రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, డిసెంబర్ 2016, సోమవారం

ఆనాటి సినిమా!






దర్శకత్వం : కోడి రామకృష్ణ 

తారాగణం : డాక్టర్ రాజశేఖర్. జీవిత, ఎంఎస్ రెడ్డి, రామి రెడ్డి, బాబూమోహన్, ప్రసాద్ బాబు తదితరులు 
కథ : ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ యూనిట్, సంగీతం : సత్యం, చాయాగ్రహణం : కె. ఎస్. హరి
బ్యానర్ : ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్,
నిర్మాత : ఎం. శ్యాం ప్రసాద్ రెడ్డి
విడుదల : 1990
***
         స్టార్ డమ్ దానికదే వరించాలి, వేరే తయారీ విధానం లేదు దానికి. 
          స్ట్రగుల్ చేసే హీరోలు హీనపక్షం స్టార్ గా  రూపాంతరం చెందాలంటే ఏదో అనుకోని ప్రమాదం జరగాలి. ఇలా అనుకుని స్టార్స్ అయిన చరిత్ర లేదు గనుక, అనుకోకుండా అయిన ఆశ్చర్యాలే వున్నాయి.
           అలాంటి ఒక ఆశ్చర్యం అమితాబ్ బచ్చన్, ఇంకో ఆశ్చర్యం రాజ శేఖర్.
          1973 లో సలీం - జావేద్ లు వాళ్ళ క్రియేటివిటీ కొద్దీ ఓ యాంగ్రీ యంగ్ మాన్ పాత్రకి పోలీసు యూనిఫాం తొడిగి ‘జంజీర్’ అనే స్క్రిప్టు రాస్తే, ఆ పాత్ర వేసిన అమితాబ్ బచ్చన్ అనే ఓ స్ట్రగుల్ చేస్తున్న ఛోటా హీరో, అమాంతం స్టార్ అయిపోయాడు. ఆ పైన సూపర్ స్టార్ డమ్ ని కూడా సాధించేశాడు

         
స్టార్ కావడమనేది ప్యూర్ యాక్సిడెంటల్. అమితాబ్ అయినా, రాజశేఖర్ అయినా యాక్సిడెంటల్  స్టార్సే. కాకపోతే అమితాబ్ కి పనికొచ్చిన ‘జంజీర్’ ఫార్ములాని  ఉద్దేశపూర్వకంగా రాజశేఖర్ కి అప్లై చేయలేదు. యదాలాపంగా ‘అంకుశం’ అనే ఓ పోలీసు మూవీ తీస్తే ఆయన స్టార్ అయి కూర్చున్నాడు. పవర్ ఫుల్ పోలీసు పాత్రలో మలయాళం లో సురేష్ గోపీ స్టార్ అవుతాడని  వూహించి ‘ఏక లవ్యన్’ తీయలేదు. అలాగే తమిళంలో ‘కాక కాక’ తో సూర్య సంగతి కూడా. 

          యాక్సిడెంటల్  మాటెలా వున్నా, పోలీసు పాత్రలతో అమాంతం స్టార్లయిన నట చతుష్టయం - అమితాబ్, రాజశేఖర్, సురేష్ గోపి, సూర్యలే! పోలీస్ పాత్రల్ని ఫేమస్ చేసిన ఓంపురి (అర్ధ సత్య), సాయికుమార్ (పోలీస్ స్టోరీ) లది వేరే కేటగిరీ.

          మూడో నాల్గో విషాదకర బాల్యపు దృశ్యాలు, ఓ యాంగ్రీ యంగ్ మాన్ ఫేసు, ఫ్రెష్ పోలీసు యూనిఫాం ఒకటి, వ్యక్తిగత సమస్య లేదా సామాజిక రుగ్మత ఒకటి, యాక్షన్ కి సరిపడా విలన్లు కొందరు, పవర్ఫుల్ డైలాగులు చాలినన్ని, ఎమోషనల్ సీన్లు నాల్గైదు మోతాదులు, ఓ పెద్ద సీసాడు రివెంజి సీను, ఓ బుట్టెడు తుపాకులూ తూటాలూ- ఇవి చాలు పవర్ఫుల్ పోలీస్ పాత్రని పరివేష్టించి వుండి వెండి తెర మీద క్షణక్షణం జ్వాలలు రగిలించెయ్యడానికి. 

          1985 లో ‘వందేమాతరం’ తో యాక్టరైన డాక్టర్ రాజశేఖర్, 1990 లో ‘అంకుశం’ సంచలన విజయంతో స్టారయ్యాక, అదే పోలీసు పాత్ర మీద మక్కువ చావక ‘ఆహుతి’, ‘ఆగ్రహం’, ‘మగాడు’  చేస్తూ పోయారు.

         ఎమ్మెస్ రెడ్డి , శ్యాం ప్రసాద్ రెడ్డి, కోడి రామకృష్ణలు కలిసి ‘అంకుశం’ తీసిన ఉద్దేశం వేరు. నిజ జీవితంలో నీతీ నిజాయితీలు ఓడిపోతున్నాయనీ, దీన్ని హైలైట్ చేయడానికే ఈ సినిమా తీశామనీ కోడి రామకృష్ణ ఉద్ఘాటన. అలా ఈ సినిమా 1989 లో ‘శివ’ తర్వాత మరో విప్లవాత్మక మార్పు. ఇది కేవలం రగిలిన పోలీసు గుండె కథలాగా వుండి పోలేదు, ఆ కథని కొత్త పంథాలో బిగిసడలని దర్శకత్వపు విలువలతో దౌడు తీయించిన టాలెంట్ షోగా కూడా చరిత్ర కెక్కింది. దీనికి మచ్చు తునక ఆ వొక్క సీను- రామిరెడ్డిని రాజ శేఖర్ అరెస్టు చేయడాని కొస్తాడు. రామిరెడ్డి ఎదురు తిరుగుతాడు. అతడి మెడ బట్టి చార్మినార్, అసెంబ్లీ, ట్యాంక్ బ్యాండ్ ల మీదుగా పబ్లిగ్గా ఈడ్చు కెళ్తూ చావచితకదంతాడు రాజశేఖర్. చిరిగిపోయి పోగులుగా వేలాడుతున్న బట్టలతో ‘ఖిలోనా’ లో సంజీవ్ కుమార్  లా వుంటాడు రామిరెడ్డి. ‘తేరే నామ్ కా దీవానా...’  అనే  పాటొక్కటే తక్కువ. ఈ దృశ్యాన్ని అప్పటి ప్రేక్షకులెంత ఎంజాయ్ చేశారంటే, దాంతో సహజంగా వాళ్ళల్లో వుండే బహిరంగ శిక్షా కాంక్ష చాలా బాగా సంతృప్తి పడింది. గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నట్టు, ఆ వొక్క సీను తో కడుపు నిండి పోయింది. ‘అంకుశం’ భావికాలంలో మనిషి బయట పెట్టుకునే సహజాతానికి అలా భవిష్య వాణి చెప్పిందేమో. ఈ రోజుల్లో అడపా దడపా మనకి కన్పిస్తున్నసంఘటనలు- ఏదో తప్పు  చేశాడని సాటి మనిషనే కనికరం లేకుండా, చెట్టుకో కరెంటు స్థంభానికో కట్టేసి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, దారుణంగా శిక్షిస్తున్న ఇరుగు పొరుగు జనం మూక మెంటాలిటీ మేట వేసిన అలాటి బహిరంగ శిక్షా కాంక్షేనేమో. 

          అయితే నిజంగా తప్పు చేస్తే అలా శిక్షించే చేతులు పవిత్రంగా వుండాలని పురాణాలు చెప్తాయి, యేసు క్రీస్తు కూడా చెప్తాడు. దీనికీ, ‘అంకుశం’ మూల కథకీ చాలా సంబంధం వుంది. స్వయంగా ఎమ్మెస్  రెడ్దియే పాట రాశారు రాజశేఖర్ పాత్రకి- ‘చాటు నుంచి చంపలేదా వాలిని రాముడు, ధర్మ రాక్షణార్ధమనే పేరుతో  కృష్ణుడు చేయించిన తప్పులన్నీ పొందలేదా మెప్పులు...ఆనాటి ఆ ధర్మం అదే నాకు ఆదర్శం...’ అంటూ.  

      విజయ్ అనే మొండి వాడి పాత్రలో కన్పిస్తాడు రాజశేఖర్. ఎందుకంటే ఆ మొండితనం, తల్లి అతణ్ణి కని కుప్పతొట్లో పడేసి పోయింది. ఈ అవమానంతో చావకుండా మొండిగా బతికాడు. అడుక్కు తినడానికి చావు తన్నులు తిన్నాడు. అదృష్టవశాత్తూ  ఏ బాలనేరస్థుడో కాలేదు. ఓ దయగల మాస్టారి చేతిలో చదువుకున్న వాడయ్యాడు. పోలీసు ఇన్స్ పెక్టర్ కొలువులో చేరాడు. అప్పటికా మాస్టారు ముఖ్యమంత్రి అయ్యాడు. అతణ్ణి దింపేందుకు హోం మంత్రి పావులు కదపడం మొదలెట్టాడు. అందులో  భాగంగా జరిగిన ఓ నాయకుడి హత్య కేసు దర్యాప్తు చేపట్టాడు ఆ ఇన్స్ పెక్టర్ విజయ్. దీంతో హోంమంత్రి వర్గంలో ముసలం పుట్టింది. పై అధికారి మాట వినే రకం కాదు విజయ్. అతడి సిన్సియారిటీ కాస్తా మొండితనం రూపం తొడిగింది. ఇదే తనకీ ప్రతిబంధకంగా మారింది. 

         ఆ హత్యకి ప్రత్యక్ష సాక్షి  అయిన ఓ పళ్ళమ్ముకునే అమ్మాయిని రక్షించి పెళ్ళాడాడు. కడుపుతో వున్న ఆమెని హోంమంత్రి తొత్తు కడదేర్చాడు. వాణ్ణి అరెస్టు చేసి లోపలేస్తే చక్కా విడుదలై పోయాడు. ఓ కర్ఫ్యూ రోజున వాణ్ణి ఎన్ కౌంటర్ చేసి పారేశాడు విజయ్. విద్యార్థుల ఆందోళనని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రిని ఇరికించాలని చూశాడు మళ్ళీ హోంమంత్రి. ఆ కుట్రని కూడా భగ్నం చేశాడు విజయ్. హోంమంత్రి పెద్ద తొత్తు నీలకంఠం అనే వాణ్ణి రోడ్లమీద తన్నుకుంటూ తీసి కెళ్ళి లాకప్ లో వేశాడు. ముఖ్యమంత్రి మాస్టారు విజయ్ నే వ్యతిరేకించి సస్పెండ్ చేశాడు. తన మీద జరుగుతున్న కుట్రలేవీ సుతరామూ నమ్మే స్థితిలో లేడు మాస్టారు. అప్పుడేకంగా మస్టారుకే స్పాట్ పెట్టేందుకు పన్నిన మహా కుట్రని విజయ్ అడ్డుకోవాలి...ఎలా? 

          పై కథా సంగ్రహంలో వ్యక్తమవుతూన్న వివిధ దృశ్యా లెందుకు అంత ఉత్కంఠ రేపుతున్నాయో ఎవరైనా చెప్పగలరా? బ్యాక్ డ్రాప్... మొదట బ్యాక్ డ్రాప్ ని ఎర్పాటు చేసి  అప్పుదండులోకి  హీరోని  ప్రవేశ పెట్టడం వల్ల! దీంతో వెంటనే కథ వొంటబట్టి,  సీట్లకి అతుక్కుపోతారు ప్రేక్షకులు. తోటంతా చూసుకుంటూ వెళ్లి మధ్యలో ఫౌంటెయిన్ని చూసి థ్రిల్లవడం లాంటిదన్న మాట. శివ- షోలే- బొబ్బిలిపులి... ఇలాంటివే కథనపు మరికొన్ని సినిమాలు. అలా విలన్లు పన్నుతున్న కుట్రల బ్యాక్ డ్రాప్ లో అడుగుపెట్టిన ఇన్స్ పెక్టర్ విజయ్  పాత్ర, ఇక వాళ్లతో తలపడుతూ వుంటుంది. అంటే విలన్ గారి కార్యక్రమాలని బట్టి హీరో గారికి పనుంటుందన్న మాట. ఎంత సేపూ విలన్ పన్నాగాలకి పాసివ్ గా రియాక్ట్ అవుతూ తిప్పికొట్టడమే తప్ప, తను యాక్టివ్ గా మారి పరిస్థితిని తన గుప్పెట్లోకి తెచ్చుకుంటూ– అదే విలన్ని ఆటాడించే సెంట్రల్ పాయింటు కాదన్న మాట. ఇది సిడ్ ఫీల్డ్ లాంటి ఆధునిక స్క్రీన్ ప్లే గురువులు చెప్పే వాటికి విరుద్ధమే. ఐతే ప్రొఫెసర్ విలియం ఫ్రోగ్ లాంటి పాత స్కూలు పండితులు అసలు త్రీ యాక్ట్ (మూడంకాల) స్క్రీన్ ప్లే అనేదే మిధ్య అనీ, ప్రాచీనకాలంలో అరిస్టాటిల్ చెప్పింది కూడా కేవలం కథలో ఆదిమధ్యంతాల (బిగినింగ్-మిడిల్-ఎండ్) గురించేననీ వాదిస్తారు. ఈ లెక్కన చూస్తే, ‘అంకుశం’ ఈ పాత స్కూలు  విధానంలోకే వస్తుంది. అంటే మనసుకి ఎలా నచ్చితే అలా కథ చెప్పుకుపోవడమన్న మాట. అది  ఆత్మాశ్రయ ధోరణి అన్పించుకున్నా మొహమాట పడడం వుండదు (కానీ కమర్షియల్ సినిమా కథ ఇలా సబ్జెక్టివ్ గా కాకుండా, ఆబ్జెక్టివ్ గా వుండాలనేదాని విషయంలో అంతా ఏకీభవిస్తారు మళ్ళీ!).  ఏవో రూల్సంటూ తమ సృజనాత్మకతలకి సంకెళ్ళు వేసుకోవడ మంటూ కూడా వుండదు. ఈ బాపతు కథల్ని నిలబెట్టేది కేవలం పాత్ర బలమే. అలా ‘అంకుశం’ బలం స్ట్రక్చర్ కి అతీతంగా తీర్చిదిద్దిన రాజశేఖర్ పాత్ర బలమే. తన అనితరసాధ్య భావప్రకటనా సామర్థ్యంతో అడుగడుగునా పాత్రని మండిస్తూ పోతాడు. అలా కథని పతాక సన్నివేశం దాకా నడిపించి ముక్తి కల్గిస్తాడు. 

         అలా విలువలతో బతికే పాత్ర విలువలతోనే చచ్చిపోతుంది. జానీ డెప్ నటించిన ‘డాన్ జువాన్ డీ మార్క్’  అనే హాలీవుడ్ సినిమాలో అతనంటాడు- ‘జీవితంలో ఎన్నదగిన ప్రశ్నలు నాల్గే నాల్గు. ఏది పవిత్రం? ఏది ఆత్మకి మూలం? దేనికోసం జీవించడం? దేనికోసం మరణించడం?...అన్నవి. వీటన్నిటికీ కలిపి ఒకటే జవాబు- అదే ప్రేమ! స్వచ్ఛమైన ప్రేమ!’ అని.  

          త్యాగ కారణాలు ఎక్కడైనా ఒకలాగే వుంటాయి. మాస్టారి మీద తనకి గల అపారమైన ప్రేమ కొద్దీ  ప్రాణత్యాగం చేశాడు. ఎవరు ధృవీకరించినా  ధృవీకరించకపోయినా, కళంకిత మైన నీతీనిజాయితీల్ని అలాటి మరణమే ధృవీకరిస్తుంది...కడిగిపారేస్తుంది. 

          ఇందులో జీవిత పళ్ళమ్ముకునే బస్తీ అమ్మాయి. ఎమ్మెస్ రెడ్డి ముఖ్యమంత్రి పాత్రధారి. ముఖ్యమంత్రి పాత్రకి రొటీన్ బిల్డప్పులు లేకుండా మన పక్కింటి పెద్దాయనలా కన్పించడం ఈయన ప్రత్యేకత. సినిమాకి మరో ఆకర్షణ విలన్ గా పరిచయమైన రామిరెడ్డి.  ‘స్పాట్ పెడతా’ అని ఇతను పలికే డైలాగు తెలుగు భాషలో భాగమై పోయింది. అంతేకాదు- దినపత్రికల బ్యానర్ లని కూడా అలంకరించే దాకా పోయింది వార్తలకి (ఫస్ట్ బ్యానర్ ‘ఈనాడు’లో ఓ వార్తకి! ) సత్యం సంగీతం, కెఎస్ హరి ఛాయాగ్రహణం మరో రెండు ఆకర్షణలు. హిందీలో మెగా స్టార్ చిరంజీవి ప్రవేశ చిత్రంగా ‘ప్రతిబంధ్’ పేరుతో  రీమేకైన ‘అంకుశం’ నిజానికి మూసఫార్ములా కథలకే గురి చూసి స్పాట్ పెట్టిందనాలి!


-సికిందర్
(2009 నవంబర్ ‘సాక్షి’)