రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, అక్టోబర్ 2017, ఆదివారం

532 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు

          కథల్లో సమస్యకి పరిష్కార మార్గాన్ని కనుగొనాల్సింది  ప్రధాన పాత్రే. ప్రధాన  పాత్ర విలన్ అయినా సరే ఆ విలనే పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. ఎందుకంటే ఒక ప్రధాన పాత్రగా తనే కథని ప్రారంభిస్తాడు గనుక. ఎవరు కథని ప్రారంభిస్తే వాళ్లే తలెత్తిన సమస్యకి పరిష్కార మార్గాన్ని కనుగొనాలి. అయితే విలన్ ప్రధాన పాత్రగా వున్నప్పుడు,  ఆ విలనే పరిష్కార మార్గాన్ని కనుగొనాల్సి వచ్చినప్పుడు,  ఫలితం వ్యతిరేకంగా వచ్చి అతడికి విషాదాంత మవుతుంది కథ.  అదే ప్రధాన పాత్రగా హీరో కథ నడిపిస్తూ పరిష్కారమార్గాన్ని కనుగొన్నప్పుడు,  సుఖాంత మవుతుంది కథ. పరిష్కార మార్గమంటే ముగింపు కాదు, ముగింపుకి తెర్చుకున్న ద్వారం. ఇది ప్లాట్ పాయింట్ టూ దగ్గర లభిస్తుంది. దీంతో మిడిల్ పూర్తయి ఎండ్ విభాగంలో పడుతుంది స్క్రీన్ ప్లే.
          
          ‘బ్లడ్ సింపుల్’ లో విస్సర్ అనే విలన్ ప్రధాన పాత్ర. ఇతనే మార్టీని ‘చంపి’ కథ ప్రారంభించాడు.  కథని ముగించాలంటే అతడికో పరిష్కార మార్గం దొరకాలి. ఈ పరిష్కార మార్గాన్ని ఎవరు సరఫరా చేయాలి?  విస్సర్ రహస్యం తెలుసుకున్న వాడు సరఫరా చేయాలి. ఈ రహస్యం తెలుసుకోబోతున్నవాడు రే. కాబట్టి రే నే విస్సర్ కి పరిష్కారం అందించి కథ ముగించడానికి తోడ్పడాలి.

            ప్రధాన పాత్రగా గుమ్మడి విలన్ గా వేసిన ‘నేనూ మనిషినే’ లో ఒక జడ్జిగా గుమ్మడి హత్య చేసి దొరక్కుండా ఎత్తులేస్తూంటాడు.  సత్యనారాయణ బాధిత పాత్ర. గుమ్మడిని ఇక చంపెయ్యాలనుకుని రివాల్వర్ తో హత్యాప్రయత్నం చేసి దొరికిపోతాడు. తీరా చూస్తే తను  గుమ్మడి మీద హత్యాయత్నం చేస్తూ వాడిన  రివాల్వర్,  గుమ్మడి హత్య చేయడానికి వాడిన రివాల్వర్ ఒకటే. ఇది తెలీక దాన్ని తెచ్చుకుని గుమ్మడి మీద హత్యాయత్నం చేయడంతో, గుమ్మడి చేసిన హత్య కూడా తనే చేశాడని ఇరుక్కుంటాడు. 

            ‘బ్లడ్ సింపుల్’ లో విస్సర్ మార్టీని షూట్ చేసి చంపేశాననుకుని వెళ్ళిపోతాడు. రే వచ్చి చూస్తే మార్టీ బతికే వుండడంతో,  అతణ్ణి సజీవ సమాధి చేసేసి పూర్తిగా చంపేస్తాడు. ఫలితంగా తనే హంతకుడవుతాడు. ఇదే పరిస్థితి సత్యనారాయణది. అక్కడ గుమ్మడి ఎస్కేప్, ఇక్కడ విస్సర్ ఎస్కేప్.

            కానీ ఆ కథని ఒక ప్రధాన పాత్రగా గుమ్మడి ముగించాల్సిందే.  ఎలా ముగిస్తాడు? తను చేసిన హత్యలో సత్యనారాయణ బాగా ఇరుక్కున్నాడని టాటా చెప్పేసి హేపీగా వెళ్లి పోవడమా? ఇది కథా ప్రయోజనమన్పించుకోదు. కథా ప్రయోజనం నేరానికి తగిన శిక్ష!  మరి గుమ్మడి కి ఏ పరిష్కారమార్గం దొరికి కథా ప్రయోజనం ప్రకారం కథని ముగించాడు?

            కోర్టులో సత్యనారాయణ పరిస్థితి చూసి గుమ్మడిలో అంతర్మధనం మొదల
వుతుంది. నేరం ఒప్పుకుని లొంగిపోతాడు.  ఈ కథలో గుమ్మడి కథ ముగించడానికీ,  అందుకో పరిష్కార మార్గం దొరకడానికీ సత్యనారాయణ పరిస్థితి దోహదం చేసింది. అలాగే విస్సర్ కి కూడా రే ఆ పరిష్కార మార్గాన్ని అందించబోతున్నాడు. ఇదెలాగో చూద్దాం. గత సీన్లో ఎబ్బీ పీడకల వ్యవహారం చూశాం. దీంతో ఆమె ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం...

33. మార్టీ హత్య గురించి ఎబ్బీ రేలు మాటామాటా అనుకోవడం
            ఇలా రాశారు –
            రే ఇంటి ముందు ఎబ్బీ కారు దిగి ఫోర్ గ్రౌండ్ లో నడుచుకుంటూ పోతుంది. కిటికీ దగ్గర నిలబడి లోపలికి  చూస్తుంది. గోడ కేసి చూస్తూ బెడ్ మీద కూర్చుని వుంటాడు రే. పిలుస్తుంది. తిరిగి చూస్తాడు. 

            లివింగ్ రూమ్ వైడ్ షాట్ – స్క్రీన్ డోర్ తీసుకుని  ఎబ్బీ వస్తూంటుంది. గది ఖాళీగా వుంటుంది ఫర్నిచర్ తప్ప. కింద అట్టపెట్టె లుంటాయి. అర్ధంగాక చూస్తూ - ‘సామానేమైంది?’ అంటుంది.  

            అతను ముందుకు అడుగులేస్తాడు.  నేలమీద కత్తి, చుట్ట చుట్టిన తాడూ వుంటాయి. తాడు మీద అతడి కాలు పడుతుంది. వంగి కత్తి ని అందుకుంటాడు. ‘డిక్కీలో’ – అంటాడు ఆమె ప్రశ్నకి సమాధానంగా. ‘వెళ్ళిపోతున్నావా?’ అంటుంది. అతను అట్టపెట్టెకి తాడు కట్టి కసిక్కున కోస్తాడు కత్తితో -  ‘అదేగా నువ్వు కోరుకునేది’  అంటాడు. తల అడ్డంగా వూపుతుంది. ‘వస్తావా నాతో?’ అంటాడు. ముందు అసలేం జరిగిందో తెలియాలంటుంది.

            ‘నువ్వు జీతం డబ్బుల కోసం బార్ కి వెళ్ళావ్. మార్టీ తో ఘర్షణ పడ్డావ్. అప్పుడేదో జరిగిపోయింది...’  అని ఆమె అంటూంటే, తలూపుతూ చిర్నవ్వుతో చూస్తాడు. మళ్ళీ అంటుంది ఎబ్బీ- ‘అది నువ్వు కాదంటావా? మరి  దొంగోడెమో ...నువ్వెళ్ళే సరికీ...’
            ‘నీ రివాల్వర్ తో దొంగోడా?’ అంటాడు. 

            కత్తిని జేబులో పడేసుకుని,  ఆమె వున్న డోర్ వైపు అడుగులేస్తాడు, ‘ఇంకెవరూ రాలేదు, ఎబ్బీ. నీకు నిజం చెప్తాను’ అంటాడు -  ‘నిజం ఏమిటంటే, రెండ్రోజులుగా నావొంట్లో బాగోలేదు. తినలేక పోతున్నాను, కళ్ళు మూయలేక పోతున్నాను. ఏం చెయ్యాలో తెలియడం లేదు. సరే, ఎబ్బీ...’

            ఆమెకి అభిముఖంగా నిలబడి చేతులు ప్యాంట్ జేబుల్లో పెట్టుకుని, ఇబ్బందిపడుతూ  – ‘ నిజమేమిటంటే, నేను పాతి పెట్టినప్పుడు అతను బతికున్నాడు’  అంటాడు. అతణ్ణి తీక్షణంగా చూస్తుంది. 

           
వెనక వారగా ఆకాశంలో ఒక వస్తువు తిరుగుతూ తిరుగుతూ వచ్చి,  పెద్ద శబ్దంతో స్క్రీన్ డోర్ కి ఠపీ మని కొట్టుకుంటుంది. ఇద్దరూ ఉలిక్కిపడి అటుకేసి చూస్తారు. ఎబ్బీ చటుక్కున డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. రే ఆమెని ఆపకుండా వుండిపోతాడు.  

            బయట – ఇందాక స్క్రీన్ డోర్ కి కొట్టుకుని కింద పడ్డ న్యూస్ పేపర్ని దాటుకుని -  ముందు కెళ్ళి పోతుంది ఎబ్బీ.
           
ఎబ్బీతో ట్రాకింగ్ షాట్ – తన కారు వైపు వెళ్ళిపోతూ రే కారు వైపు చూస్తుంది.
            ఎబ్బీ పాయింటాఫ్ వ్యూ- ట్రాకింగ్ ఫార్వర్డ్ – రే కారు వెనుక సీట్లో కప్పిన వస్త్రం రక్తం తో అంతకంతకూ  ఎర్రబారి వుంటుంది...
***
            పై సీను పరస్పరం నిజాలు తెలుసుకునే ట్రాక్ లో భాగంగా వచ్చింది. అంచెలంచెలుగా పరస్పరం నిజాలు తెలుసుకుంటున్నారు.  ఇక కథ క్లయిమాక్స్ కి వెళ్ళాలి కాబట్టి మిగిలున్న ఈ ప్రక్రియ. ఈ సీనుకి సబ్ కాన్షస్ డ్రైవ్  29 వ సీన్లో వుంది. ఆ సీన్లో ఎబ్బీ మరొకర్ని చూసుకుందన్న అనుమానంతో రే ప్రవర్తనలో వచ్చే మార్పు. అస్థిమితంగా తిరుగుతూ అక్కడున్న అట్టపెట్టెని అందుకోవడం, పడెయ్యడం గమనించాం. ఆ సబ్ కాన్షస్ చర్య ముందే అతడికి జరగబోయేదాని గురించి చెప్పేసింది. ఇప్పుడు అదే జరుగుతోంది-

            ఎబ్బీ వచ్చేసరికి సామాను సర్దుకుంటున్నాడు. ఆమె ‘సామానేమైంది?’ అన్నప్పుడు అతడి కాలు తాడు మీద పడుతుంది. తామిద్దరి మధ్య బంధానికి  అతడి సమాధానమది. ఆమె ‘వెళ్ళిపోతున్నావా?’ అన్నపుడు, అట్టపెట్టెకి తాడు కట్టి కసిక్కున కోస్తాడు కత్తితో. తెగిపోయింది బంధం. ఆ తర్వాత బార్ లో జరిగిందాని పైకి సంభాషణ మళ్ళుతుంది. ఆమె మార్టీ ని షూట్ చేసిందనే అతడి అపార్ధం మాత్రం తొలగడం లేదు. అతను అడిగితేగా? తనని వాడుకుని మరొకరితో సెటిలవుతోందన్న అనుమానంతో వున్నాడు పైగా. అతడలా అనుకోవడానికి ఆమె మాటలే తోడ్పడ్డాయి. 

            అందుకే వూరొదిలి వెళ్ళిపోతున్నాడు. ఆమె రాత్రి వచ్చిన కలలో మార్టీ మాటలకి కలత చెంది ఇక్కడి కొచ్చింది. రే నిన్ను కూడా చంపేస్తాడని మార్టీ పలికాడు. మరొకర్ని చూసుకోమని కూడా అన్నాడు. ఆమె ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఆమెకి బార్ కి వెళ్లి చూసినప్పుడు మార్టీ చనిపోయాడనీ, రే చంపాడనీ అనుకుంది. ఇది మార్టీ మాటల్లో బయటపడ్డంతో ఆమెకి నిర్ధారణ అయిపోయింది.  ఇప్పుడు రేని ఈ విషయంగా నిలదీయాలని వస్తే,  ఎదురు చూడనివిధంగా అతను ప్రయాణం కడుతూ షాకిచ్చాడు. 

            ఇప్పుడు కూడా రే - నువ్వు షూట్ చేశావనీ, అతను చావలేదనీ, బతికుంటే నీకు మంచిదికాదని పాతి పెట్టాననీ   క్లియర్ గా చెప్పలేక పోతున్నాడు. నువ్వు షూట్ చేశావనే మాట వాడకుండా, కేవలం కొనవూపిరితో వున్న మార్టీని సమాధి చేసేశానని చెప్పాడు. కథలో ఎప్పుడూ  కూడా అతను ఆమెని హర్ట్ చేయాలన్న ఉద్దేశంతో లేడు. తనని తాను శిక్షించుకునే ధోరణిలోనే వుంటున్నాడు. అతను మార్టీని చంపి సుఖంగా ఏమీ లేడు. లోలోపల చేసిన తప్పుకి కుంగిపోతున్నాడు. అందుకే ఇప్పుడు ఫైనల్ గా స్క్రీన్ డోర్ దగ్గర ఆమెకి అభిముఖంగా చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. సెల్ఫ్ ఇమేజి బాగా లేదని అన్పించినప్పుడే ఇలాటి బాడీ లాంగ్వేజీ ప్రదర్శిస్తారు మనుషులు. తను పాతి పెట్టినప్పుడు మార్టీ బతికున్నాడని చెప్పేశాడు. 

            ఇప్పుడు ఒకటి జరుగుతుంది. ఈ షాకింగ్ వార్తకి ఆమె అతణ్ణి తీక్షణంగా చూస్తూండగానే - స్క్రీన్ డోర్ అద్దంలోంచి బయట ఏదో వస్తువు ఎగురుతూ రావడం మనకి కన్పిస్తుంది. అది పెద్ద చప్పుడుతో అద్దానికి కొట్టుకుని అవతల పడిపోతుంది. అదేమిటో మనకి తెలీదుగానీ, ఎవరో విసిరితే వచ్చి తగిలిందని మనకి అర్ధమవుతుంది. ఎవరు? ఏం విసిరారు? ఎందుకు విసిరారు? విస్సర్ కాక వీళ్ళ గురించితెలిసిన మరో వ్యక్తి ఎవరు?...ఇలా రకరకాల ప్రశ్నలు వేధిస్తాయి.

            వాళ్ళిద్దరూ అది డోర్ కి తగలగానే ఉలిక్కి పడి అటు చూస్తారు. ఆమె వెంటనే డోర్ తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి కన్పిస్తుంది బయట పడున్న న్యూస్ పేపర్. 

            ఆమె పిడుగు లాంటి వార్త విన్నది. అందుకే న్యూస్ పేపర్ తో ఈ ఎఫెక్ట్. దీన్ని ఇంకోలా చేయవచ్చు. న్యూస్ పేపర్ లేకుండా - రే అన్న మాటకి సంగీత దర్శకుడు ధనా ధనామని ఏదో వాయించి బ్రహ్మాండమైన ఎఫెక్ట్ ఇవ్వొచ్చు. అది కృత్రిమంగానే వుంటుంది తప్ప యాక్షన్ తో డ్రమటైజ్ చేసినంత ఎఫెక్టివ్ గా వుండదు. మనం ఉలిక్కి పడ్డానికి ఏమీ వుండదు. అది పేపర్ బాయ్ పేపర్ వేసే సమయం. అప్పుడు సరీగ్గా ఆ డోర్ దగ్గరే నిలబడ్డారు. ఈ డోర్ దగ్గర నిలబడ్డం కావాలని నిలబెట్టినట్టు వుండచ్చు న్యూస్ పేపర్ ఎఫెక్ట్ కోసం. ఇక్కడ లోపలికి ఎంటరవగానే ఎబ్బీ చూసిన పరిస్థితికి ఆమె ఇంకా లోపలికి వచ్చే అవకాశం లేదు. అతను సామాను సర్డుకుంటూంటే విస్తుపోయి డోర్ దగ్గరే నిలబడిపోయింది. ఇందులో దర్శకులు కావాలని అక్కడ నిలబెట్టిందేమీ  లేదు. అలాగే ఆమెకి దూరంగా అట్టపెట్టెలు కడుతున్న రే, నిజం చెప్తానని యాదృచ్ఛికంగా ఆమె దగ్గరికే వస్తాడు. అతను  కావాలని డోర్ దగ్గరికి వచ్చిందేమీ లేదు. సీను కేవలం డైలాగులతో నడిచిపోకుండా ఏదైనా సంఘటన కూడా జరిగితేనే చలనశీలంగా వుంటుంది. ఎక్కువ ఆకట్టుకుంటుంది. 

            ఇక ఆమె కారు దగ్గరికి వెళ్ళిపోతూ, రే కార్లోకి చూసినప్పుడు,  సీటు మీద కప్పిన వస్త్రం రక్తసిక్తంగా కన్పించడం ఆమెకి పూర్తి సమాచారం ఇవ్వడం కోసమే. లేకపోతే రే పాతి పెట్టానని అంటే ఆమె నమ్మాలని లేదు. ఐతే ఇద్దరి మధ్యా  విస్సర్ వున్నాడని ఇప్పటికీ వాళ్లకి తెలీదు. ఇది బాకీ వుంది కథలో. ఒకటొకటే ఎలా క్లియర్ చేసుకుంటూ పోతున్నారో గమనించాలి. రాబోయే ప్లాట్ పాయింట్ టూ కల్లా ఇవన్నీ క్లియర్ అయితేనే పరిష్కార మార్గం (విస్సర్) కి దొరుకుతుంది.

34. ఎబ్బీ వెళ్లి మారిస్ కి ఫిర్యాదు చేయడం
        ఈ సీనుని ఎడిటింగ్ లో తగ్గించేశారు. ఎబ్బీ బార్ టెండర్ మారీస్ ఇంటి కెళ్ళి,  రే తనతో ఏం చెప్పాడో,  మార్టీ ఎలా చనిపోయాడో చెప్పే సీను ఇది. మార్టీ బతికే వున్నాడనీ, అన్సర్ మిషన్ లో అతడి మెసేజి వుందనీ, రే డబ్బు దొంగిలించినట్టు చెప్పాడనీ అంటాడు మారీస్. ఐతే బతికుంటే ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటుంది ఎబ్బీ. 

            ఇదంతా కట్ చేశారు ప్రేక్షకులకి తెలిసిన సమాచారమే కాబట్టి. ఇందులో మార్టీ బతికున్నాడన్న అపోహ ఇద్దరికీ కలగడం ఒక్కటే కొత్త విషయం. మార్టీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటుంది ఎబ్బీ. ఇదంతా కృత్రిమంగా, అనవసరంగా వుంది. వెనుక సీన్లో చూసిన దృశ్యాలతో మార్టీ చనిపోయాడని ఆమె నమ్మిందని ప్రేక్షకులు నమ్మాక (లేకపోతే  న్యూస్ పేపరుతో పిడుగు లాంటి వార్త ఎఫెక్ట్ కి అర్ధమే వుండదు), మళ్ళీ ఆమె ఇప్పుడు మారీస్ ఏదో చెప్పాడని, మార్టీ బతికుంటే ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అనడం అర్ధరహితమై పోతుంది. 

            దీని తర్వాత రెండో సీనులో మారీస్ మార్టీ ఇంటికెళ్ళి పరిశీలిస్తూంటాడు. స్క్రిప్టులో రాసిన ఈ సీను కూడా అర్ధరహితమే. దీన్ని పూర్తిగా తొలగించారు. పకడ్బందీగా రాసుకొస్తున్న కోయెన్ బ్రదర్స్, నమ్మశక్యంగాని ఈ రెండు సీన్ల దగ్గర ఎందుకు పొరబడ్డారో. అలాగే మార్టీ ఇంట్లో పెంపుడు కుక్క ఏమైందో కన్పించదు. యజమాని కన్పించకపోతే దాని పరిస్థితేమిటి?  అది కథకి అడ్డుపడు
తుందని వదిలేసినట్టున్నారు గానీ, పెంపుడు కుక్క కూడా వుండి వుంటే  ప్రేక్షకుల వెంట్రుకలు నిక్కబొడిచేలా దృశ్యాలుండేవి. యజమానిని వెతుక్కుంటూ వచ్చి, రే పాతి పెడుతూంటే అడ్డుకునే దృశ్యం వుండివుంటే,  హార్రర్ ఎఫెక్ట్ తో వొళ్ళు జలదరించే దృశ్యం వెంటాడేది మనల్ని. అది రే మీద పగబట్టి వెంటాడుతూంటే కథనానికి మంచి వూపు వచ్చేది.

            ప్రస్తుత ఎడిట్ చేసిన సీనులో,  ఎబ్బీ మారీస్ ఇంటికెళ్ళి  తలుపుకొట్టి, అతను  తీయగానే  ‘నీతో అర్జెంటుగా మాటాడాలి’ అని లోపలి కెళ్ళి పోవడంతో కట్ అవుతుంది.
ఐతే దీంతో కూడా ఈ సీను ప్రయోజనం నెరవేరలేదు. కథలో వున్న పాత్రలకి కథలో ఏం జరుగుతోందో తెలియాలి కాబట్టి - ఆ జరిగింది (మార్టీ చావు) మారిస్ కి తెలిపే ఉద్దేశంతో ఇలా ఎబ్బీ ని పంపించి సీను కట్ చేస్తే సరిపోయిందనుకున్నా, అసలు మార్టీ ని చంపానన్న రే పట్ల ఆమె దృక్పథ మేమిటిప్పుడు? ఇది పాత్రకి అవసరం. ఆమె ఇప్పుడు తీసుకోవాల్సింది రే చెప్పిన మాటల పైన నిర్ణయం. ఇదే కన్పించదు. దీంతో పాత్ర చిత్రణ దెబ్బతింది.

***
35. రే వెళ్లి బార్ లో సేఫ్ తెరిస్తే ఫేక్ ఫోటో బయట పడడం      
        ఈ సీను కూడా ఎడిట్ అయ్యింది. స్క్రిప్టులో ఈ సీను ప్రారంభం రాత్రిపూట కారులో వెళ్తున్న రే,  ఎవరో అనుసరిస్తున్నట్టన్పించి ఆపేస్తాడు. వెనుక వస్తున్న కారు కూడా ఆగిపోతుంది. చాలా సేపూ రెండు కార్లూ ఆగే వుంటాయి. ముందు కెళ్ళి పొమ్మని రే చెయ్యూపితే,  వెనుక కారు క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అది విస్సర్ కారు. అతను రే ని కనిపెడుతున్నాడన్న మాట. ఇది కట్ చేశారు. లేకపోతే జరగబోయేది మనకి ముందే తెలిసిపోతుంది. 

            ఇంతవరకూ కట్ చేస్తే, మిగతా సీను ఈ కిందివిధంగా రాశారు:
            బార్లో ఆఫ్ స్క్రీన్ లో లైటు స్విచ్ వేసిన చప్పుడు. మార్టీ టేబుల్ మీద చచ్చిన చేపల షాట్. షాట్ కట్ చేసినప్పుడు ఈగ చేసే రొద  తీవ్రమవుతుంది.
            రే మీద క్లోజ్ షాట్.
            డోర్ దగ్గర నిలబడి చేపల్ని చూస్తూంటాడు రే.
            ఆఫీసు వైడ్ షాట్ - చుట్టూ చూస్తాడు రే. కింద  అడ్డం ముక్కలు అలాగే పడుంటాయి. చూపు  సేఫ్ వైపు మళ్ళుతుంది. అక్కడున్న సుత్తిని చూస్తాడు. సేఫ్ దగ్గరికి వెళ్లి గొంతుక్కూర్చుంటాడు.
            రే క్లోజ్ షాట్ -  దెబ్బతిన్న సేఫ్ డయల్ ని ప్రయత్నించి ఓపెన్ చేసేస్తాడు. లోపలున్న వస్తువుల్ని కదిలిస్తూంటే, మడత పెట్టి వున్న ఫోటో తగుల్తుంది.
            రే పాయింటాఫ్ వ్యూ – తనూ ఎబ్బీ శవాలై వున్న ఫోటో.
            రే మీద ఫోకస్ – మార్టీ టేబుల్ సజెషన్ లో.
            నెమ్మదిగా లేస్తాడు. టేబుల్ మీద చేపల కిందున్న విస్సర్ లైటర్ అంచు మెరుస్తూంటుంది.
              ఫోర్ గ్రౌండ్ లో టేబుల్ దగ్గరి కొస్తాడు. ఫోటోని టేబుల్ మీద పరుస్తాడు. ఒక్క క్షణం దానికేసే చూసి,  సడెన్ గా  ఫ్రేములోంచి తప్పుకుంటాడు.
            బయట కొచ్చి కారెక్కి పోనిస్తూ ఆపేస్తాడు. దూరంగా చీకట్లో ఓ కారాగి వుంటుంది. దాన్నే చూస్తూంటాడు. అది విస్సర్ కారు. ఆ కారు దాటుకుని వెళ్ళిపోతాడు.
***
   ఇది ప్లాట్ పాయింట్ టూ సీను.   
  దీన్ని ప్రేరేపించింది 31 వ సీను. అంటే ఆ ప్లాట్ పాయింట్ టూ కి దారి తీయించే పించ్ టూ అన్నమాట. ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ని ప్రేరేపించే పించ్ వన్ సీను ఎలా వుంటుందో, సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ ని ప్రేరేపించే పించ్ టూ సీను అలా వుంటుంది. ఆ పించ్ వన్  సీన్లో మారీస్ వచ్చి, రే మీద డబ్బు దొంగతనం ఆరోపణ చేసి వెళ్ళాడం తెలిసిందే. 

          దీంతో రే మనసుని ఒకటి దోలుస్తూండాలి సహజంగానే. ఆ ఆరోపణ అబద్ధమని.  ఆరోపణ  డబ్బు సేఫ్ లోనే వుండాలి.  ఇదేదో తేల్చుకోవడానికే ఇలా బార్ కొచ్చాడు. వచ్చి చూస్తే, సేఫ్ లో ఫేక్ ఫోటో బయట పడింది. దీంతో ఈ గేమ్ లో తనూ - ఎబ్బీ – మార్టీయే గాక, మరొకడున్నాడని అర్ధమైంది. వాణ్ణి మార్టీ తామిద్దర్నీ  చంపడానికి నియమిస్తే, వాడు చంపకుండా ఫేక్ ఫోటో సృష్టించి మార్టీని నమ్మించాడనీ, ఏదో తేడా వచ్చి మార్టీ ని షూట్ చేసి వెళ్లి పోయాడనీ,  అసలు మిస్టరీ అంతా ఇప్పుడు రే కి వెల్లడైపోయింది.

          ఇది చాలా షాకింగ్ సంగతి రేకి. ముందు తమని చంపడానికే మార్టీ కుట్ర పన్నాడన్న భయంకర నిజంతో, ఇప్పుడు తను మార్టీ ని అలా చంపేసి వుండడం పక్కగా న్యాయమే అన్పించ వచ్చు రేకి. ఇది  పోయెటిక్ జస్టిస్, మార్టీ ఎలా చేసుకుంటే అలా అనుభవించక తప్పదన్న నీతితో. కానీ చట్టం దృష్టిలో తాను దోషియే రే.

          ఎవడా నాల్గో వాడు?  వాడే సేఫ్ లో ఫోటో తొలగించడానికి వచ్చి వుంటాడు. అందుకే ఆఫీసు ఇలా ధ్వంసమైంది. సేఫ్ తెరవలేక వెళ్లి పోయుంటాడు. ఇప్పుడు రే ఏం చేయాలి?
          రే ఏం చేయడానికీ సమయంలేదు. మార్టీ నియమించిన హంతకుడు ఎప్పుడైనా దాడి చేయవచ్చు ఫోటో కోసం. రే కారెక్కి  వెళ్లిపోతూంటే ఎదురుగా  కాపేసి వున్నది వాడే. ఇక్కడ రే ఏం నిర్ణయం తీసుకున్నాడో, వాడి పక్కనుంచే వెళ్ళిపోయాడు. 

          విస్సర్ విషయానికొస్తే, ఎబ్బీ బార్ కొచ్చినప్పుడు సేఫ్ పగుల గొడుతున్నాడు. ఆమె వెళ్ళిపోయాక తిరిగి  ఆ ప్రయత్నం చేసి ఫోటో దక్కించుకో వచ్చు. అప్పటికీ అది తెరచుకుని వుండి వుండదు. వెళ్ళిపోయిన ఎబ్బీ విషయం చెప్తే,  రే బార్ కొస్తాడని వూహించాడు. రే బార్ కొచ్చి  సేఫ్ తెరిచాడు. ఫోటో తీసి చూసేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దర్నీచంపడం మినహా మార్గం లేదు విస్సర్ కి. ఈ ప్లాట్ పాయింట్ టూ సీన్ లో,  ప్రధాన పాత్ర విస్సర్ ముందున్న సవాలు ఇది. దీనికి వాళ్ళిద్దర్నీ చంపడమే పరిష్కారం!

          చనిపోక ముందు మార్టీ రే మీద కసితో డబ్బు దొంగతనం ఆరోపణ చేసింది వూరికే పోలేదు. ఈ ఆరోపణ గురించే రే బార్ కొచ్చి ఇలా విస్సర్ కి చిక్కాడు. మార్టీ ప్రతీకారం ఇలా తీరుతోంది. 31 వ సీన్లో మారీస్ వచ్చి డబ్బు దొంగతనం ఆరోపణ చేసి వెళ్ళాక, రే కారులో వస్త్రం కప్పిన సీట్లోంచి రక్తం ఉబికి రావడం గమనించాం. అంటే సమాధిలోంచి మార్టీ వెంటాడుతున్నట్టు అర్ధం జేసుకున్నాం. ఆ ఆరోపణతో  రే ని బార్ కి పరుగెత్తిస్తే, రే వచ్చి ఫోటో తీసి విస్సర్ కి చిక్కాడు. ఇంకేం, మార్టీ ప్రతీకారం తీరిపోయింది. 

          మరి మార్టీ తనని షూట్ చేసిన విస్సర్ మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలిగా? అది చట్టం చూసుకుంటుంది. చేపల కింద వున్నవిస్సర్ లైటర్ తో. విస్సర్ ఫోటో గురించి ఎంత ఆందోళనతో వున్నాడంటే , లైటర్ సంగతే మర్చిపోయాడు. 

          ఇలా మార్టీ ప్రతీకారం తేర్చుకునే ట్రాక్ లోంచే రే కి నిజాలు తెలియాలన్న కథనం సాగింది. ప్లాట్ పాయింట్ టూ కి చేరవేసింది. 
ఈ సీనులో ఒక సింబాలిజముంది.  రే సేఫ్ దగ్గర వంగినప్పుడు టిల్ట్ అప్ యాంగిల్లో పైన సీలింగు ఎల్లో కలర్ లో మెరుస్తూంటుంది. మార్టీని విస్సర్ షూట్ చేసే సీన్లో ఇలాగే  మార్టీ సేఫ్ దగ్గరున్నప్పుడు,  టిల్ట్ అప్ షాట్ లో  పైన సీలింగ్ ఎరుపు - నలుపు గడులుగా ప్రకాశించడాన్ని గమనించి, అది అతడి మరణం ఎలా  వుండబోతోందో తెలియజేప్తోందని చెప్పుకున్నాం.

          ఇప్పుడు రే మరణానికి కూడా ఈ సింబాలిజంతో అర్ధం తీస్తే, ఇతను మార్టీలా అంత యాతన పడకుండా మెరుపు వేగంతో మార్టీ దగ్గరికి చేరుకుంటాడని తెలుస్తోంది.

(సశేషం)
-సికిందర్