రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, సెప్టెంబర్ 2016, సోమవారం

స్క్రీన్ ప్లే సంగతులు!



స్టార్ సినిమాలతో వున్న సులువు ఏమింటే, ఎలా తీసినా వాటి వ్యాపారం జరిగిపోతుంది, హిట్ టాక్ వచ్చేస్తుంది. ఎప్పుడో స్టార్లుండి కూడా బ్రహ్మోత్సవం, కబాలీ లాంటివి విషయపరంగా మరీ వికటిస్తే పరాభవం తప్పక పోవచ్చు, ఇవి  అరుదుగా ఎదురయ్యే సన్నివేశాలు. విషయపరంగా ఏ మేరకు వికటిస్తే సేఫ్ అనడానికి కొలబద్ద లేదుగానీ, చాలావరకూ విషయపరంగా అర్ధవంతంగా వుండని స్టార్ సినిమాలు హిట్టయి పోతూంటాయి. కారణం స్టార్ పవర్. స్టార్లు ఇద్దరుంటే రెట్టింపు పవర్. కాబట్టి వాటి విజయాలకి వాటి కథా కథనాలు, పాత్రచిత్రణలు కూడా తోడయ్యాయని ఎవరైనా నమ్మితే పొరపాటే. హిట్టయ్యింది కాబట్టి కథాకథనాలు ఇలాగే వుండాలని, పాత్రచిత్రణలూ ఇలాగే వుండాలని భావిస్తే, లేదా కథా కథనాలూ పాత్ర చిత్రణలూ కరెక్టుగా ఇలా కుదరడం వల్లే హిట్టయ్యిందని వాదిస్తే  తప్పులో కాలేసినట్టే. స్టార్ పవర్ ని తీసేసి చూసినప్పుడు ఆ కథా కథనాల, పాత్ర చిత్రణల  బలమెంతో తెలిసిపోతుంది. ‘జనతా గ్యారేజ్’ ఆర్ధిక విజయానికి కారణం ఇదే- స్టార్ పవర్. అందులోనూ డబుల్ స్టార్ పవర్- తప్ప విషయపరంగా చేసిన అద్భుతమేమీ కాదు. డివైడ్ టాక్ ఎందుకొస్తుంది- విషయపరమైన లొసుగుల వల్లే కదా? డివైడ్ టాక్ ని అధిగమించి ‘జనతా గ్యారేజ్’ ఆర్ధిక విజయం సాధిస్తోందంటే అది స్టార్ పవరే. కాబట్టి స్టార్ పవరుంటే చాలు, అంత  చక్కగా స్క్రిప్టు వర్క్ చేసుకోనక్కర లేదని రాతపని సరంజామాతో పాటు మెదడుని  పక్కన పడేస్తే- అన్నివేళలా కలిసి రాకపోవచ్చు. అదొక బ్రహ్మోత్సవమో, కబాలీనో కావొచ్చు. వికటించే రేంజుల్ని బట్టి జాతకాలుంటాయి. 

దురదృష్టవశాత్తూ సినిమాల్లో విషయం ఎంత వికసించాలనిగాక, ఏ రేంజిలో వికటిస్తే మనం సేఫ్ గా వుంటామని ఆలోచించే కాలంలో మనం వున్నాం.  ఈ కథ ఇలా చేస్తే మరీ పాడయిపోతుందా.... అయితే కొంచెం తగ్గించు...తక్కువ పాడు చేసుకుందాం....అనే ధోరణి ప్రబలిన చీకటి యుగంలో వున్నాం. ఇలా తక్కువ వికటించేలా చూసుకునే పనే తప్ప ఎక్కువ వికసించే మాట కాదు. వికాసం, విస్తృతి, నాణ్యతల కంటే కూడా - ఎంత తక్కువ పాడుచేసుకోవచ్చు, ఎంత తక్కువ (ప్రేక్షకుల చేత) తిట్లు తినవచ్చు, ఎంత తక్కువ కెరీర్ కి నష్టం చేసుకోవచ్చనే వాటి మీదే దృష్టి పెట్టి కసరత్తు చేసే నయా క్రియేటర్ల జమానాలో జీవిస్తున్నాం. ఎక్కువ వికాసం గురించి గాక, తక్కువ వినాశం గురించి తపించే నెగెటివిటీ తాండవిస్తున్న ట్రెండ్ ని చవిచూస్తున్నాం. వికాసమంటే ఎంతో కష్టపడాలి, వినాశానికి ఏ కష్టమూ  పడనక్కర్లేదుగా, అందుకని. 

        ‘జనతా గ్యారేజ్’  లో విషయం యే మేరకు సేఫ్ గా వికటించిందీ అంటే,  మనం ఓనమాలు అంటే బేసిక్స్ లోకి వెళ్ళాలి.  మనం ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’  వ్యాస పరంపరలో భాగంగా మూడో అధ్యాయంలో బేసిక్స్ గురించి చెప్పుకుంటూ,  అసలంటూ ఓ ఐడియా అనుకున్నాక, ముందుగా అందులో కథే వుందా, లేకపోతే  గాథగాని వచ్చి శుభ్రంగా తిష్ఠ వేసిందా పరిశీలించు కోవాలని హెచ్చరించుకున్నాం. ఈ మధ్యే ‘బ్రహ్మోత్సవం’ సినిమా చెప్పాల్సింది కథ అని మర్చిపోయి, ఓ గాథా లహరితో బిగ్ బ్యాంగ్ ఇచ్చి వెళ్ళింది. ఆల్రెడీ ఒకప్పుడు కృష్ణవంశీ ‘మొగుడు’, తో సరిపెట్టకుండా మళ్ళీ,  ‘పైసా’ అంటూ కూడా గాథలతో రెండు బ్యాడ్ టు బ్యాడ్ బ్యాంగు లిచ్చి వదిలారు.  మణిరత్నం సర్ కూడా ‘ఓకే బంగారం’ తో తనదైన వెరైటీ బ్యాంగ్ ఇస్తే, మరో ఇద్దరు దర్శకులు ‘చక్కిలిగింత’ అనీ, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అనీ  గాథలందుకుని గాయపడ్డారు. ఆఖర్న  ‘రాజాధిరాజా’ తో కూడా ఈ మధ్యే గాథ బారిన పడి దగాపడి పోయాం. 

       
తెలుగు సినిమాలకి పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలు అనే రెండు శాపాలు ఇంకా వదలడం లేదు-  ఇక ఇప్పుడు గాథలు కూడా ముచ్చటగా మూడో శాపంగా తోడయ్యియ్యాయి. ఇసుకకీ మట్టికీ తేడా తెలీని వాడు ఇల్లు కట్ట లేనట్టే - కథకీ, గాథకీ తేడా తెలీని వాడు సరైన సినిమా తీయలేడు. దట్స్  బేసిక్స్. 

గాథంటే ఏమిటి?  
      మన్మధ రావు రోడ్డు మీద నడుచుకుంటూ ఏటో పోతున్నాడు... రోడ్లమీద ప్రాణాలకి అంత గ్యారంటీ వుండదు కాబట్టి, వెనకనుంచి ఏదో వాహనం వచ్చి ధభీల్మని గుద్దేసింది. అమ్మో అని గీపెట్టి  కింద పడ్డాడు. ఆ ప్రయాణం రద్దయి, 108 లో అత్యవసరంగా ఇంకో ప్రయాణం కట్టాడు. ఎంచక్కా హాస్పిటల్ బెడ్ నలంకరించాడు. కాలు ఫ్రాక్చరైందని తేలింది. ఫ్రాక్చరైన కాలితో అతను బెడ్ మీద ఎన్ని బాధలు పడ్డాడు, బయటి కొచ్చి ఎంతకాలం ఇంకెన్ని యాతనలు పడ్డాడు, చివరికి కాలు బలపడి మళ్ళీ రోడ్డు మీద ఎంత క్రేజీగా ఎలా నడవసాగాడు- ఈ మొత్తం అనుభవంతో జీవితం గురించి నేర్చుకున్న దేమిటీ అని, సదరు మన్మధరావు తోటి నవీన్ కుమార్ కి   చెబుతోంటే అది గాథ. నవీన్ కుమార్ కి బోరు కొట్టింది. కారణం, ఇందులో ఏముందని ఆసక్తి కల్గించడానికి మన్మధరావు గాయం బాపతు  సోది  తప్ప- కాబట్టి గాథ అనేది ఏదో విషయం మీద స్టేట్ మెంట్ ఇచ్చిన స్థాయిలోనే  వుండిపోతుంది. నేనిలా అనుకుంటే నాకిలా జరిగి ఇలా మిగిలానబ్బా, ఏమంటావ్?-  అని విధికి తలవంచిన మనిషిలా  ఒక పరాజితుడిగా చెప్పేసి వెళ్ళిపోవడం.

కథంటే?
     అదే మన్మధరావు బైక్ మీద అర్జెంటుగా పెళ్లి చూపులకి పోతున్నాడనుకుందాం. వెనుక నుంచి కారొచ్చి గుద్దేసింది. ఎగిరి కింద పడ్డాడు. కాలు విరిగింది. ఎవడ్రా  నన్ను గుద్దిందీ -అని లేవబోయే లోపే కారు వెళ్ళిపోయింది. మన్మధ రావు విరిగిన కాలుతోనే దాని వెంటబడ్డాడు. ఎవరో ఆపి హాస్పిటల్ కి తీసి కెళ్ళారు. ఫ్రాక్చరైన కాలుకి బ్యాండేజీ పడింది. పెళ్లి సంబంధం రద్దయ్యింది.  నా పెళ్లి పాడు చేసిన వాణ్ణి వదిలేది లేదని పోలీసుల్ని పట్టుకుని, లాయర్నీ  పెట్టుకుని, కారు వాడి మీద కేసు వేశాడు. యాక్సిడెంట్ లో తప్పె వరిదనే  పాయింటు పై తీవ్ర పోరాటం చేసి  కేసు గెలిచాడు. నష్టపరిహారం పొందాడు.


        మన్మధరావు ఇలా చెప్తే నవీన్ కుమార్ కి నచ్చింది. ఎందుకంటే ఇందులో వాడిగా వేడిగా ఆసక్తి రేపే ఆర్గ్యుమెంట్ వుంది. మన్మధ రావు చేసే పోరాటం వుంది. చివరికి తప్పొప్పుల నిర్ధారణతో జడ్జి మెంట్ వుంది. నేనకున్న లక్ష్యాన్ని ఫలానా ఈఈ శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నాను- అని మన్మధరావు  విజేతగా ప్రకటించుకోవడం వుంది. 


కథ- గాథ
       కొన్ని ఛానెల్స్ లో అకస్మాత్తుగా అరుపులు వినిపిస్తూంటాయి. ఏమిటా అనిచూస్తే చర్చావేదికలో కొందరు రాజకీయ నాయకుల్ని కూర్చో  బెట్టుకున్న యాంకర్ వాళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తూంటాడు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ వుంటారు. ఏదో యుద్ధం జరుగుతున్నట్టు  ఆ కార్యక్రమం సాగుతూంటుంది. ఇంకొన్ని ఛానెల్స్ లో యాంకర్ ముందు రాజకీయ నాయకులు బుద్ధిగా కూర్చుని ఒకరి తర్వాత ఒకరు మాత్రమే అభిప్రాయాలు వెలిబుచ్చుకుంటూ వుంటారు.  ఎవరైనా అడ్డు తగిలితే ఒకరు మాట్లాడిన తర్వాతే ఇంకొకరు మాట్లాడాలని యాంకర్ కంట్రోలు చేస్తూంటాడు. ఈ  కార్యక్రమాలు చప్పగా సాగుతూంటాయి. ఆర్గ్యూ చేసుకునే ఛానల్స్ కి రేటింగ్ ఎక్కువ వుంటే, అభిప్రాయాలు చెప్పుకునే ఛానెల్స్ కి అంతగా ప్రేక్షకులు వుండరు. 

        కథకీ- గాథకీ తేడా ఇదే. ఛానెల్సే సాక్షి. ఛానెల్స్ కి లాగే సినిమాలకి పనికొచ్చేది ‘కథ’లే గానీ
 ‘గాథ’ లు కాదు. స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే కమర్షియల్ సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. 

        దాంతో
 సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ దృశ్య మాధ్యమంగా చూడాలంటే  కథలు మాత్రమే  బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై, దాంతో మొదలయ్యే పాత్రల మధ్య సంఘర్షణ (మన్మధరావు- 2 లాగా) అనేది తప్పొప్పుల లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో పాత్రలు (మన్మధరావు- 1 లాగా)
సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంటూ  ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్య వల్ల  మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ మాత్రమే ఇచ్చి అవతల పారేసి తమ  దారిన తాము వెళ్ళిపోతాయి.
          
        ఇంకోటి గమనిస్తే గాథకి స్ట్రక్చర్ వుండదు. కథకి వుంటుంది. కమర్షియల్ సినిమాకి కథ వల్ల  సమకూరే స్ట్రక్చరే ప్రాణం. గాథ అనే దానికి  బిగినింగ్ మాత్రమే వుండి, అదే సాగి సాగి  ఆ బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని కమర్షియల్ సినిమాలకి బిగినింగ్ ని మాత్రమే కలిగి వుండే గాథలు పనికి రావు. కథతో అలా కాదు, కథలకి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ లనే మూడంకాలుండి, ఆ ఆదిమధ్యంతాల సృష్టి స్థితి లయలతో విషయ విపులీకరణ చేస్తాయి.

        ఇంకా చెప్పుకుంటే,  గాథకి ప్లాట్ పాయింట్స్ కూడా వుండవు. కథకి వుంటాయి. గాథకి పాత్ర ఎదుగుదలకి సంబంధించిన క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) కూడా వుండదు. ఎలా మొదలైన పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. కథకి అలాకాదు, పాత్ర ఎదుగుదలతో కూడిన క్యారక్టర్ ఆర్క్ అడుగడుగునా ఉద్విగ్నభరితంగా తయారవుతూ పోతూంటుంది. ఇంకా గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ (కాలం- వొత్తిడి బిందు రేఖ) కూడా ఏర్పడదు. అంటే తెర మీద సినిమా నడిచే కాలం గడిచే కొద్దీ టెన్షన్ కూడా పెరగడం వుండదన్న మాట. ఎలా మొదలయిన సినిమా అలా నేలబారు కథనంతో నడుస్తూంటుంది. కథకి అలాకాదు, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ పాలన జరగడంతో బాటు, ఉత్థాన పతనాల కథనంతో కట్టి  పడేస్తూ పోతుంది.


        గాథలో సంఘర్షణ కూడా వుండదు, కానీ సంఘర్షణ లేని కథ వుండదు. గాథకి విలన్ కూడా వుండడు, వుంటే సరిగా వుండడు. కథకి విలన్ ఒక కీలక కక్షి దారు. వీడు లేకపోతే మనమీద కక్ష గట్టినట్టు వుంటుంది కథ.

        గాథలు ఆర్ట్ సినిమాలు చూసుకునే వ్యవహారం. కథలు కమర్షియల్ సినిమాలు చూసుకోవాల్సిన వ్యాపారం (తెలుగు సినిమాలు కమర్షియల్ సినిమాల  ముసుగేసుకున్న  ఆర్ట్ సినిమాలే నని చాలా సార్లు చెప్పుకున్నాం). 

       
మరింకా చెప్పుకుంటే, కథఅనే దాంట్లో విధి అనే ఎలిమెంట్ కి స్థానం లేదు.  హీరో ఏదో అనుకుంటూంటే దైవం కల్పించుకుని ఇంకేదో చేసి- - తానొకటి తలిస్తే దైవమొకటి తలచును -  అన్నట్టు అమాంతం ఏ పిడుగో  పడి చావడంతో ముగియదు. గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో  ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో  భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే వుంటుంది.  దైవిక పరిష్కారాలు - ఫాటలిజం - కమర్షియల్ సినిమా హంగు కాదు, అది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్ కావొచ్చు. పలాయనం చిత్తగించేదే గాథల్లో  కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే అది తలరాత అన్నట్టుగా, పరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి వూరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలంటూ లభిస్తూంటాయి.
        
        ఇక చివరిగా, ప్రేక్షకుల విషయానికి వస్తే, గాథల్ని పాసివ్ గా చూస్తారు; అదే కథల్ని యాక్టివ్ గా చూస్తారు.
        పైన గాథలుగా వచ్చాయని చెప్పుకున్న  బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, మొగుడు, పైసా, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, రాజాధిరాజా మొదలైన సినిమాలతో- జనతా గ్యారేజ్ ని కూడా కలుపుకుని,  మరొక్క సారి వీటన్నిటినీ  పరిశీలనాత్మకంగా చూసినట్లయితే- పై పేరాల్లో చెప్పుకున్న ‘కథ’ కుండే లక్షణాల్లో ఒక్కటీ వీటికి లేదనీ, అన్నీ  ‘గాథ’ కి చెప్పుకున్న లక్షణాలే తుచ తప్పకుండా వున్నాయనీ గుర్తించ వచ్చు. 

గ్యారేజ్ ఐడియా 
       ఎక్కడ పడింది  ‘గ్యారేజ్’ డివైడ్ టాక్ కి బీజం? ఐడియా దగ్గరే  పడింది. ఐడియా ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు అప్రమత్తంగా లేకపోతే డివైడ్ టాక్ కీ అప్పుడే బీజం పడిపోతుంది! ఈ ఐడియాతో తీసిన సినిమాకి డివైడ్ టాక్ వస్తుందని అప్పుడే చెప్పెయ్యొచ్చు. విడుదలకి పెట్టుకునే ఎలాటి ముహూర్తాలూ దీన్నుంచి కాపాడ లేవు. పనిలో శాస్త్రీయత వుంటే శాస్త్రాలు పెట్టే  ముహూర్తాలు తోడ్పడవచ్చు. ఐడియా అంటే ఏమిటి? ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్ = ఐడియా అని ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాల్లో భాగంగా ‘ఐడియాలో కథ వుందా?’ అనే  మూడో అధ్యాయంలో చెప్పుకున్నాం. పైన చెప్పుకున్న మన్మథ రావు-1 నే తీసుకుందాం. ఏమిటి వీడి వ్యవహారం? ఇలాటి వాణ్ణి మనిషిగా లెక్కేయ కూడదు, వీడు తన గాయం తాలూకు సోది చెప్పుకున్నాడు. ఈ సోదిని ఐడియాగా తీసుకుని సోదీ సింగ్ సినిమా తీయాలనుకున్నాడను కుందాం :  అప్పుడు కాస్త కామన్ సెన్స్ వున్న రచయిత లైనేంటో  చెప్పమన్నాడనుకుందాం, సోదీసింగ్ ఏమని చెప్తాడు- మన్మధరావు కి యాక్సిడెంట్ అయి చాలా బాధలు పడ్డాడు, చాలా బాధలు పడ్డాడు, ఇంకా బాధలు పడ్డాడు ఆ గాయంతో, మూణ్ణెల్లకి కాలెలాగో బాగై మళ్ళీ హేపీగా నడవసాగాడబ్బా- అని చెప్పాడనుకుందాం-

        దీనికి కామన్ సెన్స్ వున్న రచయిత- ‘మీ ఐడియాలో స్ట్రక్చర్ ఎక్కడుంది, సోది తప్ప. మీరెలా కింగ్ నవుదామనుకున్నారు ఈ సినిమా తీసి?’  అని ప్రశ్నించి, ఇలా వివరించాడనుకుందాం :  ‘యాక్సిడెంట్ అయ్యింది లగాయత్తూ  బాధలు పడుతూనే వున్నాడు, ఇది బిగినింగ్. ఇంకా బాధలే పడుతున్నాడు, ఇది సాగదీసిన బిగినింగ్. ఇంకా ఇంకా బాధలు పడుతూనే వున్నాడు ఆ గాయంతో, ఇది మరీ మరీ ఇంటర్వెల్ మీదుగా  సాగదీసుకున్న  బిగినింగ్...ఇలా మూణ్ణెల్లకి కోలుకుని బాగా నడవడంతో తీరింది అతడి బాధ- ఇక్కడ బిగినింగ్ ముగిసిందే అనుకుందాం, వాట్ నెక్ట్స్ ? అయిపోయింది కదా సినిమా, ఇంకేముంది? బిగినింగ్ తోనే  సినిమాకి శుభం పడ్డాక మిడిల్ లేదు, ఎండ్ కూడా లేదు- మీకూ నాకూ బ్రెడ్ కూడా లేదు. మీరు మొదటి రకం చట్నీ, రెండో రకం చట్నీ, మూడో రకం చట్నీ కూడా పెట్టి,  అసలు ఇడ్లీయే  పెట్టకపోతే ఎలా వుంటుంది, అలా వుంటుంది ఇలా సినిమా తీస్తే. జీవితంలో ఆశాభంగాలకి అడుగులెలా పడతాయో, సినిమాల్లో కూడా మొదట్నించీ తప్పటడుగులు అలాగే పడుతూ వస్తాయి. ముగింపు దాకా అవి తప్పటడుగు లేనని తెలుసుకోనే తెలుసుకోం. జీవితంలో వేసే తప్పటడుగుల్ని సవరించుకుంటాం. ఎందుకంటే అవి దేవుడి హెచ్చరికలు కదా? సినిమాలకి మనమే క్రియేటర్లం కదా, మన క్రియేటివిటీ తప్పవడానికి వీల్లెనే లేదు! మనం రాసేవి శిలా శాసనాలు, మామూలు స్క్రిప్టులేం కాదు...అంత నీచానికి దిగజారం...’

        ఇలా వివరించి, ఈ అయిడియాలో ఆర్గ్యుమెంట్ లేదనీ, మన్మధరావు సోదితో కూడిన స్టేట్ మెంట్ మాత్రమే వుందనీ, ఇందుకే లాగ్ లైన్ కూడా సరీగ్గా రావడం లేదనీ ముక్తాయించాడు కామన్ సెన్స్ వున్న రచయిత. ‘మీ ఐడియా = స్టేట్ మెంట్ + నో స్ట్రక్చర్ + నో లాగ్ లైన్’  అనీ తేల్చాడు. 

        కింగ్ నవుదామనుకున్న సోదీ సింగ్ కి విషయం అర్ధమయ్యింది. మరేం చేయాలో చెప్పమన్నాడు. విధిలేక  రచనలతో కామన్ సెన్స్ కూడా అలవాటు చేసుకుని  కాస్త బెటర్ గా వృత్తి చేసుకుంటున్న రచయిత, మన్మథరావు -2  చెప్పుకొచ్చాడు : మన్మథరావుకు యాక్సిడెంట్ అయ్యింది ( కథా పరిచయం-బిగినింగ్), యాక్సిడెంట్ చేసిన వాడిమీద కేసు వేసి పోరాడాడు (సంఘర్షణ- మిడిల్),  కేసు గెల్చి నష్టపరిహారం పొందాడు (పరిష్కారం- ఎండ్), ఇంతే. ఇక్కడ కథనం ‘గాయం’ దగ్గరే ఆగిపోలేదు. పాయింటు ‘గాయం’ కాదు, ‘హక్కు’. పోరాడి ఆ హక్కు సాధించుకునే తీరు. 

        పోరాటమంటేనే తప్పొప్పుల ఆర్గ్యుమెంట్. దీనికి బిగినింగ్ -మిడిల్ -ఎండ్ లతో కూడిన స్ట్రక్చర్ కూడా తోడైంది. ఇక లాగ్ లైన్ కి వస్తే- యాక్సిడెంట్ లో గాయపడ్డ మన్మథ రావు, నానా తిప్పలుపడి ఎలా న్యాయ పోరాటం చేసి గెల్చాడన్నది కథ. ఈ లాగ్ లైన్ లో పరస్పర సంబంధంతో బిగినింగ్- మిడిల్ - ఎండ్  మూడూ వున్నాయి.

        షెఫ్ అవ్వాలని కోరిక పెట్టుకున్న హీరో, ఫుడ్ ట్రక్ పెట్టుకున్న హీరోయిన్ తో కలిసి పనిచేసి ఎలా ఆమెతో ప్రేమనీ, తన కలనీ నిజం చేసుకున్నాడన్నది బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సంబంధించి పరస్పర సంబంధం గల మూడు వాక్యాలతో  ‘పెళ్లిచూపులు’ లాగ్ లైన్.

        పెళ్లి తప్పించుకున్న హీరోయిన్ పాకిస్తాన్లో తేలితే, అక్కడి పరిస్థితుల్లోంచి ఆమెని కాపాడి,  ఎలా పెళ్ళిచేసి హీరో పంపాడన్నది బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సంబంధించి పరస్పర సంబంధం గల మూడు వాక్యాలతో  ‘హేపీ భాగ్ జాయేగీ’ లాగ్ లైన్. 

        తన తండ్రి నడుపుతున్న కుటుంబ బిజినెస్ అయిన మాఫియా కార్యకలాపాలకి దూరంగా ఉంటున్న కొడుకు, తండ్రి మరణంతో ఇక తప్పక తండ్రి పదవిలోకొచ్చి, శత్రు శేషం గావించడమనేది బిగినింగ్- మిడిల్- ఎండ్ లకి సంబంధించి పరస్పర సంబంధం గల మూడు వాక్యాలతో ‘గాడ్ ఫాదర్’ లాగ్ లైన్. 

       
లాగ్ లైన్ అంటే మరేమిటో కాదు, లైను, స్టోరీ లైను. తమ కథకి మూడు వాక్యాల్లో లైన్ చెప్పలేని వాళ్ళు 90 శాతం మంది ఉండొచ్చు టాలీవుడ్ లో. 

        ఇప్పుడు  కథ అనుకుని తీసిన ‘గ్యారేజ్’ లైనుని కథగా మూడు వాక్యాల్లో చెప్పగలమో లేదో చూద్దాం : ముంబాయిలో పర్యావరణ కార్యకర్తగా  పోరాటం చేస్తున్న హీరో, హైదరాబాద్ వచ్చి పెదనాన్న నడుపుతున్న గ్యారేజ్ లో చేరి, సామాజిక సమస్యల మీద పోరాటం చేశాడు...

       
ఏమైనా ఈ వాక్యాలకి పరస్పర సంబంధం వుందా? పర్యావరణ కార్యకర్త సామాజిక పోరాటం చేయడమేమిటి? దీనికి కథా లక్షణం వుందా, గాథలా వుందా? ఒక కథలో రెండు పాయింట్లు ఎలా వుంటాయి? ఒక గోల్ వదిలేసి ఇంకో గోల్ కి హీరో ఎలా వెళతాడు? గాథ కైతేనే అనేక పాయింట్లు వుంటాయి.  ఒక పాయింటు మీంచి ఇంకో పాయింటు, ఒక గోల్ నుంచి ఇంకో గోల్... డాక్యుమెంటరీలు తీయయడానికి వాడే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ (టైగర్ హరిచంద్రప్రసాద్), దాంతో ఎపిసోడిక్ కథనం ( ఆటోనగర్ సూర్య)...ఫస్టాఫ్ లో చూపించింది హుష్ కాకీ చేసి సెకండాఫ్ లో ఇంకో భారతం (రుస్తుం)... ఇలాటివన్నీ ఐడియా దగ్గర మూడు వాక్యాల సమన్వయం కోల్పోయినప్పుడే తలెత్తుతాయి... కథ అనే ఉన్నతాసనం మీంచి ఐడియా ముక్కలై,  గాథగా అగాథంలోకి పడిపోతుంది.

        ఇలా వెల్డింగ్ చేసిన  ఐడియాని నాలుగు పేజీల సినాప్సిస్ గా రాసుకున్నప్పుడైనా చదువుతున్నడు ఆ పేరాలు లాజిక్ కే అడ్డుతగులుతూంటాయి. సినాప్సిస్ రాసుకునే వాళ్ళుకూడా 90 శాతం వుండరు. ఒక ఐడియా అనుకుని డైరెక్టుగా దానికి వన్ లైన్ ఆర్డర్ వేసుకుపోవడమే...అదిగో అప్పుడే ‘గ్యారేజ్’ లాంటి ‘గాథలు’ తెరమీదికి వస్తాయి. ‘గ్యారేజ్’ ఐడియా లేదా కాన్సెప్ట్ దాని మూలస్థంభమైన సెంట్రల్ పాయింటుకి కూడా నోచుకోలేదు...


(మిగతా రేపు)
- సికిందర్ 
http://www.cinemabazaar.in