రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, అక్టోబర్ 2016, మంగళవారం



     ప్రతిభ నిరూపించుకోవడానికి షార్ట్ ఫిలిమ్సే కాదు, డాక్యుమెంటరీ లనే విభాగం కూడా వుంది. ఐతే ఇది సామాజిక బాధ్యతలతో కూడుకున్నది. వివిధ సామాజిక సమస్యలపై లోతైన అధ్యయనాన్ని డిమాండ్ చేసేది. ఒక రకంగా ఇది జర్నలిజమే. ఉదాహరణకు ‘పార్టనర్స్ ఇన్ క్రైమ్ ‘ అనే డాక్యుమెంటరీ ఫిలిం నే తీసుకుంటే, ఇది సినిమా రంగానికి బెడద గా తయారైన కాపీరైట్/ పైరసీల పెను సమస్య గురించి విశ్లేషనాత్మకంగా చర్చిస్తుంది. ఈ డాక్యుమెంటరీ వివిధ డాక్యూ ఫెస్టివల్స్ లో అనేక అవార్డులు పొందింది. పారోమితా వోహ్రా రూపొందించిన ఈ డాక్యూమెంతరీ కాపీరైట్ చౌర్యం గురించి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు వెలికి తీసి లోకానికి ప్రదర్శిస్తుంది.

          ఒక లెక్కలేనన్ని సినిమాలని, మ్యూజిక్ ని, వీడియోలనీ డౌన్ లోడ్  చేసుకున్న కాకలుతీరిన పైరసీ దారుడ్ని’నువ్వు చేస్తున్నది చట్ట విరుద్ధమని తెలుసా?’ అని అడిగితే  – ‘ఇవి నాకేం ఉత్త పుణ్యానికి రాలేదు, వీటిని సంపాదించడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను చేసిన వర్క్ ఎంత విలువైనదో నాకు తెలుసు’ అనేశాడతను.

          ఇలా పైరసీయే గాకుండా, కళాకారులు చేసే పాల్పడే కాపీరైట్ ఉల్లంఘనల గురించి కూడా ఇందులో చిత్రీకరించారు. ముఖ్యంగా మ్యూజిక్ కి సంబంధించి..ఇండియన్ రాక్ బ్యాండ్ ‘ధర్మల్ అండ్ ఏ క్వార్టర్’ ఎలా తమ ట్యూన్లని సినిమాపాటలకి కాపీ చేసి వాడుకుంటున్నారో వివరించారు. అంతేగాకుండా ఇంటర్నెట్ లో తమ సంగీతాన్ని తమ అభిమానులే కాపీ రైట్ హక్కుల్ని ఉల్లంఘించి పైరసీకిపాల్పడుతున్నట్టు  ఆరోపించారు. దర్శకురాలు పారోమిత్రా వోహ్రా వ్యవస్థీ కృత 

మాఫియాలుగా మారిన పైరసీదార్ల దగ్గరనుంచి, వివిధ కళా రంగాల్లో స్వయంగా కాపీరైట్ ఉల్లంఘనలకి పాల్పడుతున్నకళాకారుల వరకూ బయటపడని నిగూఢ రహస్యాలెన్నో వెలికి తీశారు. అసలు పైరసీ అనేది వ్యవస్థీ కృత నేరమా, లేక ఇదో రకమైన వర్గ పోరాటమా అన్న సందేహాన్ని కూడా రేకెత్తించారు.  ఈ మొత్తం వ్యవహారంలో బాధితులవుతున్న స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను కూడా సేకరించారు. సినిమాలని చట్ట విరుద్ధంగా డౌన్ లోడ్ చేసుకునేవారితో, పైరసీ సీడీ ల సేల్స్ మాన్ లతో, ఏది ఇన్ స్పిరేషన్ –ఏది కాపీ అంటూ రీసెర్చ్ చేస్తున్న బ్లాగర్ తో, పైరసీ- కాపీరైట్ చట్టాల్లోని లోసుగులతో సొమ్ము చేసుకుంటున్న యువ పారిశ్రామిక వేత్తతో- ఇలా అటూ ఇటూ అందరు వ్యక్తులతో సంక్షిప్త ఇంటర్వ్యూలు  డాక్యుమెంటరీలో పొందుపర్చారు.

          తొలి నుంచీ కాపీరైట్ చరిత్రని అద్భుతమైన ఇన్ఫో గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తూ, బ్యూటిఫుల్ సౌండ్ ట్రాక్ ని జోడించి ప్రయోజనాత్మకమైన ఈ ఇన్వెస్టిగేటివ్ ఈ డాక్యుమెంటరీని అందించిన దర్శకురాలికి అభినందనల వెల్లువ కూడా అంతే స్థాయిలో వుంది. యూట్యూబ్ లో దీన్ని వీక్షించ వచ్చు.

-సికిందర్