రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, మే 2017, శుక్రవారం

రివ్యూ!


రచన దర్శకత్వం : సుదీర్ వర్మ
తారాగణం : నిఖిల్, రీతూ వర్మ, ఇషా కొప్పీకర్, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్ ,ప్రియదర్శి
సంగీతం : సన్నీ ఎంఆర్ఛాయాగ్రహణం: మణి 
బ్యానర్ : అభిషేక్ పిక్చర్స్
నిర్మాత : అభిషేక్  నామా
విడుదల : మే 19, 2017
      హీరో నిఖిల్ ఇతర హీరోలకి భిన్నమైన  సినిమాలు చేసుకుపోతూ తనదైన వొక కొత్త స్కూలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అవి తెలుగు సినిమాలకి అలవాటు లేని కొత్త పాయింట్లే కావొచ్చు- నచ్చితే కళ్ళు మూసుకుని చేసేస్తున్నాడు. ‘సూర్య వర్సెస్ సూర్య’ లో  పోర్ఫీలియా అనే వ్యాధిగ్రస్తుడిగా నటిస్తే, ఇప్పుడు ‘కేశవ’ లో డెక్స్ ట్రోకార్డియా బాధితుడిగా పాత్ర పోషించాడు. న్యూవేవ్ ధోరణిలో కొత్తదనాన్నిఆహ్వానిస్తున్న అతడ్ని అభినందించక తప్పదు.  అలాగే ‘స్వామి రారా’  ఫేం దర్శకుడు సుధీర్ వర్మ, ఆ తర్వాత ‘ దోచేయ్’ అనే ఫ్లాప్ తీసి తిరిగి అదే నిఖిల్ తో  ఇప్పుడు ‘కేశవ’ అనే థ్రిల్లర్ తీశాడు.  మళ్ళీ ఒకటైన వీళ్ళిద్దరి కాంబినేషన్ లో  ఈ కొత్త ఆఫర్ ఎలావుందో ఒకసారి చూద్దాం...

కథ 
      కాకినాడలో లా చదివే  కేశవ శర్మ (నిఖిల్) చిన్నప్పుడు కారు ప్రమాదంలో తల్లి దండ్రుల్ని కోల్పోతాడు. ఆ ప్రమాదం  చేసిన తాగుబోతులైన పోలీసుల్ని గుర్తు పెట్టుకుంటాడు. అతడికి అరుదైన హృదయ సంబంధ సమస్య వుంటుంది. గుండె కుడివైపు వుంటుంది. దీంతో అతను  ఎక్కువ ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా జీవించాలి. కానీ ఇప్పుడు పెద్దయ్యాక ఈ పోలీసుల మీద పగ తీర్చుకోకుండా వుండలేక పోతాడు. ఒక్కొకర్నీ రహస్యంగా చంపడం మొదలెడతాడు. అదే కాలేజీలో చదివే చిన్ననాటి స్నేహితురాలు సత్య భామ ( రీతూ వర్మ ) అతణ్ణి అనుమనిస్తూంటుంది. ఈ హత్యల్ని  దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఆఫీసర్ గా షర్మిల (ఇషా కొప్పీకర్ ) వస్తుంది. ఇప్పుడు ఈమెని తప్పించుకుంటూ మిగిలిన పోలీసుల్ని కేశవ్  ఎలా చంపాడన్నది మిగిలిన కథ.

ఎలావుంది కథ ?
     రొటీన్ రివెంజి  ఫార్ములా కథ. గత వారమే నిఖిల్ ‘హేపీ డేస్’ కొలీగ్ రాహుల్ ‘వెంకటాపురం’  లో పగతో పోలీసుల్ని చంపే కార్యక్రమం ఆల్రెడీ చేశాడు. ఇక మరో కొలీగ్ వరుణ్ సందేశ్ కూడా చేస్తే  ముగ్గురితో ఓ పని పూర్తయి పోతుంది. నిఖిల్, రాహుల్ ఇద్దరి సినిమాల్లోనూ  పోలీసులు పుసుక్కున చస్తారు. తల్లిదండ్రుల చావుకి ప్రతీకారం తీర్చుకోవడం, ప్రేయసి మరణానికి పగదీర్చుకోవడం లాంటి కథలు  నిజానికి 1970 ల నాటి ఫార్ములా. ఆ తర్వాత బి- గ్రేడ్ సినిమాలకి ఈ ఫార్ములా బదిలీ అయింది. దీన్ని ‘ఏ’ గ్రేడ్ గా  పాలీష్ చేసి ఈనాటి ప్రేక్షకుల్ని ఆకట్టుకుందామనుకుంటున్నారు. ఇంతకంటే ఈ రివెంజి ఫార్ములా గురించి చెప్పుకోవడానికేమీ లేదు. 

          ఈ రివెంజి కథలో  హీరోకి ‘కుడివైపు గుండె’ సమస్య చెప్పారు. ఈ సమస్యతో బెంగాలీ లో (సజరూర్ కాంతా), హిందీలో (లక్) , హాలీవుడ్ లో  (డాక్టర్ నో) వంటి సినిమాలు వచ్చాయి. ఇవి ఆసక్తికరంగా వుంటాయి.  

ఎవరెలా చేశారు 
       నిఖిల్ డార్క్ మూడ్ లోవుండే పాత్ర ఇది. ఒక్క చోట కూడా నవ్వడు, సరదాగా వుండడు,  సంతోషంగా వుండడు. గత సినిమాలన్నిటి కంటే భిన్నంగా యమ సీరియస్ గా రివెంజి మూడ్ లోనే వుంటాడు. అతడి ఫ్యాన్స్ కి జీర్ణం కాని కొత్త వ్యవహారం కావచ్చు ఇది. ఈ పాత్రకి చంపడం తప్పితే ఇంకెలాంటి కమర్షియల్ హంగులు కూడా లేవు- హీరోయిన్ రీతూ వర్మతో రోమాన్సూ పాటలూ సహా. ఆ చంపడం కూడా థ్రిల్లింగ్ గా వుండదు, నాసిరకంగా వుంటుంది. 

          నిఖిల్ కుడివైపు గుండెగల అరుదైన  సమస్యతో స్ట్రగుల్ చేసే పాత్ర పోషించినట్టు భారీగా పబ్లిసిటీ చేశారు. ఇది నమ్మి వెళ్తే తీవ్ర ఆశాభంగం తప్పదు. ఈ గుండె సమస్య కథలో భాగం కాదు, పాత్రకి అదొక సమస్య కూడా కాదు. కేవలం ప్రారంభంలో నిఖిల్ తనకి ఈ అరుదైన సమస్య వుంది కాబట్టి గట్టిగా నవ్వినా, ఉద్రేకాలకి లోనైనా  ప్రాణాలు పోతాయి కాబట్టి, ప్రశాంతంగా మర్డర్లు చేస్తానని ఒకమాట చెప్పి  వదిలేస్తాడు. ఆ తర్వాత ఎక్కడా మళ్ళీ దీని ప్రసక్తే వుండదు, ఆ సమస్య వున్నవాడిలా కన్పించడు. ఏదైనా యాక్షన్ సీను వుంటే అప్పుడు ఛాతీని రుద్దుకుంటాడు- అది కూడా  కుడి వైపు కాదు, ఎడమవైపు! 

          డెక్స్ ట్రోకార్డియా సమస్య పిండ దశలోనే కోటి మందిలో ఒకరికి వచ్చే అవకాశముందని అంటారు. గుండె ఛాతీకి ఎడమవైపు వుంటుందని అనుకుంటారు. కానీ  కాదు. గుండె ఛాతీ మధ్యలో రెండు వూపిరి తిత్తుల మధ్య వుంటుంది. కేవలం ఎడమ వైపు ఒరిగి వుండడం వల్ల ఎడమ వైపు గుండె వుందని అనుకుంటాం. డెక్స్ ట్రోకార్డియా ని సైటస్  ఇన్వర్సస్ అనికూడా అంటారు. ఈ కేసుల్లో  గుండె కుడి వైపు వొరిగి వుంటుంది, అంతే.  ఇలా కుడి వైపు వొరిగి వున్నప్పడు శరీరంలో అన్నిటి స్థానాలూ మారిపోతాయి-  కాలేయం, ప్లీహం, మూత్ర పిండాలు, మూత్రాశయం మొదలైనవి ఎడమ వైపు కొచ్చేస్తాయి. 

         ఇది నయం కాని సమస్యేం కాదు, సర్జరీతో సరి చేయవచ్చు. లేకపోతే జీవితాంతం మందులు వాడాలి. పైగా శరీరం నీలి వర్ణంలోకి మారుతుంది, ఆక్సిజన్ సరిగా అందదు. జీర్ణ వ్యవస్థ సరిగ్గా వుండదు. అయితే ఎంత వొత్తిడికి లోనైనా, భావోద్రేకాలకి లోనైనా, నవ్వినా  ఏడ్చినా, పరుగెత్తినా వచ్చే ప్రమాదమేమీ లేదు. 

          సినిమాల్లో ఈ ‘కుడివైపు గుండె’ ఫార్ములా యాక్షన్ సినిమాల్లో సర్ప్రైజ్  ఎలిమెంట్ గానే వాడుకున్నారు తప్పితే  స్ట్రగుల్ కి కాదు. జేమ్స్ బాండ్ మూవీ  ‘డాక్టర్ నో’ లో షూట్  చేస్తే చావడు. బతికి, నాగుండె కుడి వైపు వుందని షాకిస్తాడు. 

        కాబట్టి ‘కేశవ’ లో గుండె స్థానభ్రంశాన్ని ఎమోషన్స్ కి ముడిపెట్టి వివరించడం సరికాదు. అయితే శారీరక ఇబ్బందులు ఖచ్చితంగా చూపించాల్సిందే. ఇవి చూపించలేదు. పైగా ఉద్రేకాలకి, ఆందోళనలకి లోననైతే ప్రాణాలు పోతాయన్నారు. అలాంటప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రమాదంలో ఘోరంగా చనిపోయినప్పుడే చూసి తనూ హార్ట్ ఎటాక్ తో అప్పుడే పోవాలి. అసలు ఆ కార్లు గుద్దుకున్న తాకిడికే గుండాగిపోవాలి. 

          గొప్పగా ఎక్కడా లేని జబ్బులు కథలో పెట్టుకుని వార్తల కెక్కడమే గానీ, కథలో వాటి నిర్వహణ కొచ్చేసరికి  ఆ విషయ పరిజ్ఞాన మేమీ వుండడం లేదు. నిఖిల్ నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ కూడా ప్రేక్షకుల్ని ఇలా మభ్యపెట్టి  థియేటర్లకి పరుగులు పెట్టించిన వ్యవహారమే. అందులో నిఖిల్ పాత్ర పదిహేను నిమిషాలు వెలుగులో వుంటే చచ్చి పోయే జబ్బున్న (పోర్ఫీరియా) పాత్ర అని ప్రచారంచేశారు. రాత్రిపూటే బయట తిరుగుతాడు. ఈ సమస్యతో వున్న ఇతడితో ప్రేమలో పడ్డ హీరోయిన్ కి ఈ సమస్య గురించి తెలిస్తే ఎమౌతుందన్న పాయింటు వస్తుంది. దీన్ని పక్కకు తోసేసి,  ప్రేమలో ఇంకేవో అపార్ధాలు సృష్టించి సవాలక్ష సినిమాల్లో చూసేసిన ఏడ్పుల ప్రేమల్నే చూపించారు రొటీన్ గా !  అలాంటప్పుడు గొప్పగా పోర్ఫీరియా ప్రచారాలెందుకు? 

          నిఖిల్ కొత్త ప్రయోగాలు  చేద్దామనుకోవడం మంచిదే, అవి హాస్యాస్పదంగా వుంటే తనే దెబ్బ తింటాడు. సినిమాల్లో హీరో గార్ని ఛీఫ్ ఎడిటర్ గా పరిచయం చేసి  ఆ తర్వాత దాని వూసే వుండని  మూస యాక్షన్ హీరోగా మార్చేసినట్టు, వ్యాధులతో కుదుర్తుందా? 

          హీరోయిన్ రీతూవర్మకి ఇందులో ఏ పనీ లేదు. స్పెషలాఫీసర్ పాత్రలో ఇషా కొప్పీకర్ పాత్రని హాస్యాస్పదంగా సృష్టించాడు దర్శకుడు. ఆమె మాట తీరుగానీ, దర్యాప్తు విధానంగానీ సిల్లీగా వున్నాయి. ఇక పోలీసు పాత్రల్లో వున్న వాళ్ళు ఏకపక్షంగా చావడమే. ఎందుకు ఛస్తున్నామో కూడా తెలియకుండా చావడమే. కొన్ని చోట్ల తప్పించుకునే అవకాశమున్నా హీరోకి చంపడానికే అవకాశమిస్తారు- ఆయన ఎక్కువ పారితోషికం తీసుకుంటాడు కాబట్టి  ఆమాత్రం కాయకష్టం వుండాలన్నట్టు. 

          అక్కడక్కడా కాస్త కామెడీలు చేసుకుని నవ్వించే వాళ్ళు వెన్నెల కిషోర్, సత్య, ప్రియదర్శి లే. రెండే పాటలున్నాయేమో, అవేం బాగా లేవు. ఛాయాగ్రహణం మాత్రం డార్క్ మూడ్ కి తగ్గట్టే వుంది. 

          ఇకపోతే ఒక చీకాకు ఇక్కడ కూడా తప్పలేదు- ఛానెల్ వార్తలు స్క్రీన్ నిండా  పర్చి ఎడాపెడా చూపించడాలు. మాటాడితే – ఇప్పుడే అందిన వార్త అంటూ మొదలెడతారు యాంకర్లు చీటికిమాటికీ. శర్వానంద్ ‘రాధా’ లో ఈ ఎడాపెడా మోత భారీగా వుంటుంది అనాగరికంగా. చీప్ క్రియేషన్ – కథకి అడ్డుపడుతూ. దీనికి ‘సర్కార్- 3’ లో రాం గోపాల్ వర్మ టీవీ స్క్రీన్ లు చూపించకుండా, పాత్రలు పని చేసుకుంటూ తక్కువ వాల్యూంలో వస్తున్న న్యూస్ వింటున్నట్టు అత్యంత సహజంగా చూపించారు. తెలుగు సినిమాల్లో  పాత్రలు కాక, సినిమా కొచ్చిన ప్రేక్షకులు వినాలన్నట్టు ఆయా ఛానెళ్ళ  స్క్రీన్లు వెండి తెరల నిండా వేసి మోత మోగిస్తున్నారు అనాగరికమైన పద్ధతుల్లో. సినిమాకొచ్చామా, ఛానెళ్ళు చూడ్డాని కొచ్చామా అని తలపట్టుకోవాల్సిన పరిస్థితి.

 చివరికేమిటి 
      ఫస్టాఫ్ లో ఒకవైపు హత్యలు, ఇంకో వైపు పోలీసు దర్యాప్తు అనే కథ కొనసాగుతూ ఇంటర్వెల్లో హీరో దొరికిపోయాక- సెకండాఫ్ లో కథలేదు దర్శకుడు చెప్పడానికి. అందుకే  సీన్లు మందకొడిగా సాగుతాయి. ప్రేక్షకులు వూహించే విధంగానే సాగి హమ్మయ్యా అని ముగగింపు కొస్తుంది. ఇందులో రొటీన్ గా స్పెషలాఫీసర్ హీరోకే  హెల్ప్ చేసే అనౌచిత్యం వుంటుంది. ఇదంతా మూసఫార్ములా చిత్రణే తప్ప వాస్తవిక ధోరణి కాదు. సీన్లలో సస్పెన్స్, థ్రిల్, లాజిక్, వేగం అనేవి వుండవు. ఓపికపట్టి నెమ్మదిగా సాగే తెలిసిన సీన్లే చూస్తూండాలి. చిత్రీకరణ వరకూ స్టయిలిష్ గా వుండేట్టు చూసుకున్నాడు దర్శకుడు. విషయం రొటీన్ గా దాని మానాన దాన్ని వదిలేశాడు. ఈ సినిమా చూస్తూంటే ఇలాటిదే  డార్క్ మూడ్ లో వుండే పవన్ కళ్యాణ్  ‘పంజా’ గుర్తుకొస్తోంది. నో- ఆ లుక్, ఆ క్యారక్టర్ పవన్ కి మేలు చేయలేదు- నిఖిల్ కి చేస్తుందా?

-సికిందర్ 
http://www.cinemabazaar.in