రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, మార్చి 2016, మంగళవారం

షార్ట్ రివ్యూ!






రచన, దర్శకత్వం : ప్రవీణ్‌ సత్తారు
తారాగణం:
 నరేష్‌, సిద్ధు జొన్నలగడ్డ,  రష్మీ గౌతమ్‌,
శ్రద్ధా దాస్‌
, మహేష్‌ మంజ్రేకర్‌, రాజా రవీంద్ర, రఘుబాబు తదితరులు
సంగీతం : శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం : రామ్‌రెడ్డి
బ్యానర్‌ : ఆర్‌.కె. స్టూడియోస్‌,  నిర్మాత : రాజ్‌కుమార్‌ 
విడుదల :  4 మార్చి, 2016
***
నిజానికి అడల్ట్ మూవీస్ అని కేవలం సెక్స్ కంటెంట్ వున్న సినిమాలనే అంటారు – ‘త్రిష లేదా నయనతార’ అని ఇటీవల వచ్చిన సినిమా ఇలాటిదే. పూర్తి సెక్స్ కంటెంట్ కాకుండా క్రైం ఎలిమెంట్ కలిసి  వుంటే అది ఎరోటిక్ థ్రిల్లర్ అవుతుంది.  కానీ పూర్తిస్థాయి క్రైం ఎలిమెంట్ తో కూడి వున్న ‘గుంటూర్ టాకీస్’ ని థ్రిల్లర్ అనే మాటే లేకుండా అడల్ట్ మూవీగా ప్రచారం చేసుకున్నారు. దీనివల్ల సినిమా ఏమాత్రమైనా ఆడడానికి బ్రేకులు వేసుకున్నట్టయ్యింది. ఈ రోజుల్లో అడల్ట్ మూవీ అంటూ థియేటర్లకి ప్రేక్షకుల్ని రప్పించగలరా- డైరెక్ట్ పోర్న్ కంటెంటే  సెల్ ఫోన్ల నిండా దొరుకుతున్నాక? ఎరోటిక్ థ్రిల్లర్ అయిన ‘మర్డర్’ ని అడల్ట్ మూవీగా ప్రచారం చేసివుంటే ఆ రేంజిలో హిట్టయ్యేదా?


       సలు సినిమాల్లో సెక్స్ చూడాలనో, అద్భుత ప్రేమలు చూడాలనో ప్రేక్షకులు వస్తున్నారా? ఈ రెండిటినీ క్రైం ఎలిమెంట్ తో కలిపి ఎరోటిక్ థ్రిల్లర్స్ గానో, రోమాంటిక్ థ్రిల్లర్స్ గానో తీసి చూపిస్తే వస్తున్నారు. ఇప్పుడున్న మార్కెట్ తీరు ఇది. 


        దర్శకుడు ప్రవీణ్ సత్తారు ‘చందమామ కథలు’ తీసి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆ ఎనిమిది కథల సినిమాని సరిగ్గా తీయలేదని  రాసినందుకు రివ్యూ రైటర్లకి క్లాసు తీసుకున్నాడు. జాతీయ అవార్డుల కమిటీ అవార్డులిస్తుందే గానీ ఆ సినిమా తీసి చేతులు కాల్చుకున్నందుకు నష్టపరిహారమివ్వదుగా?  కాబట్టి అవార్డులకీ ఆర్ధిక లాభ నష్టాలు బేరీజు వేసే రివ్యూలకీ లంకె పెట్టనవసరం లేదు. ‘చందమామ కథలు’ లాంటి జాతీయ అవార్డు స్థాయి సినిమా తీయగల్గిన తను ఇప్పుడు అశ్లీలాన్ని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది- కమర్షియల్ సక్సెస్ కోసమేగా? అయినా  ‘అడల్ట్ మూవీ’ అనే ప్రచారంతో తీసిన ఈ ఫన్నీ ఎరోయిటిక్ థ్రిల్లర్ కూడా చతికిలబడాల్సి వచ్చింది.




కథ

       నడివయసులో వున్న గిరి (నరేష్), కోడెవయసులో వున్న హరి (సిద్ధూ జొన్నలగడ్డ) గుంటూరులో ఓ మెడికల్ షాపులో పని చేస్తూంటారు. ఇంటి దగ్గర హరి పక్కింటి ఆంటీతో సంబంధం పెట్టుకుంటాడు. ఆ అంటీ పిన్నికూతురు సువర్ణ ( రష్మీ గౌతమ్) కి లైనేస్తూంటాడు. గిరి భార్య సరీగ్గా పోషించడం లేదని ఐదేళ్ళ క్రితం ఇద్దరు పిల్లల్ని కూడా వదిలేసి చీరల షాపువాడితో లేచిపోయింది. ఆ ఇద్దరు పిల్లలకీ, తన రోగిష్టి తల్లికీ చాకిరీ చేయలేక తిట్టుకుంటూ వుంటాడు గిరి. హరికి కూడా పూర్వ కథ వుంటుంది. ఒక సెక్స్ పిచ్చిగల రివాల్వర్ రాణి (శ్రద్ధా దాస్) సెక్స్ కోసం ప్రాణాలు తోడేస్తూంటే ఆమెదగ్గరే కొంత అప్పు తీసుకుని పారిపోయి గుంటూరొచ్చాడు.


        ఇక్కడ హరి-గిరిలు పని చేస్తున్నమెడికల్ షాపు ఓనర్ (సుదర్శన్) పెద్ద కంత్రీ. వాడిచ్చే జీతం చాలక రాత్రిపూట షాపు కట్టేసి వస్తూ ఇళ్ళల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూంటారు. ఒకరాత్రి తెలుసుకోకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ (రఘుబాబు) సొంతింట్లో ఒకరు, సర్కిల్ ఇన్స్ పెక్టర్ ఉంచుకున్న దాని ఇంట్లో మరొకరూ దొంగతనానికి వెళ్తే చెరి ఐదు లక్షలు దొరుకుతాయి. ఒకరికి చెప్పుకోకుండా ఒకరు ఆ డబ్బుతో జంప్ అయిపోతారు. తల్లినీ పిల్లల్నీ వేసుకుని గిరి సొంతూరు పారిపోతే, సువర్ణని లేపుకుని గోవా ఉడాయిస్తాడు హరి.



        అక్కడ ఎంజాయ్ చేస్తూంటే ఓ గ్యాంగ్ వచ్చేసి పట్టుకుంటుంది. కొట్టేసిన డబ్బులు కాదు, ‘ఆ డబ్బా’ ఇమ్మంటుంది. ఏ డబ్బా? ఏమిటి దాని కథ? అదెక్కడుంది? ఇద్దర్లో ఎక్కడ ఎవరి దొంగతనంలో అది మాయమయింది? హరి మాయం చేశాడా, గిరి మాయం చేశాడా? ఆ డబ్బా కావాల్సిందే ఇప్పుడు గుంటూరు డాన్ జాకీ (మహేష్ మంజ్రేకర్) కి! లేపోతే ఏం బావోదు...


 ఎలా వుంది కథ 
   ఓవరాల్ గా చూస్తే ఇదొక ఫన్నీ థ్రిల్లరే. అనవసరమైన అశ్లీలాన్ని పూశారు. పూస్తే పూశారు, ఆ అశ్లీల కంటెంట్ ని కనీసం సెకండాఫ్ లో  హీరోయిన్ తో ఒక సీన్లో పాటతో కలిపి చూపించినట్టు క్లాస్ గా - ఎరోటిక్ గా చూపించి వుంటే,  సేఫ్ గా  ‘U/A’ గ్రేడ్ ఎరోటిక్ థ్రిల్లర్ అయ్యేదేమో. ఫస్టాఫ్ లో చూపించుకొచ్చిన అశ్లీలం వల్ల - రాయడానికి వీల్లేని ఒక పదాన్ని పదేపదే వాడడం వల్ల - దీనికిచ్చిన  ‘A’ సెన్సార్ సర్టిఫికేట్ కంటే, గ్రేడు ఇంకా తగ్గించి కొత్తగా ‘A2  అని క్రియేట్ చేసి సత్కరించాలి. ఈ సినిమాకి పిల్లల్ని తీసుకురావద్దనీ, సున్నిత మనస్కులు చూడొద్దనీ సినిమా ప్రారంభంలో చెప్పారు. నిజానికి ప్రధాన కథతో సంబంధం లేని ఈ సెక్స్ కంటెంట్ ని కావాలని పూసుకున్నట్టుంది గానీ, ఇది లేకపోతే అందరూ చూడదగ్గ కథే. ప్రేక్షకులు ఒక హాస్యభరితమైన న్యూవేవ్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయనివ్వకుండా దీనికేదో అడల్ట్ మూవీ అంటూ బిల్డపిచ్చి తప్పుదోవ పట్టించారు.





ఎవరెలా చేశారు 

      సిద్ధూ జొన్నలగడ్డది మాస్ సినిమాల్లో కన్పించే మాస్ పాత్రకంటే- స్లమ్ డాగ్ కంటే  నీచ పాత్ర. ఏ విలువలూ, వ్యక్తిత్వం, నీతీ లేని క్రిమినల్ పాత్ర. అతడికి ప్రేమ తెలీదు, దొరికిన ఆడాళ్ళని అనుభవించడమే తెలుసు. ఆ దృష్టితోనే చూస్తాడు. ఆంటీతో సంబంధం పెట్టుకుంటూనే ఆమె పిన్ని కూతుర్ని అనుభవించడానికి ప్రయత్నిస్తూంటాడు. దొంగతనాలు చేసి ఆ డబ్బుతో మజా చేస్తూంటాడు. కుక్కలా బతుకుతాడు, పిచ్చి కుక్కలా తన్నులు తింటూనే ఉంటాడు. ఇలా ఈ దర్శకుడి స్వైర కల్పనలు ఎందుకు అఫెన్సివ్ గా వున్నాయి? ఇది కళా మర్యాదకి ఎందుకు దూరం? 


        2014 లో ఐదు ఆస్కార్ నామినేషన్లు పొందిన ‘ది వుల్ఫ్ ఆఫ్ వాల్  స్ట్రీట్’ అనే బ్లాక్ కామెడీకి దర్శకుడు  ది ఫేమస్ మార్టిన్ స్కోర్ససీ (Martin Scorsese). ఇందులో హీరో వచ్చేసి మరెవరో కాదు, పాపులర్ స్టార్ లియోనార్డో డీ కాప్రియో. ఇందులో ఇతడిది చాలా నీచపాత్ర. అమ్మాయిలతో చాలా అసహ్యమైన పనులు చేస్తాడు. ఆఫీసులో అందరి ముందూ అలాటి పనులే  చేస్తాడు. స్టాక్ బ్రోకర్ గా చాలా నీచమైన పనులు చేస్తాడు. అవడానికి మల్టీ మిలియనీర్ అయినా వూర కుక్కలా తిరుగుతాడు. హీరో కాదుకదా, విలన్ కూడా చేయలేని చేష్టలకి పాల్పడతాడు. 



        ఆస్కార్స్ లో  ఈ సినిమా ప్రదర్శన ముగిశాక, ఒక రచయిత దర్శకుడు స్కోర్ససీని పట్టుకుని నిలదీశాడు- మీరు మీరేనా? ఇలా ఎలా తీస్తారు? ఏవగింపుగా వుంది మిమ్మల్ని చూస్తూంటే!- అంటూ అరిచాడు. అసలు విషయం అతడికి తెలీదు. ఈ సినిమా జోర్డాన్ బెల్ఫోర్ట్ అనే పేర్గాంచిన స్టాక్ బ్రోకర్ జీవిత చరిత్ర అని. కాబట్టే స్కోర్ససీ అలా తీయాల్సి వచ్చింది. డీ కాప్రియో అలా నటించాల్సి వచ్చింది. ఆ సీన్లన్నీ తీసేస్తే సినిమాకి అర్ధమే లేదు.

        ప్రవీణ్ సత్తారు తీసింది ఇలాటి జీవిత చరిత్ర కాదు. ఇలాంటప్పుడు ఇలాటి కల్పిత పాత్రతో ఆశుద్ధాన్ని గ్లామరైజ్ చేయడం  కళా మర్యాద అన్పించుకోదు. అలాటి క్రిమినల్ పాత్ర నిజవితంలో ఎవరైనా వుంటే, ప్రేక్షకులకి బాగా తెలిసి వుంటే అప్పుడు ఓకే. అయినా కూడా ఎక్కడో నార్త్ లో జరిగిన నిజకథ అని చెప్పి   ‘కీచక’ అనే హార్డ్ కోర్ రేపుల సినిమా ఇటీవలే తీశారు. అయినా అదీ ఒక్కరోజు కూడా ఆడలేదు. 

        యాంటీ హీరో పాత్రకైనా హద్దులుంటాయి. ఈ హద్దులు కూడా చేరిపేస్తామంటే అదేదో ప్రయోగం అన్పించుకోదు, పెర్వర్షన్ అన్పించుకుంటుంది. యాంటీ హీరోని సెక్స్ యావ తగ్గిస్తూ పచ్చి క్రిమినల్ గా ‘అండర్ డాగ్’ గా చూపించవచ్చు. ఇతను తలపడే ‘టాప్ డాగ్స్’ తో ఎప్పుడూ తన్నులు తినొచ్చు. యాక్టివ్ పాత్ర కాకపోయినా ఫర్వాలేదు. గేమ్ లో చిట్టచివరికి గెలిచాడంటే, ఆ ముగింపు ‘టాప్ డాగ్స్’ కి దిమ్మతిరిగేట్టు వుంటుంది. 

        అయితే ఈ సినిమా ఒక హీరో కథ కాదు- ఇద్దరి కథ. అందుకని ఇది ‘అందరూ దొంగలే’ లాంటి  ‘బడ్డీ మూవీ’. హాలీవుడ్ లో ఒకప్పుడు బడ్ స్పెన్సర్- టెరెన్స్ హిల్స్ కలిసి ఎన్నో క్రైం- కామెడీ – అడ్వెంచర్  కలగలిసిన ‘బడ్డీ మూవీస్’ లో నటించారు. ఇలాటి ‘బడ్డీ’ పాత్రలే నరేష్- సిద్ధూ జొన్నలగడ్డలవి యిక్కడ. అయితే సిద్దూతో పాటూ నరేష్ పాత్ర కూడా అశ్లీలాన్ని డామినేట్ చేసే క్యారక్టరైజేషన్స్ కావడంతో, బ్యాడ్ టేస్ట్ అన్పించుకుని తెల్లారిపోయాయి ఆ నటనలు ఫస్టాఫ్ లో.

        2000 లో యూత్ సినిమాలంటూ వెల్లువెత్తిన కాలంలో వచ్చిన ‘బ్యాచిలర్స్’ లో మొట్టమొదటిసారిగా స్టూడెంట్స్ ని తాగుబోతులుగా చూపించారు. అది అందరి ఛీత్కారాలకీ గురయ్యింది. కానీ అక్కడ్నించీ అవే తాగుళ్ళు మరింకొన్ని యూత్ సినిమాల్లో కంటిన్యూ అయ్యాయి. అలా అలా క్రమంగా చిన్న పెద్దా తేడా లేకుండా అందరు హీరోల సినిమాల్లో మందు సీన్లు సర్వసాధారణమైపోయి అలవాటు పడిపోయారు ప్రేక్షకులు. మందు సీన్లకి అలవాటుపడినట్టు పెర్వర్షన్ కి కూడా క్రమంగా అలవాటు పడ్డానికి ‘బ్యాచిలర్స్’ లాగే ఇదింకో బీజం వేస్తోందా- దీన్ని ఫాలో అవుతారా ఆవేశపడి దర్శకులు? 

        ఫస్టాఫ్ లో డామినేట్ చేసిన అశ్లీల ఎలిమెంట్ సెకండాఫ్ లో క్రైం ఎలిమెంట్ కారణంగా సమసిపోయాకే, సిద్ధూ నరేష్ లు ఎంటర్ టైన్ చేయడం మొదలెడతారు. అండర్ డాగ్స్ గా రక్తి కట్టించడం మొదలెడతారు. 

        ఇంకో రివాల్వర్ రాణి అనే సెక్స్ పిచ్చిగల పాత్రతో అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే సెక్స్ కి కామెడీ తోడవుతుందో అప్పుడది పాసయిపోతుంది. అమీర్ ఖాన్  ‘పీకే’ లో కారు లోపల జంటవల్ల ‘కారూగుతూంటే’ అమీర్ ఖాన్ వాళ్ళ బట్టలు కొట్టేయడం లాంటి రెండు సీన్లు ఇలాటివే. అలాగే ‘శంకరాభరణం’ లో అంజలి పోషించిన బందిపోటు పాత్ర తన అనుచరురాళ్ళని పెట్టించి పృథ్వీని సీరియల్ రేప్ చేయించే సీను కూడా. ఇలాగే ‘గుంటూర్ టాకీస్’ లో రివాల్వర్ రాణి శ్రాద్ధాదాస్ తో  ‘కారు ఊగే’  సీన్లు, ఫస్టాఫ్ లో సిద్ధూని రేప్స్ కి వాడుకునే సీన్ల వరకూ కామెడీ కిందే చెల్లిపోయాయి.  శ్రద్ధాదాస్ సెకండాఫ్ లో మొత్తం టాప్ డాగ్స్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకునే థ్రిల్లింగ్ సీన్స్ లో పాత్రకి ఆమె సరీగ్గా సరిపోయింది. 

        టాప్ డాగ్స్ అయిన డాన్ జాకీగా మహేష్ మంజ్రేకర్, అతడి గ్యాంగ్ లో  రవిప్రకాష్, ఫిష్ వెంకట్ లు కూడా సీన్లని ఫన్ తో నింపేశారు -  సీఐగా రఘుబాబు, ఎస్సైగా రాజారవీంద్ర, కానిస్టేబుల్ గా జోగినాయుడు సహా. 
        కెమెరా, సంగీతం మాత్రం ఒక వ్యూవేవ్ థ్రిల్లర్ కుండాల్సిన స్టయిలిష్ నేచర్ తో లేవు. 


చివరికేమిటి 

      దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి క్రైం సబ్జెక్టు మీద కూడా మంచి పట్టువుంది సందేహం లేదు, అక్కడక్కడా కొన్ని లాజిక్కులు తప్పితే. ఐదేళ్ళ క్రితం మొదటిసారిగా నరేష్ దొంగగా పట్టుబడినప్పుడు టౌన్లో ఏ ఎస్సై (రాజారవీంద్ర) ఉన్నాడో అతనే  ఇంకా కొనసాగడం, ఇప్పుడు తాజాగా ఐదు లక్షలు కొట్టేసిన నరేష్ ఫోటోని  కూడా గుర్తుపట్టక గోవా దాకా వెళ్ళడం లాంటి ఇల్లాజికల్ సీన్స్ వున్నాయి. అలాగే ‘ఆ డబ్బా’ ఇస్తానని టాప్ డాగ్స్ ని నరేష్ తన ఇంటికి వెంట బెట్టుకొస్తూంటే, అక్కడే వున్న ఎస్సై నరేష్ ని పట్టుకుంటాడు. పోలీసుల్ని చూసి టాప్ డాగ్స్ పారిపోతారు. తర్వాత టాప్ డాగ్స్ ‘ఆ డబ్బా’ కోసం నరేష్ ఇంట్లోకి జొరబడి వెతకొచ్చుగా? ఆ పని చేయకుండా  ఎక్కడెక్కడో తిరుగుతూంటారు.


        ఇలాటి లోపాల్ని సవరిస్తూ, ఆంటీ గీంటీ ఇంకో పెళ్ళాం లాంటి చీప్ పాత్రల్ని తీసేసి- నీటైన ఎరోటిక్ త్రిల్లర్ గా దీన్ని తీసివుంటే రెగ్యులర్ కమర్షియల్ అయ్యేది.


-సికిందర్