రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, ఏప్రిల్ 2016, శనివారం

స్పెషల్ ఆర్టికల్ :

త సంవత్సరం హిట్టయిన చిన్నా పెద్దా సినిమాలు ఎందుకు హిట్టయ్యాయో ఇదివరకు కొన్నిసార్లు చెప్పుకున్నాం. కేవలం ఏ జానర్ ప్రధానంగా ఆ సినిమాలు తీశారో తూచా తప్పకుండా ఆ జానర్స్ ని కలుషితం చేయకుండా, వాటి మర్యాదని కాపాడుతూ తీసిన సినిమాలే హిట్టయ్యాయి. అంటే ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతిని మార్చుకున్నారా?
ఎలాటి నాన్సెన్స్ నీ అంగీకరించడం  లేదా? కథ ఏదైనా  దాన్ని స్వచ్ఛంగా, సరళంగా, అర్ధవంతంగా చూపించాలని కోరుకుంటున్నారా? ఏమో చెప్పలేం గానీ, అలాటి సినిమాలే 
హిట్టయ్యాయి...ఈ నేపధ్యంలో ఈ జానర్ మర్యాద అంటే ఏమిటో, దాన్నెలాకాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం


      జానర్ అంటే కేటగిరీ, వెరైటీ, తరహా, జాతి, గ్రూపు, టైపు, మోడల్...ఇలా అనేక పర్యాయ పదాలున్నాయి. జానర్ అనే మాట ఎందుకు అవసరమైందంటే సినిమాల్ని గుర్తు పట్టడానికే.  మీదే జానర్ సినిమా అంటే యాక్షన్ అనో, లవ్ అనో, ఫ్యామిలీ అనో చెప్పొచ్చు.  జానర్ గురించి ఇంకా బాగా అర్ధమవాలంటే,  మీదే జానర్ సినిమా అని అడిగారంటే, ఏ రస ప్రధానమైన సినిమా అని అడిగినట్టే - హాస్య రస ప్రధానమా, భక్తి  రసప్రధానమా అని! ఇలా సినిమాల్ని  వివిధ జానర్లుగా గుర్తిస్తున్నారు. పైన చెప్పుకున్న యాక్షన్, లవ్, ఫ్యామిలీ లతో బాటు, కామెడీ, క్రైం, హార్రర్, ట్రాజెడీ, డ్రామా, అడ్వెంచర్, స్పోర్ట్స్ , హిస్టారికల్, బయోపిక్, మ్యూజికల్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, వార్, కౌబాయ్..ఇంకా జానపద, పౌరాణిక, భక్తి, ఉద్యమ, విప్లవ, దేశభక్తి, రాజకీయ, సామాజిక, ప్రయోగాత్మక, బాలల ...చెప్పుకుంటే పోతే ఎన్నో. మళ్ళీ వీటిలో కొన్నిటికి సబ్ జానర్లు కూడా వున్నాయి. ఈ సబ్ జానర్లు వందల్లో వుంటాయి. ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి చేరుతూనే వుంటాయి. 

        యాక్షన్ జానర్ కి  సబ్ జానర్లు గా  యాక్షన్ కామెడీ, థ్రిల్లర్, ఫ్యాక్షన్, టెర్రరిజం, మార్షల్ ఆర్ట్స్, ఎపిక్, స్పై, డిజాస్టర్, సూపర్ హీరో..ఇంకెన్నో  వున్నాయి. క్రైం జానర్ లో  డిటెక్టివ్, గ్యాంగ్ స్టర్, మాఫియా, రోడ్ మూవీ, రేప్ రివెంజి, లీగల్ థ్రిల్లర్స్, కోర్ట్ రూమ్ డ్రామాలు మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్..ఇంకా మరెన్నో సబ్ జానర్లుగా వున్నాయి. అలాగే లవ్ జానర్లో రోమాంటిక్ డ్రామా, రోమాంటిక్ కామెడీ, రోమాంటిక్ థ్రిల్లర్, చిక్ ఫ్లిక్స్ లాంటివి అనేకం  సబ్ జానర్లుగా వున్నాయి. హారర్ర్ జానర్ కి ఘోస్ట్ హార్రర్, హార్రర్ కామెడీ, పారానార్మల్, జాంబీ, క్షుద్ర శక్తులు, చేతబడి లాంటివెన్నో వున్నాయి...



       తెలుగులో ఇప్పుడు ఎక్కువగా చెలామణి లో వుంటున్నవి  యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, లవ్, హార్రర్, అడ్వెంచర్, టెర్రర్, ప్రయోగాత్మకాలతో బాటు మాస్....పక్కా మాస్ అనే లోకల్ జానర్ సినిమాలు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే కేవలం ఏదో ఒక జానర్ మీద ఆధారపడి  సినిమాలు తీయడం అరుదు. రెండు మూడు జానర్ లు కలిపి హైబ్రిడ్ గా తీసే సినిమాలే ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువగా వుంటున్నాయి. తెలుగులో యాక్షన్ తీస్తే, అందులో కామెడీ, ఫ్యామిలీ కూడా కలప వచ్చు – తప్పని తద్దినం  మాస్ అనే పదార్ధాన్ని కూడా అందులో ఎటూ కలపాల్సిందే. హార్రర్ తీస్తే దాన్ని కామెడీతో కలిపి ఇప్పుడు హార్రర్ కామెడీ గా తీయాల్సిందే. లవ్ తీస్తే దాంట్లో కామెడీ కలిపి రోమాంటిక్ కామెడీగా, లేదా డ్రామా కలిపి రోమాంటిక్ డ్రామాగా, థ్రిల్లర్ కలిపి రోమాంటిక్ థ్రిల్లర్ గా తీస్తున్నారు.

        ఈ కలపడంలో ఎక్కువ తక్కువల దగ్గరే తేడా వస్తోంది. రెండు మూడు జానర్ లు కలిపినప్పుడు వాటిలో ఒకటే మెయిన్ జానర్ గా వుంటుంది, వుండాలి కూడా. మిగిలినవి పక్క వాద్యాలుగా వుండాలి. ఒకవేళ పక్క వాద్యాలలో ఒకటి లేదా రెండూ కలిసి  మెయిన్ జానర్ గా మారిపోయి,  మెయిన్ జానర్ ని పక్కకి తోసేస్తే ఏం జరుగుతుంది? అది జానర్ మర్యాదని కాపాడని సినిమాగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మైక్రోఫోన్ ముందు నుంచి మెయిన్ సింగర్ని తోసేసి కోరస్ పాడేవాళ్ళు పాటెత్తుకుంటే ఎలావుంటుందో,అలావుంటుంది
మెయిన్ జానర్ తో డ్రెయిన్ (సైడుకాల్వ) జానర్ల  పెత్తనం.


         తాజాగా ఈ ఏప్రెల్ 29 న విడుదలైన ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా ఇంతే. డ్రైనేజీ జానర్ల దెబ్బకి మెయిన్ జానర్ మూసీ నదిలా పారింది. సినిమా తీసే దర్శకుడు అసలు సినిమా లెందుకు ఫ్లాపవుతున్నాయో వేయి కళ్ళతో గమనిస్తూ, పరిశీలిస్తూ ఉండడమనే  మార్కెట్ మూల్యాంకన చేసుకునే ఓపిక వుంటే  తప్ప, తనూ ఇంకో అలాటి ఫ్లాప్ ఇవ్వకుండా ముందు జాగ్రత్త పడలేడు. ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. తీసిన సినిమా ఎందుకు ఫ్లాపయయిందో అర్ధం కానంతగా కొత్త కొత్త కారణాలు వచ్చి చేరుతున్నాయి. గత సంవత్సరం కల్తీ లేని జానర్లకే పట్టం గట్టి నట్టే, సింగిల్ స్క్రీన్ సినిమా కథలకే ఓటేశారు ప్రేక్షుకులు. అంటే జానర్ల పరిరక్షణతో బాటు, సింగిల్ స్క్రీన్ కథలు- మల్టీప్లెక్స్ కథలు అనే తేడా కూడా దర్శకులు గుర్తించాల్సిన అగత్యం ఏర్పడిందన్నమాట!

        పెద్ద,  మధ్య తరహా సినిమాలు విడుదల అవుతాయి. చాలా కొన్నే హిట్టవుతాయి. వీటికి రెట్టింపు సంఖ్యలో చిన్న చిన్న సినిమాలు  విడుదల అవుతాయి. అన్నీ ఫ్లాపవుతాయి. ఇది ఆన్ స్క్రీన్ దృశ్యం. కానీ చిన్న సినిమాలు ఎన్ని విడుదలై ఫ్లావుతాయో, అన్నేసి  అసలే విడుదల కాకుండా బుట్ట దాఖలై పోతున్నాయన్న వాస్తవం కూడా గమనించాలి. ఇది ఆఫ్ స్క్రీన్ గా కన్పించే సీను. చిన్నా చితకా సినిమాలు నిర్మాణ రంగంలోనే తప్ప, ప్రదర్శనా రంగంలో ఎవ్వరికీ నయా పైసా  అందించని మొండి ఘటాలైపోయాయి. ఇవి తీసినా  ఒకటే తీయకపోయినా ఒకటే అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. 



         గత సంవత్సరం జయాపజయాల్ని ఆయా  సినిమాల జానర్ మర్యాద కిచ్చిన ప్రాధాన్యమే నిర్ణయించింది. అంటే జానర్ మర్యాద పాటించిన సినిమాలనే తమకి తెలీకుండానే  ఎక్కువ చూశారు ప్రేక్షకులు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్దాం... 2015 లో మొత్తం చిన్నా పెద్దా తెలుగు స్ట్రెయిట్ సినిమాలు 88 విడుదలయ్యాయి.  డబ్బింగ్ సినిమాలు 39 విడుదలయ్యాయి. మొత్తం కలిపి విడుదలైన  సినిమాల సంఖ్య  127. విడుదలైన 88 స్ట్రెయిట్ చిత్రాల్లో పెద్ద సినిమాలు 10 వుంటే, మధ్య తరహా 36, చిన్నవి 42 వున్నాయి. పెద్ద సినిమాలు పదింటిలో 5 విజయం సాధించగా, మధ్యతరహా 36 లో 9, 42 చిన్న సినిమాల్లో 2 సక్సెస్ మాత్రమే అయ్యాయి. మొత్తం  88 లో 16 హిట్టయ్యాయి. ఈ పదహారూ జానర్ మర్యాదని కాపాడుకున్నవే.

        పెద్ద సినిమాల్లో  శ్రీమంతుడు, గోపాల గోపాల, టెంపర్, బాహుబలి, రుద్రమదేవి, లయన్, బ్రూస్ లీ, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్-2, బెంగాల్ టైగర్ అనే  10 వుండగా,  శ్రీమంతుడు, గోపాల గోపాల, బాహుబలి, రుద్రమ దేవి, టెంపర్ –ఈ ఐదు  మాత్రమే హిట్టయ్యాయి.

        హిట్టయిన శ్రీమంతుడు జానర్ మర్యాద ఎలా కాపాడుకుందో చూద్దాం. ఇది ఫ్యామిలీ –యాక్షన్ రెండు సజాతి జానర్ల కలబోత కాగా, దీంట్లోకి మళ్ళీ పక్కా మాస్ ని చొరబెట్టలేదు.  అలాగే పెద్ద సినిమాల్లో అదేపనిగా వస్తున్న ‘సెకండాఫ్ లో విలన్ ఇంట్లో హీరో చేరుట మరియు బ్రహ్మానందంతో  కన్ఫ్యూజ్ కామెడీ చేయుట అవశ్యము’  అనే సింగిల్ విండో స్కీములోకి కథని తోసెయ్యకుండా ఆ రెండు యాక్షన్- ఫ్యామిలీ జానర్లనే కాపాడుకుంటూ కథ నడిపారు. ఇందులో మహేష్ బాబు పాత్ర పూర్తి డొల్లగా వుంటుంది. ఈ సూక్ష్మం ప్రేక్షకులు తెలుసుకోవడం కష్టం. వాళ్లకి డిస్టర్బెన్స్ లేకుండా రెండు జానర్లతో ‘అర్ధమయ్యేలా’ కథ నడిపించారు. 



        ‘గోపాల గోపాల’ నాస్తికుడికీ, దేవుళ్ళ పేర్లతో దందాలు చేసే ఆస్తికులకీ మధ్య సంఘర్షణగా  ప్రయోగాత్మకంగా తీశారు. ప్రయోగాత్మకంలో మాస్- కామెడీ ల వంటి విజాతి జానర్ లని  చొరబెడితే  చాలా అనాగరికంగా  వుంటుంది  కాబట్టి ఆ జాగ్రత్త పడ్డారు. ఈ కథలో కూడా పెద్ద లోపముంది- తన వ్యాపారం మీద పిడుగుపడి నష్ట పోయినందుకుగాను, ఆ నష్ట పరిహారం దేవుడు చెల్లించాలని దేవుడి మీద కేసు వేస్తాడు నాస్తికుడైన హీరో. కానీ ఇలాటి వాటికి ప్రకృతి  వైపరీత్యాల ఖాతాలో నష్ట పరిహారం ఇస్తూనే వుంటాయి  ప్రభుత్వాలు.  ఈ సూక్షం కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. పట్టించుకున్నా క్షమించేయ గలరేమో  జానర్ మర్యాద దృష్ట్యా.

       
‘టెంపర్’ని  సామాజిక జానర్లో తీశారు. రేప్ అనే సామాజిక సమస్యతో సినిమాటిక్ పరిష్కారంకోసం ప్రయత్నించారు. ఇందులో దాదాపు సగం సినిమా మాస్ ఎలిమెంట్స్ తో గడిచిపోతుంది. సామాజికం - మాస్ సజాతి జానర్లే  కాబట్టి చెల్లిపోయింది. కథా పరంగా ఇందులో లక్ష తప్పులున్నా పట్టించుకోలేదు ప్రేక్షకులు. 

       
మూడు మాత్రమే జానర్ల పాలన సరిగ్గా వుండి హిట్టయిన పెద్ద స్టార్ల రెగ్యులర్ సినిమాలు. బాహుబలి, రుద్రమ దేవిల్లాంటి ఫాంటసీ, చారిత్రక సినిమాల్ని కూడా రెగ్యులర్ సినిమాలకి లాగే వాటి జానర్ మర్యాదని చూసి సక్సెస్ చేశారు ప్రేక్షకులు. వీటిలో కథల్లో  ఇమడని మాస్, కామెడీ లాంటి జానర్లని తెచ్చి కలపలేదు. రెండిట్లో మళ్ళీ స్క్రీన్ ప్లే పరంగా  పెద్ద లోపాలు చాలానే వున్నాయి


        ఫ్లాపయిన లయన్, బ్రూస్ లీ, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్-2, బెంగాల్ టైగర్ ఐదింటి జానర్లూ మానభంగానికి గురయ్యాయి.  లయన్ ని క్రైం జానర్లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ గా తీశారు. దీంట్లోకి వేరే జానర్లు కలపకపోయినా సస్పెన్స్ థ్రిల్లర్  ఎలిమెంట్స్ నే ప్రవేశపెట్ట లేకపోయారు- ‘రాజా చెయ్యి వేస్తే’ లో  క్రైం ఎలిమెంట్స్ ని కలపలేకపోయినట్టు. కనీసం టెంపో గానీ, స్పీడు గానీ ఉండాలన్నా ఆలోచనే చెయ్యలేదు.

        బ్రూస్ లీ ని ఒక దుష్టుడి బారి నుంచి తన కుటుంబాన్ని- అక్కనీ  కాపాడుకునే ఫ్యామిలీ జానర్లో,  సిస్టర్ సెంటిమెంట్ అనే సబ్ జానర్ గా తీయబోయారు. దీనికి సజాతి యాక్షన్ జానర్ ని కూడా జోడించారు.  ఈ మొత్తాన్నీ మెడబట్టి  సింగిల్ విండో స్కీం లోకి నెట్టేశారు. 

        సన్నాఫ్ సత్యమూర్తి లోనైతే ఓపెనింగ్ లోనే  ఇదొక నరుక్కునే రాక్షసుల కుటుంబ కథ అన్న సీనేశారు. దీంతో మొత్తం ఫ్యామిలీ జానర్ ఖూనీ అయిపోయింది. ఇందులో హీరో పాత్ర తప్పులతడకయినా, కల్తీ జానరే  ప్రాణం తీసింది. యాక్షన్ జానర్ లో కాలం చెల్లిన సబ్ జానర్ ఫ్యాక్షన్ పట్ల విసుగెత్తింది ప్రేక్షకులకి. 



       కిక్-2 సింపుల్ గా తెలుగులో వర్కౌట్ కాని, యాక్షన్ జానర్ లో ‘ఫారిన్ (పరాయి) ఇష్యూ’  సబ్ జానర్ కిందికొస్తుంది. ఎక్కడో రాజస్థాన్ వాళ్ళ సమస్యలు అక్కర్లేదు తెలుగు ప్రేక్షకులకి. ఇక బెంగాల్ టైగర్ మాస్, యాక్షన్ సజాతి జానర్ల కథలోకి, క్రైం జానర్ ని దింపారు. లాజిక్ ని డిమాండ్ చేసే  క్రైం జానర్ ని, మాస్ యాక్షన్ తో కలపి,  దానికి కూడా లాజిక్ లేకుండా చేయడంతో- మొత్తం మాస్ యాక్షనే సెకండాఫ్ లో డొల్లగా మారింది.

        ఇలా జానర్ మర్యాదని కాపాడుకుని ఐదు పెద్ద సినిమాలని ప్రేక్షకులు హిట్ చేస్తే, కాపాడుకోలేని ఐదు పెద్ద సినిమాల్ని ఫ్లాప్ చేశారు.

(ఇంకా వుంది)
-సికిందర్
http://www.cinemabazaar.in









29, ఏప్రిల్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!


రచన- దర్శకత్వం:  ప్రదీప్‌ చిలుకూరి
తారాగణం: నారా రోహిత్‌, నందమూరి తారకరత్న, ఇషా తల్వార్‌, అవసరాల శ్రీనివాస్‌, రఘు కారుమంచి, శశాంక్‌, శివాజీరాజా తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: భాస్కర్‌ సామల
బ్యానర్‌ : వారాహి చలనచిత్రం, నిర్మాత : రజని కొర్రపాటి
విడుదల : ఏప్రిల్‌ 29, 2016
***
న సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు రోడ్డెక్కి ఆందోళన చేయకుండా, అకుంఠిత  దీక్షతో నెలకి రెండు మూడు  సినిమాలు చొప్పున యుద్ధ  ప్రాతిపదికన నటించేసి విడుదల చేయిస్తున్న నారా రోహిత్,  మండుటెండల్లో మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రేక్షకులకి- ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా దయచేసి చూడమని. నారా వారబ్బాయి సినిమాలు అమరావతి అంత అద్భుతంగా వుంటాయన్న నమ్మకం ప్రేక్షకులకి ఏనాడో సడలిపోయినా, తనకి మాత్రం తన టాలెంట్ మీద విపరీతమైన నమ్మకం రోజురోజుకీ  పెరిగిపోతోంది. తరలి వస్తున్నకొత్త కొత్త దర్శకులు మొక్కు తీర్చుకోవడానికి తనే ఒక ఇలవేల్పులా అవతరించి ఆశీర్వదించేస్తున్నాడు.  గత నెలలోనే ‘తుంటరి’ ఇచ్చి, వెంటనే అర్జెంటుగా ఈ నెల ఫస్టున ‘సావిత్రి’ కూడా  ఇచ్చేసి, మళ్ళీ హడావిడిగా   ఈ నెలాఖర్లోనే  నారా - కాదు కాదు- ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా సరఫరా చేశాడు. రాబోయే రోజుల్లో ఇంకో ఆరు సినిమాలు  తన నారావారి  అమ్ముల పొదిలోంచి ప్రేక్షకుల మీదికి సంధించేందుకు శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

         కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మంచి బ్యానర్, మంచి హీరో, మంచి విడుదల వంటి ప్లస్ పాయింట్స్ కి నోచుకునే అదృష్టం దక్కడం మామూలు విషయం కాదు. నారా రోహిత్ ఎందుకు మంచి హీరో అంటే, కొత్త తరహా కథలకి తను ఒకప్పటి నాగార్జునలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. అలా మంచి బ్యానర్, మంచి హీరో, మంచి విడుదల దక్కిన దర్శకుడు ఇక చూసుకోవాల్సింది తను వెనకబడిపోకుండానే!  రోహిత్ లెవెల్లోనే తనూ ఉండిపోతే బ్యానర్, విడుదల వంటి ప్లస్ పాయింట్స్ వృధా చేసుకున్నట్టే అవుతుంది. ఈ రెండిటిని అడ్డు పెట్టుకుని రోహిత్ లాంటి ఫ్లాప్ హీరోతో సక్సెస్ కొట్టి దర్శకుడుగా తను ఒడ్డున పడిపోయే ప్రయత్నం చేయాలి. ఇది జరిగిందా? ఓసారి కథలోకి వెళ్లి చూద్దాం...

 క్రైం మసాలా!
         
రాజారాం (నారా రోహిత్) సినిమా రంగంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్. మూడేళ్ళలో దర్శకుణ్ణి అవుతానని ఇంట్లో చెప్పి వచ్చేశాడు. కథలు రాసుకుని ప్రయత్నాల్లో ఉంటాడు. మాణిక్ (నందమూరి తారకరత్న) అని రాజకీయ నాయకుల కోసం హత్యలు చేసే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఉంటాడు. ఇతను బహిరంగంగా హత్యలు చేసినా సాక్ష్యం  చెప్పడానికి ఎ వరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోతారు. రాజారాం ఒక థ్రిల్లర్ కథ రాసుకుని నిర్మాతని కలుస్తాడు. నిర్మాత ప్రేమ కథ అడుగుతాడు. రాజారాం తన ప్రేమ కథే రాయడం మొదలెడతాడు. ఆప్రేమ కథలో,  ఒకసారి తను షార్ట్ ఫిలిం తీస్తున్నప్పుడు ఒకమ్మాయి కెమెరాకి అడ్డొస్తుంది. ఆమెని చూసి పడిపోతాడు. కొంత తిప్పుకుని అతడికి ఓకే చెప్పేస్తుందామె. ఆమె పేరు చైత్ర (ఇషా తల్వార్). సాఫ్ట్ వేర్.  అలా అలా ప్రేమకథ పూర్తి చేసి పంపిస్తే,  క్లయిమాక్స్ లో విలన్ ని చంపిన తీరు బావుందని సమాధానం వస్తుంది. ఆ విధంగానే ఒకణ్ణి చంపమని, కొరియర్ లో  రివాల్వర్, ఫోటో అందుతాయి. ఆ ఫోటోలో వున్నది మాణిక్. ఇతణ్ణి  చంపకపోతే నువ్వు చస్తావ్, నీ లవర్ చస్తుంది – అనేసి  బెదిరిపులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో రాజారాం ఏం చేశాడు, మాణిక్ ని చంపాడా, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకున్నాడా, చంపడానికి గల కారణాలు తెలుసుకున్నాడా – అన్నవి ఇక్కడ్నించీ ద్వితీయార్ధంలో సాగే కథలో తేలే విషయాలు. 

ఎలావుంది కథ
       
మొదలెట్టింది ఒక క్రైం కథ, తిరగబెట్టింది మాత్రం పాత మూస మసాలా లోకి. ఈ మూసలో మదర్ సెంటి మెంట్, చైల్డ్ సెంటి మెంట్, లాలిపాట, మెలోడ్రామా, పూజలూ పురస్కరాలు వంటి వన్నీ తెచ్చి  పెట్టేశాడు దర్శకుడు. ఇక ఫ్రెండ్స్ తో రొటీన్ మూస  ఆవారా తనాలూ, తాగుళ్ళూ, కామెడీలూ వేరే. ఇవేవీ ఈ తరహా కథలో ఇమిడేవి కావు. చాలా చిరాకు  తెప్పిస్తాయి దర్శకుడి చాదస్తానికి. చిన్నప్పటి కోరికలన్నీ ఈ కొత్త దర్శకుడు అవకాశం దొరికింది కదాని తీర్చుకున్నట్టుంది. అసలు చెప్పాల్సిన క్రైం కథకి వుండాల్సిన ఎలిమెంట్స్ కోసం కృషి చేయకుండా, ఇలాటివన్నీ తెచ్చి అడ్డమేశాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్  తను రాసుకున్న కథతో  ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ని చంపాల్సి వస్తే ఏం చేస్తాడు? అన్నసూటి ప్రశ్న దర్శకుడు వేసుకుని, దానికి కట్టుబడి వుంటే,  ఈ క్రైం కథ ‘క్షణం’ లా మరో ప్రొఫెషనలిజం తో కూడిన మంచి ప్రొడక్టు అయ్యేది.

ఎవరెలా చేశారు.
       
నారా రోహిత్ ఏం చేయగలడని  ఆశిస్తాం. అదే స్థూలకాయం, అదే భావాలు పలకని ముఖారవిందం, అదే రాయల్ గా నవ్వే  ఫేసు- ఏ పాత్రకైనా ఇంతేగా? సాయంత్రం పూట ఏ పేజ్ త్రీ పార్టీకో  వెళ్లినట్టు వుంటుంది గానీ, షూటింగ్ కి వెళ్తున్నట్టు వుంటుందా వాలకం? పాత్ర ప్రకారం తానొక సినిమా ప్రయత్నాల్లో వున్న దర్శకుడిగా కొంతైనా  డిఫరెంట్ గా కనపడాలిగా? వాడిలా నేనెందుకుంటాను, నేను నారావాణ్ణి అనుకుంటే ఎలా? చంద్రబాబే నిత్యం జనాల్లో పడి నిద్ర పోనివ్వడం లేదు.
        తను వెరైటీ కథల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు తన వైపు నుంచి హోం వర్క్ లేకపోతే వెరైటీ కథలన్నీ ఇలాగే మట్టి కొట్టుకు పోతాయి. కొత్తగా దర్శకత్వ ప్రయత్నాల్లో వుండే ఔత్సాహికుల్ని ఏ కాస్తా తను పరిశీలించినా ఆ క్యారక్టర్ వచ్చేసేది.  కానీ ప్రతీ సినిమాలో ప్రతీ పాత్రలో  ఒకేలా కనపడ్డం, ఒకేలా ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం అనే అశ్రద్ధ, అలసత్వాలతో తను ఎంత దూరం ప్రయాణించగలనను కుంటున్నాడో తనకే తెలియాలి. కనీసం సెకండాఫ్ లోనైనా ఒక థ్రిల్లర్ కథకి అతికే హీరో పాత్రలా కన్పించే ప్రయత్నం చేయలేదు. పైగా వొళ్ళు పెంచేసి అలాగే వదిలెయ్యడం చాలా విజువల్ టార్చర్ ప్రేక్షులకి.
        నారా వారసుణ్ణి పక్కన పెడితే,  ఇందులో నందమూరి వారసుడు కూడా నటించడం ఆసక్తి రేపింది. నందమూరి తారకరత్న ఇక లాభంలేదని విలన్ గా వచ్చేశాడు. ట్రూ ప్రొ ఫెషనలిజాన్ని ప్రదర్శించాడు. విలన్ గా తను కంటిన్యూ అవొచ్చు. అయితే ఈ సినిమాలోలా కాకుండా పాత్రకి కాస్త డెప్త్, అర్ధవంతమైన పగా ఉండేట్టు చూసుకోవాలి. నిజానికి నారా - నందమూరి వారసులతో మంచి అవకాశం కొత్త దర్శకుడికి. ‘బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మాన్’ లా ఓ సంచలన, క్రేజీ ఘట్టం దర్శకుడికి. దీన్ని కూడా జా రవిడుచుకుని, ఇద్దరి మధ్యా  సంఘర్షణని ఈ స్పాట్ లైట్ లో హైలైట్ చేసి ప్రత్యేకాకర్షణగా నిలబెట్ట లేకపోయాడు.
        హీరోయిన్ ఇషా తల్వార్ కత్తిలా వుంది. ఈమె టాలెంట్ ని కూడా పాత్ర సరిగ్గా లేక వృధా చేసుకున్నాడు దర్శకుడు. పాటల విషయం చెప్పుకోనవసరం లేదుగానీ, కెమెరా, ఇతర సాంకేతిక హంగులు బ్యానర్ హోదాకి తగ్గట్టు వున్నాయి. కానీ నిర్మాతగా సాయి కొర్రపాటి విషయపరంగా ఓ క్వాలిటీ మూవీని మాత్రం అందించలేదు. 

 చివరికేమిటి?
         
స్టాఫ్ లో  ప్రేమ కథ రాసే పేరుతో  చూపించిన,   అమ్మాయిని లవ్ లో పడేసే స్టోరీ - ప్రతీ సినిమా ఫస్టాఫ్ లో వుండే అరిగిపోయిన పాత రొటీనే.  దీన్నుంచి రిలీఫ్ నివ్వలేకపోయాడు దర్శకుడు. ఈ లవ్ స్టోరీలో అనాధ శరణాలయం సన్నివేశం ఒక్కటే  కాస్త హాస్యభరితంగా వుంది. హీరో కుక్కని దొంగిలించే సీను అనవసర సాగతీతతో ‘బి’ గ్రేడ్ సినిమా బిట్ లా అభాసు అయ్యింది. ఫస్టాఫ్ లో కథలోకి వెళ్ళకుండా ప్రేమ కథనే  లాగించి ఎలాగో ఇంటర్వెల్ కి చేర్చినా అక్కడి మలుపు పేలవంగానే వుంది. దీని  తర్వాత సెకండాఫ్ అంతా చాలా పాత చాదస్తంతో వుంది. విలన్ ని ఎందుకు చంపాలో కారణం చెప్పేందుకు వేసిన ఫ్లాష్ బ్యాక్, అందులో లాలిపాట  మరో మైనస్. ఇంతా  చేస్తే ఆ పగా హీరోది కాదు, ఆ లక్ష్యమూ హీరోది కాదు- ‘ఊసరవెల్లి’ లో ఎన్టీఆర్ టైపు విఫలమైన హీరో పాత్ర. ఇక తర్వాతంతా  లాజిక్ లేని కథా కథనాలే. ఈ కథా కథనాలు, నటనలు పక్కన పెడితే, కొత్త కాంబినేషన్ ని కనీసం బాక్సాఫీసు అప్పీల్ కోసం ప్లాన్ చేసుకోవాలని కూడా ఆలోచన చేయలేదు. బ్యానరూ నారా రోహితూ కంటిన్యూ అవగలరు. ఈ సినిమాని ఇలా అమెచ్యూరి ష్ గా తీసిన ఈ  కొత్త దర్శకుడు???


-సికిందర్ 

27, ఏప్రిల్ 2016, బుధవారం

రైటర్స్ కార్నర్ :

  కప్పటి జంట రచయితలు సలీం - జావేద్ లు కలిసి స్క్రిప్టులు రాసినా డైలాగులు జావేదే  రాసినట్టు, పరుచూరి బ్రదర్స్ సెంటిమెంటల్ సీన్లు ఒకరు, యాక్షన్ సీన్లు మరొకరు పంచుకుని  రాసినట్టు, కవల సోదరులైన హాలీవుడ్ జంట రచయితలు  చాడ్ హేస్- కేరీ హేస్ లు యాక్ట్ లు పంచుకుని రాస్తారు. కలిసి 16 సినిమాలకి రాసిన ఈ కవల రచయితల తాజా సినిమా ‘కంజూరింగ్-2’ జూన్ 10 న విడుదల కాబోతోంది. వీరి పని విధానమేమిటో, కలిసి ఎలా పనిచేస్తారో ఒకసారి తెలుసుకుందాం..

     1. రాకెట్ డ్రాఫ్ట్ :కలిసి రాయడమంటే ఇద్దరూ కలిసి సీక్వెన్సులో రాసుకుపోవడం కాదు. సోలో రైటర్లు ఇలా రాయడానికే అలవాటు పడతారు. ముందు బిగినింగ్ రాసి, తర్వాత మిడిల్, ఆ తర్వాత  ఎండ్ పద్ధతిలో.  మా రాకెట్ డ్రాఫ్ట్ కోసం, అంటే ఫస్ట్ రఫ్ డ్రాఫ్ట్ కోసం- మా మెదడులో అప్పటికే రూపుదిద్దుకున్న సీన్లనీ, సీక్వెన్సుల్నీ రాస్తాం. వీటికి కనెక్టింగ్ మూమెంట్స్ ని రాకెట్ డ్రాఫ్ట్ పూర్తయాక రాస్తాం. దీంతో మేమనుకుంటున్న అతి ముఖ్యమైన సీన్లు, సీక్వెన్సులు పేపర్ పైకి వచ్చేస్తాయి. దీంతో ఈ సీన్స్ నీ, సీక్వెన్సుల్నీ కలిపే లింకుల గురించి చర్చిస్తాం. ఈ చర్చల్లో కోపతాపాలు, వాగ్యుద్ధాలూ మామూలే. ఇవి  కూడా భాగమే మా పని విధానంలో.  

          
2. యాక్ట్ ఎసైన్ మెంట్స్ : కలిసి రాయడమంటే సీక్వెన్సు లో రాసుకుపోవడం కాదని ఇందాకే  చెప్పుకున్నాం. మేమిద్దరం చెరొక యాక్ట్ పంచుకుంటాం.  ఫస్ట్ యాక్ట్ (బిగినింగ్) ఒకరు  తీసుకుంటే, సెకండ్ యాక్ట్ (మిడిల్) మరొకరు  తీసుకుంటాం.  ఈ తీసుకునే దగ్గర కూడా తీవ్ర చర్చ, గొడవ  జరుగుతుంది. ఇలా విడివిడిగా పంచుకుని ఈ రెండు యాక్టులూ రాశాక, థర్డ్ యాక్ట్ (ఎండ్) ని ఇద్దరం కలిసే  రాస్తాం. ఎందుకంటే ఇది అత్యంత కష్ట తరమైన భాగం.  ఈ రోజుల్లో ప్రేక్షకులు పెట్టే డబ్బుకి సరిపడా సంతృప్తితో కథని ముగించి ఇంటికి పంపించడమనేది చాలా కష్టంతో కూడుకున్న పనై పోయింది. థర్డ్ యాక్ట్ కలిసి  రాశాక, మొదట్లో విడివిడిగా రాసిన రెండు యాక్ట్స్ ని పరస్పరం మార్చుకుని వాటి మీద విడివిడిగా పని చేస్తాం. ఒకరు రాసిన యాక్ట్ ని మరొకరు దిద్దుతాం తప్పులేమైనా వుంటే. అలాగే నోట్స్ రాస్తాం, కొత్త అయిడియాలు స్ఫురిస్తే అవీ రాస్తాం. అప్పుడు ఆ రెండిటినీ చర్చిస్తాం. ఒక రూపానికి తీసుకొస్తాం.

        3. డ్రాఫ్ట్ ప్రాసెస్ : ఇప్పుడు సీన్లని బ్రేక్ డౌన్  చేస్తాం. ఇది కూడా సీక్వెన్సులో వుండదు. ఒక్కో సీన్ లాటరీ తీసి విడివిడిగా వాటి మీద వర్క్ చేస్తాం. మళ్ళీ పోల్చుకుంటాం. ఇది కూడా పూర్తయ్యాక డ్రాఫ్ట్ రాస్తాం. ఇది అనేక సార్లు తిరగ  రాశాకే ఫైనల్ కాపీ తీసి అందిస్తాం.


కొత్త రచయితలకి సూచనలు :

1. రాయండి, రాస్తూనే వుండండి :  రచయితగా మారాలంటే  ఏం కిటుకు లుంటాయంటే కిటుకులేమీ వుండవు, ఒకరికి చెప్పకూడని రహస్యాలేమీ లేవు. జస్ట్ రాయండి, అంతే. ఎక్కడైనా ఎప్పుడైనా రాయండి. ‘వన్ నోట్’  మీద రాయడం రైటర్స్ కి బాగా కలసివచ్చే అంశం. ఎక్కడైనా ఎప్పుడైనా అందుబాటులో  వున్న కంప్యూటర్, లాప్ టాప్, మొబైల్.. ఇలా  ఏ డివైస్ లో  నైనా  ‘వన్ నోట్’ ని ఓపెన్ చేసి వర్క్ చేసుకోవచ్చు.
కాఫీ షాప్ లో  ఓ మూడు నిమిషాలు లీజర్ దొరికిందా? ఐతే టాబ్లెట్ ఓపెన్ చేసి ‘వన్ నోట్’ లో ఓ రెండు పేరాలు రాయండి. ట్రైన్ లో పోతూండగా ఐడియా ఏదైనా తట్టిందా? మీ ఫోన్లో ‘వన్ నోట్’ ఓపెన్ చేసి రాయండి. రైటింగ్ అనేది నిరంతరం  సానబట్టుకుంటూ ఉండాల్సిన వృత్తి. రాయడానికి అవకాశం చిక్కినప్పుడల్లా రాస్తూనే వుండాలి.

 
2. బాగా చదవండి : గొప్ప రచయితలు ఎంత రాస్తారో అంత చదువుతారు. మీరు సినిమా రచయిత అయితే సినిమా స్క్రిప్టులు చదవండి. నవలా రచయిత అయితే నవలలు చదవండి. కథా రచయిత అయితే కథానికలు చదవండి. చెడ్డ కథలు చదివి వాటిని బాగా ఎలా రాయవచ్చో ఆలోచించండి.  మంచి కథలు చదివి ఇంకా మంచిగా ఎలా రాయవచ్చో ఆలోచించండి. ఏ ఖాళీ దొరికినా మేం స్క్రిప్టులు చదువుతూనే వుంటాం. వర్క్ తో బాటు  ఎంజాయ్ మెంట్ కోసం కూడా. వన్ నోట్’ తో ఇది సులభమవుతోంది. ‘వన్ నోట్’  లొ సేవ్ చేసిన వందల,  వేల స్క్రిప్టులు మా టాబ్లెట్ లో ఓపెన్ చేసి చదువుకుంటాం.

 
3. అవుట్ లైన్ తో  ప్రారంభించండి :  అవుట్ లైన్ చాలా  ముఖ్యం. మళ్ళీ రిపీట్ చేస్తాం :  అవుట్ లైన్ పెట్టుకుని  రాయడం ప్రారంభించండి.  మా కొచ్చే పెద్ద పెద్ద అయిడియాలన్నిటికీ    డైలాగులూ  యాక్షన్ ఆలోచించేకంటే ముందు, అవుట్ లైన్ వేసి చూస్తాం. ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి : అవుట్ లైన్ గా వర్కౌట్ కాని ఐడియా స్క్రిప్టుగా వర్కౌట్ గాదు. అవుట్ లైన్ మీ కథకి రోడ్ మ్యాప్. స్క్రిప్టు రాస్తున్నప్పుడు రిఫరెన్స్ కోసం అవుట్  లైన్ ని వెతుక్కునే అవసరం లేకుండా,  ఈజీ యాక్సెస్ కోసం,  ‘వన్ నోట్’ లో   మీ వర్కింగ్ డ్రాఫ్ట్ పక్కన పెట్టుకోండి.


4. రాయండి, ఎడిట్  చేయండి, రిపీట్ చేయండి : రచయితలు  తిరిగరాత గాళ్ళే. రాసేకన్నా తిరగ రాసేదే  ఎక్కువ వుంటుంది. ఈ వృత్తే అలాంటిది. చాలా మానసిక శ్రమ డిమాండ్ చేసేది. ‘ది కంజూరింగ్-2’ అనే మా  స్క్రిప్టుని 150 సార్లు తిరగ రాస్తే గానీ ఫైనల్ కాపీ తయారు కాలేదు. ఆ తిరగ రాసిన ప్రతి చిత్తు ప్రతినీ ‘వన్ నోట్’ లో సేవ్ చేసి వుంచాం. స్క్రిప్టు ని  స్టూడియోకి సబ్మిట్ చేసే ముందు ఇదంతా చేస్తాం. ప్రొడక్షన్ ప్రాసెస్ లో స్టూడియో ఎగ్జిక్యూటివ్ ల నుంచి, నిర్మాతల నుంచి, నటీనటుల నుంచీ, దర్శకుడి నుంచీ మాకందే బెటర్ మెంట్ నోట్స్ ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తిరగ రాస్తాం. ఇదంతా పేపర్ మీద గంటల కొద్దీ పట్టే  ఎడింగ్ పని కాదు, ఖర్చుతో కూడిన ప్రింటింగ్ తోనూ పనిలేదు, నోట్స్ ఎక్కడో మిస్సయ్యే సమస్యా  వుండదు- ‘వన్ నోట్’ లోనే ఇదంతా సాఫీగా తేలిగ్గా జరిగిపోతుంది.


5. కలిసి  రాసే ప్రయత్నం చేయండి : ఇంకొకర్ని కలుపుకుని రాయడం ఎప్పుడూ మంచిదే. చేస్తున్న తప్పులు తెలుస్తూంటాయి. మేమిద్దరం పగలు కలిసి పని చేస్తాం. రాత్రి  ‘వన్ నోట్’ లో వర్కింగ్ స్క్రిప్ట్ ఇంటికి పట్టుకు  పోతాం. ఆ రోజు జరిగిన వర్క్ మీద నోట్స్ రాస్తాం, సందేహాలు నోట్ చేస్తాం, కొత్త ఆలోచనలు ప్రతిపాదిస్తాం.  అప్పటి కప్పుడు ఒకరు రాస్తున్నది మరొకరం  రియల్ టైంలో   టాబ్లెట్ లో  చూసుకుంటాం. కలిసి రాయడంవల్ల మా క్రియేటివిటీ మరింత విస్తృతమవుతూంటుంది. అంతే గాక కొత్త పద్ధతుల్లో రాసే ఉపాయాలు తెలుస్తూంటాయి ‘వన్ నోట్’ లాగా.



   ***






25, ఏప్రిల్ 2016, సోమవారం

'పోలీస్' స్క్రీన్ ప్లే సంగతులు- 2



రెండు దశాబ్దాలు నిండిన 
బాషా ఫార్మాట్తిరిగి థ్రిల్ కల్గించాలంటే ఇంకో రెండు దశాబ్దాలు వదిలెయ్యాలి. అప్పుడింకో తరం మారి,  ‘బాషా ఫార్మాట్తో పరిచయం లేని ఫ్రెష్ ప్రేక్షకులు రంగంలో వుంటారు. అప్పుడా సంగతి అప్పటి తరం దర్శకులు చూసుకుంటారు. ఇప్పటి తరం దర్శకులకి ఇంకా మక్కువ చావకపోతే, ‘బాషా ఫార్మాట్లోనే ఇంకెలా మెరుపులు మెరిపించగలమో ఆలోచించాలే తప్ప, ఊకదంపుడుగా ఆ చట్రంలో కథ నింపేస్తే కాదు. స్ట్రక్చరే ఒక చట్రమని ద్వేషించే వాళ్ళుంటారు. అవే బిగినింగ్, మిడిల్, ఎండ్ లు, వాటికీ మూడు మూల స్తంభాలూ అనే చట్రంలో పోత పోసినట్టు కథలన్నీ ఒకలాగే ఉంటాయని అంటారు.  అలాటిది బాషా ఫ్లాష్ బ్యాకుల టైపు చట్రం ఇంకెంత బోరు కొడుతుందో ఆలోచించాలి. అంతగా బాషా ఫార్మాట్ని బతికించుకోవాలనుకుంటే కావాల్సింది చట్రం కాదు, ఫార్మాట్ ని కాపాడే  కొత్త ఛత్రం- స్పార్క్ తో మెరిసే క్రియేటివిటీ. తేరిఅంటేనే తమిళంలో స్పార్క్ అయినప్పుడు ఆ స్పార్క్ కన్పించాలిగా??

       కిందటి పోస్టులో పేర్కొన్నట్టు ‘అక్బర్స్ జాబ్’ మొదలెడితే  ఆ  స్పార్క్ ఏదో ఎక్కడుందో బయట పడొచ్చు. కాబట్టి చాలా లోపభూయిష్టంగా వున్న ఈ కథ మొత్తాన్నీ తిరగరాసే ప్రయత్నం చేద్దాం...

        కేరళలో బేకరీ నడుపుకుంటూ కూతురితో జీవిస్తూంటాడు జోసెఫ్. టీచర్ ఏన్ పరిచయమవుతుంది. మీ ఆవిడ లేదా?’  - అంటుంది. ఆమెని ఇంటికి తీసికెళ్ళి  మిత్ర ఫోటో చూపిస్తాడు. ఈ రిమోట్ ఏరియా, ఈ టీవీ ఫోన్లు లేని పొదరిల్లు, ఈ పెంపుడు కుక్కా ఈ ఏకాంతం ..ఇదంతా  మిత్ర కన్న కలే. ఈ కల తీరకుండానే  పోయింది...ఆమె కలని నిజం చేయడానికి ఇక్కడి కొచ్చి ఉంటున్నాను. ఆమె ఇక్కడే ఈ పొదరింట్లోనే ఉంటోందని, ఈ చుట్టూ తిరుగాడుతూ ఉంటుందని నా నమ్మకం.. అదిగో ఆ చెట్టు పక్క నుంచి మనల్ని  చూస్తోంది కన్పిస్తోందా –‘ అని జోసెఫ్  చూపిస్తూంటే ఏన్ కేమీ కన్పించదు.  జోసెఫ్  కి మాత్రమే కనిపిస్తూంటుంది మిత్ర. జోసెఫ్  పరిస్థితికి బాధపడుతుంది ఏన్. ఇంకెప్పుడూ  మిత్రని గుర్తు చెయ్యొద్దనుకుంటుంది.

       నా జీవితం అయిపోయింది, నా కూతురి జీవితం ఏమిటా అనే ఆలోచన
అని అతనంటూంటే ఏదో అనెయ్యాలని ఏన్ నోటి దాకా వచ్చేస్తుంది. ఆగిపోతుంది. మిత్ర స్థానాన్ని మరొకరికి ఇవ్వలేకపోవడమే తన సమస్యనీ చెప్పుకుంటాడు. ఏన్ నిరాశ చెంది చూస్తుంది. మీ కూతురికి మీరు తోడుంటారుగా’  అంటుందిచెప్పలేను, ఏ క్షణంలో ఏమవుతుందో  అంటాడు. అప్పుడు నేనుంటానుగా మీ కూతురుకి-’  అనేస్తుంది. అయినా మీరెందుకు దూరమవుతారని అడుగుతుంది. మేడమ్, నేనొకరి దయాదాక్షి ణ్యాలపై ఈ జీవితాన్ని లీజుకి తీసుకుని బతుకుతున్నా’  అంటాడు.

        అనుమానంగా చూస్తుంది, భయంగా చూస్తుంది. అతడి మాటలేం అర్ధంగాక, ఇంకేం అడిగే ధైర్యంలేక అలా ఉండిపోతుందినా లీజు ముగిసిన రోజున నాకూతురికి మీరు కూడా వుండరు అనేస్తాడు.  గాభరాగా చూస్తుంది.


***
క రోజు స్కూల్నించి కూతుర్ని ఇంటి దగ్గర దిగబెట్టడానికి ఏన్  వచ్చినప్పుడు జోసెఫ్ వుండడు. కూతురు ఒక పెళ్లి  ఫోటో తీసి  చూపిస్తుంది. మిత్ర- విజయ్ ల పెళ్లి ఫోటోఅందులో మిత్ర తండ్రి, చెల్లెలు, మేనత్తా, విజయ్ తల్లీ వుంటారు. అక్కడ విజయ్ కుమార్ అని పేరుని చూశాక, జోసెఫ్ అసలు పేరు కాదని తెలుసుకుంటుంది ఏన్. ఫోటోని ఇంకా పరీక్షగా చూస్తే, విజయ్ పోలీస్ కటింగ్ తో ఉన్నట్టు కన్పిస్తాడు

        ఇంకో రోజు ఏన్ కూతుర్ని స్కూలుకి  తీసుకు పోతూంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ జీపుతో గుద్దుతారు. ఏన్ పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది వాళ్ళ మీద. జోసెఫ్ వాపసు తీసుకునేలా చేస్తాడు. ఎందుకిలా చేశారని అడిగితే, మిత్ర కల కోసం నేనిక్కడ ఉంటున్నా, ఎలాటి డిస్టర్బెన్స్  తట్టుకోలేదు మిత్ర’  అంటాడు.

        అదే రాత్రి  ఆ గ్యాంగ్ జోసెఫ్  ఇంటి మీది కొస్తారు. ఇక్కడ డిస్టర్బ్ చేయకూడదు రా, ఇది నా సెంటిమెంటల్ ప్లేస్ అని వాళ్ళని విరగదంతాడు.

ఇదే సమయంలో టీచర్ ఏన్ అటు తన ఇంట్లో గూగుల్ లో సెర్చి చేస్తూంటుంది. విజయ్ కుమార్ ఐపీఎస్ పేరుతో  వెయ్యి సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. దిగ్భ్రాంతితో విజయ్ ఫోటోలని చూస్తూంటుంది. యూనిఫాంలో వున్న డిసిపి విజయ్ కుమార్ అలియాస్ జోసెఫ్...

 ఎక్కడో  దూరంగా కుక్క ఒకటే మొరుగుతూంటుంది. దేంతోనో కొట్లాడుతున్నట్టే ఆ మొరుగుళ్ళు వినిపిస్తూంటాయి. ఏన్ మనసు ఏదో  కీడు శంకించి పరిగెడుతుంది. చూస్తే, జోసెఫ్- కాదు- ఇప్పుడు విజయ్ ఇంటిముందు ఘర్షణ జరుగుతూంటుంది. ఆ గ్యాంగ్ తో తలపడుతూంటాడు విజయ్. కుక్క వాళ్ళని చెండాడుతూంటుంది. కూతురు భయంతో కేకలేస్తూంటుంది. ఏన్ కూతుర్ని ఎత్తుకుంటుంది. అంతా సద్దుమణిగాక, ‘మీరు వద్దన్న డిస్టర్బెన్సే కద...’ అని అనబోతూంటే, సారీ చెప్తాడు. అతడి రహస్యం ఏమీ  ఎరగనట్టే వుం డిపోతుంది ఏన్.

        మళ్ళీ గూగుల్లో సెర్చి చేసి, డిసిపి విజయ్ కుమార్ కేసులకి సంబంధించిన సమాచారమంతా డౌన్ లోడ్ చేసి చదవడం ప్రారంభిస్తూంటే, ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది..

                                               ***
ఫ్లాష్ బ్యాక్ లో-
విజయ్ డిసిపిగా ఉంటాడు. ఒకరోజు బెగ్గర్ మాఫియాని కొట్టి హాస్పిటల్లో పడేస్తే అక్కడ హౌస్ సర్జన్ గా వున్న  మిత్ర పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. దీన్ని ఓకే చేస్తుంది విజయ్ తల్లి.
ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రేప్ కేసులో మంత్రి కొడుకుని అనుమానించి అరెస్ట్ చేయబోతే మంత్రి కొడుకు కాల్పులు జరుపుతాడు. ఆత్మరక్షణ చేసుకుంటూ విజయ్ జరిపే కాల్పుల్లో చనిపోతాడు మంత్రి కొడుకు. దీన్ని నమ్మడు మంత్రి. విజయ్ కావాలనే కాల్చి చంపాడని ఎదురు  తిరుగుతాడు. మంత్రితో వ్యవహారం కాబట్టి, అతను  నమ్మడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తాడు విజయ్. ససేమిరా అంటాడు మంత్రి. విజయ్ స్వాధీనం చేసుకున్న మంత్రి కొడుకు రివాల్వర్నీ, కాల్చిన బుల్లెట్స్ నీ మంత్రి ఆదేశాలతో మాయం చేస్తాడు విజయ్ పై అధికారి. నాకింత కడుపు శోకం కల్గించిన నీకు ఏ శోకం మిగల్చాలి?’ అంటాడు. మంత్రి మూర్ఖత్వంతో ఇక పిచ్చెక్కిన విజయ్నిన్ను కూడా చంపేస్తాను నా కొడకా!’  అని రివాల్వర్ కణతకి పెట్టేస్తాడు

మంత్రి ఏదో కనుసైగ చేస్తున్నట్టన్పించి, గిరుక్కున వెనక్కి తిరిగి కాల్చేస్తాడు విజయ్. వెనుక నుంచి విజయ్ పైకికాల్చబోతున్నమంత్రి తమ్ముడు కుప్ప కూలుతాడు. షాక్ అవుతాడు విజయ్
రెండు మర్డర్లా? ఓరినీ ఎన్ని ఆత్మరక్షణలురా నీకు? ఇప్పుడు సీసీ కెమెరాకి దొరికిపోయావురా! అయిపోయవురా!’  అంటాడు మంత్రిపైన వున్న కెమెరా కేసే చూస్తూంటాడు విజయ్.

        కెమెరాకి దొరికింది నేను కాదురా, నీ తమ్ముడికి కను సైగ చేస్తూ నువ్వు దొరికిపోయావురా, నా ఆత్మరక్షణ ఎప్పుడూ రైటే!’  అని ఆ ఫుటేజీ ఎత్తుకుని  పారిపోతాడు విజయ్.
                                                ***
        ట్టుకోలేక ఫైలు మూసేసి పరిగెడుతుంది టీచర్ ఏన్.
        అటు హైదరాబాద్ లో వున్నవిజయ్ పై అధికారి, కేరళలో వున్న విజయ్ కి కాల్ చేస్తాడు ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు. యోగ క్షేమాలడుగుతాడు. మీరు లీజు కిచ్చిన లైఫ్ తో బాగానే వున్నాను సార్  అంటాడు విజయ్. ‘99 ఏళ్ళకి లీజుకిచ్చా, నిలబెట్టుకోవడం నీ పనే  అంటాడు పై అధికారి. సమ్మర్ వెకేషన్స్ కి కేరళ ప్లాన్ చేసినట్టూ, అక్కడికి రావచ్చా అనడుగుతాడు. ష్యూర్ అంటాడు విజయ్.

                                                ***
       మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో -
        విజయ్ ని కలుసుకున్న మిత్ర, తన తండ్రితో మీటింగ్ కి తొందర పెడుతుంది. ఇప్పుడు నాకే ఠికానా లేదు. అప్పుడు వాడలా పోయాడు, ఇప్పుడు వీడిలా పోయాడు. నన్ను సస్పెండ్ చేశారు, నా సర్వీస్ రివాల్వర్, యూనీఫాం కూడా  సరెండర్ చేశాను. సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఇచ్చేశాను, నా దగ్గర ఇప్పుడేమీ లేదు అంటాడు

        ‘ఇదే కావాలి. నీ సర్వీస్ రివాల్వర్ పోవాలి, యూనీఫాం పోవాలి, అన్నీ పోవాలి. లేకపోతే పోలీసే వద్దని కూర్చున్నాడు నాన్న.. నువ్వు సస్పెండ్ అయ్యావని తెలిశాక, రేపు వూస్టింగ్ కూడా అవుతావని చెప్పి ఆయన్ని ఒప్పించడం చాలా సులభమైంది, పద అని తీసికెళ్తుంది

        రెస్టారెంట్ మీటింగ్ లో  మిత్ర తండ్రి, చెల్లెలు, మేనత్తా వుంటారు. మిత్ర తండ్రి హేపీగా విజయ్ కి కంగ్రాట్స్ చెప్పబోతూండగానే తుపాకీ పేలుతుంది. బుల్లెట్ మిత్ర పక్కనుంచి దూసుకెళ్తుంది. మళ్ళీ పేల్తుంది. ఆమెని పక్కకి తోసేసి బయటికి వురుకుతాడు విజయ్. చేతిలో వెపన్ లేకుండానే దుండగుల్నిఎదుర్కొంటాడు. అంతా అయ్యాక తిరిగి చూస్తే ఎవరూ కన్పించరు

        కుటుంబాన్ని కారెక్కించుకు తీసి కెళ్లి పోతున్న మిత్ర తండ్రి- వీడిది మామూలు ప్రాబ్లం కాదు, మంత్రితో పెట్టుకున్నాడని వూరంతా కూస్తోంది. మంత్రి వీణ్ణి వదలడు,నువ్వు వదిలేయ్ వీణ్ణి!’ అని హెచ్చరిస్తాడు.

        మంత్రి విజయ్ కి కాల్ చేసి- చట్టపరంగా నీకు జరిగేది జరుగుతూంటుంది, కడుపు శోకం కోసం, బోనస్ గా నా తమ్ముడి ఆత్మశాంతి కోసం  నేను చేసేది చేసుకోవాలిగా? నీకూ శోకం మిగల్చాలని నీ లవర్ని టార్గెట్ చేశాఇవ్వాళ ఎస్కేప్ అయింది, రేవు అవదుగా? ముందు నిన్ను సస్పెండ్ చేయించడం నీకు సెక్యూరిటీ లేకుండా చేయడం కోసమే, కాపాడుకో నీ లవర్ని’  అంటాడు.

        విజయ్ ఎలర్ట్ అయి మిత్ర తండ్రికి కాల్ చేస్తాడు. జరిగిందానికి సారీ చెప్పి, మిత్రని ఇక తను మర్చిపోదల్చుకున్నట్టూ, ఐతే ఈ పరిస్థితుల్లో మిత్ర తండ్రి పోలీస్ సెక్యూరిటీ కోరడం అత్యవసరమని చెప్తూ, వెళ్లి కమీషనర్ ని కలిసి జరిగిందంతా చెప్పేయమంటాడు.

        ఒక నాటు రివాల్వర్ సంపాదించుకుని విజయ్, మంత్రి  వెళ్తున్నపుడు కారు మీద ఫైర్ చేసి పారిపోతాడు. మంత్రి విజయ్ మీద కమీషనర్ కి కంప్లెయింట్ చేస్తాడు. మీ మీద ఎందుకు ఎటాక్ చేస్తాడని కమీషనర్ అడిగితే చెప్పలేకపోతాడు. చెప్తే తన రివెంజియే  బయటపడుతుంది.

        మొన్న సీసీ కెమెరా ఫుటెజీలో ఈ కణతకి రివాల్వర్ పెట్టాడు విజయ్, బాగానే వుంది. మీరెందుకు వెనుక వున్న  మీ తమ్ముడికి కనుసైగ చేశారు?’ అంటాడు కమీషనర్. ఆత్మరక్షణ కోసమే  కనుసైగ చేశానంటాడు  మంత్రి.అసలు మీకెందుకు రివాల్వర్ పెట్టాడు విజయ్?’ అంటే చెప్పలేకపోతాడు.మీరతన్ని హెరాస్ చేశారా?’ అన్న  ప్రశ్నకీ సమాధాన ముండదు. ‘మొన్న రెస్టారెంట్లో విజయ్ పెళ్లి విషయం మటాడుతూంటే ఎటాక్ జరిగింది, వాళ్ళు మీ వాళ్ళేనా?’  అంటేనన్నే అనుమానిస్తారా!’  అని చిందులేస్తాడు  మంత్రి.

        ఇలా రివెంజితో మంత్రి ముందుకెళ్ళ కుండా  లాక్ చేసిన విజయ్, మిత్ర తండ్రి కమీషనర్ ని కలవకపోవడాన్ని ప్రశ్నిస్తాడు. అతను మిత్రని చూపిస్తాడు. ఒకవేళ నాన్న మీద ఏటాక్స్ చేస్తున్నారని నా సేఫ్టీ కోసం నాన్నని వదిలేస్తానా? నిన్నెందుకు వదిలెయ్యాలి?  మనం కలిసింది మనసులు కలవడం దగ్గరే ఆగిపోతే దానికర్ధముందా?’’ అంటుంది మిత్ర. ఆమె కమిట్ మెంట్ కి చలిస్తాడు విజయ్. ఒక ఆలోచన చేసిమా పెళ్ళికి ఇప్పుడు మంత్రి కూడా వస్తాడు అంటాడు మిత్ర తండ్రితో. వాణ్ణి  నమ్మకు. పిలిస్తే వాడు రావచ్చుగానీ, వాడి మనసు రావాలని లేదుఅని హెచ్చరిస్తాడు మిత్ర తండ్రి.

***
        మిత్ర కూడా తండ్రి మాటే పట్టుకుని మంత్రిని పిలవ్వొద్దంటుంది. మైండ్ గేమ్స్ వద్దంటుంది. అప్పుడేదో లాక్ వేశావ్ గా, వాణ్ణలా వుండనీయ్  అంటుంది. పెళ్ళికి చాలా మంది పోలీసులు వస్తారు. విజయ్ పై అధికారి కూడా వస్తాడు మంత్రిని వెంటబెట్టుకుని. మిత్ర షాక్ అయి ఎందుకిలా చేశావని విజయ్ ని చూస్తుంది. మిత్ర తండ్రి కూడా విజయ్ తన మాట వినలేదన్న కోపం ప్రదర్శిస్తాడు. విజయ్ మంత్రిని  వెంట బెట్టుకొచ్చిన  తన పై అధికారినే  క్యాలిక్యులేట్ చేస్తూంటాడు. మంత్రి ఆశీర్వదిస్తూ అన్నీ మర్చిపోదామంటాడు. పై అధికారి బలవంతం చేస్తేనే వచ్చానంటాడు. డ్యూటీలో భాగంగా విజయ్ కి కొన్ని తప్పవనీ, ఇది తెలిసి కూడా తను తొందరపడి  ఏదేదో చేశాననీ బాధ పడతాడు. మిత్రకీ, ఆమె తండ్రికీ విజయ్ మీద అపార్ధం తొలగిపోతుంది. అయితే మంత్రి మాటల్ని నమ్మరు.

        భోజనాల దగ్గర మంత్రి అంటాడు పై అధికారితో- పెళ్ళికి ఇంత మంది పోలీసులు వచ్చారంటే వీడికి చాలా మద్దతుంది సస్పెండైనా. వీడి మీద కేసులకి ఇంకేం న్యాయం చేస్తారు!’ అంటాడు. మీరు తాగి పడుకోకుండా ఈ సీన్ చూపించి మీలోని కడుపు శోకాన్ని నిద్ర లేపుదామనే ఇక్కడికి తీసుకొచ్చా. చట్టం ఏమీ పీకదు, మీరే పీక్కోవాలిఅంటాడు పై అధికారి.

        తర్వాత విజయ్ తో మాట్లాడతాడు పై అధికారి-నువ్వు మంత్రిని- మంత్రి నిన్నూ యేసేసే ఎదురెదురు మెక్సికన్ స్టాండాఫ్ సిట్యుయేషన్ కల్పిస్తాను- వాణ్ణి యేసేసి ఇంకో ఆత్మరక్షణ స్టేట్ మెంట్ ఇచ్చుకుంటావా? ముచ్చటగా మూడుసార్లవుతుంది, మూడు పువ్వులూ ఆరు కాయలుగా వుంటుంది, మనం పోలీసులం ఇంతే!’  అంటాడు

        ‘మీరు నాకు మేలు చేస్తున్నారా, మీకేదో మేలుకి నన్నుపయోగించుకుంటు న్నారా?’ అంటాడు విజయ్. నీ ఇష్టమని వెళ్ళిపోతాడు పై అధికారి.

        మంత్రికీ, పై అధికారికీ మిత్ర తండ్రి సెండాఫ్ ఇస్తున్నప్పుడు, మిత్ర తండ్రితో పై అధికారి- ‘సస్పెండైనా మీరు పెద్ద మనసు చేసుకుని మా వాణ్ణి  అల్లుడుగా చేసుకున్నారు. సస్పెండైనప్పుడే అల్లుళ్ళని పట్టాలి, చీపుగా దొరుకుతారు’  అంటాడు.

        వీళ్ళని చూసి అసలే అయిష్టంగా వున్న మిత్ర తండ్రి, ఈ మాటలకి బాగా మండిపోతాడు - అసలు పోలీసే వద్దన్నా!’  అంటాడు. పోలీసే వద్దన్నారా? ఏఁ? ఎందుకనీ?’ అనడుగుతాడు పై అధికారి. పిలవకుండా వచ్చి -అడ్డంగా కూరలన్నీ మెక్కి- ఇలా పిచ్చి వాగుడు వాగి పోతారనీ!’  అని గట్టిగా అంటాడు మిత్ర తండ్రి.

        పెళ్ళికి వచ్చిన పోలీసాఫీసర్నే అంత మాటంటావా? ఏయ్, ఈణ్ణి లోపలెయ్యండి, లోపలెయ్యండి!’ అని  పై అధికారి అనగానే, మిత్ర తండ్రి అతడి కాలర్ పట్టుకుంటాడు. ఈడ్చి కొడతాడు పై అధికారి.  పోలీసులు మిత్ర తండ్రిని లాగి, జీపెక్కించి తీసి కెళ్లి పోతూంటారు. పరుగెత్తుకొచ్చిన విజయ్ ని ఆపేసి- ఇందాకా నేనేం అడిగానో గుర్తుందిగా? రేపు కలువ్  అనేసి వెళ్లి పోతాడు పై అధికారి మంత్రితో

***
    లాకప్ లో  వున్న మామని బాధగా చూసి, వెళ్లి పై అధికారిని కలుస్తాడు విజయ్. ఒక డేట్ ఫిక్స్ చేసి, రిసార్ట్స్ లో  మంత్రికీ విజయ్ కీ సిటింగ్ ఏర్పాటు చేస్తానంటాడు పై అధికారి. మంత్రి పెళ్ళికి వచ్చి విజయ్ ని కలుపు కున్నాడు గాబట్టిమంత్రి పిలిస్తే నమ్మి రిసార్ట్స్ కి వెళ్లినట్టు వుంటుంది పిక్చర్. డ్రింక్ తీసుకునేప్పుడు పూర్వ సంఘటనల రీత్యా మంత్రిని రెచ్చ గొట్టాలి విజయ్. మంత్రి వాడి ఇగో కొద్దీ రివాల్వర్ తీస్తాడు. అంతకంటే స్పీడుగా విజయ్ తన నాటు రివాల్వర్ తీయాలి. ఇద్దరూ పరస్పరం గురి పెట్టుకుంటారు. ఎవరు ముందు షూట్ చేస్తే వాళ్ళే బతుకుతారువిజయ్ ఎలాగు షార్ప్ షూటర్  కాబట్టి ముందు తనే షూట్ చేసేస్తాడు. చేతిలో రివాల్వర్ తో మంత్రి దేహం పడిపోతుంది. విజయ్ వచ్చి తనదగ్గర లొంగి పోవాలి. మిగతా విషయాలు తను చూసుకుంటాడు

        మీకేమిటి లాభమని విజయ్ అడుగుతాడు. ఎందుకంటే, ఇది తన కోసమే అయితే తన మామని బందీగా లాకప్ లో  పెట్టుకోరని అంటాడు. తన లాభమేమిటో చెప్తాడు పై అధికారి- మంత్రి ఒక స్కాం చేస్తున్నాడని తను తెలుసుకున్నాడు. మంత్రి తమ్ముడ్ని లాగి ఆ వివరాలన్నీ తెలుసుకుని బ్లాక్ మెయిల్ కి తెర తీశాడు. మంత్రి తమ్ముడే బ్లాక్ మెయిలర్ అని తెలుసుకోలేని మంత్రి కోట్ల రూపాయలు అందిస్తూ పోయాడు. ఎందుకో మంత్రి తమ్ముడ్ని అనుమానించాడు, వాణ్ణి ఫినిష్ చేయాలనుకున్నాడు. ఆరోజు విజయ్ రెచ్చిపోయి మంత్రి కణతకి  రివాల్వర్ పెట్టినప్పుడు- కావాలనే, విజయ్ కి తెలిసేట్టే,  వెనుక  వున్న తమ్ముడుకి కనుసైగ చేశాడు. ఇది కనిపెట్టి విజయ్ తమ్ముడ్ని కాల్చేస్తాడని ఊహించాడు. విజయ్ షార్ప్ షూటర్ కాబట్టి తన తమ్ముడి కంటే మెరుపు వేగంతో ఎటాక్ చేస్తాడని లేక్కేశాడు. అతడి లెక్క తప్పలేదు. విజయ్ ఆ తమ్ముడ్ని లేపేశాడు. ఇదంతా  బ్లాక్ మెయిలర్ గా మారిన తమ్ముడ్ని అడ్డు తొలగించుకోవాలన్న మంత్రి కుట్రే తప్ప, యాదృచ్చికంగా జరిగిందేమీ కాదు.

        ఈ కొత్త నిజం తెలుసుకున్న విజయ్- ‘నన్నడ్డం పెట్టుకుని ఎవరి గేములు వాళ్ళు బాగానే ఆడుతున్నారు’  అంటాడు కసిగా. ‘అందువల్ల నా ఇన్ కం కి గండి కొట్టి మంత్రి స్కాం చేసుకుంటే భరించలేను,  హీ మస్ట్ గో!’ అంటాడు పై అధికారి. వాడు పోతే తన కెంత లాభమో విజయ్ కీ అంతే  లాభమంటాడు. పైగా వాడి కొడుకూ, తమ్ముడూ చచ్చిపోయిన కేసులు ఆత్మరక్షణ కారణాన్నే బలంగా సూచిస్తున్నాయని చెప్పి,  విజయ్ మీద సస్పెన్షన్ ని ఎత్తివేయిస్తానని చెప్తాడు పై అధికారి. 

        ‘మీరు ఈ డేట్ ఫిక్స్ చేసే లోగా మంత్రి ఎటాక్ చేయకుండా మీరే చూడాలి’ అంటాడు విజయ్. మామని తీసుకుని వెళ్ళిపోతాడు.

***
విజయ్ ఇంటికి తిరిగొస్తాడు. కొత్త కోడలిగా మిత్ర వస్తుంది. మామని ఇంకెప్పుడూ పోలీసుల్ని మాటలనొద్దని మందలిస్తాడు విజయ్. రోజులు గడుస్తూంటాయి. హౌస్ సర్జన్ గా మిత్ర ఒంటరిగా హాస్పిటల్ కి వెళ్లి వస్తూంటుంది. అత్తగారు (విజయ్ తల్లి) తో కలిసి షా పింగ్స్ కి కూడా వెళ్లి వస్తూంటుంది. విజయ్ పై అధికారి నుంచి కబురు కోసం ఎదురు  చూస్తూంటాడు.  
        పై అధికారి మంత్రిని కలుస్తాడు. ‘మీ కొత్త ఫ్రెండ్ విజయ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. మీకు సారీలు చెప్పి మీ ద్వారా సస్పెన్షన్ రద్దు చేయించు కోవాలనీ ...అది జరిగితే మీకు అరకోటి ఇచ్చుకోవాలనీ...డిసిపి కదా...కానీ మీరు కడుపుశోకంతో కాంప్రమైజ్ కారనుకోండీ...’ అని అంటూంటే- తను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటాడు మంత్రి.  ఐతే వాణ్ణి లేపెయ్యమంటాడు పై అధికారి. ‘వాణ్ణి లేపి ఏంలాభం? వాడి పెళ్ళాన్ని లేపితే వాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు, అది కదా నాక్కావాలీ!’ అంటాడు మంత్రి.  ‘రెండూ ఒకటే- వాణ్ణి లేపినా వాడి పెళ్ళాం కుళ్ళు కుళ్ళి  ఏడుస్తుంది’  అంటాడు పై అధికారి. మంత్రి అపాయింట్ మెంట్స్ చూసుకుని మీటింగ్ కి తేదీ చెప్తాడు. ఆ తేదీ విజయ్ కి పాస్ చేస్తాడు పైఅధికారి.

        ఆ తేదీ నాడు విజయ్ రిసార్ట్స్ కి చేరుకుంటాడు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవంటాడు మంత్రి. తను కూడా రివాల్వర్ తెచ్చుకోలేదని,  బయట సెక్యూరిటీ చెక్ చేశారని, ఈ సంగతి  మీకు పాస్ చేసే ఉంటారనీ అంటాడు విజయ్. ఇద్దరూ డ్రింక్స్ తీసుకుంటూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూండగా- ‘నువ్వు వెపన్ తో వస్తావనుకున్నా’ అంటాడు మంత్రి. ‘నువ్వు మాజీ డిసిపితో డీల్ చేస్తున్నావని తెలుసుకో.  నీకు గన్ లైసెన్సే లేదు, ఎప్పుడూ తుపాకీ పట్టుకోనే లేదు, అదెలా పనిచేస్తుందో తెలీదు,  ఇప్పటికిప్పుడు నువ్వు  ఇల్లీగల్ గన్ సంపాదించుకు వచ్చినా దాన్ని పేల్చగలవా? ఏదో మర్డర్ చేసేయాలన్న ముసలి యావే తప్ప, చేవ ఎక్కడుంది? నేనే నేర్పాలి, నేర్పనా?’  అన్న విజయ్ రెచ్చగొట్టే మాటలకి- ‘అంత మాటంటావా!’  అని నాటు పిస్తోలు తీస్తాడు మంత్రి తాగిన మత్తులో. రకరకాల టార్గెట్స్ ని చూపిస్తూ షూట్ చేయిస్తూంటాడు విజయ్. ఒక్కటీ గురి కుదరదు. గది బీభత్సంగా  తయారవుతుంది కాల్పులతో. సెక్యూరిటీ పరుగెత్తు కొస్తారు.  విజయ్ నేల మీద పడిపోతాడు. అతడికి పిస్తోలు గురిపెట్టి కాల్చాలని ప్రయత్నిస్తూంటాడు మంత్రి. ఇప్పుడా పిస్తోల్లో గుళ్ళు లేవన్న సంగతి తెలుసు విజయ్ కి. ఈ దృశ్యం చూసిన సెక్యూరిటీ, మంత్రిని పెడ  రెక్కలు విరిచి పట్టుకుంటారు.

***
విజయ్ పై అధికారి స్టేట్ మెంట్ ఇస్తూంటాడు : సస్పెండైన డిసిపి విజయ్, మంత్రికి సారీ చెప్పి సస్పెన్షన్ ఎత్తివేయించుకోవాలని పోతే,  మొదట్నించీ అనుమానం పెనుభూతంగా ప్రవర్తిస్తున్న మంత్రి, విజయ్ ని చంపెయ్యాలని కాల్పులు జరిపాడనీ, సెక్యూరిటీ వాళ్ళు ఆపారనీ, దరిమిలా మంత్రిని అరెస్ట్ చేయక తప్పలేదనీ అంటాడు. 

        విజయ్ కి కాల్ చేసి ఎందుకిలా చేశావని నిలదీస్తే, ‘మీ స్వలాభం కోసం నేనెందుకు మర్డర్ చేయాలి సార్? వాడి మూర్ఖపు రివెంజి ప్రపంచానికి తెలిసేలా చేస్తే నాకు చాలనుకున్నాను. మీరలాగే ప్రపంచానికి  తెలియజేశారు. ఇప్పుడేమైంది? వాడి మంత్రి పదవి పోతుంది, స్కాం ఆగిపోతుంది, ఈ కేసులోంచి బయట పడకుండా మీరు చూస్తారు, ఇదీ మీకు లాభమేగా?’  అంటాడు విజయ్. 

        ‘వాణ్ణి చంపే దాకా నీ మీద సస్పెన్షన్ వుంటుంది’  అంటాడు పై అధికారి.
విజయ్ తిరిగి మామూలు జీవితంలో పడిపోతాడు. మిత్రని తీసుకుని గోవా హనీ మూన్ వెళ్తాడు. ఎంజాయ్ చేసి తిరిగొస్తాడు.  మంత్రి బెయిల్ కోసం సుప్రీం కోర్టు దాకా పోతాడు. అప్పటికి ఏడాది తిరిగి విజయ్ కి కూతురు పుడుతుంది. కూతురే లోకంగా ఉంటాడు. మిత్ర హౌస్ సర్జెన్సీ కూడా పూర్తయి డాక్టర్ గా డ్యూటీలో చేరుతుంది. విజయ్ కి పని లేకపోవడం పెద్ద సమస్య అయిపోతుంది. 

        పై అధికారిని కలుస్తూంటాడు. మంత్రి బెయిలు మీద వచ్చేవరకూ ఆగమంటూంటాడు పై అధికారి. ‘వాడు బయటికొస్తే మీ పట్టుదల కోసం నేను చంపాలి అంతేనా? కానీ ఇప్పుడు నా కోసం నేనే చంపాలి. వాడు బెయిల్ మీద బయటికి వస్తే నన్ను చంపడానికే వస్తాడని నాకు తెలుసు. వాడు నాకు పట్టిన క్యాన్సర్. ఈ క్యాన్సర్ కి ఇక చికిత్స తప్పదు. వాడు నన్ను చంపడానికి  వచ్చే ముందే వాడి కిల్లింగ్ ని నేను ప్లాన్ చేసుకోవాలి. అందుకునేను డ్యూటీలో చేరాలి. నేను డ్యూటీలో వుండి ఎన్ కౌంటర్ చేయడం పూర్తిగా వేరు. అప్పుడు మీరన్నట్టు నా మూడో ఆత్మ క్షణ స్టేట్ మెంట్ నా గుండెల్లోంచి ఇంకా బాగా ఒరిజినల్ గా ఉబికి ఉబికి వస్తుంది’ అంటాడు విజయ్. 

 తన సస్పెన్షన్ మీద నిర్ణయం తీసుకోకపోతే ట్రిబ్యునల్ కి పోతానంటాడు విజయ్. తను చెప్పినట్టు వినకపోతే, విజయ్ ని ప్రాసిక్యూషన్ కి రికమెండ్ చేసి జైల్లో కూర్చో బెడతానంటాడు పై అధికారి. ఆ రెండు కేసుల్లో ఇదే తన తుది నిర్ణయమవుతుందని స్పష్టం చేస్తాడు.  మంత్రి బెయిల్ మీద విడుదలై అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. విజయ్ ఎలర్ట్ అవుతాడు. విజయ్ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వడానికి పై అధికారి ఒకటే షరతు పెడతాడు- తను మంత్రి ఎక్కడ దాక్కున్నాడో ఇన్ఫర్మేషన్ తీసి ఇస్తాడు, విజయ్ వెళ్లి చంపెయ్యాలి. 

        మిత్రకి  పోలీస్ సెక్యూరిటీతో హాస్పిటల్ కి వెళ్ళాల్సి రావడంతో ఆమె కూడా ఎలర్ట్ అవుతుంది. ఎక్కడ మొదలయ్యిందో అక్కడే పరిష్కార ముంటుందని అంటుంది.
ఇద్దరూ కాసేపు ఏకాంతంగా గడుపుతారు. ఆమె ఏదేదో మాట్లాడేస్తూంటుంది. అవేవీ తలకెక్కవు విజయ్ కి...  ఎక్కడ మొదలయ్యిందో అక్కడే పరిష్కార ముంటుంది- అన్న ఆమె మాట ఒక్కతే చెవుల్లో  మొగుతూంటుంది. దానర్ధ మేంటోఅంతు చిక్కదు. ఆమె మాత్రం ఏదో  లోకంలో విహరిస్తున్నట్టు...
‘ఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా, ఎక్కడో నిర్జన ప్రదేశంలో పొదరిల్లు కట్టుకుని, ఫోనూ టీవీ లాంటి బయటి ప్రపంచంతో సంబంధాలూ  కట్ చేసుకుని, పెంపుడు కుక్కతో ఏకాంతంగా జీవించాలని.. అని చెప్పుకు పోతూంటుంది. విజయ్ కి ఏదో తట్టి అక్కడ్నించీ పరుగు దీస్తాడు.

        మంత్రి కొడుకు రేప్ చేసిన ఫాం హౌస్ కెళ్లి చూస్తాడు. అక్కడ రేప్ చేసింది మంత్రి కొడుకు కాదనీ, మంత్రేననీ స్పష్టమైన ఆధారాలు దొరుకుతాయి..షాక్ అవుతాడు. 

        కింది అధికారుల ఇన్వెస్టిగేషన్ నిర్వాకానికి తిట్టుకుంటాడు. అప్పుడు మంత్రి ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పై అధికారి- మంత్రి విజయ్ ఇంటికే వెళ్ళాడని !

                                        ***
మంత్రి బీభత్సం చేస్తూంటాడు- మిత్రనీ, విజయ్ తల్లినీ టార్చర్ చేస్తూంటాడు. ఒంటరిగా బాగా దొరికారని వాళ్ళని చిందర వందర చేస్తూంటాడు. ‘మీరు చచ్చే ముందు ఒక నిజం చెప్పనా?’ అని  అప్పుడు రేప్ చేసింది తన  కొడుకు కాదనీ, తానేననీ, తనకా సత్తా ఇప్పుడూ ఉందనీ అంటూ , మిమ్మల్ని కాస్సేపు వాడుకుంటానని  శాడిజం ప్రదర్శిస్తాడు. వాళ్ళు లొంగక పోయేసరికి కాల్చి చంపేస్తాడు- అప్పుడే విజయ్ వచ్చేస్తాడు- అతడి మీదికీ కాల్పులు జరిపి పరారవుతాడు. గాయపడిన విజయ్ తో ఏదో అనాలనుకుని అనలేక ప్రాణంవిడుస్తుంది మిత్ర. అటు తల్లి మృత దేహం పడుంటుంది. విజయ్ కూతురి కోసం పరిగెడతాడు. ఇల్లంతా వెతికినా కన్పించదు కూతురు.

 విజయ్ చితి మంటల్ని చూస్తూంటాడు.
        ‘నువ్వెంత పోలీసువైనా రాజకీయనాయకులు నిన్నునమ్ముతారను కోవద్దు ..నువ్వెంత  నిజంగా ఆత్మ రక్షణ కోసమే మంత్రి కొడుకుని చంపినా నమ్మలేదు మంత్రి. మాయ ..కన్పించేదంతా మాయ.. కన్పిస్తున్న మంత్రిని నమ్మించాలని నానా యాతన పడ్డావ్, వాడే కనిపించని  నేరస్థుడని తెలుసుకోలేక పోయావ్!’  ఘోషిస్తోంది అంతరాత్మ. 

        విజయ్ పై అధికారి దగ్గరికి వెళ్లి, తన ఇంటిదగ్గర సెక్యూరిటీని ఎందుకు విత్ డ్రా చేశారని  అడుగుతాడు. పై అధికారి బాధగా-  ‘రాజకీయం క్రిమినల్ స్వభావాన్ని పులుముకుంటే చాలా దారుణంగా వుంటుంది. మన చేతిలో ఏమీ వుండదు.  అంతా పైస్థాయిలోనే జరిగిపోయిందని నేననుమానిస్తున్నాను. వాడు ఇన్ ఫ్లూయెన్స్ చేసి ఉంటాడు..నాకు తెలీకుండా సెక్యూరిటీని విత్ డ్రా చేసేశారు..’ అంటాడు. నమ్మనంటాడు విజయ్. ముందు వాణ్ణి చంపిరా, తర్వాత మనం తేల్చుకుందామంటాడు పై అధికారి. ‘నువ్వు చంపితే అది సూసైడ్ అని నేనే  రాస్తాను’ అంటాడు. ‘చంపే ముందు అడిగితే వాడే చెప్తాడు సెక్యూరిటీ ఎవరు విత్ డ్రా చేసారో’ అంటాడు. ‘అది నేనే అయితే వచ్చి నన్ను చంపు’ అంటాడు. తన స్వాధీనంలో వున్న విజయ్ సర్వీస్ రివాల్వర్ ని తీసి ముందు పెడతాడు. దీంతో చంపి తిరిగి ఇచ్చేయాలంటాడు. ‘మీరింకా గేములాడుతున్నారా నాతో?’ అంటాడు విజయ్.

‘ఇది మనిద్దరి జాయింట్ డెత్ వారెంట్. రేపు నీతో తేడా వచ్చి మంత్రిని నువ్వే చంపావని నేనడానికి వుండదు.. నా స్వాధీనంలో వున్న రివాల్వర్ నీకెలా వచ్చిందన్న క్వశ్చన్ వస్తుంది. అప్పుడు నేనే ఇరుక్కుంటాను. నీ రివాల్వర్ తో నేనే మర్డర్ చేశానని నువ్వుకూడా అనలేవు, ఎందుకంటే నువ్వు మర్డర్ చేసి రాగానే నీ వేలిముద్రలతో దాన్ని సీల్  చేస్తాను కాబట్టి’  అంటాడు. ‘మీరేమంటున్నారు సార్?’ అని అరుస్తాడు విజయ్.

        ‘సెక్యూరిటీ నేనే విత్ డ్రా  చేశానని మంత్రి అంటే, వాణ్ణి చంపేశాక వెంటనే నన్ను చంపకు, మంత్రి చావు సూసైడ్ అని నేను కవిత్వం రాశాకే నన్ను చంపు, చచ్చే ముందు నీకీ హెల్ప్ చేస్తాను’  అంటాడు మళ్ళీ పై అధికారి. పిచ్చెత్తి నట్టయి  జుట్టు పీక్కుంటాడు విజయ్.

***
మంత్రిని వెతికి వెతికి వేటాడి వేటాడి, రేప్ చేసిన అదే ఫాం హౌస్ లో చంపుతాడు విజయ్. చంపే ముందు- ఆఫీసర్ పేరడిగి తెలుసుకుంటాడు. ‘నీ కొడుకు కిడ్నాప్ చేసిన అమ్మాయిని నువ్వు లాక్కుని రేప్ చేశావంటే, నీకు వావీ వరసలు కూడా లేవు. నా భార్య మీద, మా అమ్మ మీద కూడా చేతులేస్తావురా?’  అని కాల్చి కాల్చి కసికసిగా చంపేస్తాడు.

  పై అధికారి వచ్చి చూసి, రేప్ చేసింది తానేనని తెలిసిపోయిన అవమాన భారంతో, మాజీ మంత్రి కసికసిగా కాల్చుకునీ కాల్చుకునీ  చచ్చిపోయాడనీ కవిత్వం రాస్తాడు. రివాల్వర్ ఇమ్మని అడిగితే, ఇంకో పోయెట్రీ రాశాక ఇస్తానని, విజయ్ వెళ్లి- సెక్యూరిటీని విత్ డ్రా చేసిన ఆఫీసర్ ని షూట్ చేస్తాడు.

విజయ్ కి ఘనంగా పార్టీ ఇస్తాడు పై అధికారి. ఇక కూతుర్ని తీసుకుని వెళ్లి పొమ్మంటాడు. ‘అంతకి ముందే  నీ మామ నీ కూతుర్ని తనింటికి తీసుకెళ్లడం వల్ల బతికిపోయింది. లేకపోతే దాన్ని కూడా కోల్పోయే వాడివి. అంత మాత్రాన మామ మీద తెగ సెంటి మెంటల్ అయిపోకు. వాడు నాకు నచ్చలేదు. చాలా చెడ్డ మాటలన్నాడు. నేనడ్డంగా కూరలు దొబ్బి తిన్నానట. నాకాలర్ కూడా పట్టుకున్నాడు.  నేనసలే మెంటల్ ని, ఇది  మర్చిపోను. వాడిని పనిష్ చేయాల్సిందే. కూతురు పోయిన బాధతో ఉన్నాడుగా- ఇప్పుడు మనవరాలు కూడా లేకుండా పోయి కుళ్ళి కుళ్ళి ఏడవాలి, అది నేను చూడాలి. కాబట్టి దాన్ని తీసుకుని కన్పించకుండా పో! లేకపోతే నీ మర్డర్ వెపన్ బయటి కొ చ్చేస్తుంది. ఎన్నాళ్ళు నీ మామకి మనవరాల్ని దూరం పెడితే అన్నాళ్ళు  రివాల్వర్ బయటికి రాకుండా నీకు లైఫ్ వుంటుంది. గాటిట్? దెన్ ఫకాఫ్!!’ అంటాడు భీకరంగా పై అధికారి.
***
టీచర్ ఏన్ చదువుతున్న ఫైల్లో చివరి పేజీని చూసి తేరుకుని కంగారు కంగారుగా వెనక పేజీలన్నీ తిరగేస్తుంది. ఇవన్నీ తను ఫైల్ చేసిన పేజీలు కావు. అసలు నెట్ లోంచి తీసినవి కావు. తను తీసింది- నెట్ లో  ఉన్నదీ - పెళ్లి వరకే. అదనంగా ఈ పేజీలన్నీ ఎక్కడ్నించీ వచ్చాయి?
 ‘పెళ్లి తర్వాత అసలేం జరిగిందో మీడియాకి తెలిసే  అవకాశం లేదు. కాబట్టి అంత వరకే నెట్ లో  వుంటుంది. అక్కడ్నించీ అంతా నాకూ నా పై అధికారికీ మాత్రమే తెలిసిన గేమ్ కనుక,  అక్కడ్నించీ చివరివరకూ నేనే టైప్ చేసి మీ  ఫైల్లో పెట్టాను. మీరు ఏకబిగిన సస్పెన్స్ థ్రిల్లర్ లా చదువుకుంటూ పోయారు చూసుకోకుండా’ అంటాడు ఆమె వెనకే వున్న విజయ్.


కంగారు పడి చూస్తుంది ఏన్.  తనిలా ఇన్ఫర్మేషన్ తీయడం వేరే ఉద్దేశంతో కాదనీ, కూతురికి ఎలా తోడ్పడగలనా అని తెలుసుకోవడానికేననీ, అంతేగానీ విజయ్ ని ఎలా ప్రేమించగలనా అని కానే కాదనీ ఏడ్చేస్తుంది. విజయ్ షాక్ అయి చూస్తాడు. 

         ‘వద్దు, తెలిసీ మిత్ర నాతో రిస్క్ చేసింది, నువ్వు కూడా చదువుకునీ రిస్క్ చేయవద్దు. నాకెవరూ అవసరం లేదు, ప్లీజ్...ఇది మిత్రకే సొంతమైన ఇల్లు’  అంటూ ఫైల్ ని తగలబెట్టేస్తాడు. 

        అప్పట్నించీ ఇద్దరూ ముభావంగా వుంటారు. కూతురితో ఆడుకుంటూ పైపైన ఎంత అల్లరి చేసినా,  ఆ నిశ్శబ్దం ఇద్దరి మధ్యా వెన్నాడుతూనే  వుంటుంది. ఇది కనిపెట్టేస్తుంది కూతురు. తన స్థాయిలో ఏమిటీ సమస్యని ప్రశ్న లడిగేస్తూంటుంది. బావుండదని, ఇద్దరూ పరిచయమైనప్పుడు ఎలా వుండే వాళ్ళో అలా బిహేవ్ చేయడం మొదలెడతారు. 

        ఒక రోజు కూతురు ఇంట్లో వొంటరిగా వున్నప్పుడు  డోర్ బెల్ మోగుతుంది. కూతురు తలుపు తీసి చూస్తే ముగ్గురుంటారు. ఇద్దరు ఆడవాళ్ళు, ఒక మగవాడు. వీళ్ళెవరో గుర్తుపట్టదు. కూతుర్ని చూడగానే మగవాడు ఉద్వేగంతో ఎత్తుకుని ముద్దా డేస్తూంటాడు, ఆడవాళ్లు లోపలికొచ్చేసి ఇల్లంతా చూసేస్తూంటారు. ‘బాగానే కట్టాడు, డబ్బెక్కడిదో?’ అనుకుంటారు. ‘కాంట్రాక్ట్ కిల్లర్ కి డబ్బుకి కొదవా?’ అని మళ్ళీ అనుకుంటారు. గోడకున్న మిత్ర  ఫోటో కేసే చూస్తూ నిలబడతారు- ‘నయం, దేన్నో పట్టి వుంటాడనుకో లేదూ మనమూ?’  అనుకుంటారు. 

        కూతురు దగ్గర ఫోన్ నంబర్ అడిగి  తీసుకుని కాల్ చేస్తాడు మగ అతను. విజయ్ ఆఘమేఘాల మీద వచ్చేసి వీళ్ళందర్నీ చూసి- ‘మీరెందుకొచ్చారిక్కడికీ?’ అని తీవ్రంగా అంటాడు. ‘ఎలా వచ్చామని అడగవయ్యా మగడా’ అని వెటకారంగా అంటాడు విజయ్ మామ. ‘పోలీసు కాలాంతకుడైతే  లేడీసు దేవాంతకులు!’ అనేస్తారు మిత్ర చెల్లెలు, ఆమె మేనత్తా. 

        ‘ఐదేళ్లూ కన్పిచకుండా పోయావ్. ఒక్క పోలీసూ సహకరించలేదు. ఆ రోజువద్దన్నా నా ఏడాది నిండని మనవరాల్ని లాక్కుపోయావు. నా కూతుర్ని పోగొట్టావ్, మనవరాల్నయినా ఇమ్మంటే విన్లేదు నువ్వు. నీకు నీ కూతురు ఎక్కడ్నించి వచ్చేది- ఆ రోజు నీ ఇంట్లోంచి నేను తీసికెళ్ళి పోకపోయి వుంటే? ఇవ్వమని ఎంత ఏడ్చినా ఆ కనికరం కూడా లేదు నీకు.. నా కూతుర్ని పోగొట్టిన నీకు, నా మనవరాలితో వుండే హక్కులేదు- ఇచ్చేయ్!’
‘ఇవ్వను!’
       ‘ఇచ్చేయ్!’
        సమ్మర్ వెకేషన్స్ కి కేరళ వస్తానన్న పై అధికారి అప్పుడే వచ్చేస్తాడు, టీచర్ ఏన్ ని వెంటబెట్టుకుని. ఇక్కడ సీనంతా చూసి- చటుక్కున రివాల్వర్ తీసి విజయ్ మామకి పెడతాడు, తీసి విజయ్ కి పెడతాడు, తీసి ఫైనల్ గా కూతురికి పెడతాడు. ఆమె తలకి గట్టిగా పెట్టి నొక్కుతూ శాడిస్టిక్ గా చూస్తూంటాడు...
***
దంతా కథలో వున్న స్పార్కే. దర్శకుడి చేతిలో ప్రయోగించని తురుపు ముక్క. స్క్రీన్ ప్లే రచనలో ‘హిడెన్ ట్రూత్’  అనే టూల్ ని ఉపయోగించుకుని కథని తిరగ రాస్తే ఇలా వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన కథ కాదు. అది రన్నింగ్ స్టోరీకి అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే. రన్నింగ్ స్టోరీయే ఎప్పుడూ కథ- ప్రధాన కథ. దీని మీద కూడా ఫ్లాష్ బ్యాక్ ‘కథ’ నే సాగదీసి స్వారీ చేయిస్తూ ముగిస్తే రొటీన్ బాషా ఫార్మాటే వస్తుంది.  

 ఇలాకాక, ఫ్లాష్ బ్యాక్ లో ‘కథ’ ని ఫ్లాష్ బ్యాక్ లోనే ముగించేసి, ప్రధాన కథయిన రన్నింగ్ స్టోరీలో- ఇంకేదైనా  ఫ్లాష్ బ్యాక్ లో గుప్త సమాచారముంటే దాన్ని ప్రయోగించి, కథని పూర్తిగా వైట్ వాషింగ్ చేస్తూ  మాస్టర్ స్ట్రోక్ ఇస్తే,  బాషా ఫార్మాట్ ని బ్రేక్ చేసుకుని కథ ఇంకో లెవెల్  పై కెళ్లి పోతుంది! ఈ రన్నింగ్ స్టోరీకి ఓ పాత్రో లేక ఏదైనా అంశంమో  కేంద్ర బిందువుగా వుండాలి. ప్రస్తుత తిరగ రాతలో తేలిన కూతురి పాత్రలా.

ఫ్లాష్ బ్యాక్ హింసాత్మకంగా వుంటే, రన్నింగ్ స్టోరీ సాత్వికంగా వుండాలి. రన్నింగ్ స్టోరీ హింసాత్మకంగా వుంటే, ఫ్లాష్ బ్యాక్ సాత్వికంగా వుండాలి. రెండిటినీ వేర్వేరుగా ప్లాన్ చేసుకోవాలి- అయితే, రన్నింగ్ స్టోరీ మాత్రం ఫ్లాష్ బ్యాక్ ని మరిపించేదిగా వుండాలి. ఎందుకంటే రన్నింగ్ స్టోరీకే  తెర మీద  The End  పడుతుంది గనుక.


-సికిందర్