రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, అక్టోబర్ 2016, సోమవారం

రివ్యూ!


సాంకేతికం :




కప్పుడు కంప్యూటర్లతో డిజైన్ చేసిన సినిమా పోస్టర్లంటే అంత దూరం పారిపోయేది  తెలుగు సినిమా రంగం. తర్వాత  అదే డిజిటల్ డిజైన్లని రుచి మరిగాక  కావాలీ-  ఇంకా కావాలీ అంటూ వెంట పడసాగింది తెలుగు సినిమా ప్రపంచం. దేశంలోనే కాదు, విదేశాలలోనూ ఏ  సినిమాకీ వుండనన్ని పోస్టర్ డిజైన్లు ఒక్క తెలుగు సినిమాలకే వుండడం కూడా టాలీవుడ్ సాధించిన ఒక  రికార్డు.

          ఎందుకిలా? ఎందుకంటే, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచీ, నిర్మాతల తాపత్రయమూ కారణమని రాంరెడ్డి అలియాస్ రాము సమాధానం. రవితేజ నటించిన ‘వీర’ తో దర్శకుడిగా మారిన రమేష్ వర్మ స్థాపించిన సుప్రసిద్ధ కిరణ్ యాడ్స్ వ్యవహారాలు చూసుకుంటున్న ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ పి.  రాము నిజానికి మాన్యువల్ తరం నుంచి వచ్చిన కళాకారుడు. నల్లగొండ జిల్లా వెలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన వ్యవసాయదారుడైన తండ్రికి గల చిత్రలేఖనం హాబీని చూసి తనూ కుంచె పట్టిన రాము, ప్రఖ్యాత పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్ కుమారుడు శంకర్ దగ్గర శిష్యరికం చేసి, తన కళకి మరింత పదును  పెట్టుకుని వచ్చి కిరణ్ యాడ్స్ లో చేరిపోయారు.

          అప్పుడదంతా కంప్యూటర్స్ ప్రపంచం. 1998లో ఓ కంప్యూటర్ మీదే స్వతంత్రంగా తన మొదటి సినిమా పోస్టర్ డిజైన్ చేశారు రాము. ఆ సినిమా పేరు ‘బావగారూ బావున్నారా?’. అప్పటినుంచీ  కొన్ని వందల స్టార్ సినిమాలకి పోస్టర్స్ వేస్తూ వస్తున్నారు.

          అసలు కంప్యూటర్ పోస్టర్స్ డిజైనింగ్ ని దక్షిణాదిన పరిచయం చేసింది రమేష్ వర్మే. పూర్తిగా మాన్యువల్ కి అలవాటైన ఆ కాలంలో నిర్మాతలు కంప్యూటర్ పోస్టర్లని అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు. అలాటిది నెమ్మదిగా వాటిని అలవాటు చేశారు వర్మ. అలాగే స్టిల్ ఫోటోగ్రఫీ లోనూ డిజిటల్ కెమెరాని ప్రవేశ పెట్టింది తనే. వినైల్ బోర్డుల్ని పరిచయం చేసింది కూడా తనే. ఇంతే కాదు, బొటాబొటీగా సంపాదించుకుంటూ, పెద్దగా గుర్తింపు కూడా పొందని పబ్లిసిటీ ఆర్టిస్టులకి  చీఫ్ టెక్నీషియన్ గా గుర్తింపు తీసుకొచ్చి అత్యధిక పారితోషికం (5 లక్షలు) పొందిన ఘనత కూడా ఈయనదే.

      స్టూడియోలో రాము తన కుంచె పనిని (లోగోలు వేసే పనిని) అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి పూర్తిగా ఫోటోషాప్ కి అంకితమైపోయారు. బయటి ఆర్టిస్టులు రూపొందించిన లోగోలని మెరుగు పరచి సెలక్షన్  కోసం నిర్మాతలకి పంపిస్తారు. అయితే ఇప్పుడు శతదినోత్సవాల సినిమాల్లేని కాలంలో, పోస్టర్  డిజైనింగ్ స్టూడియోల దగ్గర నుంచీ ప్రింటింగ్ ప్రెస్సుల వరకూ పనీపాటలు  తగ్గిపోలేదా అంటే, పనీపాటలు  ఇంకా బాగా పెరిగాయన్నారు రాము. రెండు మూడు వారాల్లోనే వసూళ్లు రాబట్టుకునే వ్యూహంతో వందలాది థియేటర్లలో సినిమాలు విడుదల చేస్తున్నప్పుడు  పబ్లిసిటీ వ్యయం భారీగా పెరిగిందన్నారు. ఇదివరకు ఇరవై లక్షల రూపాయలు సరిపోతే, ఇప్పుడు ముప్పయి కోట్ల సినిమాకి 3 కోట్ల రూపాయలు పబ్లిసిటీకి ఖర్చవుతొందన్నారు. ఈ లెక్కన పబ్లిసిటీ రంగం అభివృద్ధి పథంలోనే వుందని వివరించారు.

          పోస్టర్ల మీద సెన్సార్ సర్టిఫికేట్ల ముద్రణ ఎందుకు మానేశారని అడిగితే,  విడుదలకి చాలా ముందే పోస్టర్లు తయారై పోతాయి గనుక, విడుదలకి రెండ్రోజుల ముందు సినిమా సె న్సారైనప్పుడు U, U/A, A  మొదలైన రేటింగ్స్ ని ముద్రించడం ఎలా కుదురుతుందన్నారు. బాలీవుడ్లో  నెల రోజుల ముందే సెన్సారవడం వల్ల అక్కడ పోస్టర్ల మీద సెన్సార్ సర్టిఫికెట్లు ముద్రించడం కుదురుతోందన్నారు రాము.

         ఒక పోస్టర్ని సృష్టించాలంటే రాముకి ఒక్కోసారి అరగంటే పట్టొచ్చు, ఒక్కోసారి రోజంతా కూడా పట్టొచ్చు. సమయం ఎంత పట్టినా క్వాలిటీ మీద దృష్టి పెడతారు. షూటింగ్ స్పాట్స్ లో స్టిల్స్ తీసి అందించే  స్టిల్ ఫోటోగ్రాఫర్లు తమ స్టిల్స్ ఎలా వచ్చినా అవి రాము చేతిలో క్వాలిటీని సంతరించుకుంటాయన్న నమ్మకంతో వుంటారు. లోగోలని రాము అవుట్ సోర్సింగ్ ఇవ్వడానికి కారణం నల్గురి నుంచి వైవిధ్యం వస్తుందనే. అదే తనే వేస్తె మొనాటనీ వుండొచ్చు. మరి ఆ మొనాటనీ పోస్టర్ డిజైనింగ్ తో వుండదా అని ప్రశ్నిస్తే, ఈ రంగంలో టాప్ పొజిషన్లో  వుండాలంటే అనుక్షణం కొత్తదనం కోసం పాటుపడాల్సిందే నన్నారు రాము.

-సికిందర్
(జులై 2011 ఆంధ్రజ్యోతి)