రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, మార్చి 2015, శనివారం

సూర్యుడి సంగతులు..

 ఐడియా!..ప్లేటు ఫిరాయిస్తే??


  రచన – దర్శకత్వం – ఛాయాగ్రహణం : కార్తీక్ ఘట్టమనేని
తారాగణం : నిఖిల్, త్రిధా చౌదరీ, మధుబాల, తనికెళ్ళ భరణి, సత్య, వైవా హర్ష, తాగుబోతు రమేష్, మస్త్ అలీ, సాయాజీ షిండే, రావు రమేష్  తదితరులు.
మాటలు : చందూ మొండేటి, సంగీతం : సత్య మహావీర్, గీతాలు : రామజోగయ్య శాస్త్రి, శ్రీ మణి, కృష్ణ మాదినేని, కూర్పు : గౌతం ఎన్, కళ : టి. ఎన్. ప్రసాద్, నృత్యాలు : విజయ్, యాక్షన్ : వెంకట్
బ్యానర్ : సురక్ష్ ఎంటర్ టైన్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత : మల్కపురం శివకుమార్
 విడుదల : 5 మార్చి, 2015       సెన్సార్ : U
***

    రుసగా ఒకే స్కూలుకి చెందిన ముగ్గురు కొత్త దర్శకులతో మూడు కొత్త తరహా సినిమాలు  (స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య) చేసుకొచ్చిన నిఖిల్  నిజానికి మూస సినిమాలకి దూరం జరుగుతున్నాడు. ఇది మెచ్చదగ్గ విషయమే. తనకంటూ ఒక ప్రత్యేక స్లాట్ ని సృష్టించుకోవడం మంచి ఎత్తుగడే. అలాగని ఆ  ప్రయత్నంలో ఆర్ధిక ప్రయోజనాలే దెబ్బ తింటున్నప్పుడు ఆ ఎత్తుగడకి అర్ధం వుండదమో. మొదటి సినిమా తప్ప మిగిలిన రెండూ ఈ విషయాన్నే  చాటుతున్నాయి. ‘కార్తికేయ’ కి మంచి రెస్పాన్సే వస్తే ఎందుకు నష్టాలతో ముగిసిందో ఆలోచించుకోవాల్సి వుంది. ఇప్పుడు ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే మరింత  కొత్త ప్రయోగం చాలా రిస్కులో ఎందుకు పడుతోందో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వుంది. గత ఏడాది ప్రారంభంలో మహేష్ బాబు అంతటి బిగ్ స్టార్ కే ‘నేనొక్కడినే’ అనే సైకలాజికల్ ప్రయోగం పట్టుబడలేదు. నిఖిల్ ఇప్పుడు నావెల్టీ పేరుతో  ఇంకో శారీరక రుగ్మతని బాక్సాఫీసు ఫ్రెండ్లీగా మార్చాలంటే ఇంకా చాలా చాలా హోం వర్క్ చేయాల్సి వుంటుంది. మరోవైపు 2011 లో ‘బద్రీనాథ్’ పరాజయ కారణాలు కూడా ఇంకా కళ్ళ ముందుండగానే, ఏరి కోరి మళ్ళీ అలాటి పొరపాటే  చేయరెవరూ. చేస్తున్నారంటే సినిమాల్ని పైపైన చూసేసి వూరుకుంటున్నట్టే- ఏ సినిమా ఎందుకు ఆడింది, ఎందుకు పోయిందనే డేటా బ్యాంకు సృష్టించుకోకుండా.

     ఈ సినిమాతో దర్శకుడుగా (దర్శకుడంటే ఈ రోజుల్లో రచయిత కూడా కాబట్టి రచయిత గానూ) మారిన ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం లో తనదైన మార్క్ ని సృష్టించుకున్నాడు. నిజానికి ముడి ఫిలిం పోయి డిజిటల్లో చిత్రీకరణ లొచ్చాక ఛాయాగ్రహణమనే కళ అందరి చేతుల్లో చిల్లరై పోయి విలువ కోల్పోయిందని ఫీల్డులోనే  అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కిందటి తరం ప్రసిద్ధ ఛాయాగ్రాహకుల్లాగా  నేనున్నానూ అంటూ ఫ్రేము ఫ్రేమునా తన మార్కు వేస్తూ ఉనికిని చాటుకున్నాడు ఘట్టమనేని. ఇది చాలా  మైలేజీ నిచ్చే మార్కే. ఐతే దర్శకుడుగానూ మారినందువల్ల చాలామంది తనలాంటి వాళ్లకి కలిసిరాని ఈ రెండు పడవల మీద ప్రయాణం లాగే,   బిగ్ స్టార్స్ సినిమాలకి ప్రమోటయితే సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుత సినిమాకి దర్శకుడుగా, ఛాయాగ్రాహకుడుగా అతను  విఫలమవలేదు- కేవలం రచయితగానే రాణించలేకపోయాడు. ఫలితంగా సినిమా పునాదిలోనే కాన్సె ప్చ్యువల్  బ్లండర్ బారిన పడింది.

      ‘సూర్య వర్సెస్ సూర్య’ లాంటి ఐడియా నిజానికి మరిన్ని ఇలాటి సినిమాలకి ట్రెండ్ సెట్టర్ అవ్వాల్సిన ఐడియా!

అర్ధరాత్రి సూరీడు
     చిన్నప్పుడే అతడి వ్యాధి బయటపడింది. పొర్ఫీరియా / జిరోడెర్మా  పెగ్మెంటోసమ్ అనే ఈ అనువంశిక రుగ్మత ప్రకారం అతను పగటిపూట ఎండలో తిరిగితే పావుగంటలో చచ్చిపోతాడు. ప్రబంధాల్లో అసూర్యంపస్య అనే ప్రయోగం వుంటుంది. అంటే అందగత్తెల్ని ఉద్దేశించి ఎండ కన్నెరగనిది అనడం. ఎండ తగిలితే కమిలిపోయేంత సుకుమారి అన్నమాట. ఇది ఎండ తగిలితే చచ్చిపోయే వ్యాధి అయి కూర్చుందిప్పుడు. అందుకని సూర్య ( నిఖిల్) పగలంతా నిద్రపోయి, రాత్రి పూట కాలేజీకి వెళ్తాడు. పగలు వర్షం పడితేనే బయటికి వెళ్ళ నిస్తుంది వాళ్ళమ్మ (మధుబాల). ఆ నైట్ కాలేజీలో అన్ని వర్గాల, అన్ని వయసుల వాళ్ళూ చదువుకుంటూ వుంటారు. వాళ్ళల్లో కిరాణా షాపు ఎర్రిస్వామి అలియాస్ ఎర్ సామ్ (తనికెళ్ళ భరణి), ఆటో నడుపుకునే అరుణ్ సాయి ( సత్య), సూర్యకి ఫ్రెండ్స్ అవుతారు. హైదరాబాద్ లో పోలీస్ ఆంక్షలే లేనట్టు నైటంతా రోడ్లమీద, హోటళ్ళ దగ్గరా ఎంజాయ్ చేస్తారు. మందు కొడతారు. తల్లికూడా ఇంట్లో వీళ్ళ మందు పార్టీల్ని అనుమతిస్తూంటుంది. వీళ్ళది ఉన్నత కుటుంబం. సూర్య చదువుకుని సంపాదించాల్సిన అవసరం లేదు.

       ఇలావుండగా ఒక టీవీ యాంకర్ సంజనా (త్రిధా చౌదరి) ని వర్చువల్ గా ప్రేమిస్తూంటాడు సూర్య. రాత్రి పూట యాంకరింగ్ చేసే ఆమె ప్రోగ్రాం కి ఫోన్లు చేస్తూంటాడు. ఇది తెలుసుకున్న ఫ్రెండ్స్ ఇద్దరూ సూర్యని ఆమెతో కలుపుతారు. వీళ్ళతో నైట్ షికార్లలో ఆమె కూడా పాల్గొంటూ సూర్యతో ప్రేమలో పడుతుంది. ఒకానొక రోజు పట్టపగలు ఆమె నెవరో టీజ్ చేస్తూంటే సూర్యకి కాల్ చేసి వచ్చి కాపాడ మంటుంది. తన వ్యాధి సంగతి ఆమెకి చెప్పని సూర్య ఇరకాటంలో పడతాడు. ఇప్పుడు వెళ్తే ఎండలో చచ్చిపోతాడు. వెళ్ళకపోతే అసహ్యించుకుంటుంది..అంతలో ఒక అద్భుతమేదో జరిగి సూర్య వెళ్లి ఆమెని కాపాడేస్తాడు. ఆ తర్వాత గిల్టీగా  ఫీలై , ఫ్రెండ్స్ ని పంపిస్తాడు నిజం చెప్పేయమని. నిజం తెలుసుకున్న సంజన, రోగిష్టి సూర్య ప్రేమని వదులుకుంటుంది. ఇదీ సమస్య. తిరిగి ఈమె ప్రేమని సూర్య ఎలా గెలుచుకున్నాడనేది మిగతా కథ.

ఎవరెలా చేశారు
      నిఖిల్ కొత్త కొత్త పాత్రల్లో కన్పిస్తున్నాడు బాగానేవుంది. ఆ పాత్రల లోతు పాతుల్లోకి కూడా వెళ్ళ గలిగితే పాత్రలు నిలబడతాయి, తనూ నిలదొక్కుకుంటాడు. ప్రస్తుత పాత్రకి సంబంధించి ఒక ప్రేమికుడిగా ఎలా మానసిక సంఘర్షణకి లోనయ్యాడన్నది మాత్రమే కాదు పాయింటు, ఒక ఎండ పొడ గిట్టని బాధితుడిగానూ ఎలా స్ట్రగుల్ చేశాడన్నది కూడా ప్రశ్న. దీని ఛాయలే  పాత్రలో కన్పించనప్పుడు గుర్తుండిపోయే పాత్ర అవజాలదు. కేవలం నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న లవర్ బాయ్ గా మాత్రమే మిగిలిపోతాడు. ఇలా రొటీన్ గా మిగిలిపోయిన నిఖిల్ నటనలో కొత్తదన మేముంటుంది - ఇమేజీ మేకోవర్ తప్ప.

        హీరోయిన్ త్రిధా చౌదరికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో భావాలు పలికించే సామర్ధ్యం వుంది. అయితే సెకండాఫ్ లో మరీ ఆమె పాత్ర విషాదం లోకి జారుకోకపోయి వుంటే బావుండేది. ఈ సినిమాలో ఆద్యంతం కామిక్ రిలీఫ్ తనికెళ్ళ భరణియే. కుర్ర వేషాలతో ఆయన అలరించాడు. సత్య, హర్షాల కామెడీ కూడా కొత్త తరహా సీన్లతో హుషారెక్కించింది. ఇక మరో ఆటో డ్రైవర్ పాత్రలో ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ మస్త్ అలీ తెలుగుర్దూ శ్లాంగ్ కామెడీతో ఫ్రెష్ నెస్ తీసుకొచ్చాడు.

       పైన చెప్పుకున్నట్టు దర్శకుడి ఛాయాగ్రహణంతో బాటు, సత్య మహావీర్ సంగీతం ఒక హైలైట్ గా నిల్చింది. అన్ని పాటలూ క్యాచీగా వున్నాయి. చాలా కాలం తర్వాత మంచి సాహిత్యంతో, నృత్యాలతో, చిత్రీకరణలతో పాటలు కథని ఎలివేట్ చేసేంత బలంగా వున్నాయి. అయితే కథే ఈ బలానికి సరితూగలేదు.

స్క్రీన్ ప్లే సంగతులు
    “నీకోసం, నీకోసం భగ భగ సూర్యుడు మాయమైపోడా...నీకే నువ్వు కవచానివై కదలాలంటా కదనానికే ..ఎదురడుగేసి సుడిగాలివై తెంచెయ్యాలి సంకెళ్ళనే.. గ్రహణమై గ్రహణమై కాంతికి ముసురు వెయ్యరా.. రాహువై  రాహువై  రగిలే సూర్యుడు శక్తి  లాగెయ్యరా..నీలో విశ్వాసం వుంటే నీదే ఈ విశ్వం..” (శ్రీమణి / కార్తీక్)
      ఇలా సాగే పాటకి కథ అందించిన బలమేమీ లేదు. ఊరికే పాట రెచ్చిపోతూ హీరోని ఆకాశాని కెత్తేస్తోంది. కీలకమైన ఇంటర్వెల్ యాక్షన్ సీన్లో ఈ బ్యాక్ గ్రౌండ్ పాట ఏదో హీరోని ఆదుకుంటూ ప్రకృతి కరుణించి వర్షం కురిపిస్తే, ఆ గొప్పంతా హీరోకి ఆపాదిస్తూ ప్రకృతి మీద కవితా పంక్తులు పేల్చడం అర్ధరహితంగా వుంది. అసలే కథాపరంగా ఇంటర్వెల్ సీన్ తేలిపోయిందనుకుంటే, బిల్డప్ తో ఈ పాటొకటి!

       ఈ కీలక సన్నివేశంలో తనని కాపాడమని హీరోయిన్ అడుగుతోంది. వెళ్తే ఎండలో చనిపోతాడు. ‘వెళ్ళూ..నువ్విపుడు ఇలాగే వెళ్ళాలి..నీ ప్రేమకోసం నువ్వేమైనా అయిపోవాలి.. వెళ్ళూ.. ఇప్పుడైనా ఆ సూర్యుణ్ణి ఎదిరించి వెళ్ళు...అప్పుడే ఈ కథని ఎక్కడికో తీసికెళ్ళి పోతావ్ –నువ్వు హీరోవి, ఇలాటి సాహసమే చెయ్యాలి!  What is character but determination of incident? And what is incident but the illumination of character? ( Henry Williams) అని మనకి ఆవేశం రగిలిపోతూంటే, ఇంకా తటపటాయిస్తూనే వుంటాడు. ఇక్కడే పాత్ర ఫెయిలయ్యిందనుకుంటే, ఇతన్ని అప్పనంగా కాపాడేస్తూ దర్శకుడు జొరబడి జోరుగా వర్షం కురిపించేస్తాడు- ఓహ్ గాడ్! – సీను మాంచి కాక మీదుంటే, ఆ సీను మీదా  హీరోయిజం మీదా ఉన్నట్టుండి నీళ్ళు గుమ్మరించేశాడు దర్శకుడు! ఇంకేముంది- సూర్యుడే  లేని ఆ కురిపించుకున్న వర్షంలో, వీరాధి వీరుడిలా మనవాడు పోరాటానికి వెళ్తోంటే,  ప్రకృతిని ‘ఇరగదీస్తూ’ పై పాట! ఎంత మిస్ మేనేజ్ మెంట్!

      కథ సాంతమూ ఇలాటి కన్ఫ్యూజనే వుంది.

      ఈ తరహా జెనెటిక్ వ్యాధితో  అమెరికాలోనూ, యూరప్ లోనూ అనేక టీవీ సిరిస్ లు, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ లు, బాలల సినిమాలు, నవలలూ  వచ్చాయి- ఇంకా వస్తూనే వున్నాయి. డీన్ కూంజ్ ఇలాటి వ్యాధితో ఒక పాత్రని సృష్టించి మూడు థ్రిల్లర్ నవలలు రాశాడు.
2013 లో వచ్చిన ‘డూమ్ అండ్ గ్లూమ్’ అనే నవల్లో ఈ  వ్యాధి బారిన పడ్డ పన్నెండేళ్ళ కుర్రాడు కాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోడు. సహజంగా ఆ వయసుకి వుండే తెగువ కొద్దీ తయారు చేసుకున్న సోలార్ సూటు తొడుక్కుని, పట్టపగలు ఎండలో సూపర్ హీరోలా సాహసకృత్యాలు చేస్తూంటాడు, రిస్కులో పడుతూంటాడు. ఈ పాత్ర చిత్రణతో సూర్య పాత్రని పోల్చగలమా?

         ఐడియా ఒకటయితే కథనం మరొకటి కావడం ఈ స్క్రీన్ ప్లే ప్రధాన లోపం. ఎత్తుకున్న ఐడియాకి ( పాయింటుకి) కట్టుబడి ఉండని ఒక్క తెలుగు సినిమాల్లోనే కన్పించే జాడ్యం మరోసారి ఇక్కడ జడలు విప్పుకుంది. గతంలో ‘బద్రీనాథ్’ అనే భారీ చలనచిత్రం ఈ కారణంగానే పరాజయం పాలయ్యింది. దీనిదీ ‘సూర్య వర్సెస్ సూర్య’ లాగే అసామాన్య కాన్సెప్ట్. రెండూ భారతీయ వెండితెర మీద ఇంతవరకూ రాని కాన్సెప్ట్సే.  ‘బద్రీనాథ్’ ఎత్తుగడలో పూర్వం విదేశీ దురాక్రమణ దార్లు దేశంలో దేవాలయాల్ని కొల్లగోడితే, ఇప్పుడు టెర్రరిస్టులు ఆ పని చేస్తున్నారంటూ అక్షరధాం ఉదంతాన్ని ఎత్తిచూపుతూ, ఈ పుణ్య క్షేత్రాల సంరక్షణకి హీరోని నియమిస్తూ కథ ప్రారంభిస్తారు. అంటే అపూర్వంగా ఇండియన్ టెంపుల్స్ వర్సెస్ టెర్రరిజం కథని చూపబోతున్నారని ఉత్సుకతని పెంచేశారు! తీరా చూస్తే, ఇదంతా పక్కకు తోసేసి, హీరోయిన్ ని ఎంటర్ చేయగానే ప్రేమ కోసం హీరో ఆమె వెంట పడే, వీళ్ళని ఫ్యాక్షనిస్టులు అడ్డుకునే పాత మూస ఫార్ములాలోకి ప్లేటు ఫిరాయించేసి, సూపర్ సోనిక్ స్పీడుతో అట్టర్ ఫ్లాపు దిశగా దూసుకుపోయారు!

         ఇంకో విచిత్రమేమిటంటే, విదేశీ దురాక్రమణ దార్ల మీదా, టెర్రరిస్టుల మీదా అంత ధ్వజమెత్తుతూ ప్రారంభమైన కథ చివరి కొచ్చి- స్వమతస్థులే దేవాలయం మీద తెగబడి మారణహోమం సృష్టించే దృశ్యాలతో ఠారెస్తుంది. ఇలా స్వమతస్థులే గుళ్ళ మీద పడి తెగ నరుకుతున్నట్టు చూపిస్తున్నప్పుడు, అన్యమతస్థుస్తల మీద ఆరోపణ లేమిటో అర్ధంకాని గందరగోళం సృష్టించింది అంత భారీ సినిమా కథ కూడా!

         ప్రస్తుత సినిమా కూడా ఇంతే. జీవితాంతం నిశాచరుడిగానే ఉండిపోవాల్సిన హీరోని ప్రేమించిన హీరోయిన్ కి ఆ విషయం తెలిస్తే ఏమౌతుందన్న పాయింటు కాస్తా పక్కకెళ్ళిపోయి, సవాలక్ష ప్రేమ సినిమాల్లో చూసేసిన రొటీన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం కథగా మారిపాయింది. ఇది కూడా బలంగా చూపాలని లేకుండా, ఇంకా సినిమా కథల్ని ఇలా పైపైన చెప్పేస్తే సరిపోతుందన్న మైండ్ సెట్ తోనే కొత్త దర్శకుడు కూడా వుండడం విచారకరం.

         వ్యాధి తాలూకు కథాకమామిషూ తో ప్రేక్షకులకి కొత్త లోకాల్ని పరిచయం చేసే బంగారు అవకాశాన్ని వదులుకున్నారు. ఒక్కసారైనా హీరో ఎండలోకి వెళ్తే ఏమౌతుందో చూపించలేదు. అసూర్యంపస్య అయిన ప్రబంధ నాయికలా వుంచేశారు. ఎండలోకి వెళ్ళాలంటే హీరోకి ఎంత భయమో, కథలోకి వెళ్ళాలంటే దర్శకుడికి అంత భయంలా వుంది.

          ఈ కథది స్ట్రక్చర్ కోల్పోయిన మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే. అంటే కథకి వెన్నెముక లాంటి మిడిల్ విభాగం నామ మాత్రమన్నమాట. ప్రేమలో హీరో హీరోయిన్లు విడిపోయే ప్రధాన మలుపు వచ్చేసరికే సెకండాఫ్ లో పడింది కథ. అంటే బిగినింగ్ విభాగం మిడిల్ విభాగపు అసలు ఆటస్థలాన్ని దురాక్రమిస్తూ పట్టు కోల్పోయి, ఇంటర్వెల్ కూడా దాటిపోయిందన్న మాట- ఇలా స్ట్రక్చర్ లేని కథ ఎంత విసిగిస్తుందో ఈ సినిమా సెకండాఫ్ నుంచీ చూసి తెలుసుకోవచ్చు.

           విడిపోయిన కారణంలో కూడా స్పష్టత, బలం లేకపోవడం వల్ల ముగింపు అలా అభాసయ్యింది. ( బలహీన సమస్య ఏర్పాటు = బలహీన ముగింపు). ఇక లాభం లేదని హీరో ఆమెకి తన వ్యాధి గురించి చెప్పేయాలనుకున్నాడు. అలా తనే చెప్పకుండా ప్రబంధ నాయికలా ఫ్రెండ్స్ చేత చెప్పించాడు. అప్పుడామె విడిపోయింది. ఎందుకు విడిపోయింది? వ్యాధి గురించా? ముందే చెప్పనందుకా? ఏదైనా తనని ఆ దేవుడు కురిపించిన వర్షంలో వచ్చి కాపాడాడుగా? వర్షం కురవకపోతే వచ్చేవాడా అని డౌటా? అది ఊహాజనిత డౌటు. అయినా ఇదంతా ఎందుకు,  తను సగటు అమ్మాయి కాదు.  మనుషుల పట్ల, సమాజం పట్లా అవగాహన వుండే మీడియా వృత్తిలో వుంది. అలాటి తను ఎవరో పోకిరీలు తన యాంకరింగ్ ని ఆటలు పట్టించారని హుందాతనం కోల్పోయి, సంకుచితంగా హీరోని పిలిపించి కొట్టించడం లోనే అర్ధంలేదు. అలాగే హీరో వ్యాధిని దాచాడనీ, లేదా వ్యాధి ఉన్నందున పనికి రాడనీ భావించడం లోనూ పాత్రౌచిత్యం దెబ్బతినిపోయింది. ఇక విడిపోవడం అర్ధమే లేనిది!  

           హీరో కూడా వర్షం కురవకపోతే ఏం చేసేవాడు? ఆమె ప్రమాదంలో ఉన్నానూ రమ్మంటూంటే సందిగ్థంలో పడ్డాడు. కొన్ని క్షణాల తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది. ఒక్కసారి అంత భారీ వర్షం మొదలైందంటే అంతకి ముందు ఆకాశం మేఘావృతమై ఉన్నట్టే. వర్షం పడితేనే వెళ్ళాలా? మబ్బులు కమ్మితే వెళ్ళ కూడదా? పోనీ, ఈ లాజిక్ కూడా తీసేసి సీన్ ని ఖూనీ చేస్తూ మూస ఫార్ములా ప్రకారమే ఇంకోలా చూద్దాం- హీరో అనేవాడు ఏం చేస్తాడు? అది ప్రేమిస్తున్న అమ్మాయే కానక్కర్లేదు, ఓ ఆడపిల్ల అపాయంలో వున్నానని ఫోన్ చేస్తే చాలు, ముందూ వెనుకా చూడకుండా కాపాడేస్తాడు. లేకపోతే వాడి జీవితానికి అర్ధమే లేదు. ఇదే మనం ఆశించి ఈ సీన్లో అంత ఆవేశ పడిపోయాం- వెళ్ళరా బాబూ అని!

          ఇలాటి అవకతవక పాత్ర చిత్రణల నేపధ్యంలో లవ్ లో బ్రేకప్ చూపిస్తే ఏమవుతుందో అదే జరిగింది ఈ సినిమాలో.  ఇలా ఏ సూత్రాల ఆధారంగా ఈ ఇన్నోవేటివ్ ఐడియాని కథగా విస్తరించారో, ఆ కథకి కథనం చేశారో, పాత్రల్ని నడిపించారో, ఒడ్డుకి చేర్చారో అదైనా పరిశీ లించుకుంటే మున్ముందు పనికొస్తుంది.

           సెకండాఫ్ లో మస్త్ అలీ చేత ఎలాగో మొహం పెట్టించి ఒక డైలాగు చెప్పించారు – ఫస్టాఫ్ స్వీట్ పాన్ లా వుంది, సెకండాఫ్ ప్చ్ సాదాగా వుందని! అంటే ఇది తెలిసే సినిమా తీశారన్న మాట!!

సికిందర్

అనుబంధంగా ‘బర్ఫీ’ ఎలా తీశారో ఈ కింద చూద్దాం...

విషాదం కాదు, వినోదమే!

      విషాదాన్నీ, శోకాన్నీ, సానుభూతినీ చూపించి సోమ్ముచేసుకునే కాలం తీరిపోయిందిప్పుడు. సినిమా అనే పాపులర్ దృశ్య మాధ్యమానికి అర్ధం ఎంటర్ టైన్మెంట్- ఎంటర్ టైన్మెంట్- ప్యూర్ ఎంటర్ టైన్మెంట్ మాత్రంగానే స్థిరపడిపోయిందిప్పుడు. ‘డర్టీ పిక్చర్’ లో  విద్యాబాలన్ పాత్ర అన్నట్టుగా, ఎంటర్ టైన్మెంట్ తప్పించి ఏ గాంభీర్య ప్రదర్శనా అనవసర ప్రేలాపనే!

      నిజానికి గతంలోకి చూస్తే, విషాదాన్ని లైట్ తీసుకోవడం ఏనాడో తన మాస్టర్ పీస్ ‘ప్యాసా’ తోనే  చేసేశాడు గురుదత్ దిగ్విజయంగా. ప్రతి అలాటి ఘట్టాన్నీ కేవలం ఒక టీవీ జర్నలిస్టు చేసే రిపోర్టింగ్ చందంగా మాత్రమే చూపించి కట్ చేసేస్తాడు. ఇంకే ఏడ్పులూ మెలోడ్రామాలూ నహీ చల్తా. దీన్నే మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ కథనమన్నారు పండితులు. మతులు పోగొట్టే తరహా కథనమిది. ఇంతకాలం దీన్ని మరే దర్శకుడూ  ప్రయత్నించకపోవడం విషాదమే.

      ఇప్పుడు దీన్ని అనురాగ్ బసు సాధించాడు. ‘మర్డర్’, ‘గ్యాంగ్ స్టర్’, ‘ఏ లైఫ్ ఇన్ మెట్రో’ లాంటి హిట్స్ తో కథా కథనాల మీద, మనస్తత్వాలూ భావోద్వేగాల  పైనా మంచి పట్టున్న దర్శకుడుగా రుజువు చేసుకున్నాక, ఇప్పుడు తాజాగా అనితర సాధ్య ప్రయోగమొకటి చేసి చూపించాడు – మొదలంటా విషాదం మెడలు వంచచేసి పూర్తి వినోదంగా మార్చేశాడు!

       సినిమాల్లో ద్వంద్వాల పోషణ హస్యపాత్రల చిత్రణకి తప్పనిసరి తద్దినమయ్యాక, నేపధ్యంలో విషాదం తాండవించడం మొదలయ్యింది. అలా అయితేనే హాస్యం రాణిస్తుందనుకునే వాళ్ళు. పాత్ర దాని అంతరంగంలో గూడు కట్టుకున్న విషాదాన్ని అనుభవిస్తూనే, ఆ విషాదాన్ని అధిగమించడానికి రకరకాల హాస్య ప్రహసనాలకి తెరతీసే ప్రక్రియ ఇలా పారంపర్యంగా వస్తూ వుండిన నేపధ్యంలో,  చందన్ మిత్రా వచ్చేసి ‘మై మేరీ పత్నీ ఔర్ వో ’ తీశాడు. పొట్టి వాడైన  అర్భక  భర్తకి తన పొడగరి అయిన భార్య అంటే చచ్చేంత ఆత్మనూన్యతా భావం. దీన్ని కవర్ చేసుకునేందుకు వెర్రిమొర్రి చేష్టలూ, చివరికి తన ఈ హిపోక్రసీ అంతా తనే భరించలేక భోరు మనెయ్యడం. ఇలాటి కామెడీలు చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు విషాదం లోంచి హాస్యం పుడుతుందనే పూర్వ నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ –ఎలాటి ఈ ద్వంద్వాల ప్రదర్శనా లేని ఏకోన్ముఖ ఏక్  నిరంజన్ పాత్రతో, నసలేని పసగల ఆరోగ్యకర కామెడీ సృష్టించాడు అనురాగ్ బసు!

    ఈ బర్ఫీ ( రణబీర్ కపూర్) అనేవాడు పుడుతూనే అమ్మని హరీ మన్పించాడు. 1970 లకి పూర్వమెప్పుడో ఆ అమ్మకి ఒకటే కోరిక వుండేది. తను కంటే మర్ఫీ రేడియో లోగోలో వుండే బుడతడు లాంటి వాణ్ణే కనేసి, పేరు కూడా మర్ఫీ అనే పెట్టుకుని ముద్దు చేయాలని. అయితే వాణ్ణి కంటూనే బాల్చీ తన్నేసింది ( రేడియో ఆన్ అయింది, మమ్మీ ఆఫ్ అయిందనే పాట!). ఐతే ఈ పుట్టిన మర్ఫీ గాడికి మాటలే రావు. చెవులు కూడా విన్పించి చావవు. పుట్టు మూగా – చెవిటి  అయినా, తన మనసు భాష అర్ధంజేసుకు చావాల్సిన ఖర్మ ఈ లోకానికే పట్టిందన్నట్టు కేర్ లెస్ గా తిరుగుతూంటాడు.



       అదే డార్జిలింగ్ పట్టణంలో ( ఈ కథాకాలం 1970-76 మధ్య ) శృతి ( ఇలియానా) అనే అమ్మాయి దిగుతుంది. కలకత్తాలో ఈమెకి  క్లాస్ మేట్ తో పెళ్లి నిశ్చయమై వుంది. కానీ ఇక్కడ బర్ఫీని చూసి ప్రేమలో పడకుండా ఉండలేక పోతుంది. ఈ ప్రేమతో తల్లికి దొరికిపోతుంది. గతంలో తల్లిది కూడా ఈ కూతురి లాంటి దొంగ ప్రేమే. దాంతో అనుభవించింది కూడా. కనుక కూతుర్ని వారిస్తుంది. ఈ పరిస్థితుల్లో బర్ఫీ స్టయిలుగా  వచ్చేసి, పెళ్లి విజ్ఞాపన పత్రం చదివి విన్పించేసి తిట్లుతిని, తనదైన శైలిలో మనసు ( సైకిలు ని కూడా) విరిచేసుకుని అవతలపడేసి వెళ్ళిపోతాడు. అతడికి ఒకవైపు చిన్ననాటి స్నేహితురాలైన  మానసిక వికలాంగురాలు ఝిల్ మిల్ ( ప్రియాంకా చోప్రా) ఉండనే వుంది. కానీ ఈమెని కలుసుకోవడం ఇప్పుడు కుదరడం లేదు. తాతగారి హవేలీ లో ఎటూ వెళ్ళలేని ఒంటరి ఆమె. పైగా ఈ ఆస్తంతా తాత తనకే  రాసిచ్చినందుకు తండ్రి ( ఆశీష్ విద్యార్థి ) కి తనమీద చెప్పలేని కసి.  ఈ నేపధ్యంలో ఒకనాడు బర్ఫీ తండ్రికి అర్జెంటుగా చేయాల్సిన ఆపరేషన్ కి డబ్బు ఎక్కడా పుట్టక, తిక్కరేగి ఝిల్ మిల్ ని కిడ్నాప్ చేసి పడేస్తాడు. దీంతో అందరి కథలూ అడ్డం తిరిగిపోతాయి!

        ఓ అర్ధవంతమైన హాస్యానికి కేరాఫ్ అడ్రసుగా మారిన ఈ సినిమా ఫ్లాష్ బ్యాకుల సమాహారంగా వుంటుంది. సినిమాకి ఇదే పెద్ద బలం. ఇలియానా దృష్టి కోణంలో ప్రేమ కథగా ఒక ఫ్లాష్ బ్యాక్, రణబీర్ పాయింటాఫ్ వ్యూలో కిడ్నాప్ కథగా ఇంకో ఫ్లాష్ బ్యాక్, సౌరభ్ శుక్లా (ఇన్స్ పెక్టర్ పాత్ర)  స్వగతంలో కిడ్నాప్ మిస్టరీ విప్పే కథగా మరింకో ఫ్లాష్ బ్యాక్ వుంటాయి. అయితే ఈ చివరి ఫ్లాష్ బ్యాక్ లో కిడ్నాప్ మిస్టరీ, దీని విశ్లేషణా మరీ ఎక్కువై పోయి ఫోకస్ ని దెబ్బ తీస్తాయి. కథకి ఈ మిస్టరీ  అంతగా అవసరం లేదు. దీని వల్ల  ప్రధాన పాత్రలు మూడింటి మధ్య ప్రేమకథ బ్రేకులు పడుతున్నట్టయ్యింది.సత్యజిత్ రే అప్పూ ట్రయాలజీ డిటెక్టివ్ కథనాల పట్ల ఆకర్షితుడై దర్శకుడు దీనికి పాల్పడ్డాడేమో అన్పించేట్టు వుంది. ఆ పరిసరాల వాతావరణ సృష్టి కూడా అలాగే వుంటుంది. దీని వల్ల సినిమా ఆరంభ మధ్యమాల కంటే కూడా ముగింపు ఉన్నత స్థాయి కళాప్రదర్శన చేయాలన్న సూత్రీకరణ గాల్లో కలిసిపోయింది.

     అయితే ఏ ఫ్లాష్ బ్యాక్ లోనైనా కామెడీ కే పెద్ద పీట వేశాడు దర్శకుడు. నటనాపరంగా రణబీర్ లో చాప్లిన్ నే చూస్తున్నామా, మిస్టర్ బీన్ నే చూస్తున్నామా అన్నంత ప్రతిభావంతంగా పోషించాడు మూగ –చెవీటి పాత్రని. తను ఏ స్థాయి నటుడో గత ‘ రాక్ స్టార్ ‘ లోనే నిరూపించాడు. ప్రియాంకా చోప్రా అయితే తానొక స్టార్ అన్న సంగతే గుర్తు రానంత సీరియస్ గా ఈ డీ- గ్లామరైజ్డ్ పాత్రలో పరకాయప్రవేశం చేసింది. ఇలియానాని బహుశా  తొలిసారి చీరా, కట్టూబొట్లతో సామాన్య యువతిగా చూస్తాం. చాలా చాలా కాలం తర్వాత బాలీవుడ్ నుంచి ఒక క్వాలిటీ సినిమా ఈ ‘బర్ఫీ’ ఏడేళ్ళ క్రితం నిజజీవితంలో క్యాన్సర్ బారిన పడ్డ అనురాగ్ బసు, ఇండియన్ సినిమా మూస ఫార్ములా ముడతల్ని వదిలించి యూత్ నెస్ ని పులమడానికే ఆ క్యాన్సర్ ని జయించి పునర్జన్మెత్తాడేమో!

సికిందర్
(సెప్టెంబర్ 2012, ‘ఆంధ్రభూమి వెన్నెల’)
       
       

         

                             







5, మార్చి 2015, గురువారం

టాలెంట్ చూపిస్తాం...

స్టార్స్ తోనే స్టంట్స్ కి గుర్తింపు!
పి. సతీష్


క స్టంట్ మాస్టర్ ఎన్ని భాషా చిత్రాలకి పని చేయవచ్చు? రెండా, మూడా, నాలుగా? ఇంతవరకే ఊహ కందగలదు సాధారణంగా. ఊహించని దృష్టాంతం ఎదురైతే కంగుతిని పోతాం. దేశం లో 12 వివిధ భాషా  చిత్రాలకి పనిచేస్తున్న స్టంట్ మాస్టర్ ఒకే ఒక్కరున్నారనీ, ఇంకో రెండు భాషలు పూర్తి చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన చేరిపోతారనీ తెలుసుకుంటే కంగుతిని పోవడం కాదు, కళ్ళు తిరిగి పడిపోవడమే!


        పి స్టంట్స్ యూనియన్ అధ్యక్షుడు పి. సతీష్ ఈ అరుదయిన రికార్డు స్థాపించే దిశగా
వడివడిగా అడుగులేస్తున్నారు. ఈ ప్రయాణంలో ఇప్పటికే మరో గర్వకారణనమైన అద్భుత మజిలీకి చేరుకున్నారు. అది  బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘శ్రీ రామరాజ్యం’ కి యుద్ధ దృశ్యాల్ని సమకూర్చడం! ఇదొక ఎత్తైతే, జీవితంలోనే తొలిసారిగా ఓ పౌరాణికానికి పనిచేయడం మరొకెత్తూ.

      ‘ఎలా ఫీలవుతున్నారిప్పుడు?’ అన్నప్పుడు, కలలో కూడా ఇది ఊహించలేదన్నారు. మహాదర్శకుడు బాపు సినిమాకి పనిచేయడం మరపురాని అనుభూతి అన్నారు. అలాగే ఈ అవకాశం కల్పించినందుకు నందమూరి బాలకృష్ణకూ రుణపడి ఉంటానన్నారు. తన కేం కావాలో  బాపు చెప్పి చేయించుకుంటున్నారనీ, అంత అనుభవంతో ఆయన చెప్పేది తు.చ. తప్పకుండా పాటించడం మినహా మరో ఆలోచన ఉండదనీ చెప్పుకొచ్చారు. 2004 లో మెల్ గిబ్సన్ భక్తి  సినిమా ‘పాషన్ ఆఫ్ ది క్రైస్ట్’ లోలాగా, ఇప్పుడు  ‘శ్రీరామ రాజ్యం’  లోనూ కాలానుగుణమైన మార్పుతో పోరాట దృశ్యాలు హింసాత్మకంగా వుండ బోతున్నాయా అన్న ప్రశ్నకి, అలాటి దేమీ లేదని స్పష్టం చేశారు. బాణాలు, గదలు, కత్తులు  ఉపయోగిస్తున్న ఈ పౌరాణిక  పోరాట 
దృశ్యాల్లో  రక్తపాతం ఏమీ చూపడం లేదనీ, ఈ విన్యాసాలకి గ్రాఫిక్స్ తోడ్పాటు కూడా తీసుకుంటున్నామనీ వివరించారు.

    జంటనగారాలకి దూరంగా, ఎపి ఫారెస్ట్ అకాడెమీ లో ‘దునియా’ అనే తెలుగు సినిమాకి యాక్షన్ సీన్లు కంపోజ్ చేస్తున్న సతీష్, తన బ్యాక్ గ్రౌండ్ ని ఉల్లాసంగా చెప్పుకొచ్చారు. స్వస్థలం  విజయవాడ అయినా పుట్టి పెరిగింది హైదరబాద్ లోనే ( ఈయన చెప్తే తప్ప కోస్తా మూలాల్ని ఊహించలేం, తెలంగాణ వ్యక్తి  అనే అనుకుంటాం). తండ్రి అడ్వొకేట్. తనకి అథ్లెటిక్స్ మీద ఆసక్తి. ఈ ఆసక్తే ఆర్మ్ రెజ్లింగ్ లో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ నీ, స్త్రెంత్ లిఫ్టింగ్ లో రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్ నీ సంపాదించి పెట్టింది. ఇక సినిమాల్లో దూకెయ్యాలనుకున్నారు. 1989 లో ఫైటర్ గా మారారు. సుప్రసిద్ధ మాస్టర్ల దగ్గర ఫైటర్ గా, అసిస్టెంట్ గా పదేళ్ళూ పనిచేసి, 1999 లో ‘బంగారు రామచిలక’ సినిమాకి స్టంట్ మాస్టర్ అయ్యారు. తర్వాత తెలుగులోనే గాక,  వివిధ భాషా చిత్రాలకి  వివిధ రాష్ట్రాలు తిరుగుతూ, ఇప్పటివరకూ 200 తెలుగు సినిమాలు, 100 ఇతర భాషల సినిమాలూ పూర్తి చేశారు. తాజాగా హిట్టయిన తను పనిచేసిన సినిమా ‘అలా మొదలైంది’


     ఎందుకని మీరు అగ్ర హీరోల సినిమాలకి పనిచేయలేక పోతున్నారన్న ప్రశ్నకి, చెన్నై మాస్టర్ల డామినేషన్ ఉందన్నారు. మన స్టార్స్ కీ, డైరెక్టర్స్ కీ వాళ్ళ మీదే గురి అనీ, స్థానికంగా మేమూ ఆ స్థాయి యాక్షన్ సీన్స్ ని సృష్టించగలమని చెప్పినా కూడా విన్పించుకునే నాథుడు లేరనీ బాధపడ్డారు. మొన్న జరిగిన ఫైటర్ల వివాదంలో, చెన్నై మాస్టర్ల గ్రూపులో 50 శాతం స్థానిక ఫైటర్లు ఉండేట్టు ఒప్పందం కుదిరిందనీ, ఇక స్థానిక స్టంట్ మాస్టర్లకీ అదే 50 శాతం వాటా కోసం ఉద్యమించ బోతున్నామనీ వివరించారు రెండవ సారి యూనియన్ అధ్యక్షుడైన సతీష్.   ఇదలా ఉంచితే, ఇతర భాషా చిత్రాలకీ మనకూ ఫైట్స్ లో తేడాల గురించి చెప్పమంటే, తేడా పెద్దగా ఏమీ ఉండదనీ, నేటివిటీని బట్టి, బడ్జెట్ ని బట్టీ కొంత మారవచ్చనీ అన్నారు. హాలీవుడ్ సినిమాల్లోంచీ ఎవరూ యథాతథంగా కాపీ చెయ్యరనీ, ఆ ఫైట్స్ మన హీరోలు చేయలేరనీ, వాటిని మన కనుకూలంగా మల్చుకుని చేస్తామనీ చెప్పారు.
       ఫైట్ మాస్టర్లకి గుర్తింపు విషయానికొస్తే, చిన్న చిన్న సినిమాల్లో ఫైట్స్ ఎంత బాగా చేసినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనీ, అదే స్టార్ సినిమాలకి చేస్తే ఫైట్స్ కి క్రేజ్ వస్తుందనీ, కాబట్టి స్టార్స్ తోనే స్టంట్స్ కీ, స్టంట్ మాస్టర్లకీ  గుర్తింపు అనీ వివరించారు.

         అసలు ఫీల్డ్ లోనే తోటి కళాకారులు ఎంత గుర్తింపు నిస్తున్నారో ఓ అనుభవం చెప్పారు : ‘సందర్భ వశాత్తూ నేను ఓ సినిమాకి చెన్నై మాస్టర్ తో కలిసి పని చేయాల్సి వచ్చింది. అప్పుడు నేను కంపోజ్ చేసిన ఒక షాట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ కెమెరా మాన్ చెన్నై మాస్టర్ వైపు తిరిగి అభినందనల్తో ముంచెత్తారు. సహృదయుడైన చెన్నై మాస్టర్ కి ఆ అభినందనలు ఎవరికి  చెందుతాయో తెలుసు. కెమెరా మాన్ ని ఏమీ అనలేక నా భుజం తట్టి అభినందించారు..’


        ‘మమ్మల్ని కూడా ఎంకరేజి చేస్తే తెలుగు వాడి టాలెంట్ ఏమిటో చూపిస్తాం కదా?’ అంటున్న మాస్టర్ సతీష్ ని తెలుగు ఫీల్డు ఎప్పుడర్ధం చేసుకుంటుందో!

సికిందర్
(జూన్ 2011, ‘ఆంధ్రజ్యోతి’ కోసం)
      


        

4, మార్చి 2015, బుధవారం

ఆనాటి సినిమా ..


విఠలుడి సమాజ దర్పణం!


జానపద సినిమాలు జాతికి నష్టమా?

ఒక సారి యాదృచ్ఛికంగా దొరికిన ఈ లాట్వేనియన్ జానపద కథ చూడండి..


అనగనగా ఓ అడవి. ఆ అడవిలో జంతువులూ పక్షులూ అన్నీ కలిసి కాలువ తవ్వాలని నిర్ణయించాయి. అప్పుడొక ఉడుత కాలువ ఏ మార్గంలో వెళ్ళాలో చూపుతానని దాని జాతి లక్షణం కొద్దీ గుండ్రంగా పరుగెత్త సాగింది. ఇది చూసి ఉస్సూరన్న ఎలుగుబంటి తానే కష్టపడి కాలువ తిన్నగా తవ్వేసింది. జంతుజాలం, పక్షిజాలం అంతా కలిసి ఆ ఎలుగుబంటిని ఘనంగా సన్మానించాయి. ఒక బొంత కాకి మాత్రం మూతి ముడుచుకుంది. తనకి ఆకాశం నుంచి రాలిపడే ఒక్క నీటి చుక్కయినా చాలునని, ఈ నేల మీద పారే పాడు నీళ్ళు ముట్టనంటే ముట్టనని భీష్మించుకుంది. దాని తీరుకి మిగతా జీవులన్నీ నొచ్చుకున్నాయి. దీని సంగతేంటో చూద్దామని కాలువ దగ్గరికి రానీయకుండా కట్టడి చేశాయి. వాన పడ్డప్పుడే,  ఆ వాన చినుకుల తోనే దాహం తీర్చుకోవాలని ఆంక్ష విధించాయి.

      వాన ఎంతకీ పడక, చుక్క చినుకూ రాలక, దాహంతో నాలిక పిడచ కట్టుకుపోయి ఏడుస్తూ, ఎప్పుడు కురుస్తుంది వాన? వానెప్పుడు కురుస్తుంది బాబులూ? అని దీనంగా అడుక్కుంటూ తిరగ సాగింది బొంత కాకి.


    
ఇప్పుడు పాత సినిమా పత్రికలో మన విమర్శకుల వ్యధ చూద్దాం.. 


  
1940 నుంచి జానపద సినిమాలకి ఊపు తీసుకొచ్చారు తెలుగు నిర్మాతలు, దర్శకులు. అప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో కాస్త ముతకగానే సినిమాలు తీస్తూంటే, ఆ సీనులోకి ఠీవీగా బి. విఠాలాచార్య (1920-1999) అనే ఆయన ఎంటరై, జానపద సినిమాల్ని మార్గంలో పెట్టి, ఆబాల గోపాలన్నీ  అలరించడం మొదలెట్టాడు. నిర్మాతలు, ప్రేక్షకులు ఆకాశాని కెత్తేశారాయన్ని. ఇది విమర్శకులకి నచ్చలేదు. జానపద సినిమాలనేవి నేలబారు సినిమాలని, ఇవి వచ్చేసి అప్పుడప్పుడే పౌరాణికాల వ్యామోహం వదిలించుకుని, సామాజిక ప్రయోజనంతోమాలపిల్ల’, ‘రైతుబిడ్డ’, ‘వరవిక్రయంలాంటి వాస్తవిక కథా చిత్రాలకి ప్రేక్షకులు అలవాటవుతున్న సమయంలో, వాళ్ళ జిజ్ఞాసకీ, ఉత్తమాభిరుచికీ గండి కొట్టేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రేక్షకుల వెనుక బాటుతనాన్ని ఆసరాగా చేసుకుని, అశ్లీలాన్నీ అసభ్యాన్నీ జొప్పించి సొమ్ములు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇలా అస్పృశ్యతా భావంతో జానపద సినిమాలని ఖండిస్తూ, మళ్ళీ నాటి వాస్తవిక కథా చిత్రాల రా కోసం భవిష్యత్తులోకి ఆశగా చూస్తూ వుండి పోయారు



        ఇలా వన్య ప్రాణుల కథ, మనుష్యుల  కథా ఒక్కటే. కాకపోతే ఇక్కడ ఫినిషింగ్ టచ్/మాస్టర్ స్ట్రోక్ ఏమిటంటే, విఠాలాచార్య తనని లోకం ముక్తకంఠంతో ‘జానపద బ్రహ్మ’ గానూ, అటు తమిళంలో ‘మాయాజాల మన్నన్’ గానూ  కీర్తించే కాలం వచ్చే దాకా, సదరు విమర్శకులు ఖండించిన ఆ ‘చెత్త’  జానపద సినిమాల శకలాల్నే పట్టువదలని విక్రమార్కుడిలా బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళాడు. కడు భీకర కదన రంగం!


       అటు హిందీ లోనూ ఇంతే!

     ‘స్థానిక  నమ్మకాల మీద విదేశీ విష సంస్కృతి పడగ నీడలా పర్చుకుంటున్న వేళ, పౌరాణిక సినిమాలొచ్చి పేద ప్రజల్లో సైతం తమకూ దేవుళ్ళనే వాళ్లున్నారన్న ఆత్మ స్థైర్యాన్నీ, తద్వారా జాతీయతా భావాన్నీ పెంపొందించుకునేందుకు తోడ్పడ్డాయి. చారిత్రికాలొచ్చేసి, గత వైభవాన్ని కళ్ళకి కట్టి సాంస్కృతిక పునరుజ్జీవనానికి తోడ్పడ్డాయి. కానీ ఈ నేపధ్యంలో జానపద సినిమాల రాక మాత్రం అప్పటివరకూ వున్న పాపులర్ టేస్టుకి  విఘాతం కల్గించి, ప్రేక్షకుల్ని ఎంత మత్తులోకి లాక్కెళ్ళాయంటే, అత్యంత భారీ వ్యయ ప్రయాసలకోర్చి, తమిళంలో నిర్మించిన జానపదం ‘చంద్రలేఖ’, ఇదే టైటిల్ తో దాని హిందుస్తానీ రీమేకూ దేశవ్యాప్తంగా విజయ ఢంకా మోగించేసే దాకా!’ అని కె. ఎ. అబ్బాస్ కూడా రాశాడు.


     కానీ విఠలాచార్య మనసుని ఎవరూ తెలుసుకోలేదు. ఏదో వానాకాలం చదువు మూడో తరగతి వరకు చదువుకుని, తను నడిపిన టూరింగ్ టాకీసులో సినిమాలు చూస్తూ దర్శకుడ యిన వాడికి, ఏం సామజిక స్పృహలే బొంద అనుకోవచ్చు. అంతకి ముందు హోటల్ నడుపుకుంటున్న వాడు క్విట్ ఇండియా ఉద్యమంలోకి దూకి జైలు కెళ్ళాడు మరి. కన్నడలో తీసిన మొదటి రెండు సాంఘికాలు ‘రాజ్యలక్ష్మి,’ ‘కన్యాదాన’ అభ్యుదయ వాదంతో విరుచుకు పడ్డ సినిమాలే. మొత్తం తన నలభై రెండేళ్ళ క్రియాశీలక సినిమా జీవితంలో ఒక్క జానపదాలే కాదు, సాంఘికాలు, పౌరాణికాలు, హార్రర్ సినిమాలూ ..ఇలా వేటికవి తీసిన బహుముఖ ప్రజ్ఞాశాలియతను. జానపద సినిమాల గురించి ఎవరికెలాటి చిత్త భ్రాంతులున్నా, ఆ సినిమాలు థియేటర్లకిప్రేక్షకుల సంఖ్యని పెంచాయన్నది కాదనలేని వాస్తవం. కానీ ఏ నీతీ లేకుండా జానపద సినిమా కథ వుండదు. ప్రపంచ వ్యాప్తంగా జానపద కథల్లో వుండే నీతి ఎంత సార్వకాలిక, ఎంత సార్వజనీన నీతి అయివుంటుందంటే, ఆ కథల ఆధారంగా ‘ఫాటల్ ఎట్రాక్షన్’, ‘ప్రెట్టీ వుమన్’, ‘స్లీపింగ్ బ్యూటీ’ వంటి ప్రసిద్ధ చలన చిత్రాలెన్నో రూపొందాయని అంటాడు సినిమా కథల మీద ఇరవయ్యేళ్ళూ  పరిశోధన చేసి,  ‘స్టీలింగ్ ఫైర్  ఫ్రమ్ ది  డి గాడ్స్’  అనే పాపులర్ స్క్రీన్ ప్లే పుస్తకం రాసిన జేమ్స్ బానెట్.
   

    ఐతే తెలుగులో వచ్చిన జానపద సినిమాల్లోని కథలన్నీ ఒరిజినల్ జానపద కథలు కాకపోవచ్చు. సినిమాల కోసం సొంతంగా వండి వార్చుకున్నవే కావచ్చు. ఆ వంటకంలో విఠాలాచార్య  ఎంత సిద్ధహస్తుడో ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇందుకు ఉదాహరణగా ఒక్క ‘బందిపోటు’ సినిమా చాలు. ఇందులో విమర్శకులు శోకించే మాయలు మంత్రాలు, అభూతకల్పనలు, అసభ్య ప్రదర్శనలూ ఏవీ కన్పించవు. శుభ్రంగా సామజిక ప్రయోజనంతో పాటు, వ్యక్తిత్వ వికాస కోర్సూ చూసుకోవచ్చు ఇందులో.

    ‘బందిపోటు’ అనగానే వెంటనే మెదిలేవి ‘వగల రాణివి నీవే’, ‘ఊహలు గుస గుస లాడే’  పాటలు. ఆ తర్వాతే మిగతా కథాకమామిషూ... 1963 లో దీనికి దర్శకత్వం వహిస్తూ నిర్మించి, ప్రేక్షకుల విందుకు సిద్ధం చేశాడు విఠాలాచార్య. ఎన్టీఆర్, కృష్ణ కుమారి, గుమ్మడి, రాజనాల, ప్రథానపాత్రథారులుగా ఈ సినిమాని ఎంత రక్తి కట్టించారంటే, అదొక మర్చిపోలేని కమర్షియల్ క్లాసిక్ అయేంతగా!

    సర్కస్!

    అధికారం సర్కస్ లాంటిదే.

    బ్యాలెన్సింగ్ చేసుకుంటే చప్పట్లు, లేదంటే ఇక్కట్లు.

     సర్కస్ విన్యాసాలు టైమింగ్, బ్యాలెన్సింగ్ అనే రెండు నైపుణ్యాల మీద ఆధారపడతాయి. ఏ కాస్తా అటు ఇటైనా మొత్తం సర్కస్ అభాసు. విఠాలాచార్య తను సర్కస్ కంపెనీలో కూడా పని చేసిన అనుభావన్నంతా రంగరించి ఈ  ‘బందిపోటు’ లో బ్యాలెన్సింగ్ యాక్ట్ చూలాగ్గా చేసేశాడు!



       అనగనగా గాంధార రాజ్యంలో సత్యసేన భూపతి అనే అశక్తుడైన మహారాజు. మందారమాల అనే మహా అహంకారియైన కూతురు. శూరసింహుడనే దుష్ట సేనాపతి. ఇతను రాజుగారి బావమరిది కూడా. రాజ్యం మీదా రాజకన్య మీదా కన్నేసి రాజు గార్ని బద్నాం చేస్తూంటాడు. పంట లెత్తుకుపోవడం,  బల్లేలకి పసి పిల్లల్ని మిడుతల్లా గుచ్చి ఆనందించడం, ఆడవాళ్ళని చెరచడం, మగవాళ్ళని చంపడం వంటి అకృత్యాలతో రాజుకి చాలా చెడ్డ పేరు తెస్తూంటాడు.
      అసహాయ శూరుడనే వాడు ఇతడి లేటెస్ట్ బాధితుడు. ఇతను ముసుగు దొంగలా ఖజానాని దోచి పేదలకి పంచి పెడుతూంటాడు. కీచక రాజభటుల్ని వధిస్తూంటాడు. ఈ అవకాశంతో  శూర సింహుడు  తన దురాగతాల్ని ఇతడికే అంటగట్టి, రాజుకి ఫిర్యాదు చేస్తూంటాడు. ఒకసారి నరసింహ అనే యువ రైతు అసహాయ శూరుడ్ని అటకాయిస్తే, ఇతను తన చిన్నాన్నే అని తెలిసిపోతుంది. అటు రాజుకి కూడా ఈ రహస్యం తెలిసిపోయి, ఆ అసహాయ శూరుడ్ని విచారణకి తన ఎదుట ప్రవేశ పెట్టాల్సిందిగా అతడి అన్న ధర్మ నాయకుణ్ణి ఆదేశిస్తాడు. ఈలోపు నిజాలు బయట పడకూడదని శూర సింహుడు అసహాయ శూరుడ్ని చంపించేస్తాడు. ఈ అఘాయిత్యానికి గుండె పగిలి చస్తాడు ధర్మనాయకుడు. కుటుంబంలో ఒకేసారి ఇలా ఈ ఉత్పాతాలకి నరసింహ ఖిన్నుడై, తేరుకుని శూర సింహుడి మీద పగబడ్తాడు.

      ఓ అరగంట లోపే సెటప్ చేసిన ఈ కథా ప్రారంభం చాలా పకడ్బందీ స్క్రిప్టింగ్ ప్రణాళిక అనొచ్చు. సెటప్ డైనమిక్స్ కి ఈ భాగం వరకూ కత్తిరించి రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు ఆసక్తి వున్న సినిమా రచయితలెవరైనా. చాలా అందమైన దృశ్య మాలిక ఇది. జానపద సినిమాలు ఉత్త నేలబారువి అనేవాళ్ళకి చెంప పెట్టు సృజనాత్మకత ఇది. ఇక్కడి దాకా కథని, పాత్రల్ని పరిచయం చేసిన తీరూ, మల్చిన తీరూ, సమస్యని స్థాపించి కథానాయకుడ్ని కార్యోన్ముఖుడ్ని చేసిన పద్ధతీ...అదీ కేవలం ఓ అరగంటలో...ఓ క్రియేటివ్ ఛాలెంజియే అనాలి మూడో తరగతి డ్రాపౌట్ నుంచి!

     పగ బట్టిన నరసింహ బందిపోటు వేషంలో మరో కార్యం కూడా సాధిస్తాడు. తను ప్రేమించిన రాకుమారి అహంకారాన్నణచడం. కథానాయకుడి మెయిన్ యాక్షన్ లైన్ తో ఈ పర్సనల్ లైన్ డబుల్ ట్రాక్ లైన్ గా కుదిరి, ఈ సినిమాకి జవజీవాలు చేకూర్చి పెట్టాయి. తన పోరాటంలో చివరికి ఉరి కంబమెక్కుతాడు. అటువైపు దుష్ట నాయకుడు శూర సింహుడు, రాజుని బంధించి తన పట్టాభిషేక సంబరాల్ని ఘనంగా జరుపుకుంటూంటాడు. 

      అప్పుడు తప్పించు కొచ్చిన బందిపోటు నరసింహ, ఆ పట్టాభిషేక ఉత్సవాల్లో భారీ యెత్తున సర్కస్ విన్యాసాలతో కనువిందు చేస్తాడు. గానా బజానాతో మైమరపిస్తాడు. అధికారమంటే బుర్రలో  మంచీ చెడు అనే ద్వంద్వాల బ్యాలెన్సింగ్ యాక్టే ననీ, అంతే తప్ప ఒక వైపు మొగ్గి, అందిన కాడికి కబళించడం కాదనే అర్ధంలో రక్తి కట్టిస్తాయీ విన్యాసాలు. అక్రమార్కుడికి ఇదంతా ప్రదర్శించడం అయ్యాక, కత్తి తీసుకుని ఆ కంటకుడి మెడ కస్సక్ మన్పిస్తాడు నరసింహ!



      మనస్సు అనే పెండ్యులం ఆగిందంటే అది నిశ్చల స్థితే. అంటే శాంతి, మనశ్శాంతి. అలా దుష్ట సేనాపతిని న్యూట్రల్ చేశాక,  తిరిగి రాజ్యం శాంతితో కళకళ! ఇదీ  విఠలుడి సామాజిక సారస్వత దర్పణం!

    ఇందులో ‘బందిపోటు’ టైటిల్ పాత్ర నందమూరి తారక రామారావు, రాకుమార్తెగా కృష్ణ కుమారి,  శూర సింహుడిగా  రాజనాల, నటిస్తే; రాజు, చిన్నాన్న, అన్న పాత్రల్లో  గుమ్మడి, మిక్కిలినేని, నాగయ్య కన్పిస్తారు. రాజనాలకి ఉపాయల్లాంటి అపాయాలు చెప్పే రమణారెడ్డి, ఎన్టీఆర్ పక్కవాద్యం రేలంగి కావలసినంత హాస్యం డోసు అందిస్తారు. ఒకేచోట ఇంతమంది హేమా హేమీలతో మల్టీ స్టారర్ చూస్తున్నంత ఫుల్ మీల్స్.  ఒకే చోట వీళ్ళందరి అభినయ కౌశలాల్ని గాంచగలగడం మన అదృష్టమే అవుతుంది. ఇక రిచ్ కాస్ట్యూమ్స్, సెట్టింగ్స్ గురించైతే చెప్పక్కర్లేదు. నిర్మాత తనే కాబట్టి ఏదో చీప్ గా చుట్టేద్దామని అనుకోలేదు  విఠాలాచార్య. ఘంటసాల సంగీతంలో పైన  చెప్పుకున్న రెండు ఎవర్ గ్రీన్ హిట్ పాటలు కూడా ఈ సినిమాకి  క్లాసిక్ హోదాని సంతరించి పెట్టిన అంశాల్లో చేరాయి. సమాజానికి అద్దం పట్టే ఈ జానపద సినిమా జాతికి నష్టమంటే అవమానమే

      
     కాశీమజిలీ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు పుస్తకాల్లో నిక్షిప్తమై వున్నట్టే, ఇలాంటి జానపద సినిమాల్ని చలన చిత్ర భాండాగారాల్లో వదిలేసి పోయాడు జానపద బ్రహ్మ భావిష్యత్తరాల ఆనంద వినోద వికాసాల కోసం...టేకిటప్!

సికిందర్
(2009 అక్టోబర్, ‘సాక్షి’ కోసం)




.