రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, జనవరి 2018, గురువారం

587 ; రివ్యూ!

ర్శత్వం: శ్రీరంజని
తారాగణం :  రాజ్ రుణ్, చిత్రా శుక్లా, సితార, ప్రియర్శి దితరులు
సంగీతం :  శ్రీచరణ్ పాకాల,  ఛాయాగ్రణం: ఎల్‌.కె.విజయ్
బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల : జనవరి 14, 2018

***
        రోమాంటిక్ సినిమాల హీరోగా రాజ్ తరుణ్ యువ ప్రేక్షకులకి ఒక క్రేజ్ మొదటి మూడు సినిమాలతో. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావా, కుమారి 21 ఎఫ్ వంటి మూడు రోమాంటిక్కుల తర్వాత రూటు మార్చి మాస్ యాక్షన్ హీరోయిజానికి దిగడంతో, యువప్రేక్షకులు తగ్గిపోయి ఓపెనింగ్స్ లేకుండాపోయాయి. సీతమ్మ అందాలు –రామయ్య సిత్రాలు, ఈడో రకం – ఆడో రకం, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు అనే మాస్ యాక్షన్లతో ఒరిజినల్ ఇమేజిని కోల్పోయాడు. ఈ ప్రభావం మధ్యలో వచ్చిన నాన్నా నేనూ నాబాయ్ ఫ్రెండ్స్ అనే రోమాంటిక్ మీద కూడా పడింది. మళ్ళీ ఇప్పడు తాజాగా ‘రంగులరాట్నం’ అనే రోమాంటిక్ తో వచ్చినా పండక్కి కూడా యువప్రేక్షకుల్లో కదలిక లేదు. అన్నపూర్ణ బ్యానర్, శ్రీరంజని అనే తమిళ కొత్త దర్శకురాలు అనే ఆకర్షణీయ హంగులు సమకూరినా ప్రయోజనం కన్పించడం లేదు. ఇంత మాత్రాన తను పనికిరాకుండా పోయాడని కాదు. యూత్ అప్పీల్ దేనికుంటుందో ఆ సినిమాలు చేస్తే తప్పకుండా పనికొస్తాడు. మొహమాటాలకి యూత్ అప్పీల్ వుండని సినిమాలు నటిస్తే ఎన్నటికీ పూర్వ ప్రాభవం తిరిగి రాదు. ఇప్పుడు ‘రంగులరాట్నం’ కూడా  ఇంకెందుకని కాసుల రాట్నం కాలేక పోయిందో ఈ కింద చూసుకుంటూ వెళ్దాం... 

కథ 
       విష్ణు (రాజ్ తరుణ్) ఓ ఉద్యోగం చేస్తూ తల్లి (సితార)తో వుంటాడు. అతడికి పెళ్లి సంబంధాలు చూస్తూంటుంది తల్లి. ఓ పెళ్ళిలో కీర్తి (చిత్రా శుక్లా) ని చూసి ఇష్టపడతాడు. తల్లికి కూడా ఈమె నచ్చుతుంది. ఇంతలో గుండె పోటుతో చనిపోతుంది. తల్లి మరణంతో విష్ణు విషాదంలో పడిపోతాడు. కీర్తి అతడికి దగ్గరై అతడి ఆలనాపాలనా చూసుకోవడం మొదలెడుతుంది. ఆమె చెప్పే జాగ్రత్తలు, తీసుకునే అతిజగ్రత్తలూ అతణ్ణి విసిగిస్తాయి. దీంతో దూరమైపోతాడు. తర్వాత ఆమెని అపార్ధం చేసుకున్నానని తెలుసుకుని తిరిగి దగ్గరవుతాడు. ఇదీ కథ.

ఎలావుంది కథ 
      ఈ ప్రేమకథ రోమాంటిక్ డ్రామా జానర్ లోకొస్తుంది. తమిళ దర్శకురాలు శ్రీరంజని తొలి ప్రయత్నంగా తెలుగులో అడుగుపెట్టి కెరీర్ ని ప్రారంభిస్తోంది. ఈ నడుస్తున్న శతాబ్దంలో తెలుగులో దర్శకురాళ్ళు కొందరు వచ్చారు. వాళ్ళు తమ స్త్రీ దృక్కోణంలో కథల్ని, పాత్రల్ని చూపించకుండా, పురుష పంథాలోనే పురుషులు తీసినట్టు సినిమాలు తీసేసి తమ జెండర్ అస్తిత్వాన్ని పురుషస్వామ్యానికి తాకట్టు పెట్టేస్తున్నారు. కొందరైతే మాస్ యాక్షన్లు అంటూ మోజు పెంచుకుని బోల్తా కొడుతున్నారు. ప్రేమకథలు, సామాజిక కథలు ఏ కథలు చూసినా పురుష వాసనలతోనే వండి వారుస్తున్నారు. వివాహ భోజనంబులనేవి మాస్ రేంజిలో పురుషులు పాల్పడే  గారడీ వంటకాలు. స్త్రీలు ఇంటి వంట చేసుకోవాలి. దర్శకురాళ్ళు కూడా ప్రేక్షకులకి ఇంటి వంట నోచుకోకుండా  చేయడం దారుణం. స్త్రీ స్పర్శ గల సృజనాత్మకత తెలుగు దర్శకురాళ్ళనుంచి రాకపోవడం చాలా వింత. ఇందుకేనేమో మీడియా మిత్రులు ‘మహిళా దర్శకురాలు’ అని తెగ రాసేస్తూంటారు. ‘మగ దర్శకురాలు’ కూడా వుంటారనేమో. అప్పుడు దర్శకుడు ‘పురుష దర్శకురాలు’ అవుతాడా? దర్శకురాలు మహిళే. అమాయకురాలు మహిళే. మహిళా అమాయకురాలనీ వుండదు. దర్శకురాల్లోనే నూటికి నూరుపాళ్ళూ మూర్తీభవించిన మహిళామణియే ఖచ్చితంగా కొలువుదీరి వుంటుంది. మగవాడు వుండడు. మగ దర్శకురాలుండదు దరిద్రంగా. శ్రీరంజని ‘మహిళా దర్శకురా’లని అన్ని రకాల మీడియాల్లో అందరూ హోరెత్తించుకోవడం అయింది. ఇక రేపు ఇంకొకర్ని  ‘మహిళా నటి’ అని దుమారం రేపడానికి సర్వసన్నద్ధులవుతారు బహుశా ఇప్పట్నించే. డిజిటల్ పలకలతో భాషా స్పృహ ఏముంటుంది. అ ఆలు కూడా రానవసరం లేదు. 

          ఐతే శ్రీరంజని ఇప్పుడు – దర్శకురాలిగా మేల్ టెండెన్సీని పూసుకోకుండా తనదైన జెండర్ ప్రధానమైన దృక్పథంతో కథ తీసుకొచ్చింది. ఒక యువకుడికి ఇటు తల్లితో, అటు ప్రేయసితో వుండే అనుబంధాన్ని అతడి దృక్కోణంలోంచి కాకుండా,  ఆ తల్లీ ప్రేయసుల దృక్కోణంలో చూపాలనుకుంది. అంటే ఇది కథానాయకుడి కథ కాదు, రెండు స్త్రీపాత్రల కథ. వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ విజయం. ఐడియా వరకూ ఈ ఆలోచన  ఆశాజనకంగా కనిపిస్తుంది. ఐడియాని అమల్లో పెట్టేసరికి జనరంజకం కాలేకపోయింది సహజంగానే. స్త్రీ పాత్రల్ని సమర్ధవంతంగా చిత్రించడంలో దర్శకులకి దర్శకురాళ్ళు సాటి రారు. ‘ఫిల్హాల్’ తీసిన మేఘనా గుల్జార్ కూడా. దర్శకుడు సులభంగా స్త్రీ పాత్రలోకి పరకాయప్రవేశం చేసేసి సబ్జెక్టివ్ గా చూస్తాడు, దర్శకురాలు పైపైనే ఆబ్జెక్టివ్ గా చూసి సగటు స్త్రీ అన్పించుకుంటుంది  – స్త్రీకి స్త్రీయే శత్రువనే టాక్ ని నిజం చేస్తున్నట్టు స్త్రీ పాత్రల్ని కిల్ చేస్తుంది. శ్రీ రంజనికూడా ఐడియా విషయంలో చూపినంత జెండర్ దృక్పథాన్ని స్త్రీ పాత్రల విషయానికొచ్చేసరికి వదిలేసింది. దీంతో కొడుకు - తల్లి
- ప్రేయసుల  ముక్కోణం తన జెండర్ దృక్కోణం లేకుండా పోయి, అభాసు అయింది.  ఆమె ఈ రెండో పార్శ్వాన్ని కూడా సగటు స్త్రీ సిండ్రోమ్ లోంచి ఇవతలకొచ్చి జయించగలిగితే, త్వరత్వరగా ఎదగ గల్గుతుంది. దర్శకుల దగ్గర అసిస్టెంట్లుగా చేరకుండా, ప్రూవ్ చేసుకున్న దర్శకురాళ్ళ దగ్గర చేరితే వ్యక్తిత్వమున్న స్త్రీత్వం వచ్చే అవకాశముంది సృజనాత్మకతకి. 

ఎవరెలా చేశారు 
       రాజ్ తరుణ్ కథకాని కథలో నటించడం వల్ల ఈసారి ఆకట్టుకోడు.  పేలవమైన పాత్ర, పేలవమైన సీన్లు అతణ్ణి ఆశక్తుణ్ణి చేశాయి. గోల్ లేని పాసివ్ పాత్రే, ఎందుకంటే ఇది కథానాయకుడి కథ కాదు కాబట్టి.  తల్లిగా నటించిన సితార, ప్రేయసిగా నటించిన హీరోయిన్ చిత్రా శుక్లా ఇద్దరి  కథానాయికల కథ కాబట్టి. రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సిషన్ పొందే పాత్రగా వుండాల్సింది, రొటీన్ లవర్ బాయ్ లక్షణాలతో తప్పుడు పాత్ర చిత్రణ పాలబడ్డంతో - చూసే ప్రేక్షకులకి విసుగు పుట్టించేలా తయారయ్యాడు. రొటీన్ లవర్ బాయ్ అయినప్పుడు గోల్ వుంటుందనీ, గోల్ కోసం సంఘర్షిస్తాడనీ ఎదురు చూస్తారు ప్రేక్షకులు. అంటే కథకి ఇతనే కథానాయకుడనుకునే పరిస్థితి ప్రేక్షకుల కొచ్చింది. అసలు చూపించాల్సిన తల్లీ ప్రేయసుల కథానాయికల పాత్రల్ని (ప్రధాన పాత్రల్ని) వాటి గోల్స్  కోసం ప్రయత్నిస్తున్నట్టు, బలంగా చూపించక పోవడం వల్ల ఈ పరిస్థితేర్పడింది. రాజ్ తరుణ్ నటన యూత్ అప్పీల్ కి,  బాక్సాఫీసు అప్పీల్ కీ దూరంగా  పేలవంగా తయారవడానికి ఇంతకంటే వేరే కారణం లేదు. పాత్ర డీఎన్ఏ ని బట్టి నటనతో ఆకట్టుకోవడం,  ఆకట్టుకోక పోవడం వుంటాయి. రాజ్ తరుణ్ ఆకట్టుకోవాలంటే ఈ పాత్రకి ట్రాన్సిషన్ పొందే పాత్రగా ఇన్నర్  ఇంజనీరింగ్ అవసరం. 

          సితార నటించిన తల్లిపాత్ర కొడుకుని కంటి రెప్పలా చూసుకుంటూ, పెళ్లి చేయాలనీ ప్రయత్నించే పాత్ర. ఫస్టాఫ్ లో ఈమె అర్ధాంతర చావు ఇంకో పేలవమైన మలుపు. మొదటి  ప్రధాన పాత్రగా తను ఏమీ చేయకుండా చనిపోవడం నిరర్ధక పాత్రగా మార్చేసింది. కనీసం చివరి కోరిక, మాటా గీటా ఏమీ వుండవు. ఇది రొటీన్ ఫార్ములాయే అనుకుంటే, ఈమె ఉన్నట్టుండి చనిపోగానే సుదీర్ఘ ఆలాపనతో సృష్టించిన మేలో డ్రామా కూడా పాతదే. పైగా సన్నివేశ బలం లేదు. కనీసం జీవించినంత కాలం ఆమె కొడుకు మీద చూపిన బలమైన ప్రభావం, వేసిన ముద్రా ఏమీ లేవు. అంత కంటి రెప్పలా  చూసుకునే తల్లి ప్రభావం కొడుకు మీద ఏమీ వుండకపోవడం పాత్రచిత్రణ అవదు. ఆమె మరణం అతడి జీవితాన్ని మార్చెయ్యలేదు. అలాగే ఏడుస్తూ వుంటాడు. ఏడుస్తూ వుండడం కథ అవదుగా? ఏం చేయాలో అది చేయడం కథవుతుంది. ఇలాటి పరిస్థితుల్లో ఇలాటి యూత్ కి అది ఇన్ స్పైర్ చేసే కథలా వుంటుంది. ఇందువల్ల బాక్సా ఫీసు అప్పీల్ వస్తుంది. ఏ సీనుకా సీను ఎంతవరకూ ప్రేక్షకులకి అమ్మగలమని ఆలోచించకుండా గుండుగుత్తగా తీసేసి, ఫైనల్ సీనే  రిజల్ట్ నిస్తుందిలే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ సినిమాకి ఇదే జరిగింది – చిట్ట చివర ఫైనల్ సీనులో మాత్రమే రిజల్టు చూసుకుని, మొత్తం సినిమా బాగా వచ్చిందని  సంబరపడే తంతు. షూటింగులో ప్రతీ నిమిషం విలువైనదని తాపత్రయపడ్డం టోటల్ పిక్చర్ కాదు.  తీసిన సీన్లు తెర మీద ఒక్కోటి బాక్సాఫీసు నుంచి జారిపోకుండా కూడా చూసుకోవాలి. షూటింగులో ప్రతి నిమిషం కరిగిపోయే ప్రతీ రూపాయీ, తెర మీద ప్రతీ నిమిషం బాక్సాఫీసు నుంచి జారిపోకుండా చూడ్డమే టోటల్ పిక్చర్ చూడ్డం అన్పించుకుంటుంది. ఈ టోటల్ పిక్చర్ రాస్తున్నప్పుడే చూసుకుంటూ వుండాలి. 

        తమిళ దర్శకురాలి తల్లి పాత్ర చిత్రణ బహుశా తమిళనాడులో జయలలిత నుంచి స్ఫూర్తి పొందింది. తనే లేకుండా పోయాకా ఏదెలా పోతే నాకేమని జయలలిత ఒకప్పుడన్న మాటలే నిజం చేసి వెళ్ళిపోయింది. ఓ రాజకీయ వారసత్వ ప్రకటన లేదు, ఆస్తిపాస్తులకి వీలునామా లేదు. రెండూ కుక్కలు చింపిన విస్తరి అయ్యాయి. దర్శకురాలి పాత్ర తల్లి కూడా ఇలాగే వెళ్ళిపోయింది కథని దిక్కూ మొక్కూ లేకుండా చేసేసి. 

          హీరోయిన్ తో ఒకే సీనుంటుంది. హీరోయిన్లో కోడల్ని చూసుకుని మురిసిపోతుంది. హీరోయిన్ వెళ్లిపోతూంటే ఆగమంటుంది. ఆగి ఏంటన్నట్టు చూస్తుంది హీరోయిన్. ఏం లేదంటుంది. హీరోయిన్ వెళ్ళిపోతుంది. అంటే, ఇక్కడ తల్లి చేత ఏం చెప్పించాలో కథకురాలికి తెలియలేదనుకోవాలా? లేక ఆ అవసరాన్ని గుర్తించలేదా? సీను ముగింపులో ఫిల్లర్ కోసం  హీరోయిన్ని ఆగమని చెప్పి, ఏమీ లేదని చెప్పి పంపించేసిందా? చనిపోబోయే పాత్ర తర్వాత కథ నడపబోయే రెండో ప్రధాన పాత్రకి ఏమీ చెప్పదా? ఇలా పొందిక లేకుండా పాత్రచిత్రణలు, సీన్లు ఏ ముక్కకా ముక్కగా వచ్చిపోతూంటాయి. 

          క్యారక్టర్ ఆర్టిస్టులందరూ మంచి నటులే. పాత్రల  అంతర్నిర్మాణాల్ని బట్టి వాళ్ళ నటనలుం టాయి. అందుచేత పాత్ర చిత్రణ ఇలా వున్నాక సితార బాగా నటించ లేదనుకోవడం సబబుకాదు. 

          రెండో ప్రధాన పాత్రలో హీరోయిన్ చిత్రా శుక్లాది పక్కదోవ పట్టిన పాత్ర. ఆమె చూడ్డానికి హోమ్లీగానే వుంది. పాత్ర ప్రవర్తనతో ఇబ్బంది వచ్చింది. పాత్ర ఏ కోవలో వుండాలో ఆ కోవలో వుండుంటే ఆమె నటనతో సెకండాఫ్ ని రంగులరాట్నం చేసేది. ప్రేమించిన వాడి తల్లి చనిపోయింది. బాధలో వున్నాడు. బాధలో వున్నవాడి బాధ దూరం చెయ్యాలా లేక టార్చర్ పెట్టాలా? రెండోదే చేసింది. ప్రేమలో పొసెసివ్  నెస్ వేరు. ప్రేమించిన వాడు ఎక్కడ తనక్కాకుండా పోతాడోననే భయంతో జలగలా పట్టుకుని వుండడం. ప్రేమించిన వాడు చిన్నపిల్లాడై పోయాడని ఆదుపాజ్ఞల్లో వుంచుకుని జాగ్రత్తలు చెప్పడం వేరు. ఇక్కడ తల్లిపోయిన హీరోతో హీరోయిన్ చేసిందిదే. తల్లి కూడా పెట్టని బాధలు పెడుతుంది తన అతిజాగ్రతా ప్రవర్తనా నియమావళితో. దీంతో స్వేచ్ఛ కోల్పోయి ఇంకింత పిచ్చివాడవుతాడు. ఛీ కొడతాడు, దూరమవుతాడు. ఇంకింత బాధలో పడిపోతాడు. ఈ కథలో సమస్య అతను, పరిష్కారం తను (హీరోయిన్) అయినప్పుడు, దీనికి విరుద్ధంగా తనే సమస్యలా ఎలా తయారవుతుంది? ఇది తప్పుడు పాత్రచిత్రణ, తప్పుడు కథనం, పాత్రకి తప్పుడు గోల్ అవుతాయిగా? 

          హాలీవుడ్ లో ఇలాటి కథలు సైకో థెరఫీలా వుంటాయి. సైకోల్ని తయారు చేసేలా వుండవు. హీరోయిన్ ఇలా చేయడానికి కారణం చెపుతూ ఒక ఫ్లాష్ బ్యాక్ వేశారు. ఇందులో చిన్నప్పుడు తండ్రి చనిపోయిన సీను చూస్తుంది (ఫస్టాఫ్ లో హీరో మదర్ మరణం తర్వాత మళ్ళీ ఇక్కడ హీరోయిన్ ఫాదర్ మరణమనే రిపీట్ సీను, రిపీట్ ఆలాపన) దీంతో రేపు ఇంకెవరైనా తన వాళ్ళనుకున్న వాళ్ళు ఇలాగే దూరమవుతారనే భయంతో ఈ  అతిజాగ్రతా తత్త్వం అలవడిందట. ఇది తప్పు. 

          హీరోయిన్ ఇంతగా ప్రేమించినవాడి క్షేమం కోరుకోవడానికి ఆమెకో కారణం వుండాలన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ వేయడం, ఆ కారణమేదో  చూపడం  సరికాదు. ప్రియురాలు  ప్రేమించినవాడి క్షేమం కోరుకోవడానికి ప్రేమ తప్ప ఇంకే కారణం వెతుక్కుంటుంది? ప్రేమ కారణం కాకపోవడంతో హీరోయిన్ పాత్ర లేకిగా తయారయ్యింది. సన్నివేశాల్లోంచి ప్రేమ ఔటై అపరిపక్వత రాజ్యమేలింది. మరింత విషాదంగా, బోరుగా  తయారయ్యింది. ఈ కథలో తల్లి చనిపోవడం వరకే విషాదం. ఆ తర్వాత వుండాల్సిన కథనం, డైనమిక్స్  ఆ విషాదం లోంచి బయట పడ్డం గురించి. తల్లిని మించిన ప్రేమతో తల్లిని మరిపించి వుంటే రెండో ప్రధాన పాత్రగా హీరోయిన్ ఈ గోల్ పెట్టుకుని సాధించేది.  తల్లి మరణం ఏ వయసులో వున్నా మగవాడిని ఎక్కువ దెబ్బ తీస్తుంది. ఓ పట్టాన కోలుకోలేడు, నిజమే. కానీ ఆమె ఎక్కడికీ పోలేదు- తన రక్తంలోనే, జీన్స్ లోనే అనుక్షణం శాశ్వతంగా వుంది. ఇలాటి ఒక గోల్ తో హీరోయిన్ స్టాండ్ తీసుకుని అతడికి ఎవేర్ నెస్ కల్గించి వుంటే, ఆమెలోనే అతను తల్లిని చూసుకోవచ్చు. ఆమె రోమాన్సులోనే  అంతర్లీనంగా తల్లి ప్రేమే కన్పించి ప్లాట్ పాయింట్ వన్ కి పరిష్కారం దొరకవచ్చు. 

          రెండు స్త్రీ పాత్రల పరమార్ధమిదే. కానీ రెండూ ఇది గుర్తించకుండా గోల్స్ లేని పాత్రలుగా వృధా అయ్యాయి. చిట్ట చివరికి హీరో ఫైనల్ సీన్లో వెనకటి సీన్లు నెమరేసుకుని,  తల్లితో హీరోయిన్ని పోల్చుకుని, అవునుకదా – మదర్ సెంటిమెంటుతోనే హీరోయిన్ అలా  ప్రవర్తించింది కదాని తప్పు తెలుసుకుంటాడు. జడ్జి మెంట్ కరెక్టే, జడ్జిమెంట్ కి దారితీసిన హీరోయిన్ తీరే  వెగటు. చూపించాల్సిన బూతంతా చూపించేసి, చివర్లో నీతి చెప్పి బయట పడినట్టు వుంది. 

          ప్రియదర్శి కమెడియన్ పాత్ర సోసోగా వుంది. ఇంకా చెప్పుకోదగ్గ పాత్రల్లేవు. సంగీతం, కెమెరా, ప్రొడక్షన్ విలువలు వగైరా నిర్మాతగా నాగార్జున రేంజిలో లేవు. 

చివరికేమిటి 
       ఐడియా కిచ్చిన కథనమలా వుంటే, కథనానికిచ్చిన స్ట్రక్చర్ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. సెల్వరాఘవన్ అసిస్టెంట్ గా దర్శకురాలు నేర్చుకున్నదేమిటో అర్ధంగాని పరిస్థితి. ఐడియా ఒక్కటే గొప్పది. ఇద్దరు అతివలు ఒక మగాణ్ణి హేండిల్ చేసే ఐడియా. ఈ ఐడియా విస్తరణ, పాత్ర చిత్రణలు టోటల్ ఫెయిల్యూర్. కథనంలో కొత్త సీన్లు కూడా కనపడవు. ఉదయం హీరో ముసుగు తన్ని నిద్రపోతూంటే తల్లి వచ్చి కొట్టి తిట్టి లేపే సీను, హీరోయిన్ పరిచయం కాక ముందు ఒక వెకిలిదానితో పెళ్లి చూపులు, ఆ పెళ్లి చూపుల్లో పర్సనల్ గా వెళ్లి మాట్లాడుకునే సబ్ సీను, అరగంట దాకా ఎంట్రీ ఇవ్వని హీరోయిన్ని ఓ పెళ్ళిలో చూసి హీరో మనసు పారేసుకునే సీను...ఇలా అరిగిపోయిన టెంప్లెట్ సీన్లే వాడేసింది కొత్త దర్శకురాలు కొత్త సీన్లేమీ ఇవ్వకుండా. 

          ఫస్టాఫ్ అంతా తల్లితో ఒక సీను,  హీరోయిన్ తో ఒక సీను, ప్రియదర్శితో ఒక సీను   వంతు లేసుకుని పూరీ జగన్నాథ్ ఆచారంగా రిపీటవుతూంటాయి. ఇవన్నీ నిస్సారమమైనవే. నిజానికి హీరోయిన్ వచ్చే ముందు అరగంటవరకూ తల్లితో బలమైన ఒక కాంట్రాస్ట్ ఏర్పాటు చేసి, హీరోయిన్ ఎంట్రీతో హీరోకి కొత్త లోకమనట్టుగా గేరు మార్చి ఛేంజోవర్  తీసుకుంటూ- మదర్ కీ హీరోయిన్ కీ  మధ్య  హీరో జీవితాన్ని ఎస్టాబ్లిష్ చేసే కథనాన్ని వాడుతూ పోవాలి. మదర్ – హీరోయిన్ వీళ్ళిద్దరే ప్రధాన పాత్రలన్నట్టుగా చెప్పేయాలి. హీరో కథానాయకుడు కాదని స్పష్టం చేసెయ్యాలి. ఇవేమీ చేయకుండా మదర్ తో అనుబంధాన్నీ, అటు హీరోయిన్ తో రోమాన్స్ నీ పండించకుండా చప్పగా, ప్లాట్ డైనమిక్స్ లేకుండా, సడెన్ గా ఇంటర్వెల్ ముందు మదర్ ని చంపేసి,  ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు చేశారు. దీనికీ అర్ధంపర్ధం లేదు. 

          ఒక ప్రధాన పాత్ర చనిపోతే వేరే పాత్ర రెండో ప్రధాన పాత్రవుతుంది. మదర్ చనిపోతే హీరోయిన్ రెండో ప్రధాన పాత్రగా కథని చేతిలోకి తీసుకుంది. కానీ మొదటి ప్రధాన పాత్రగా ఫస్టాఫ్ లో మదర్ చేతిలోకి తీసుకున్న కథేమీ లేదు. ‘మనుషులు మారాలి’ లో గానీ, ‘ఎర్రమందారం’ లో గానీ మొదటి ప్రధాన పాత్రలుగా శోభన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లు చనిపోతే, వీళ్ళ గోల్స్ ని అంది పుచ్చుకుని శారద పాత్ర, యమున పాత్ర  రెండో ప్రధాన పాత్ర పాత్రలుగా కథనందుకుంటాయి. ఇలా ఇవి
హ్యాండ్ ఆఫ్ పాత్రలుగా మొదటి ప్రధాన పాత్రల ఆశయాల్ని  సాధిస్తాయి. ఇదేమీ కాకుండా మదర్, హీరోయిన్ల పాత్రలు అర్ధరహితంగా డిటాచ్డ్ గా వుండి పోయాయి ప్రస్తుత సినిమాలో. చనిపోయిన మదర్ పాత్రకి హీరోయిన్ కి అందించడానికి ఒక ఆశయం  లేకపోవడంతో, హీరోయిన్ ఫ్లాష్ బ్యాకుతో కృత్రిమ గోల్ తవ్విపోసుకుని దాంతో సెకండాఫ్ ని కిష్కింధకాండ చేసింది. ప్రధాన పాత్రల అనుసంధానం మర్చిపోతే ఇంతే. 

          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మదర్ మరణాన్ని సరీగ్గా చూపించి వుంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే  ప్రమాదం తప్పేది. అన్ని ఎలిమెంట్స్ తో ప్లాట్ పాయింట్ వన్ ని బలంగా ఏర్పాటు చేసి,  అక్కడే ఇక కథ హీరోయిన్ దేనని స్పష్టం చేసేసి వుంటే, ఆతర్వాత సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూగా హీరో రియలైజేషన్ కి అదే చూపించిన,  పైన చెప్పుకున్న ఫైనల్ జడ్జి మెంటు సీను పెట్టుకుంటే,  ఈ కథ స్ట్రక్చర్ లో కొచ్చేది. ఇంటర్వెల్ ముందు వరకూ బిగినింగ్, అక్కడ్నించి సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ వరకూ మిడిల్,  స్పష్టంగా వుం డాల్సిన నిడివితో వుంటూ,  ఇదొక స్క్రీన్ ప్లే అన్పించుకునేది.

          ఇలా కాకుండా ప్లాట్ పాయింట్ వన్ మదర్ మరణం దగ్గర హీరోయిన్ లేకుండా చేసి, హీరోతో ఈ కథ అతడిదేనన్న తప్పుడు అభిప్రాయం కల్గించడంతో- ఈ హీరో కథని కొత్తగా ప్రేమ కథగా చూసే  ప్రయత్నంలో ప్రేక్షకులు – ఒక మలుపు కోసం చూడ్డం మొదలెడతారు. చిట్టచివరి ఫైనల్ సీనుకి ఐదు నిమిషాల ముందు,  హీరోయిన్ తో హీరో విడిపోవడమే మలుపనుకుని భ్రమిస్తారు. ఇంతసేపూ  సహనపరీక్ష పెట్టారని తిట్టుకుంటారు. ప్రధాన మలుపు అప్పుడు రావడంతో,  అదే  ప్లాట్ పాయింట్ వన్ అయింది ప్రేమ కథకి. అప్పుడు మిడిల్ ప్రారంభమయింది ప్రేమ కథకి. ఐదు నిమిషాల్లో హీరోకి రియలైజేషన్ అవడంతో ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి  అంతలోనే పిసరంత ఈ మిడిల్ కూడా  ముగిసిపోయింది. ఇలా ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయింది హీరో ప్రేమకథకి. 

          కానీ ఈ కథ హీరో ప్రేమ కథ కాదు, హీరోతో ఇద్దరు అతివల ఆరాటపు కథ. ఈ కథ ఇంటర్వెల్ కి ముందే ఒక అతివ అయిన మదర్ మరణంతో ప్రారంభమయ్యింది. కానీ అక్కడ్నించీ సెకండాఫ్ లో ఫ్రెష్ గా హీరో  ప్రేమ కథ ప్రారంభమయ్యిందన్నట్టు నడపడంతో,  ఈ ప్రేమ కథకి క్లయిమాక్స్ ముందు ప్లాట్ పాయింట్ వన్ వచ్చి  సహన పరీక్ష అయింది. ఇద్దరు అతివల కథ అనే ఏకసూత్రత వదిలెయ్యడంతో స్క్రీన్ ప్లే మధ్యకి ఫ్రాక్చర్ అయింది, సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయింది. ఒకటని కాదు, గందరగోళంగా ఎన్నో విప్పలేని చిక్కు ముళ్ళేసుకుంది అనుభవమున్న దర్శకుడి శిష్యురాలు. మహిళా శిష్యురాలు అని రాసుకుంటారేమో రాసుకోవచ్చు. లేడీ మహిళా స్త్రీ దర్శకురాలని కూడా నిరభ్యంతరంగా రాసుకోవచ్చు. మనకే ఇంత కన్ఫ్యూజన్ వుంటే తనేమిటో ఆమెకెంత కన్ఫ్యూజన్ వుంటుంది. ఆమె మంచి ‘మహిళా చిత్రాల దర్శకురాలు’ కావాలని కోరుకుందాం.

సికిందర్