రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, డిసెంబర్ 2015, సోమవారం

కొటేషన్ల కహానీ!




ర్శకులకీ, రచయితలకీ  ది బెస్ట్ కొటేషన్ గా నిల్చిపోయిన నా ఫేవరేట్ ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కొటేషన్ ఏమిటంటే, విసుగెత్తే  అంశాలన్నిటినీ  కత్తిరించేసిన నాటకీయతే నిజ జీవితమని! అలాగే మరొక కొటేషన్ జీన్ లక్ గోడార్డ్ చెప్పింది కూడా నా ఫేవరేట్ కొటేషనే : సినిమా అంటే సత్యంకోసం, లేకపోతే  సత్యాన్ని  కనుగొనే ప్రయత్నం కోసం, సెకనుకి 24 అసత్యాలని చెప్పే అబద్ధాల పుట్ట అని నేనల్లప్పుడూ చెబుతూ వచ్చాను- అనేది.

కొటేషన్స్ గురించి ఆలోచించండి. రెండూ వాస్తవాలే. ఉదాహరణకి, మీ క్యారక్టర్ ఒకటి ఒక ప్రదేశాన్నుంచీ  ఇంకో ప్రదేశానికి ప్రయాణించాలనుకుందాం. ఓ గంటో ఇంకా ఎక్కువ సేపో  ఆ  క్యారక్టర్ చేస్తున్న ప్రయాణాన్ని చూపిస్తూ పోనక్కర్లేదు. క్యారక్టర్  కారెక్కుతుంది, డ్రైవ్ చేసుకుంటూ పోతుంది, అలా వెళ్ళిన క్యారక్టర్ బహుశా తర్వాతి సీన్లో గమ్యం చేరుకున్నట్టు  మీరు చూపిస్తారు. ఈ పాయింటు దగ్గర్నుంచి నేరుగా  ఆ క్యారక్టర్ ఇంటి తలుపు కొడుతున్నట్టు మీరు చూపించ వచ్చు.  లేదా ఆ ఇంటి లోపల కూర్చుని కాఫీ తాగుతూ తను ఎవరికోసం వచ్చిందో వారితో మీ క్యారక్టర్ మాట్లాడుతున్నట్టు మీరు చూపించ వచ్చు.

అంతే గానీ మీ  క్యారక్టర్ కారు ఇంజన్  ఆఫ్ చేసి, కారు దిగి, అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఇంటి దాకా వెళ్లి నట్టు మీరు చూపించరు. ఉద్దేశపూర్వకగా ఒక పాయింటుని మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే తప్ప అలా డిటైల్డ్ గా చూపించరు. బహుశా మీ క్యారక్టర్ అబ్సెసివ్ కంపల్సివ్ రకం అనే పాయింటుని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు, అలా వివరంగా దాని చర్యల్ని ప్రధానం చేసి చూపించవచ్చు. కీ తిప్పి ఇంజన్ ఆఫ్ చేసి, డాష్ బోర్డు తుడిచి, అనుమానంతో మళ్ళీ కీ తిప్పి ఇంజన్ ఆన్ –ఆఫ్ చేసి, ఆఫ్ లోనే వుందని నిర్ధారించుకుని, అప్పుడు గానీ కారు  దిగినట్టు చూపించవచ్చు.

సినిమాలు అబద్ధాల పుట్టలని చెప్పడం  పూర్తిగా నిజం. ఎందుకంటే మొత్తం క్యారక్టర్ జీవితకాలాన్నీ ఓ రెండు గంటల్లో  చూపించేసి ముగించేస్తారు  గనుక.

రచయితలు  సర్వ సాధారణంగా చేసే పొరపాటు ఏమిటంటే, సీన్లు ముందుకు కదలకుండా అనేక వివరాలు ఇచ్చుకుపోవడం. ప్రతీ సీన్లో ఏదో క్యారక్టర్ రావడం, తనకి  హాబీ అయిన గేమ్ ఏదో ఆడడమో, ఇంకోటేదో చేయడమో చేసి, మంచినీళ్ళేదో తాగి, చెప్పాలనుకున్న డైలాగు చెప్పేసి వెళ్ళిపోవడం...ఇలాటివి!  ఇలా మీ క్యారక్టర్ ప్రవేశ  నిష్క్రమణాల్ని సవివరంగా చూపించే పని పెట్టుకో కూడదు. ఎందుకంటే సినిమా నిజ జీవితం కాదు. సినిమాల్లో రియల్ టైం లో సీన్లు నడవవు. వ్యర్ధమైన ఈ క్యారక్టర్ మూవ్ మెంట్స్ వల్ల, సీన్లు డైనమిక్స్ తగ్గి బోరు కొడతాయి.  హిచ్ కాక్ మాటల్లోనే  చెప్పుకుంటే, కత్తిరించి పారెయ్యదగ్గ  విసుగెత్తే అంశాలివి.

ఇదే సంగతి గోడార్డ్  ఇంకోలా చెప్పారు.  సినిమాలో జరిగిన క్రమం జరిగినట్టు స్పేస్ నీ , సమయాన్నీమింగేస్తూ చూపించడాన్ని అంతర్లీనంగానే కళ నిరోధించుకుంటూ పోతుంది. కనుక ఎమోషన్ ని పణంగా పెడుతూ  వాస్తవికత కోసం యమ కష్ట పడనవసరం లేదు. పకడ్బందీగా, డైనమిక్స్ తోనూ కూడినవిగా మీ  కథలుండాలంటే, వాస్తవికతని సర్దుబాటు చేసే భాష్యం వాటికి అవసరం. అప్పుడే కథలోని ఎమోషనల్ కోణం పట్టుబడుతుంది. ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని స్పర్శించగల్గడమే ఇక్కడ ముఖ్యం.  లేకపోతే అచ్చం వాస్తవికతనే ప్రతిఫలించే కథలు ప్రేక్షకుల ఇంద్రియాల్ని ఉత్తేజపరచే బదులు నిద్ర పుచ్చుతాయి.

విసుగెత్తే అంశాల కత్తిరింపు విషయానికొస్తే, మీ సినిమా కథని  వివరణ లిచ్చుకోవడంతో నింపెయ్య వద్దు. క్యారక్టర్స్  పనిలోకి దిగాలంటే, చాంతాడంత వివరణ ఇచ్చి దింపకూడదు. మీ కథలో క్యారక్టర్ చేసే జర్నీ ద్వారా,  ప్రతీ సీనులోనూ  ప్రేక్షకులని ఇన్వాల్వ్ చేయడమే ముఖ్యమని  గుర్తు పెట్టుకుంటే, విసుగెత్తే వివరణ జోలికి  మీరెళ్ళ లేరు. యాదృచ్ఛికంగా స్ట్రక్చర్ మీదా, కథ నడక మీదా దృష్టి పెట్టగల్గుతారు. ఇలా క్యారక్టర్, ప్లాట్ రెండిటి డెవలప్ మెంట్ తో కథమీద ఫోకస్ కూడా వుంటుంది.  ఈ సూత్రాల్ని పాటించడం వల్లే, సినిమా చరిత్రలో నిలిచి పోయిన ఉత్తేజభరితమైన సన్నివేశాల్నీ, కాల పరీక్షకి  తట్టుకుని నిలబడ్డ చలన చిత్రాలనూ రూపొందించగల్గారు హిచ్ కాక్,  గోడార్డ్ మహాశయులు.





వెండీ క్రామ్
(స్క్రీన్ రైటర్స్ కన్సల్టింగ్ కంపెనీ  నిర్వాహకురాలు)



దిగుమతులు -దుర్మతులు!







విలనంటే ఉత్తరాది నటుడే! ఆర్యన్ దేహాకృతితో తెల్లటి ఆరడుగుల కండలుతిరిగిన మొనగాడు ఉత్తారాదిలో ఎక్కడుంటే అక్కడ మన తెలుగు సినిమా వెళ్లి వాలిపోతుంది ...తెలుగు స్టార్ కి తగ్గ హీరోయినే కాదు, విలనూ దీటుగా ఉండేట్టు చూసుకుంటుంది. లేకపోతే ఆ సినిమా తేలిపోతుందని ఏదో భయం!
తెలుగు సినిమారంగం చుట్టూ తమిళ, కన్నడ, మలయాళ సినిమారంగాలుండగా, అక్కడ ఎందరో కొమ్ములు తిరిగిన విలన్లు వుండగా, తెలుగు సినిమాకి  వాళ్ళెవరూ తగరన్న అభిప్రాయం కొంతకాలంగా నెలకొంది. ఎనభైలలో రఘువరన్, దేవరాజ్ లాంటి తమిళ- కన్నడ విలన్లతో సరిపెట్టుకున్న తెలుగుసినిమా...ఇంకా మాట్లాడితే కోట శ్రీనివాసరావు లాంటి పక్కా తెలుగు ప్రతినాయకుడ్నీ ఆదరించిన తెలుగు సినిమా, వీళ్ళందర్నీ పక్కన పెట్టేసింది. మళ్ళీ గతంలోకి జారిపోయి, ఎనభైలలో ‘ఆఖరిపోరాటం’, ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ వంటి సినిమాలతో ఒక ఊపు ఊపిన అమ్రిష్ పురి  లాంటి ఉత్తరాది భయంకరాకారుల కోసం అన్వేషణ మొదలెట్టింది ...ఈ అన్వేషణలో మళ్ళీ దొరికిన హిందీ విలనాసురులే ముఖేష్ రుషి, ఆశీష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సాయాజీ షిండే, సోనూసూద్, దేవ్ గిల్, షావరలీ, కెల్లీ దోర్జీ, అభిమన్యు సింగ్ లవంటి కండ కావరమున్న గండర గండులు...

అయితే ఈ గండరగండులు కూడా  అరిగిపోయిన ముఖాలై పోవడంతో  మళ్ళీ తెలుగు సినిమా దక్షిణాదిలో షాపింగ్ చేస్తుందిలే అనుకుంటే  పొరపాటే...పొరపాటున కూడా అలాటి పని చెయ్యదు. ఇంకా ఏ హాలీవుడ్ వైపో చూస్తూం దేమో  గానీ, చచ్చినా  దక్షిణాన చూపు సారించదు. హాలీవుడ్ అంటే  హవ్వ అంటూ ఎవరైనా నవ్విపోతారని విధిలేక మళ్ళీ హిందీ వైపే చూడాలి!  తమిళ సినిమా కూడా ఆటే చూస్తోంది, కాబట్టి మళ్ళీ కొత్త కొత్త ముఖాలు హిందీ నుంచీ హాజరు ...అలాటి  తాజా ముఖాలే  ఈ ఆదిత్యా పంచోలీ, రవికిషన్, విక్రం సింగ్, బాబా సెహగల్  ప్రభృత ప్రతినాయక పాత్రధారులు...

హిందీ విలన్ తెలుగు సినిమాల్ని ‘నిన్నొదల బొమ్మాళీ’ అంటూ వెంటపడుతూనే వున్నాడు. ఎప్పుడో ఇరవై ఏళ్ల  క్రితం చిరంజీవి సినిమాకి ‘రూప్ తేరా మస్తానా’ అంటూ ఓం ప్రథమంగా తెలుగు హిట్ పాడిన హిందీ పాప్ సింగర్ బాబా సెహగల్ ఓ నాటికి విలనై తిరిగొస్తాడని ఎవరైనా ఊహిస్తారా? వచ్చాడు. నటిస్తున్నాడు. జయిస్తాడు. గాయకుడు కూడా విలనైపోయాక, హీరో అవక పోతే  ఎలా? అందుకని ఆనాటి తెలుగు హీరోయిన్ జరీనా వహాబ్ భర్త, ఒకప్పటి హిందీ హీరో ఆదిత్యా పంచోలీ సైతం విలనై పోయాడు. వీళ్ళ కుమారుడు సూరజ్ పంచోలీ హిందీలో అప్ కమింగ్ హీరోగా ఉంటూ,  సాటినటి జియాఖాన్ ని బలిగొన్న కేసులో ఇరుక్కుని నిజజీవితంలోనే విలన్ గా వార్తలకెక్కడం వేరే కథ. ఇక ప్రాంతీయ సినిమాకి మరో బాలీవుడ్ లా తయారైన భోజ్ పురి సినిమారంగాన్ని ఎంచక్కా హీరోగా – కాదు కాదు – ఏకంగా సూపర్ స్టార్ గా ఏలుకుంటున్న రవికిషనూ వెళ్లి వెళ్లి తెలుగులోకి విలన్ గా దిగుమతై పోవడం నమ్మశ్యక్యంగాని కథే ! మోడల్ గా ఉంటూ హిందీలో అరడజను పైగా సినిమాల్లో హీరోగా నటించిన తాజా స్టార్ విక్రం సింగ్ కూడా తెలుగులో దుష్ట పాత్రకి తెగబడ్డాడంటే...వీళ్ళకి తెలుగంటే ఏదో తెగులు వుందేమో ...తమలోని ఇంకో కోణంతో తెలుగువాళ్ళని  ‘చావగొట్టి’ వదలా లనేమో!


ఈ నయా పరాయి విలన్లు కండబలంతో హింస ప్రధానంగా చెలరేగడమే గానీ, గుర్తుంచుకోదగ్గ ఒక్క డైలాగుతోనూ ఆకట్టుకున్న, పాపులరయిన దృష్టాంతం కనబడదు. అరువు గొంతుకలతో కొన్నాళ్ళు రాయలసీమ యాసలో విలనీ ప్రదర్శించారే గానీ, ఒక ఎస్వీ రంగారావులా, ఒక నాగభూషణంలా, ఒక రావుగోపాలరావులా డైలాగ్ కింగ్స్ కూడా కాలేకపోయారు. అలనాడు ‘రైతు బిడ్డ’ లో మొదలైన విలన్ పాత్ర తన  పరిణామ క్రమంలో బడా భూస్వామిగా, చోటా పంచాయితీ ప్రెసిడెంటుగా, బడా రాజకీయ గూండాగా, బడా ఫ్యాక్షనిస్టుగా , బడా మాఫియాగా, ఇంకా బడా బడా అంతర్జాతీయ టెర్రరిస్టుగానూ  ఎగబ్రాకి  చాలా కర్కశ , పైశాచిక లక్షణాలతో  పరాకాష్టకి చేరుకున్నాడు. నవ్వించే విలనీకి పూర్తిగా దూరమైపోయాడు. హిందీ నుంచి వచ్చి నవ్వించే విలన్ పాత్రని పోషించిన ఘనత ఒక్క పరేష్ రావల్ కే దక్కింది. హిందీలో కొన్ని నవ్వించే విలన్ పాత్రలు పోషించిన దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ ని  తెలుగులో నటింప జేసుకున్నా అతడి విలక్షణ నటనా శైలిని పూర్తిగా  ఉపయోగించుకో లేకపోయారు.

కొత్తగా వచ్చిన  విక్రం జిత్ విర్క్ , రవి కిషన్, బాబా సెహగల్, విక్రం సింగ్, ఆదిత్యా పంచోలీలు కొత్త ట్రెండ్ ని స్థాపిస్తున్నారా అంటే అలాటిదేమీ లేదు. అవే సీ రియస్ ముఖాలతో రక్త పిపాసులైన జాతికి చెందిన అమల్లో వున్న పచ్చి విలనిజానికి నకళ్ళే ! రవికిషన్ – అల్లు అర్జున్ ప్రత్యర్ధిగా రాజకీయ నాయకుడి పాత్రలో  ‘రేసు గుర్రం’లో నటించగా, బాబా సెహగల్ – గుణ శేఖర్ త్రీడీ భారీ చారిత్రాత్మకం  ‘రుద్రమ దేవి’ లోనూ, రాజమౌళి మెగా మూవీ ‘బాహుబలి’ లోనూ విక్రం జిత్ విర్క్ నటించారు గానీ పెద్దగా ముద్ర వేయలేకపోయారు. విక్రం సింగ్  ‘వన్ - నేనొక్కడినే’ లో మహేష్ బాబుకి విలన్ గానూ  నటించారు. విక్రం సింగ్ –ప్రభాస్ నటించిన ‘రెబెల్ ‘ లోనూ విలన్ గా వేశాడు.  ఇక ఆదిత్యా పంచోలీ ఇ ‘ షాడో’ లో వెంకటేష్ కి విలన్ గా నటించాడు. ఇవన్నీ  పూర్తి స్థాయి  యాక్షన్ ఓరియెంటెడ్ సీరియస్ పాత్రలే. సీరియస్ విలనీ ని కూడా కొత్త తావులకి చేర్చిన సంజయ్ దత్, రిషీకపూర్ లవంటి స్టార్ల నుంచి నేటి విలన్ పాత్రధారులు నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోలూ  విలన్లుగా మారిపోయి, ఆ మధ్యే ‘అగ్నిపథ్’ తో ఎంత సంచలనం సృష్టించారో గమనించాం. తర్వాత మళ్ళీ రిషీ కపూర్ ‘డీ- డే’ లో దావూద్ ఇబ్రహీం పాత్ర ని అనితర సాధ్యంగా పోషించి మేధావుల ప్రశంసలు కూడా పొందాడు. విలన్ పాత్రల్ని హిందీలో ఎంతో సృజనాత్మకంగా తీర్చిదిద్దుతోంటే, తెలుగులో వైవిధ్యంలేని మన దర్శకులు అవే పాత చింతకాయ హింసోన్మాద రాక్షసులుగా తయారుచేసి వదిలిపెడుతున్నారు. 

ఈ నయా హిందీ విలన్లలో కూడా తెలుగులో బాగా పాపులరయిన ముఖేష్ రిషి, ఆశీష్ విద్యార్ధి, సాయాజీ షిండే, ప్రదీప్ రావత్ ల వంటి విలన్లు మళ్ళీ రాకపోవడం గమనార్హం. రాంగోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా ‘రక్త చరిత్ర’ ద్వారా పరిచయం చేసిన అభిమన్యు సింగ్ కూడా పాత హిందీ విలన్ల వారసత్వాన్ని అందుకోలేకపోయాడు. ‘అరుంధతి’ తో ఓ ఊపు ఊపిన సోనూ సూద్ తెలుగునుంచి కనుమరుగయ్యాడు. కెల్లీ దోర్జీ, షావరలీ, దేవ్ గిల్ లు ఏమాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయారు. కొత్త హిందీ విలన్ పాత్రధారులు ఇదివరకటిలా ఓ ముద్రవేసి నిలదొక్కుకునే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు.


అగ్ర హీరోలు తమకు తగ్గ హీరోయిన్లని ఎలా సెలెక్టు చేసుకుంటారో విలన్లని కూడా అంతే శ్రద్ధతో ఎంపిక చేసుకుంటున్నారు. అంతే కాదు కొందరు అగ్రహీరోలు ఎలాగైతే హీరోయిన్ ప్రాధాన్యాన్ని తగ్గించి సినిమా అంతా తమనే హైలైట్ చేసుకుంటున్నారో, అలా విలన్ పాత్రధారి విషయంలో కూడా చేస్తున్నారు. విలన్ కి మంచి డైలాగులు పెట్టనియ్యకుండా, ఆ పాత్రని సమగ్రంగా తీర్చి దిద్దనియ్యకుండా దర్శకుల్ని కంట్రోల్ చేస్తున్నారు. దీని వల్ల కూడా విలన్లు- ఆ విలన్ పాత్రలు పోషించే నటులూ ఆయా సినిమాల్లో నామమాత్రంగా మిగిలిపోతున్నారు. నిజానికి హాలీవుడ్ లెక్కలప్రకారం విలన్ ఎంత బలవంతుడైతే, తెలివిగల వాడైతే, హీరో అంత హైలైట్ అవుతాడు. కానీ టాలీవుడ్ హీరోలకి ఇది నచ్చదు. సినిమారంగాన్నే కాదు, సినిమా కథల్లోనూ ఏకఛత్రాధిపత్యాన్ని డిమాండ్ చేసి మరీ లాక్కుంటారు కాబట్టి విలన్ ఎంత కొత్తగా బాలీవుడ్ నుంచి దిగుమతయినా అతను ఓరగ బెట్టేదేమీ వుండదు. కిందటి తరం హీరోల కాలంలో  విలన్ పాత్రల విషయంలో ఇలా జోక్యం వుండేది కాదు. అప్పటి దర్శకులని శాసించే స్టార్లు కూడా వుండే వాళ్ళు కాదు. అందువల్ల అమ్రిష్ పురి, రఘువరన్ లలాంటి పరభాషా విలన్లు కేవలం అట్ట బొమ్మల్లా కాకుండా,  జవజీవాలతో అంత  శక్తివంతంగా ముద్ర వేయగలిగే వాళ్ళు. అలాటి విలన్ల కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా వుండే వాళ్ళంటే అతిశయోక్తి కాదు.

పోనీ ఇప్పుడు ఇన్ని ఆంక్షలతో స్టార్లు తాము సొంతంగా వన్ మాన్ షో తో హిట్లు కొడుతున్నారా అదీ లేదు. ఒకటొకటిగా సహాయ పాత్రల్ని ఎత్తి వేయించేస్తూ- సినిమా అంటే కేవలం స్టార్ షో గా మార్చేసిన కాలంలో – భారీ పబ్లిసిటీ తో ఎంత భారీ పరభాషా విలన్ ని తెచ్చామని చెప్పుకున్నా అది ప్రేక్షకుల్ని మభ్య పెట్టడమే అవుతుంది. తీరా సినిమాలో ఆ విలన్ ఏ ప్రత్యేకతా లేని వాడైనప్పుడు – ఏ రాయి అయితేనేం..అన్న సామెత చందంగా తయారవుతుంది. ఇంతోటి సినిమాలకి ఏ విలనయితేనేం అనేసి ఈపాటికే ప్రేక్షకుల నుంచి కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి  విలన్ ఎక్కడి వాడన్నది ప్రశ్న కాదు, సరుకు ఎంతన్నది పాయింటు!


- సికిందర్