రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, డిసెంబర్ 2014, ఆదివారం

రివ్యూ

ప్రాబ్లం ఫ్లాష్ బ్యాక్ తో! 

 



స్క్రీన్ ప్లే- దర్శకత్వం : కె ఎస్ రవికుమార్
తారాగణం :
రజనీకాంత్‌, సోనాక్షి సిన్హా, అనుష్కా శెట్టి, జగపతిబాబు, బ్రహ్మానందం, కె. విశ్వనాధ్‌, సంతానం, రాధా రవి, దేవ్ గిల్  తదితరులు
రచన: పొన్‌ కుమరన్‌, కె.ఎస్‌. రవికుమార్‌ *  సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ *
ఛాయాగ్రహణం: రత్నవేలు * కూర్పు: సంజిత్‌ * కళ: సాబు సిరిల్‌
బ్యానర్‌: రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. * నిర్మాత :  రాక్‌లైన్‌ వెంకటేష్‌
విడుదల : డిసెంబర్‌ 12, 2014 
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త  సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా పండగే. ఆ పండగ  ఉత్సాహాన్ని ఇనుమడిం పజేయడం ఎప్పటికప్పుడు ఆయన సినిమాల దర్శకులకి గట్టి పరీక్షే. అయితే  స్టార్లతో కొత్త ప్రయోగాలు చేసే శంకర్ లాంటి టాప్ దర్శకుడి విజన్ ని చూడలేకపోతున్న ఇతర టాప్ దర్శకులకి మాత్రమే ఈ పరీక్ష. రజనీకాంత్ తో శంకర్ ఇంకో  ముప్ఫై సినిమాలు తీసినా అవి వేటికవి ముప్ఫై కొత్త రకాలుగానే  ఉండొచ్చు. ఇతరులే మామూలు మాస్ కమర్షియల్స్ తో సక్సెస్ ని ఇద్దామనుకుంటున్నారు. ఈ కోవకి చెందినవాడే దర్శకుడు కె ఎస్ రవికుమార్. రజనీకాంత్ తో గతంలో ముత్తు ( 1995), నరసింహా( 1999)  తీసిన కోవలోనే తిరిగి రజనీ స్టార్ పవర్ ని ఇంకా ఈ కాలంలో కూడా మరో మూస కథకి మాత్రమే పరిమితం చేయాలనుకున్నాడు. 

         మెగా స్టార్ చిరంజీవి కూడా తన 150 వ సినిమాకి ఇలాటి ‘లింగా’ లాంటి పీరియడ్ కథనే ఎంచుకుంటే రజనీ లాగే తప్పులో కాలేసినట్టే. ఈ కాలంలో ఇవి  ప్రేక్షకులెవరికీ పట్టవు. కేంద్రంలో ఆశలు రేపే కొత్త ప్రభుత్వం, స్థానికంగా రాష్ట్ర విభజన నేపధ్యాలు విసురుతున్న అనేక సవాళ్ళకి పరిష్కారాల కోసం ప్రేక్షకులు అసహనంగా ఎదురు చూస్తున్నారు. ఎమోషన్ ఇక్కడుంది ఈ వర్తమానంలో. ఎప్పటివో గతించిపోయిన బ్రిటిషకాలపు కథల్లో కాదు. కాలక్షేపమే  కావాలనుకుంటే ఇతర హీరోల సినిమాలు చాలా వస్తాయి, అవి చూసుకుంటారు. రాజకీయంగా ప్రభావితం చేయగల, ప్రాబల్యమున్న సూపర్, మెగా స్టార్ల నుంచి స్వైరకల్పనల మసాలా సినిమాలకోసం ఎదురు చూడ్డం లేదు. తమిళంలో గత అక్టోబర్లో నేటి ప్రేక్షకుల ఎమోషన్స్ ని సరీగ్గా టార్గెట్ చేసిన  ‘కత్తి’ సమకాలీన సామాజిక సమస్యల్ని అతి  బలంగా చిత్రించి ప్రేక్షకుల భావోద్వేగాల్ని చక్కగా సంతృప్తి పర్చగల్గింది. ఈ అతి పెద్ద సక్సెస్ ని తీసింది విజయ్ లాంటి కమర్షియల్ స్టార్ తో, మురుగ దాస్ లాంటి కమర్షియల్ దర్శకుడే!

     ‘లింగా’ మరోసారి  ఫ్యూడలిజంపట్ల ప్రజల భయభక్తుల్ని చాటే తిరోగమనపు కథ చెప్పింది. ఫ్యూడలిజం మీద ఎనలేని సానుభూతిని, ఫ్యూడలిజమే కొనసాగివుంటే ఎంత బావుండునన్న మమకారాన్నీ చాటింది. ఇది  అశేష రజనీ ఫ్యాన్స్ గా నేటితరపు యువప్రేక్షకులకి అర్ధమయ్యే ‘ఇజం’ కాదు. ఐనా సినిమాలో దీనిదే (దాదాపు రెండు గంటలు) సింహభాగం!

    ఈ ‘ఇజం’ సీరియెస్ నెస్ సినిమాలో సమకాలీనతనీ, వినోదాన్నీ మింగేసింది. ‘ఇజం’ తో హీరోయిజమైనా చూపించివుంటే యువప్రేక్షకులకి హుషారెక్కేది-  రజనీ సినిమా అంటే హుషారే గానీ, బేజారెత్తిన అతడిపాత్ర పడే బాధలూ ఏడ్పులూ కాదుగా? ప్రజలకి తమ బాధలు తీర్చే నాయకుడు కావాలి తప్ప, తన బాధలు చెప్పుకునే నాయకుడు కాదు. అది నాయకుడి లక్షణం కూడా కాదు. త్యాగమనే ప్యాసివ్ హీరోయిజం కంటే,  పోరాటమనే యాక్టివ్ నెస్సే రజనీ స్థాయి సినిమాకి పండుతుంది.

రాజావారు – దొంగోడు!  
      లింగా ( రజనీకాంత్) ఒక దొంగ. ఫ్రెండ్స్ నేసుకుని బంగారు నగలు కొట్టేస్తూంటాడు. ఒక సేటుకి అమ్ముతూంటాడు. అతడికి తనతాత రాజా లింగేశ్వర్ అంటే మంట. రాజభోగా లనుభవించిన అతను తన తండ్రికి ఏమీ ఇవ్వలేదనీ, తను దొంగలా మారడానికి అతనే కారణమనీ అంటూంటాడు. ఒక టీవీ జర్నలిస్టు లక్ష్మి పరిచయమవుతుంది. ఇతన్ని దొంగాగా పట్టివ్వడానికి  ప్రయత్నిస్తూంటుంది తన స్టింగ్ ఆపరేషన్స్ తో. ఒకసారి ఒక స్టార్ హోటల్లో ఒక విలువైన ఆభరణం ఎగ్జి బిషన్ జరుగుతూంటే దాని మీద కన్నేస్తాడు లింగా. అక్కడికి అనుసరించి వచ్చిన లక్ష్మీనీ తన ఆపరేషన్లో ఇన్వాల్వ్ చేసేస్తాడు తెలివిగా లింగా. తీరా ఆ ఆభరణం కాజేసి సీటు కిస్తే,  ఆ సేటు అరెస్ట్ అవుతాడు. ఇక లింగా తన ఫ్రెండ్స్ తో పారిపోవాల్సి వస్తుంది.  అప్పుడు లక్ష్మి అతన్ని సింగనూరు అనే వూరు తీసికెళ్తుంది.

    ఇక్కడికే ఎందుకంటే, ఈ వూళ్ళో లింగా తాత లింగేశ్వర్  కట్టిన దేవాలయం వుంది. 70 ఏళ్ల క్రితం నుంచీ ఇది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఆ ప్రారంభోత్సవం రాజా లింగేశ్వర్ మనవాడే చేయాలని ఊరి పెద్ద అయిన లక్ష్మీ  తాత ( కె. విశ్వనాథ్) పట్టుదల. ఆ మనవడే లింగా అని  తెలుసుకున్న లక్ష్మి అతడ్ని ఇక్కడికి తీసుకొచ్చిందన్న మాట. 

    ఆనాడు లింగేశ్వర్ ఆలయంలో శివలింగాన్ని ఒక ఖరీదయిన మరకతమణి తో చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న లింగా, ఆ లింగాన్ని కొట్టేసేందుకు ప్రయత్నిస్తూ గ్రామస్థులకి దొరికిపోతాడు. దీంతో లక్ష్మీ తాత, రాజా లింగేశ్వర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తాడు.

    1939 లో బ్రిటిష్ ప్రభుత్వంలో రాజవంశీయుడైన లింగేశ్వర్ కలెక్టర్ గా వుంటాడు. ఇతను ఐసీఎస్ కంటే ముందు కేంబ్రిడ్జి యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఒకసారి సింగనూరు అనే ఊరికొచ్చి, అక్కడ నీటి ఎద్దడి కారణంగా కరువుకాటకాల్నీ, ఆత్మహత్యల్నీ చూసి చలించిపోతాడు. అక్కడ డ్యాం కట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాడు. ఆ గ్రామంలోనే భారతీ ( సోనాక్షీ సిన్హా) అనే అమ్మాయి పరిచయమై ప్రేమలో పడుతుంది.

    కానీ ఆ డ్యాం ప్రతిపాదనకి బ్రిటీష్ అధికారి (విలియం ఒరెండ్రాఫ్) అడ్డుతగిలి రైల్వే ట్రాక్ వేస్తానంటాడు. మీ రైల్వే ట్రాకులు మా సంపద దోచుకెళ్ళాడానికే నని ఎదురు తిరిగి, ఆ డ్యాం ని సొంత ఖర్చుతో నిర్మిస్తానని రాజీనామా చేసి వెళ్లి పోతాడు లింగేశ్వర్.

    ఇప్పుడీ డ్యాం ని లింగేశ్వర్ కట్టాడా, కడితే బ్రిటిష్ అధికారివల్ల ఏ ఏ ఇబ్బందు లొచ్చాయి, చివరి కేమయ్యాడు - అన్నవి ఈ ఫ్లాష్ బ్యాక్ లో మిగిలిన అంశాలు.

    ఇలా తాత ఔన్నత్యం గురించి తెలుసుకున్న లింగా మారి పోతాడు. అయితే ఇప్పుడు ఈ డ్యాంని కూల్చే కుట్ర ఒకటి ఎంపీ నాగభూషణం ( జగపతిబాబు) చేస్తున్నాడు. దీన్ని పేల్చేసి, కాలం చెల్లిపోవడం వల్లే అది కూలిపోయిందని చెప్పి కొత్త డ్యాంకట్టే కాంట్రాక్టుతో వేలకోట్లు వెన కేసుకోవాలని అతడి పథకం. ఈ పథకాన్ని లింగా ఎలా తిప్పి కొట్టాడనేది సినిమాకి ముగింపు.

రజనీ షో!

    సాంతం రజనీ షో ఈ సినిమా –మైనస్ రజనీ మార్కు హీరోయిజం, కేరింతలు కొట్టించే డైలాగులు కూడా శూన్యం. దాదాపు రెండు గంటలు సాగే ఫ్లాష్ బ్యాక్ పాత్రే దొంగోడి పాత్రని మింగేసింది. ఫ్లాష్ బ్యాక్ పాత్ర ద్వారా రజనీ కాంత్ లో గంభీర్యాన్నే, ఉదాత్తతనే చూస్తాం. దీని ప్రభావమే దొంగోడి పాత్ర మీద కూడా పడి అది కూడా డౌన్ ప్లే అయింది. మనకి తెలిసి మొట్ట మొదటిసారిగా రజనీ కాంత్ రజనీ కాంత్ లా కాక, ఏ అభిమానీ జీర్ణించుకో లేని ‘పాత్ర’ లా కనపడ్డాడు. రజనీ కాంత్ లో ‘పాత్ర’ని ఎవరూ చూడాలనుకోరు. కేవలం రజనీ కాంత్ నే చూస్తారు. రెండు పాత్రల్నీ ఎంత నీటుగా పోషించినా, ఆ నీట్ నెస్సే రజనీ అనే ఎట్రాక్షన్ కి ఎసరు పెట్టింది. దర్శకుడూ రచయితా కలిసి రజనీ పోషించిన ఉదాత్త పాత్రని ఎంతో పూజించ వచ్చు గాక, అభిమానులు మాత్రం రజనీనే పూజిస్తారు. ఆ వ్యక్తి పూజకి అవసరమైన గుణగణాలని పాత్రలకి పెయింట్ చేయడంలో విఫలమయ్యారు దర్శకుడూ రచయితా.

      హీరోయిన్లిద్దరూ సోనాక్షీ సిన్హా, అనూష్కా శెట్టీ లిద్దరూ ఒళ్ళు చేసి కాస్త ఇబ్బందికరంగానే కన్పిస్తారు. విలన్ గా జగపతిబాబుది సోసో పాత్ర. ఒక పెద్ద డ్యాం ని కూల్చి కొత్త డ్యాం కాంట్రాక్టు పట్టాలనే కుట్ర ఎంత సినిమా అయినా ఒప్పించని విషయం. అతడి కుట్ర కూడా కథనంలో ఎక్కడా కనీస గాభరా పుట్టించే విధంగా కూడా లేదు. కారణం ఫ్లాష్ బ్యాకే అసలు కథని మింగేయడం.
    ఏఆర్ రెహమాన్ సంగీతం, పాటలు కూడా హుషారెక్కించలేక పోయాయి. రత్నవేలు ఛాయగ్రహణం గురించి చెప్పాలంటే, అదొక అనిర్వచననీయమైన అనుభూతి. ఈ లెవెల్లో టాప్ సినిమాటోగ్రఫీ ఇంతవరకూ భారతీయ సినిమాలకి లేదు. రెడ్ డ్రాగన్ 6కె, పాంథమ్ ఫ్లెక్స్ 4కె వంటి అత్యాధునిక హైరిజల్యూషన్ కెమెరాలు వాడిన ఫలితమిది!

స్క్రీన్ ప్లే సంగతులు 
      ఒక సినిమాకి కి ఏది అసలు కథ అవుతుంది? కథ చెబుతూ సందర్భవశాత్తూ ప్రస్తావించుకునే గడచిన కాలపు ఏదైనా ఒక విశేషమా( డ్రీమ్ టైం), లేక వర్తమానంలో నడుస్తున్న కథా (ప్రెజెంట్ టైం)? గతానిదెప్పుడూ కథే   కాదు. అది ప్రస్తుతం ఎత్తుకుని చెప్తున్న, లేదా వర్తమానంలో నడుస్తున్న కథకి అవసరమైన సమచారాన్నిఅందించే వనరు మాత్రమే. ఇలా ఫ్లాష్ బ్యాక్ ( డ్రీమ్ టైం) అనేది ఒక డేటా బ్యాంకే తప్ప, మెయిన్ స్టోరీ కాదు. మెయిన్ స్టోరీ కూడా అవుతుంది- ఎప్పుడంటే- మొత్తం ఫ్లాష్ బ్యాకూ, మెయిన్ స్టోరీ ( డ్రీమ్ టైం- ప్రెజెంట్ టైం) ఒకే పాత్ర వైనప్పుడు. ఉదాహరణకి చిరంజీవి నటించిన ‘ఖైదీ’. ఇందులో మెయిన్ స్టోరీ కంటే ఫ్లాష్ బ్యాక్ నిడివే ఎక్కువ. ( సిల్వెస్టర్ స్టాలోన్ హిట్ ‘ఫస్ట్ బ్లడ్’ కాపీ) అయినా ఫర్లేదు- అది ఒకే హీరో సమస్య కాబట్టి. ఆ హీరో కథనే సమగ్రంగా ఫాలో అవుతున్నాం కాబట్టి. ఇలాకాక, వర్తమానంలో నడుస్తున్న హీరో కథని పక్కన పెట్టి, ఇంకో  పాత్ర ఫ్లాష్ బ్యాక్ ని ఎత్తుకుని సుదీర్ఘంగా చెప్పుకుంటూ కూర్చోవడమంటే, వర్తమాన హీరో కథని దగా చేయడమే. ప్రేక్షకుల వీక్షణా నుభవానికి తీవ్ర భంగం కల్గించడమే.
   ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా ప్రెజెంట్ టైం -డ్రీమ్ టైంలు ఆ హీరోవే  అయివుండడం గమనించగలం. ఇలాటి డ్రీమ్ టైం లతో ప్రమాదం వుండదు గానీ, ప్రస్తుత ‘లింగా’ లో లాంటి అవధుల్లేని రెండో పాత్ర  డ్రీమ్ టైం తోనే  సమస్య వస్తుంది. వుంటే గింటే అది సుదీర్ఘంగా వుండకూడదు. ప్రెజెంట్ టైం నీ , హీరో పాత్రనీ అధిగమించకూడదు. అధిగమిస్తే సినిమా చప్పగా తయారవుతుంది.
    ఒక అపూర్వ సూపర్ స్టార్ గా రజనీ కాంత్ పాత్రపరంగా, నటనా పరంగా అన్ని నియమ నిబంధనలకీ అతీతుడే కావొచ్చు, కానీ స్క్రీన్ ప్లే సూత్రాలకి కాదు. కామెడీకి సంబంధించి అరిస్టాటిల్ ఏం చెప్పాడో- ముందు కామెడీ పుట్టడానికి ఆధారభూతమైన సంఘటన లాజికల్ గా వుంటే, దాని మీద నిలబడి ఎలాటి అసంబద్ధ కామెడీ నైనా నడపొచ్చని- అలా ముందు స్క్రీన్ ప్లే అనేది స్ట్రక్చర్ లో వుంటే, ఆ స్ట్రక్చర్ ని ఆధారంగా చేసుకుని కథనంలో ఎన్ని అనూహ్య విన్యాసాలైనా చేసుకోవచ్చు.  రజనీతో ఇదే చేస్తూ వచ్చారు ఇంతకాలం. ఇప్పుడొచ్చి  స్ట్రక్చర్ ని కూలదోసి, స్ట్రక్చర్ కి కూడా రజనీ అతీతుడైనట్టు డ్రీమ్ టైం- ప్రెజెంట్ టైం లతో చెలగాట మాడి బ్యాడ్ టైం ని సృష్టించు కున్నారు. మనవడి కథని ఎత్తుకుని, తాత కథ చెప్పుకొచ్చారు రెండు గంటలపాటూ. 

      ఐతే ఇలా రివర్స్ లో, ఫ్లాష్ బ్యాక్ నే ప్రధాన కథగా మార్చిన స్ట్రక్చరల్ విన్యాసంతో కూడా సినిమాని నిలబెట్ట వచ్చు. కానీ  ‘లింగా’ మేకర్లు తాము ఫ్లాష్ బ్యాక్ తో ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోయారు. ప్రమాదంలో పడబోతున్నామని తెలుసుకుని వుంటే, చేయకూడని ఆ స్ట్రక్చరల్ విన్యాసానికి అనితర సాధ్య రజనీ విన్యాసాలతో చెక్ పెట్టేసే వాళ్ళు!
     ఫ్లాష్ బ్యాక్ లో రజనీ పాత్ర ని అలా పాసివ్ హీరోయిజంతో కాక, బ్రిటిష్ వాడితో అమీతుమీ తేల్చుకునే యాక్టివ్ పాత్రగా – దుమ్మురేపి వదిలేవాళ్ళు. బ్రిటిషర్ ప్రతినాయక పాత్రకి బిల్డప్పే లేక, రజనీ తలపడడానికి ముఠాయే లేక, ప్రతీచోటా రజనీ రాజీ పడిపోయే మనస్తత్వంతోనే  నడిపారు. బ్రిటష్ దోపిడీకి వ్యతిరేకంగా సొంతంగా ప్రజలకి డ్యాం కట్టించి ఇవ్వడానికి కలెక్టర్ పదవికి సైతం రాజీనామా చేసిన ప్పుడే రజనీ బ్రిటిషర్లకి అతీతుడైపోవాలి. అంతేగానీ, ఎలాగో డ్యాం కట్టిన తర్వాత మళ్ళీ ఆ బ్రిటిషర్ బ్లాక్ మెయిల్ కే  తలొగ్గి, సర్వం అతడిపరం జేసి, డ్యాం అతనే కట్టిచ్చినట్టు కూడా రాసిచ్చి, అతడి పేరే పెట్టుకునేట్టు చేసి బికారిలా వెళ్లి పోవడమనే ఫ్లాష్ బ్యాక్ కాన్సెప్టే
పాత్రోచిత్యాన్నీ, తద్వారా కమర్షియల్ గా కథనంలో పుట్టాల్సిన సంఘర్షణనీ  దెబ్బతీసింది. ప్యాసివ్ హీరోయిజం తో పనికిరాని త్యాగ ధనుడన్పించు కోవడంకంటే, ఫిజికల్ యాక్షన్ తో వీరమరణం పొందివుంటే, ఆ ఫ్లాష్ బ్యాక్ నడకే వేరుగా వుండేది!
   పూర్తిగా ఫ్యూడలిజానికి పట్టంగట్టి, ప్రజలతో అడుగడుగునా రజనీకి పూజనీయ పాత్రగా దండాలు పట్టించడమే సరిపోయింది. దాంతో అది ఉదాత్త పాత్రగానే సెటిలయ్యింది. ఈ కాలం చెల్లిన కథా పాత్రా రజనీ ఇమేజినే డౌన్ ప్లే చేశాయి!
   ఈ రైతుల కథే ‘కత్తి’ లో కూడా చెప్పారు. అందులోనూ తమిళ స్టార్ విజయ్ ద్విపా త్రాభినయమే. అయితే అది సమకాలీనంగా. ఒకడు క్రిమినల్, రెండోవాడు రైతుజన బాంధవుడు. ఇతను కుట్రకి బలైతే, ఇతని స్థానంలో క్రిమినల్ విజయ్ వస్తాడు. రైతుల భూములు లాక్కునే కార్పోరేట్ కుట్ర అది. మన చుట్టూ ఇప్పుడు జరుగుతున్నవాటిని ఎత్తి చూపే చిత్రణ ఇది.. బ్యాంకులకి ఐదువేల కోట్లు ఎగ్గొట్టిన బీరు ఫ్యాక్టరీ వాడు సమాజంలో ఫ్రీగా తిరుగుతోంటే, ఐదు వేలు రుణం తీసుకున్న రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి?-లాంటి కదిలించే డైలాగులున్న వర్తమాన కథ చెప్పారు. 2జి స్కాం మీదా, మీడియా అనారోగ్యకర ధోరణి మీదా, ఇంకా చాలా వాటి మీదా  పదునైన డైలాగులు విసురుతాడు హీరో విజయ్. రైతుల సామూహిక ఆత్మహత్యల సీను  ఒక్కటి చాలు ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ అయిపోవడానికి! రజనీ సర్, వేరార్యూ సర్?

సికిందర్