పడుతున్నట్టు  ఆరోపించారు. దర్శకురాలు పారోమిత్రా వోహ్రా వ్యవస్థీ కృత 

మాఫియాలుగా మారిన పైరసీదార్ల దగ్గరనుంచి, వివిధ కళా రంగాల్లో స్వయంగా కాపీరైట్ ఉల్లంఘనలకి పాల్పడుతున్నకళాకారుల వరకూ బయటపడని నిగూఢ రహస్యాలెన్నో వెలికి తీశారు. అసలు పైరసీ అనేది వ్యవస్థీ కృత నేరమా, లేక ఇదో రకమైన వర్గ పోరాటమా అన్న సందేహాన్ని కూడా రేకెత్తించారు.  ఈ మొత్తం వ్యవహారంలో బాధితులవుతున్న స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను కూడా సేకరించారు. సినిమాలని చట్ట విరుద్ధంగా డౌన్ లోడ్ చేసుకునేవారితో, పైరసీ సీడీ ల సేల్స్ మాన్ లతో, ఏది ఇన్ స్పిరేషన్ –ఏది కాపీ అంటూ రీసెర్చ్ చేస్తున్న బ్లాగర్ తో, పైరసీ- కాపీరైట్ చట్టాల్లోని లోసుగులతో సొమ్ము చేసుకుంటున్న యువ పారిశ్రామిక వేత్తతో- ఇలా అటూ ఇటూ అందరు వ్యక్తులతో సంక్షిప్త ఇంటర్వ్యూలు  డాక్యుమెంటరీలో పొందుపర్చారు.

          తొలి నుంచీ కాపీరైట్ చరిత్రని అద్భుతమైన ఇన్ఫో గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తూ, బ్యూటిఫుల్ సౌండ్ ట్రాక్ ని జోడించి ప్రయోజనాత్మకమైన ఈ ఇన్వెస్టిగేటివ్ ఈ డాక్యుమెంటరీని అందించిన దర్శకురాలికి అభినందనల వెల్లువ కూడా అంతే స్థాయిలో వుంది. యూట్యూబ్ లో దీన్ని వీక్షించ వచ్చు.

-సికిందర్
Monday, October 17, 2016

షార్ట్ టేక్:


     షార్ట్ ఫిలిమ్స్ ఫెస్టివల్స్ లో పాల్గొనాలని గుడ్డిగా ప్రయత్నించకూడదు. వాటి నిర్వాహకులు  సెలెక్టివ్ గా షార్ట్ ఫిలిమ్స్ ని ఎంపిక చేసుకుంటారు. కొన్ని కొన్నిరకాల సబ్జెక్టుల్ని మాత్రమే  అనుమతిస్తారు. యూత్ కోసం ఎక్కువగా తీసే లవ్ సబ్జెక్టులు అసలే తీసుకోరు. బలమైన సందేశాత్మకమైన షార్ట్స్  ఆ ఫెస్టివల్స్ లో చోటు సంపాదించుకుంటాయి. కాబట్టి టెక్నాలజీనంతా  రంగరించి ఎంత సైన్స్ ఫిక్షన్ షార్ట్ తీసినా ప్రవేశం లభించకపోవచ్చు.  ఆ షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శనల్లో ప్రేక్షకులు పరిమిత  టేస్టు గల వారై  వుంటారు. ఫెస్టివల్స్ ని పక్కన బెట్టి,  విస్తృత టేస్ట్స్ వున్న  ప్రేక్షకుల  కోసం షార్ట్స్ తీయడం  ఉత్తమం. 

       
వీటికి వేదికలుగా యూట్యూబ్, వీమియో,ఫన్నీ లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ వున్నాయి. విస్తృత పరిధిలో ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే, అలాటి కథల్నే ఎన్నుకోవాలి. ఐతే వీటిని తీశాక వెబ్ ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే అసంఖ్యాక ఇతర షార్ట్స్ తో పోటీ పడాల్సి ఉంటుందని మరువకూడదు. ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రేక్షకులకి మిలియన్ల కొద్దీ ఛాయిసులు ఆన్ లైన్ లో ఊరిస్తూ వుంటాయి. ఒక హులూనో, ఒక నెట్ ఫ్లిక్స్ నో క్లిక్ చేస్తే చాలు. ఇంకా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వేదికలు కూడా వున్నాయి. ఓ షార్ట్ ఒకసారి ఆన్ లైన్ లో క్లిక్ అయిందంటే విస్తృత పరిధిలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లలో కూడా పెద్ద ప్రచారం లభిస్తుంది. 

        వెబ్ ప్రపంచంలో దృష్టి నాకర్షిం చాలంటే, షార్ట్ ని తీయడంలో చాలా మెళకువలు  తెలిసి వుండాలి. వీటిలో ముఖ్యమైనది పేసింగ్. అంటే కథ నడక వేగం. వెబ్ లో లక్షలకొద్దీ షార్ట్స్ దర్శన మిస్తాయి. అందమైన ఛాయాగ్రహణం, నటనలు, గొప్ప కథ ఇవన్నీ వుంటాయి. కానీ  ఒక్క పేసింగ్ అనే టెక్నిక్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి స్లోగా నడిచే కథలగా పరమ బోరు కొడతాయి. మొనాపలీ వాతావరణ పరిస్థితులు వుండే సినిమాలకి థియేటర్లలో ఇది చెల్లిపోతుంది. కానీ అనేక ప్రత్యాన్మాయలూ, పోటీ కూడా వుండే  ఆన్ లైన్ వేదికల మీద షార్ట్స్ కి అలాకాదు. పేసింగ్ లేకపోతే  అవి ఒక్క సెకండ్ లో ఫ్లాప్ అయిపోతాయి. షార్ట్ ఫిలిం ని  లాప్ టాప్ లో ఎడిట్ చేసి వంద అడుగుల తెర మీద వేసి చూసుకుంటే పేసింగ్ ఎంత మందకొడిగా వుందో తెలిసిపోతుంది. కాబట్టి ఎంత స్మాల్ స్క్రీన్ వుంటే అంత ఫాస్ట్ పేసింగ్ అవసరం. ఇది జనరల్ ఫిలిం మేకింగ్ రూలు. 

        రెండోది- టైటిల్స్ సినిమా టైటిల్స్ లా చాంతాడంత సాగకుండా చూసుకోవాలి.  కథని వెనువెంటనే  ప్రారంభించేసి,  మొదటి షాట్ లోనే ప్రేక్షకుడు ఇన్వాల్ అయ్యేలా చేసుకో గల్గాలి. పది  నిమిషాల షార్ట్ లో చివరి నిమిషపు విషయం చెప్పడానికి సుదీర్ఘమైన ఉపోద్ఘాతం ఇస్తే ఎవరూ భరించలేరు. ఉపోద్ఘాతాలని  కట్ చేయాలి. ఫ్లాష్  బ్యాక్స్ కి కూడా షార్ట్స్ లో స్థానం లేదు. ఒక నిమిషం దాటి విషయం లేకపోతే  ఆడియెన్స్ చూసే అవకాశం లేదు. యాడ్ ఫిలిమ్స్ లాగే షార్ట్ ఫిలిమ్స్ కి అటేన్షన్ స్పాన్  తక్కువ. సినిమా హాళ్ళలో ప్రేక్షకుల్ని కంట్రోల్ చేయగలం. అది అక్కడి  మోనాపలీ వాతావరణం, సినిమా మాధ్యమానికి లభించిన వరం.  సమయం, స్థలం, చీకటి వాతావరణం, సౌండ్ వాల్యూం, కూర్చునే సీట్లు, తినే స్నాక్స్ అన్నీ కంట్రోల్ చేయగలరు . ప్రేక్షకుడు థియేటర్ లో సినిమా చూడడమంటే అది తన చేతిలో లేని  పాసివ్ అనుభవం. ఆన్ లైన్ లో అలా కాదు. ప్రేక్షకుడు యాక్టివ్ గా వుంటాడు. ఏ మాత్రం కంట్రోల్ చేయలేం. ఒక్క సీను బోరు కొట్టినా, మూడ్ బాగా లేకపోయినా క్లిక్ చేసేసి మరో దా నికి వెళ్ళిపోతాడు. లేదా మ్యూట్ చేసి వేరే పని చూసుకుంటాడు. డిలీట్ కూడా చేసెయ్యొచ్చు. షార్ట్స్ మేకర్ ఎంతో గొప్పగా అనుకున్న కథని ప్రేక్షకుడు తన చేతులతో రకరకాలుగా చిత్ర హింసలు పెట్టగలడు. 

        అందుకే ఆన్ లైన్లో ప్రేక్షకులని కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసుకోవాలి. కథలో పాలు పంచుకునేందుకు  ఆహ్వానించాలి. అలాటి షార్ట్స్ కొన్ని – వెల్కం టు పైన్  పాయింట్, సోల్జర్ బ్రదర్, 3డ్రీమ్స్ ఆఫ్ బ్లాక్, వైల్డర్ నెస్ ఇన్ డౌన్ టౌన్ - అనేవి వు న్నాయి.  వీటిని ఒకసారి పరిశీలించ వచ్చు.
The Thomas Beale Cipher అనే షార్ట్ లో దాని దర్శకుడు ఉద్దేశపూర్వకంగా 16 ఎన్క్రిప్టెడ్  మేసేజిల్ని  హైడ్ చేసి ఉంచాడు. ఆ ఫిలిం చూసే ఆన్ లైన్ ప్రేక్షకులు ఆసక్తితో వెనక్కొచ్చి వాటిని సెర్చ్ చేసి, కథని ఇంకా లోతుగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేలా వుందది. 

        కాబట్టి ఆన్ లైన్లో ప్రేక్షకులు మన అదుపులో వుండరు కదా అని బాధ పడనవసరం లేదు. ప్రేక్షకుల్ని కథలో ఇన్వాల్వ్ చేయగల  టెక్నిక్స్ గురించి  ఆలోచించాలి. ఇలా ఇంటరాక్టివ్ మూవీ మేకింగ్ ని అలవర్చుకుంటే ఆన్ లైన్ లోకూడా ప్రేక్షకుల మీద అదుపు సాధించ వచ్చు! ఇంటర్నెట్ కోసం తీసిన ఇంటరాక్టివ్ మూవీస్ ని నెట్ లో చూసుకోవచ్చు. వీకీ పీడియాలో లిస్టు లభిస్తుంది.

        షార్ట్ ఫిలిమ్స్ కి ఐడియాలు ఆలోచించడం చాలా ఫన్ గా వుంటుంది. పనిలో ఫన్ ఫీలయితేనే ఫెంటాస్టిక్ గా వుంటుంది. షార్ట్ ఫిలిమ్స్ షార్ప్ గా ఆడియెన్స్ కి ఆలోచింప జేసే మెసేజ్ లు ఇవ్వగలవు. అంతే కాదు, పెద్ద పెద్ద సినిమాల్లో చూపలేని విషయాలు వీటికే ప్రత్యేకం. మరి ఇంతటి వైవిధ్యాన్ని కలిగివుండే షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి వెరైటీ ఐడియాలు ఎలావస్తాయి? అదే తెలుసుకుందాం.

        ప్రతియేటా వివిధ కేటగిరీల్లో సినిమాలకి ఆస్కార్ అవార్డులిచ్చే అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు,  షార్ట్ ఫిలిమ్స్ టైటిల్స్ వగైరా అన్నిటితో కలుపుకుని 40 నిమిషాలు, లేదా అంతకు తక్కువ రన్నింగ్ టైం ని కలిగి వుండాలని నిర్ణయించారు. ఐతే ఒక మూవీని షార్ట్ ఫిలిం అనిగానీ, ఫీచర్ ఫిలిం అని గానీ నిర్ణయించడానికి ఫిక్సెడ్ క్రిటేరియా ఏదీ లేదు. అలా అనుకుంటే సినిమా చరిత్ర  ప్రారంభమైన కాలంలో లఘు చిత్రాలే కథా ఫీచర్ ఫీచర్ సినిమాలుగా చెలామణి అయ్యాయి. అయితే రానురాను ఆ లఘు కథా చిత్రాలే నిడివి పెరిగిపోయి సినిమాలు అంటూ అర్ధం చెప్పుకోవడంతో, లఘుచిత్రాలు కాన్సెప్ట్ వేరే దారి చూసుకోక తప్పలేదు - అది సినిమాలకంటే భిన్నంగా కథల్ని  చెప్పే ప్రయోగం!  ఇందులో భాగంగానే ఆర్ట్ ఫిలిమ్స్ వచ్చాయి.ఇప్పుడు ఆర్ట్ ఫిలిమ్స్ కూడా ఆదరణ కోల్పోయి నవ యువ మేకర్లతో భారీ ఎత్తున షార్ట్ ఫిలిం అనే హైటెక్ కేటగిరీకి తెరతీశాయి.

        ఐతే సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో సినిమాలకే సరైన కథల్లేక ఫ్లాప్ అవుతున్నాయి. అలాటి సమస్య షార్ట్ ఫిలిమ్స్ కి లేదని కాదు. షార్ట్ ఫిలిమ్స్ కి సమస్య సినిమా కథల్ని అనుసరిస్తేనే వస్తుంది. సినిమాల్లో చూసేదే షార్ట్ ఫిలిం లో కూడా చూపిస్తే ఇక షార్ట్ ఫిలిమ్స్ ప్రత్యేకత ఏమిటి?వాటిని ఎందుకు చూడాలి? కాబట్టి సినిమాల మీద మోజుతో షార్ట్ ఫిలిమ్స్ ని క్రియేటివ్ పరంగా బలి చేయకుండా బతికించుకుంటే, అలా ఈ కేటగిరీని కాపాడుకుంటున్న వాళ్ళుగా పేరు తెచ్చుకుంటే,  గ్రేట్ అన్పించుకుంటారు.
        కాబట్టి ఇకనుంచి షార్ట్ ఫిలిమ్స్ కి కథల్ని ఇలా విభిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నించ వచ్చేమో  :

1. ఫ్రెండ్ షిప్పే శాశ్వతమని చెప్పే ఐడియా 
       ఈ సింపుల్  కథ తీయడానికి మంచి గ్రాహ్య శక్తి, నైపుణ్యం, రాసేటప్పుడు తీసేటప్పుడు అంకిత భావంతో టీం వర్క్ వుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. స్నేహమే శాశ్వతం అని చెప్పే ఈ స్టోరీ ఐడియాని పరిశీలించండి:

        ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి ( అజయ్-నాగ్-నవ్య అనుకుందాం) ముగ్గురూ ఇంటర్ అప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్. అజయ్, నాగ్  లకి  నవ్య తన మాజీ బాయ్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది.  ఆ మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమెతో విడిపోయాక కూడా, అతను పరిచయం చేసిన అజయ్, నాగ్  లతో ఆమె ఫ్రెండ్ షిప్ ని కంటిన్యూ చేస్తూనే వుంది. ఐతే ఈ ముగ్గురూ ఎప్పుడూ తమమధ్య  లవ్ గురించి ఆలోచనే రానీయ లేదు. ఆది ఫ్రెండ్ షిప్ ని డిస్టర్బ్ చేస్తుందని భావించారు.  కాకపోతే అజయ్ వేరే కావ్య అనే అమ్మాయితో లవ్ లో పడ్డాడు. కావ్యకి అజయ్- నవ్యల ఫ్రెండ్ షిప్ గురించి తెలిసినా దాన్ని అర్ధం జేసుకుని అడ్జస్ట్ అయింది.

        ఇలావుంటే, కొంతకాలానికి నవ్య తను నాగ్ ని ప్రేమిస్తున్నట్టు గ్రహించింది. ఆ విషయం నాగ్ కి  చెప్పడానికి వెళ్లి నప్పుడు అతను తన గర్ల్ ఫ్రెండ్ సౌమ్య  గురించి చెప్పాడు. నవ్య వెంటనే ఫ్రెండ్ షిప్ నటిస్తూ అతడికి కంగ్రాట్స్ చెప్పింది. అయితే  నాగ్ ని ప్రేమిస్తున్న సౌమ్యకి, అతడితో నవ్య ఫ్రెండ్ షిప్ చేయడం నచ్చలేదు.  ఇది గ్రహించిన నవ్య,  నాగ్ తోబాటు - అజయ్ కీ దూరంగా ఉండసాగింది. 

        ఇలా వుండగా ఓ హేపీ న్యూ ఇయర్ నాడు,  నాగ్  పార్టీ ఇచ్చి నవ్యని  కూడా ఆహ్వానించాడు. ఇది తెలుసుకున్న సౌమ్య  రావద్దని నవ్య ని హెచ్చరించింది. ఫోన్ లో ఇలా హె చ్చరిస్తూంటే అది విన్న నాగ్ ఇంకొక్క క్షణం ఆలస్యం చేయకుండా సౌమ్యని వదిలేసి, నవ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు గానీ తను అసలు లవ్ చేస్తున్నది నవ్య నే అని తెలుసుకోలేకపోయాడు.  దీంతో అజయ్-కావ్య, నాగ్ - నవ్య కపుల్స్ ఇద్దరికీ వాళ్ళమధ్య ఫ్రెండ్ షిప్ దెబ్బతినకుండా సమస్య పరిష్కారమై పోయింది.

2. అపరిచితుల్ని నమ్మడం డేంజర్ అని చెప్పే ఈ స్టోరీ
       
దేళ్ళ వినీత్ మదర్ తో ఉంటున్నాడు. ఫాదర్ లేడు. మదర్  ఓవర్ టైం చేసి కష్టపడి సంపాదిస్తూ,  వినీత్ కి ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. ఒక్కోసారి ఆమె నైట్ షిఫ్ట్ కి వెళ్ళినప్పుడు ఒక టీనేజి కుర్రాడు ఆది వచ్చి వినీత్ కి తోడుగా ఉంటున్నాడు.

        టీవీలో వినీత్ ముందే ఆది చూడకూడని ప్రోగ్రాములు చూస్తాడు. అసభ్యంగా మాట్లాడతాడు. స్మోక్ చేస్తాడు. డ్రింక్ కూడా చేస్తాడు. కులపరంగా వినీత్ దూషిస్తాడు. అలా  ఒక రోజు వినీత్ పాలు తాగుతున్న గ్లాసు చేతిలోంచి జారి పగిలింది. దాంతో ఏడవ సాగాడు. అది చూసి ఆది కోపం పట్టలేక,  వినీత్ మెడ బట్టుకు లాగి బీరువాలోకి తోసి లాక్ చేసేశాడు. వినీత్ లోపలి నుంచి గట్టిగా అరుస్తూంటే, ఏడుస్తూంటే ఆది వాడి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళు చేతులు కట్టేసి మళ్ళీ బీరువాలోకి తోశాడు.

        తెల్లారి డ్యూటీ నుంచి మదర్ వచ్చి చూస్తే,  ఇద్దరూ కన్పించలేదు. ఇంట్లో విలువైన వస్తువులూ పోయాయి. బీరువా తెర్చి చూస్తే నిర్జీవంగా కొడుకు...
        ఈ సింపుల్ కథల్ని ఎలా విజువలైజ్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటాయో బాగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి.  ఏ కథ చెప్పినా అది ఏదో ఒక మెసేజ్ పాస్ చేసినట్లయితే మంచి షార్ట్ గా గుర్తుంది పోతుంది. 

       
-సికిందర్